ఫోరెన్ సిక్ సైన్స్ ద్వారా సూక్ష్మాతి సూక్ష్మమైన ఫలితాలు పొందే అవకాశం వుంది.
సైన్స్ ని పూర్తిగా నేరపరిశోధనలో ఉపయోగించుకున్నవాడు నేరస్థుడి ఒక్క వెంట్రుకగానీ, వేలిముద్రగానీ, గీతగానీ చాలు అతడ్ని క్షణాల్లో పట్టించేందుకు.
మైక్రోస్కోపిక్ పరీక్షలో విడవడని రహస్యముండదు. 20వ శతాబ్దపు మధ్యకాలంలో క్రైమ్ పెద్ద వ్యాపారమయి పోయింది. చట్టాన్ని ఏమార్చటమే క్రైమ్ బిజినెస్ లో ప్రధానమైన పెట్టుబడి లైఫ్ రిస్క్ తీసుకోవటం రెండవ పెట్టుబడి. ఈ బిజినెస్ ద్వారా ఈనాడు కొన్ని వేలకోట్లు సంపాదిస్తున్న క్రైమ్ బిజినెస్ మెన్ ప్రపంచవ్యాప్తంగా వున్నారు.
ఫోరెన్ సిక్ సైన్స్ ద్వారా కొన్ని దశాబ్దాల క్రితం సమాధి చేయబడిన శవం తాలూకు ఎముకల్ని వెలికితీసి అతనెలా చనిపోయింది? ఎప్పుడు చనిపోయింది చెప్పవచ్చు. అతని హత్య వెనుక దాగిన రహస్యాన్ని వెలికి తీయవచ్చు.
ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు కానీ, వెంట్రుకలు కానీ, చేతివ్రాత కానీ, మారణాయుధాలు ఉపయోగించే విధానంగాని, మాట్లాడే విధానంగాని ఒకేరకంగా వుండవు. అలాగే ఏ రెండు టైప్ రైటర్స్ టైపింగ్ విధానం కాని ఒకే రకంగా వుండదు.
మెట్లెక్కుతున్న సిద్దేశ్వర్ ఓబరాయ్ ని చూడగానే బొంబాయి పోలీసు డిపార్టుమెంట్ ఫోరెన్ సిక్ లాబ్ హెడ్ కళ్ళ ముందు కొన్నేళ్ళ క్రితం అతను సమర్పించిన మెమొరాండంలోని అంశాలు గుర్తుకొచ్చాయి.
నిజంగా సిద్దేశ్వర్ సిన్సియర్ గా ప్రయత్నించి ఉండకపోతే ఈ లేబ్ ఏర్పాటయ్యేదా? తనకు ఈ హెడ్ హోదా లభించేదా? హెడ్ ఇలా ఆలోచిస్తూ సిద్దేశ్వర్ కి ఎదురెళ్ళి గౌరవంగా లోపలకు తీసుకువెళ్ళాడు.
ఆనాడు సిద్దేశ్వర్ పోలీసుశాఖకు మోడరన్ సైన్స్ లేబ్ అవసరం ఎంత ఉందో వివరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, ఐ.జి.పి.కి వ్రాస్తూ వారితో వాదించిన విధానం కూడా ఎంతో కన్ విన్సింగ్ గా ఉంది.
"I am dying before my time.....murdered by the English oligarchy and its hired assassin" అని ప్రపంచ ప్రఖ్యాత యుద్దవీరుడు, మహామేధావి, రారాజు అని ప్రపంచ ప్రజలచే గుర్తింపబడిన ఫ్రెంచ్ వారియర్ జీనియస్ నెపోలియన్ తన చివరి రోజుల్లో వ్రాసుకున్న వీలునామాలో ఉటంకించాడు.
నన్ను కులీనులయిన కొందరు ఆంగ్లేయులు, వారు కుదుర్చుకున్న ఖూనీకోరు ఒకరు చంపబోతున్నారు. నా కాలంకంటే ముందే నేను చనిపోతున్నాను అని నెపోలియన్ తన వీలునామాలో వ్రాస్తే చరిత్ర విశ్వసించలేదు.
నెపోలియన్ ఓటమి పొందాక దేశభ్రష్టుడయి సెయింట్ హెలీనా దీనికి వెళ్ళ కొట్టబడ్డాడు. అప్పుడు ఆ దీవిలో ఉండి నెపోలియన్ ని అయిన నేను సెయింట్ హెలీనా దీవిలో బ్రిటిషర్సుచే చంపబడ్డాను అని తన చావుకు కొద్ది సమయం ముందు వ్రాసుకున్నాడు.
కడుపులో కేన్సర్ రావటం చేత నెపోలియన్ చనిపోయినట్లు నెపోలియన్ శవాన్ని పోస్ట్ మార్టమ్ చేసిన ఒక ఇటాలియన్ డాక్టర్ అఫీషియల్ గా ప్రకటించటం జరిగింది.
అయితే ఫ్రెంచ్ జాతీయులు మాత్రం నెపోలియన్ ఎలా చని పోయిందనే దానిమీద చరిత్ర చెప్పింది కాని, బ్రిటీషర్సు చెప్పిన దాన్ని కాని నమ్మలేదు.
కాలగమనంలో సైన్స్ బాగా అభివృద్ధి చెంది న్యూట్రన్ ఏక్టివేషన్ ఎనాలసిస్ కొత్త పుంతలు తొక్కడంతో ఫ్రెంచి జాతీయులు సెయింట్ హెలీనా ద్వీపానికి వెళ్ళి కొన్ని దశాబ్దాల క్రితం సమాధి చేయబడిన నెపోలియన్ శవాన్ని తీసి ప్యారిస్ కి తీసుకువెళ్ళిపోయారు. నెపోలియన్ శవం తల నుంచి కొన్ని వెంట్రుకలను తీసుకొని న్యూట్రాన్ ఏక్టివేషాన్ ఎనాలసిస్ ద్వారా పరీక్షలు జరిపి ఆ వెంట్రుకలలో విషం యొక్క పాషాణం 13 రెట్లు ఉన్నట్లు కనుగొన్నారు.
నెపోలియన్ చనిపోయిన 150 సంవత్సరాల తరువాత ఫోరెన్ సిక్ సైన్స్ ద్వారా ఫ్రెంచ్ జాతీయులు ఛేదించిన రహస్యమది.
అప్పట్లో సెయింట్ హెలీనా ద్వీపాన్ని పాలించిన గవర్నర్ జనరల్ సర్ హడ్ సన్ సేపోలియన్ హత్యకు కారకుడని నేటి చరిత్ర నమ్మక తప్పలేదు.
ఇది తెలుసుకున్న ప్రపంచ ప్రజ విస్తుపోయింది. నెపోలియన్ కేన్సర్ తో చనిపోయినట్లు లిఖించబడిన అప్పటి చరిత్ర పేజీలు మోడరన్ సైన్స్ ప్రతిభకు సిగ్గుపడిపోయాయి.
సాధారణంగా రసాయన పద్దతి ద్వారా పాషాణాల్ని కనుగొనే విధానం కంటే వెయ్యిరెట్లు సునిశితంగా రేడియో ఏక్టివ్ ప్రాపర్టీస్ ద్వారా పాషాణాన్ని కనుక్కొనే వీలుంది. అదీ నూటికి నూరుశాతం కరెక్టుగా సైంటిఫిక్ గా.
అనుమానాస్పదమయిన సహజ మరణాల్ని శోధించటానికి, చావుకి నిజమయిన కారణాల్ని విశ్లేషించేందుకు న్యూట్రాన్ ఏక్టివేషన్ ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా ఉపయోగపడుతోంది. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ దేశాలు బాగా ముందున్నాయి.
సాధారణంగా మనిషి తల వెంట్రుకలో ఉండే గోల్డ్, సిల్వర్, సీసం లాంటి లోహాలు ఎంత సూక్ష్మంగా ఉన్నా ఈ పరీక్ష ద్వారా వాటి శాతాన్ని నిర్ణయించవచ్చు.
అయితే ఈ సందర్భంలో నా వాదనను సమర్ధించుకోవడానికి వేరే వాదనల్ని వినిపించకుండా ఉండలేను.
నెపోలియన్ వెంట్రుకలలో కనిపించిన పాషాణానికి కారణం అతను ఆ దీవిలో ఉండగా తన చివరిరోజుల్లో శారీరక బాధని భరించలేక తరుచూ ఏదయినా ఉత్పేరకం తీసుకొని ఉండవచ్చని ఒక వాదన వుంది. నెపోలియన్ శవాన్ని సమాధి చేసిన 150 సంవత్సరాలకు దాన్ని వెలికితీసి హెయిర్ ఎగ్జామిన్ చేయటం జరిగింది. కనుక ఈ సుదీర్ఘకాలంలో సమాధిలో నెపోలియన్ తల వెంట్రుకలు పాయిజ్ నెస్ అయ్యే అవకాశం లేకపోలేదని మరో వాదన కూడా వుంది.
ఏది ఏమయినప్పటికి నేర పరిశోధనలో మోడరన్ సైన్సు పాత్ర పోలీసుశాఖకు గొప్పదనం దయచేసి నా వాదనలో నిజాల్ని మీరు గ్రహించి బొంబాయి నగర పోలీసులకు ఆ తరహా ఫోరెన్ సిక్ లాబ్ ని ప్రసాదించమని సిద్దేశ్వర్ ఓబరాయ్ డిప్యూటీ పోలీసు కమీషనర్ గా ఉన్నప్పుడు చేసిన అభ్యర్ధన, చూపిన పట్టుదలే లేబ్ ఏర్పడటానికి కారణమని ఆ లాబ్ హెడ్ కి ఎప్పటికి గుర్తుండి పోయింది.
