Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 37

ఆ వెనువెంటనే -
 అనేకమైన కలుగులలో నుంచి,
అసంఖ్యాకమైన ఎలుకలు బయటికి వచ్చి, దిక్కుతోచనట్లు పరిగెత్తడం మొదలెట్టాయి.
కొద్ది క్షణాలలో -
అక్కడే ఉన్న అనేకమైన పుట్టలలో నుంచి -
పాములు బయటికి రావడం మొదలెట్టాయి.
ఎలుకలని పట్టుకుని తినడం కోసం కాదు -
అంకుష్ నీ, సాహస్ నీ కాటు వేయడానికి కూడా కాదు -
ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోతున్నట్లుగా...జరజర పాకిపోవడం మొదలెట్టాయి.
కాసేపట్లో -
ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో నేల కనబడడం మానేసింది.
ఎలుకలు-ఎలుకలు-ఎలుకలు
పాములు-పాములు-పాములు!
"బాప్ రే బాప్! ఏమిటిది?" అన్నాడు అంకుష్.
"నా ఉద్దేశ్యంలో ఈ ప్రాంతంలో త్వరలోనే భూకంపం రాబోతోంది!" అన్నాడు సాహస్.
"అని ఎలా చెప్పగలవు?" అన్నాడు అంకుష్.
"భూకంపం లాంటి భీభత్సాలు జరిగేముందు ఎలుకలూ, పాములూ, గాడిదలూ, కుక్కలూ మొదలైన వాటికి ముందుగా తెలిసిపోతుంది."
"ఎలా?"
"ఉదాహరణకి పాముల సంగతే తీసుకుందాం. భూమి అంతర్భాగంలో పెనుమార్పులు సంభవించేటప్పుడు కొన్నిచోట్ల సల్ఫర్ గాసెస్ ఉత్పన్నం అవుతాయి. ఆ గంధకపు వాయువులని భరించలేని పాములు బయటికి వచ్చేస్తాయి."
"మరి మనిషికి ప్రమాదాలని ముందే గ్రహించే ఈ శక్తి లేదా?"
"ఒరిజినల్ గా ఉండేది. కానీ నాగరికత ఎక్కువ అయ్యేకొద్దీ అది తగ్గిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు లేటెస్టుగా జరుపుతున్న పరిశోధనల వల్ల తేలింది ఏమిటంటే, ఇలాంటి భీభత్సాలకు ముందుగా, ప్రజలలో కొందరు మూర్ఛపోతారనీ, కొందరు పిల్లల ఆరోగ్యం ప్రమాదకరంగా మారి ఆంబులెన్సుల కోసం కాల్స్ రావడం ఎక్కువ అవుతుందనీ తేలింది. వీటికీ, భూకంపాలకీ సంబంధం ఉందని గ్రహిస్తున్నది ఈ మధ్య.
"అంటే - పాములు పారిపోతున్నాయి కాబట్టి భూకంపం ఇప్పుడే రావచ్చంటావా?" అన్నాడు అంకుష్.
"ఇప్పుడే రావచ్చు. రాకపోవచ్చు. కానీ ఇప్పటినుంచి నెలరోజుల లోపల ఎప్పుడైనా రావచ్చును భూకంపం!" అన్నాడు సాహస్.
సాహస్ మాట పూర్తి కాకుండానే, కొండ కొమ్మున ఉన్న ఇంకో బ్రహ్మాండమైన బండ పట్టు దప్పి, దొర్లుతూ శరవేగంతో వాళ్ళవైపు రావడం మొదలెట్టింది.
కొండ కొమ్ము మీద నుంచి ఆ పెద్ద బండ ఎవరో దొర్లించినట్టుగా అతి వేగంగా వచ్చి వాళ్ళు నిలబడి వున్న అతి పురాతనమైన నౌకని తాకింది.
అసలే శిథిలావస్థలో వున్న ఆ నౌక కాస్తా ఆ బండ తాకిడికి ఒక వైపంతా అప్పడంలా తుత్తునియలు అయిపోయింది.
బండ నౌకని తాకగానే ఒక బరువైన వస్తువు ఎగిరి వచ్చి సాహస్ భుజాన్ని తాకి కిందపడిపోయింది.
అతను మహా బలవంతుడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ని తట్టుకున్నాడు గానీ ఇంకొకళ్ళయితే భుజం విరిగిపోయి వుండేదే!
టార్చ్ లైట్ ని దాని మీదికి ఫోకస్ చేసి కొద్ది క్షణాలపాటు పరిశీలనగా చూస్తూ వుండిపోయాడు సాహస్. ఇత్తడితో చేసిన వస్తువు అది.
"ఏమిటదీ?" అన్నాడు అంకుష్ ఆసక్తిగా.
"బహుశా ఇది ఒక కంప్యూటర్ అయి వుండవచ్చును" అన్నాడు సాహస్.
"కంప్యూటర్ ఈ శిథిలమైన నౌకలో ఎందుకుంది?"
"ఈ కంప్యూటర్ కూడా పురాతనమైనదే అయి వుండాలి."
"అంటే?"
"గతంలో వచ్చిన ప్రళయానికి ముందు తయారుచేసినదై వుంటుంది ఈ కంప్యూటర్"
"ప్రళయానికి ముందు తయారుచేసిన కంప్యూటరా? సాహస్! ఆర్యూ జోకింగ్?"
"జోక్ చేయట్లేదు అంకుష్. ఉన్న విషయాన్ని ఊహించి చెబుతున్నాను"
"ఆ చెప్పేది ఏదో కాస్త నాక్కూడా అర్థం అయ్యేలా చెబితే బాగుంటుంది కదా" అన్నాడు అంకుష్.
"ఓకే! అలాగే" అంటూ గొంతు సవరించుకున్నాడు సాహస్.
"ఇంతకుముందు ఓసారి ప్రళయం వచ్చిందనీ, ఒకసారి రావడమేకాదు అనేకసార్లు ప్రళయం వచ్చి ఉండాలని చెప్పుకున్నాం కదా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS