Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 37


    
    సిద్దేశ్వర్ ఓబరాయ్ ఎక్కిన కారు పోలీసు కమీషనర్ కార్యాలయానికేసి దూసుకుపోతుంది.
    
    కారు బ్యాక్ సీటులో కూర్చున్న సిద్దేశ్వర్ మెదడునిండా ఆలోచనలే చోటు చేసుకున్నాయి.
    
    మరో అజ్ఞాత నరహంతకుల ముఠా.... దాని వెనుక ఖలీల్.... బట్ హు ఈజ్ దిస్ 'జె'...? రకరకాల అనుమానాలు...ప్రశ్నలు సిద్దేశ్వర్ ఆలోచనల్లో చోటు చేసుకున్నాయి.
    
                                                    *    *    *    *    *
    
    "తీగ కదిలింది ఇక డొంకంతా కదిలిపోతుంది. నిప్పురవ్వలాంటి సిద్దేశ్వర్ నిజాల్ని వెలికి తీసేందుకు రంగాన్ని సిద్దం చేస్తున్నాడు. మన పని కొంచెం సులువవుతుంది."
    
    'ఎఫ్' తన సహచరులతో అన్నాడు.
    
    మిగతా ముగ్గురూ ఆశ్చర్యపోయారు. "సిద్దేశ్వర్ ఓబరాయ్.....నరహంతకుల పాలిట సింహస్వప్నం..." ఎల్ సాలోచనగా అన్నాడు.
    
    "సిద్దేశ్వర్ చిరుతపులి.....దావూద్ ఇబ్రహీంలాంటి అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ కే చెమటలు పట్టించిన ప్రమాదకరమైన పోలీసు అధికారి..." ఆర్ అన్నాడు.
    
    "ఎలాంటి వాడినుంచైనా నిజాలు కక్కించగల ఇంటిలిజెంట్ ఆఫీసర్....ఇంటరాగేషన్ అంటే ఆయనే చేయాలి. పోలీసు డిపార్టు మెంట్ మొత్తం ఆయన్ని గౌరవిస్తుంది. ఆయనంటే భయపడుతుంది మనకు కాగల పనిని గంధర్వుడైన సిద్దేశ్వర్ కి అప్పగించిందెవరు?" బి ఉద్వేగముతో ప్రశ్నించాడు.
    
    "ఇంకెవరూ.... మిల్లర్"
    
    "వ్వాట్....?!" ఎఫ్ చెప్పిన పేరును విని ముగ్గురూ ఆశ్చర్యపోయారు.
    
    "అవును."
    
    "ఎలా....?"
    
    "మాస్టర్ పై ఫైరింగ్ జరిగిన ప్రాంతం గురించి ఒక ఇన్ ఫార్మర్ లా సిద్దేశ్వర్ కి తెలియచేసి ఫోన్ పెట్టేశాడు. సిద్దేశ్వర్ హుటాహుటిని బయలుదేరి దేవానంద్ ఇంటి ప్రనతనైకి వచ్చి ఎంక్వయిరీ చేశాడు. ట్రిగ్గర్ మెన్ ఫైర్ చేసిన మెషిన్ గన్ శబ్దం ఆ చుట్టుప్రక్కల ఇళ్ళలోని వాళ్ళకు వినిపించి వుంటుంది. గనుక వాళ్ళదే చెప్పి వుంటారు. ఏమాత్రం తెలివితేటలున్న పోలీసు ఆఫీసర్ కయినా ఏ స్పాట్ లో వుండి షూట్ చేసేందుకు అవకాశముందో ఇట్టే తెలిసిపోతుంది. అలాగే తెలిసిపోయింది కూడా వెంటనే దేవానంద్ ఇంటి వాచ్ మెన్ అబూని సిద్దేశ్వర్ తన గ్రిప్ లోకి తీసుకున్నాడు. అతను తనకు తెలిసింది చెప్పేశాడు. సిద్దేశ్వర్ చాంబర్ లో రాత్రుళ్ళు సయితం లైట్స్ వెలగటం ప్రారంభమైంది. చాపక్రింద నీరులా సిద్దేశ్వర్ పథకం ప్రొఫెషనల్ కిల్లర్స్ శిబిరంవేపు సాగిపోతోంది...." ఎఫ్ చెప్పటం ఒక్కక్షణం ఆపి ఫ్రిజ్ లోని వాటర్ బాటిల్ ని చేతిలోకి తీసుకొని తిరిగి చెప్పటం ప్రారంభించాడు.
    
    "పోలీసుల దృష్టి తమమీద లేకుండా ఉంటే, ట్రిగ్గర్ మెన్ కి, మన మాస్టర్ ని అసాసినేట్ చేయడానికి చాలా స్వేచ్చ వుంటుంది. అప్పుడు కేవలం మనల్ని ఏమార్చితే చాలు కాని పోలీసులు కన్నేస్తే రెండు వలయాల్ని తప్పించుకొని తన పనిని పూర్తి చేసుకోవల్సి వుంటుంది. సో..... మన మాస్టర్ చుట్టూ మిల్లర్ రక్షణవలయం ఆపైన ట్రిగ్గర్ మెన్ ని నీడలా అనుసరించే పోలీసులు దాంతో కొన్ని లిమిటేషన్స్ కి లోబడే ప్రొఫెషనల్ వ్యవహరించవలసి ఉంటుంది కనుక మనపని కొంత సులువవుతుంది...." ఎఫ్ చెప్పటం ఆపాడు.
    
    "కధ మంచి పాకాన పడబోతోంది..." అని ఎల్ అన్నాడు.
    
    "ఇప్పుడు కదా డ్రామా రక్తి కట్టేది." ఆర్ అన్నాడు తన మీసాల్ని నిమురుకుంటూ.
    
    "మాస్టర్ ని హాన్ సోదరులు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మాస్టరంటే జ్వలించే నిత్యాగ్ని గుండం తనమీద హత్యా ప్రయత్నాలు చేయిస్తున్న హాన్ సోదరుల్ని చూసి భయపడే పిరికివారు కాదు మాస్టర్ అలాగే తనమానాన తాను వుంటున్న సింహాన్ని తోక పట్టుకు లాగితే ఏమౌతుందో కూడా హాన్ సోదరులు రుచి చూసే తీరతారు..." చివరగా బి అన్నాడు.
    
    బొంబాయి పోలీసుశాఖ అధీనంలో వున్న అత్యంతాధునికమైన ఫోరెన్ సిక్ లేబ్ ముందు కారుదిగాడు సిద్దేశ్వర్ ఓబరాయ్.
    
    సభ్యసమాజంలో కొందరు వ్యక్తులు ఎప్పుడైతే దారితప్పి నేరస్థులుగా మారి, సామరస్య పూర్వకమైన సంఘజీవనానికి తీవ్రవిఘాతం కల్పించటం ప్రారంభించారో అప్పుడే వార్ని ఎదుర్కొనలేక తప్పని స్థితికి సంఘం నెట్టబడింది. పోను పోను నేరస్థులు హింసాత్మక సంఘటనల్లో ఆరితేరి, తెలివిగా, తమ జిత్తుల్ని, ఎత్తుల్ని ప్రయోగించటం మొదలయింది. దాంతో పోలీసుశాఖ కూడా వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనే సందర్భంలో ఎదగక తప్పలేదు.
    
    నేరాలు జరగక ముందే వాటిని పసిగట్టి నివారించటంలోనూ, జరిగాక వాటిని పరిశోధించి అసలు నేరస్థులను చట్టానికి బందీలు చేసేందుకు పోలీసుశాఖ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించక తప్పలేదు.
    
    ఒక్కోసారి పోలీసులు షెర్లాక్ హోమ్స్ ఫీట్స్ ని తలపిస్తూ తేలిగ్గా నేరస్థుల్ని పట్టుకున్న సందర్భాలున్నప్పటికీ నిజానికి బూజుపట్టి కాలం చెల్లిపోయిన భారతదేశపు పోలీసు పరిశోధనా విధానాలు ఇప్పుడు నువ్వు తెప్పిస్తుంటాయి.
    
    నేరం జరిగాక నేరస్థుల్ని పట్టుకొనేందుకు పోలీసులు విపరీతమైన శ్రమకి గురవుతారు.
    
    చెకింగ్, కౌంటర్ చెకింగ్, కొన్ని వందలమంది ప్రత్యక్ష, పరోక్ష సాక్షుల్ని ఇంటర్వ్యూ చేయటం, (ఒక్కోసారి అది వేలకు కూడా చేరవచ్చు) నేరం జరిగిన ప్రాంతాన్ని దుర్భిణి వేసి వెతకటం, నేరానికి ఉపయోగపడిన మారణాయుధాన్ని చేజిక్కించుకొనేందుకు మురికికాలువల్ని, చెరువుల్ని, వాగుల్ని, పొదల్ని, బావుల్ని తిరగతోడడంలాంటి పద్ధతుల్నే నేటికీ భారతీయ పోలీసులు అనుసరిస్తున్నారు.
    
    నిశిత పరిశీలనా పోలీసులకు ఉండవల్సిన ప్రధమ లక్షణమే అయినా వారి పరిశీలనకు మోడరన్ పోలీసు లేబొరేటరీ ప్రయోగాల్ని తప్పనిసరిగా జోడిస్తేనే ఫలితాలు ఖచ్చితంగా, వేగంగా చేతికంది వస్తాయి.
    
    మోడరన్ సైన్స్ క్రైమ్ డిటెక్షన్ ఫెసిలిటీస్ ని సులభతరం చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS