"రాకపోతే మంచిదే! రాకుండా ఉండేందుకు నేను నీ నీడలా వెంటాడటం కూడా మంచిదే గదా!"
"అంటే-నువ్వు కూడా ఈ ఇంటిలోనే ఉంటావా?"
ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అన్నాడు సత్యం-
"ఉంటాను. ఉండి నీ ప్రయోజకత్వమేమిటో కళ్ళారా చూస్తాను. అదుగో లక్ష్మీపతి వస్తున్నాడు-మన బంధుత్వం మరిచిపో!" అనేసి సత్యం టీపాయ్ మీదున్న పేపరు తీసుకున్నాడు.
బజారులో ఏం కొన్నాడో గాని లక్ష్మీపతి చేతుల్లో బోలెడు పాకెట్లున్నాయి. వాటిని ఎంతో ఆనందంగా మోసుకొచ్చేడతను.
గదిలో కృష్ణమూర్తిని చూడగానే లక్ష్మీపతి అడిగాడు---
"ఎంతసేపయింది వచ్చి?"
"ఇంత క్రితమే వచ్చేను" అన్నాడు కృష్ణమూర్తి.
లక్ష్మీపతి సత్యంతో అన్నాడు---
"కృష్ణమూర్తి అని ప్రైవేట్లవీ చెబుతుంటాడు. మా వాడికి నాలుగు ముక్కలు చెప్పమని పట్టుకొచ్చేను."
కృష్ణమూర్తి సత్యానికి నమస్కరించేడు. సత్యం తలాడించి విష్ చేసేడు.
"సత్యంగారని గొప్ప వ్యాపారవేత్త! దేశం గర్వించే ప్రముఖుల్లో ఒకరు ఇన్నేళ్ళకి వారికి మామీద దయ కలిగింది. కొన్నాళ్ళు యిక్కడే మా యింటిలోనే వుంటారు" అని సత్యాన్ని కృష్ణమూర్తికి పరిచయం జేసేడు.
కృష్ణమూర్తి సత్యానికి నమస్కరించేడు. సత్యం తలాడించి విష్ చేసేడు.
"సత్యంగారని గొప్ప వ్యాపారవేత్త! దేశం గర్వించే ప్రముఖుల్లో ఒకరు. ఇన్నేళ్ళకి వారికి మామీద దయ కలిగింది. కొన్నాళ్ళు యిక్కడే మా యింటిలోనే వుంటారు" అని సత్యాన్ని కృష్ణమూర్తికి పరిచయం చేసేడు.
కృష్ణమూర్తి వేపు సూటిగా చూస్తూ అన్నాడు సత్యం---
"వాళ్ళబ్బాయి చదివేది అయిదో పదో కాదు. డిగ్రీ! డిగ్రీ వాళ్ళక్కూడా ట్యూషన్ చెప్పగలవా?"
దానికి లక్ష్మీపతి సమాధానం చెప్పేడు---
"అమ్మమ్మా! అతన్నట్లా తీసిపారేయకండి చాకంటే నమ్మండి!"
"చాకులూ బాకులే ప్రాణాలు తీస్తాయి లక్ష్మీపతి! పొట్టకింత తిండికోసం అదిచేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెబ్తారు. ఆ మాటలు నమ్మి పిల్లల్ని వాళ్ళచేతుల్లో పెడితే అంతవరకు వచ్చిన చదువును కూడా సర్వనాశనం చేస్తారు" అన్నాడు సత్యం.
"ఈ కుర్రాడు అల్లాంటివాడు కాడులెండి!" సర్దిచెప్పేడు లక్ష్మీపతి.
"ఎల్లాంటివాడో నా కనవసరం! కుర్రాడు గనకనే నాకు భయం. ఎంత మేస్టరైనా ఈ కుర్రాడ్ని చూస్తే మీ కుర్రాడికి గౌరవం ఎట్లా కలుగుతుంది? ఈ కుర్రాడు లెక్కలు వేస్తానంటే మీ కుర్రాడు సినిమాకి వెడదామంటాడు. సినిమా పేరెత్తగానే పాఠాలొదిలేసి పద పోదామని సినిమా థియేటర్లు వెతుక్కుంటారు. లక్ష్మీపతి-చదువు చెప్పేవాడు బెత్తం పట్టుకున్న గురువుగా కనిపించాలేగాని భుజమ్మీద చెయ్యేసే ఫ్రండుగా కనిపిస్తే డేంజర్!" విషయం వివరించేడు సత్యం.
సత్యంగారి థియరీతో కృష్ణమూర్తికి వళ్ళు మండిపోయింది. అదలా వుండగా-జావగారి పోతున్న ఫోజులో లక్ష్మీపతిని చూడగానే కాళ్ళు వణికేయి.
"ఔరా తండ్రీ" అని లోలోపల తిట్టుకున్నాడు. పళ్ళు పటపట కొరికేడు కూడాను.
సత్యం పెట్టిన భయంతో లక్ష్మీపతి ఈ ట్యూషన్ ఏర్పాటు కాదంటే వచ్చిన సదవకాశం చెయ్యి జారిపోతుంది. అంచేత ముందు సత్యాన్ని హెచ్చరించి లైన్లో పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సత్యంగారితో అన్నాడు కృష్ణమూర్తి.
"చూడండి! మీరో పాతకాలపు మనిషల్లే వున్నారు. చదువు చెప్పడానికి చిన్నా పెద్దా తేడా వుండవు. ఆ మాటకొస్తే మా తండ్రిగారికి ప్రయివేటు చెప్పి డిగ్రీ ఇప్పించింది నేనే!"
అంత అబద్ధానికి సత్యం అదిరిపోయేడు. కొంచెం కోపం కూడా వచ్చింది. అంచేత కోపంగానే అడిగాడు-
"నీబోటి వాడి ప్రైవేటు లేకపోతే మీ నాన్న డిగ్రీ తెచ్చుకోలేడా?"
"అడక్కండి. మా తండ్రిగారిని చూస్తే మీరిట్లా మాట్లాడరు. చదువులో వారు వట్టి చవట ఆ రోజుల్లో వారు ఏడుసార్లు తప్పేరుట."
"ఎన్నిసార్లు!" కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అడిగాడు సత్యం.
"మొత్తం ఏడుసార్లు. ఆ స్టాండర్డులో ఉన్న మా తండ్రిగార్ని తీర్చిదిద్ది డిగ్రీ యిప్పించేను. మా తండ్రిగారిని మించిన చవటలుంటారని నేననుకోను కనక వీళ్ళబ్బాయికి చదువు చెప్పడం తలకు మించిన పనేంకాదు."
"ఊ ... మాటలు చూస్తే కోటలు దాటేస్తున్నాయి!" అన్నాడు సత్యం.
"అట్లాగే-చేతలు గురించి కూడా మీ కామెంటు కావాలి! కొన్నాళ్ళపాటు తమరు ఇక్కడే వుంటారు గనక మీనుంచి మంచి సర్టిఫికేట్ పుచ్చుకుంటానని ఆశ!" అన్నాడు కృష్ణమూర్తి.
వాళ్ళిద్దరి వరసా గమనిస్తున్న లక్ష్మీపతికి కొంచెం భయమేసింది వాళ్ళ సంభాషణ ఆ ఆ విధంగా సాగిపోతే ఎక్కడ సత్యంగారు చిరాకు పడతారో నన్న ఆందోళనతో లక్ష్మీపతి ఇద్దరి దూసుకు వచ్చేడు.
"చూడు పంతులూ! అబ్బాయి మేడమీద ఉన్నాడు. వెళ్ళి పాఠాలు ప్రారంభించు!" అన్నాడు లక్ష్మీపతి.
కృష్ణమూర్తి సత్యాన్ని చురుగ్గా ఒక చూపు చూచి అక్కడినుంచి కదిలేడు.
* * *
కృష్ణమూర్తిని చూడగానే కోదండరాం లేచి నించున్నాడు.
"మీరేనా నాకు ట్యూషన్ చెప్పేది?" అడిగేడు కోదండం.
"అవును" అన్నాడు కృష్ణమూర్తి.
"వెరీ గ్లాడ్ టు సీ యూ!"
అని చెయ్యి ముందుకు చాచేడు కోదండం కృష్ణమూర్తి. షేక్ హేండ్ యిచ్చేడు. కోదండం చిన్నగా నవ్వుతూ అన్నాడు---
"ఎవరో మేష్టారొస్తారని ఇంటిలో చెబితే తలనెరిసిన వారయి ఉంటారనుకున్నాను. హీరోలా వచ్చారే?"
"కూచో!" అన్నాడు. కృష్ణమూర్తి గొంతు సవరించుకొని అన్నాడు.
"నే చెప్పింది శ్రద్ధగా వింటే చాలు దీక్షగా చదవకుండానే పాసవుతావ్. నువ్వీ పరీక్ష పాసవ్వాలి!"
"నామీద అల్లాంటి ఆశలు పెట్టుకోవద్దు!" అన్నాడు కోదండం.
అ మాటకి షాక్ తిన్నాడు.
"ఎంచేత?" అడిగాడు కృష్ణమూర్తి.
"నేను చచ్చినా పాసవ్వను!" అన్నాడు కోదండం.
"అది చెప్పాల్సింది నువ్వుకాదు! నేను! నువ్వు పాసవుతావ్. తప్పనిసరిగా పాసవ్వాలి! నా కల నా ఆశ మొత్తం నా భవిష్యత్తే నువ్వు పాసవ్వడంమ్మీద ఆధారపడి ఉంది" అన్నాడు కృష్ణమూర్తి సీరియస్ గా.
కోదండరాం నవ్వేశాడు.
"ఎందుకు నవ్వుతావ్?" అడిగాడు కృష్ణమూర్తి.
"మీక్కావలసింది నెలజీతం. దానికేం ఢోకా వుండదు. నిక్షేపంగా పుచ్చుకోండి. అంతేగాని నన్ను మీరుగాని నేను మిమ్మల్నిగాని ఉద్ధరించే ప్రయత్నం చేయొద్దు అది మన ఆరోగ్యానికి మంచిదికాదు. పడదు కూడాను మీకు తెలుసో తెలీదో-నేను పాసయితే కొన్ని కష్టాలెదురవుతాయి."
"కష్టాలా?"
"అవును మాస్టారూ!" కష్టాలే! నా చేతికి డిగ్రీవస్తే మానాన్న నా కట్నం రేటు పెంచేస్తాడు. అసలు కట్నం కోసమే నన్ను చదివిస్తున్నాడు."
"అందుకని తప్పాలని కోరుకుంటావా?"
