"ఈ ఇంటిలోని వస్తువులన్నీ పాతవే, పాత వాసన కొడుతున్నాయ్. వీటిని అమ్మాలంటే సెంటిమెంట్ అడ్డొస్తుంది. వీటిని మీరు ఓల్డు సామాన్లు కొనే ఏరియాకి తీసుకెళ్ళి అమ్మివేస్తే! ఆ చేత్తోనే మన ప్రేమను శాశ్వతం చేసే అద్భుతమైన వస్తువుల్ని కొని, వాటితో ఈ ఇంటిని అలంకరించి అప్పుడు నిజమైన ప్రేమకు నిర్వచనం చెబుదాం. ఏమంటారు?"
"మీకు ఇలా పని అప్పగించడం నాకూ బాధగానే ఉంది. కాని..."
"ఓస్... అంతేనా!" అన్నాడు నరసింహం తేలిగ్గా.
"డబుల్ కాట్... దాన్నే సెక్స్ కాట్ అనేలా ఉండాలి. పెద్ద పెద్ద నిలువెత్తు అద్దాలు - డిఫరెంట్ పెర్ ఫ్యూమ్స్ ని వెదజల్లే ఇంపోర్టెడ్ ఏసీ మెషిన్స్, శృంగారాన్ని మేలుకొలిపే బ్లూ కలర్ పెయింటింగ్స్, పాలరాతితో చేసిన తాజ్ మహల్ నమూనా లాంటివి కొనాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇంటిలోకి ఎవరు వచ్చినా చివరకు వృద్ధులు వచ్చినా శృంగారం గురించి తలపోయాలి, అందులో లీనమవ్వాలి" ఆమె పెదవుల్ని తడి చేసుకుంటూ చెప్పింది.
నరసింహం కళ్ళలో ఆనందం తొంగిచూసింది.
"ఇదొక్కటే ఇప్పుడు మన మధ్య అడ్డు"
"అయితే ఈరోజే వీటిని తీసుకెళ్ళి అమ్ముకొస్తాను." హుషారుగా అన్నాడు ఎస్.ఐ.నరసింహం.
నరసింహానికి ఆ క్షణాన ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుంది.
మధుమతి తనతో కలిసేందుకు మెంటల్ ప్రిపరేషన్ అవసరం అని అన్నప్పుడు నరసింహం నీరు గారిపోయాడు- దానికి ఇంత టైమ్ అని, ఇన్ని రోజులు అని పరిమితి లేకపోవటమే అందుకు కారణం.
ఇప్పుడు వాటన్నింటిని తోసిరాజని చిన్న పనిని అప్పగించింది. అదేమంత కష్టం కాదు. రెండు లారీలను పిలిపించి ఇంట్లో వున్న సామానంతా ఎక్కించి మార్కెట్ లో అమ్ముకు రావడం గంటల్లో పూర్తయి పోతుంది. వాటి స్థానంలో కొత్త ఫర్నిచర్ కొనటం అంతకంటే తేలిక!
"మనకోసం - అంటున్నప్పుడు, ఈ భవంతిని 'మన ప్రేమ'కు చిహ్నంగా మార్చుతానన్నప్పుడు నాకు మాత్రం ఆనందంగా వుండదా? నేను రెడీ" అన్నాడు కుడిచేతిని లేపి ఆమె కుడిభుజం మీద వేస్తూ.
అతని ఆరాటాన్ని ఆమె గ్రహించింది.
అతని చర్యకు ఆమె అడ్డు చెప్పలేదు.
"మనకై మనం అమ్మజూపితే ప్రతివాడూ తక్కువ ధర చెబుతాడు. ఆ విషయంలో జాగ్రత్తగా వుండాలి. మనకు కావాల్సిన ఒక ముఖ్యమైన వస్తువుంది."
"మనం అనుకున్న ధరకే అమ్ముతాను. ఇంతకీ ఏమిటా వస్తువు" నరసింహం ఆమె నునుపైన భుజాన్ని తమకంగా నిమురుతూ అడిగాడు.
"వాటర్ బెడ్..." అంది అతనివేపు ఓరగా చూస్తూ.
ఆమె అభిరుచికి అతను అచ్చెరువందాడు.
ఆపైన అతని కుడిచేయి ఒకింత క్రిందకు ప్రాకింది. ఆమె లోలోన నవ్వుకుంది.
"కంగారెందుకు? నేను నీదాన్నేగా? నీ సొంతం కావాలనేగా ఇదంతా. సామాన్లు ఎక్కిద్దామా...? లారీని పిలుచుకొస్తే పని ప్రారంభించవచ్చు" అంది అతని కుడిచేతిని తన కుడిచేతిలోకి తీసుకొని.
అతను అలాగే అన్నట్టు తలూపాడు.
ఆమె అతని చేతిని సున్నితంగా ముద్దాడి వదిలేసింది.
అతనికోక్షణం నరాలు జివ్వుమన్నాయి.
ఆమె లేచింది.
నరసింహం బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా - "నేను మన బెడ్ రూమ్ ని శుభ్రం చేయాలి. అదెక్కడో పైన వుంది. మీరెళ్ళగానే లోన గడియ వేసుకోవటం. తిరిగి వచ్చాక పైనుంచి దిగివచ్చి గడియ తియ్యటం నాకు చిరాకు- పైన నాపని పాడయిపోతుంది. పైగా బయట నుంచి ఫోన్ కాల్ ఒకటి ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. అదొస్తే బయటకు వెళ్ళి మనకు రావల్సి వున్న లక్ష కేష్ పట్టుకురావాలి. పైగా మీకు పట్టు పంచెలు, లుంగీలు, నాకు నైటీలు తీసుకురావాలి వాటికోసం బయటకు కూడా వెళ్లవచ్చు. ఎందుకొచ్చిన గొడవ- మీ దగ్గరున్న కీతో లాక్ చేసుకుని వెళ్ళండి, మరో ప్రమాదం కూడా వుంది. నేను ఇంట్లో వున్నానని తెలిస్తే ఎదురింట్లో వున్న నా ఫ్రెండ్ వచ్చి మన ఏకాంతాన్ని పాడు చేయవచ్చు"
ఆమె తెలివితేటలకు నరసింహం ఆనందిస్తూ బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసి మోటార్ బైక్ ని స్టార్ట్ చేశాడు.
సరిగ్గా అదే టైమ్ కి ఎదిరింట్లో వున్న ఓ నడివయస్కురాలు ఆశ్చర్యంగా నరసింహంకేసే చూసింది.
నరసింహం బయటకు రావడం - తాళం వేయటం, బైక్ ఎక్కి బయటకు వెళ్ళిపోవడం అంతా గమనించి ఏదో గొణుక్కుంటూ లోపలకు వెళ్ళిపోయింది.
* * * *
సెక్రటరీ పూజారి ఇంటి ముందు ఆటోని ఆపించి, దిగి లోపలకు వెళ్లాడు.
సరిగ్గా అరగంటకు బయటకు వచ్చి తిరిగి ఆటో ఎక్కాడు.
వెళ్ళేటప్పుడు బరువుగా వున్న అతని జేబు వచ్చేటప్పుడు తేలికయి పోయింది.
* * * *
నాగమ్మ నుంచి ఫోన్ కాల్ రావడంతో పూజారి పంచాంగం చేతబూని ఆమెను కలిసేందుకు హడావిడిగా బయలుదేరాడు.
అరగంట క్రితమే అతను అమ్మేసుకున్న తన నిజాయితీ స్థానంలో యిప్పుడు భయం చోటు చేసుకుంది.
అతనెక్కిన ఆటో రివ్వున నాగమ్మ ఎస్టేట్ కేసి దూసుకుపోతోంది.
అప్పటికే అతని అరచేతులన్నీ తడిచి ముద్దయిపోయాయి.
పంచాంగం కవర్ పేజీ మెత్తగా అయిపోయింది.
* * * *
"పూజారిగారు...చిట్టితల్లికి మంచి సంబంధం చూసాను. పెళ్ళి చూపులకి, పెళ్ళికి మంచి ముహూర్తాలు చూడండి" అంది నాగమ్మ తన బాధ్యత తీరబోతోందన్న ఆనందంతో.
పూజారి పంచాంగం తెరిచాడు.
ఒక్కో పేజీ తిరగేస్తూ ముందుకు పోతున్నాడు.
అప్పుడతని మెదడుపై సెక్రటరీ హెచ్చరికలు, వాటి వెనుక దాగిన అర్జునరావు, పీటర్ ళ ప్రభావం తీవ్రంగా వుంది.
మొత్తానికి ఓ పావుగంట నాన్చి ఆరోజు సాయంత్రమే 6-30కి పెళ్ళి చూపులకు మంచి ఘడియలున్నాయని, ఆరోజు నుంచి సరిగ్గా మూడురోజుల్లో దివ్యమైన పెళ్ళి ముహూర్తం వుందని తనలోని తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ చెప్పాడు పూజారి.
