Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 37

ఫోన్ మ్రోగింది.
రుక్మిణి మెల్లగా అందుకుంది.
"హలో...మినిస్టర్ అంబరీషుడిగారి భవంతి."
"ఆ...నేనమ్మా! తిరుమలరావును. పేపరు ప్రకటన చూశావా?"
"చూశాను. చాలా బాగుంది మాస్టారూ! మీ ప్రయత్నాల్లో మీరు మరింత చురుగ్గా కదలండి."
"థాంక్యూ అమ్మా!"
"ఒకసారి మీ పావనితో మాట్లాడాలి...ఆమె ఎక్కడ దొరుకుతుంది?"
"నీవెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది."
"నేను రమ్మనటం కాదు- ఆమె వుండే చోటుకే నేను వస్తాను. వీలుగా వుంటే మీ ఇంటికి."
"అంతకంటే అదృష్టమా! ఎప్పుడు వస్తావ్?"
"ఈ రోజు సాయంత్రం గానీ, రేపటి ఉదయం గానీ."
"తప్పకుండా! పావన్ని ఇంటి దగ్గరే వుంచుతాను. పావనిని మీ ఇంటికే తీసుకొచ్చేవాడ్ని. కానే ప్రస్తుత పరిస్థితుల్లో..."
"అర్ధమయింది. మీరు వివరణ ఇవ్వక్కర్లేదు! కాలేజీకి ప్లేస్ ఎక్వయిర్ చేశారా?"
"ఆఁ....! హైటెక్ సిటీకి, హిల్స్ కీ మధ్య పదెకరాల స్థలం చౌకగా వచ్చేట్టు వుంది. ముందు ఆ మొత్తం మీ పేరున కోనేస్తాను. మనకు అందులో ఐదేకరాలు ఉపయోగపడినా....ముందు ముందు ధర వస్తుంది. అప్పుడది అమ్మితే ఆ కాలేజీ కొనసాగింపుకు మరింతగా వుపయోగపడుతుంది. ఇప్పటికే అక్కడ ధరలు పెరుగుతున్నాయి."
"వాటిని నా పేరుకంటే- మీ పేరునే కొనండి."
"అదేమిటమ్మా? సొమ్మొకరిది- సోకొకరిదీ అన్నట్టు! పైసా పెట్టుబడి లేకుండా కోటి రూపాయల ఆస్తిని నా పేరున రిజిస్టరు చేయటమా? అది జరగని పని.
ఇప్పుడలా ఎందుకంటున్నావ్?"
"మరేంలేదు. నా పేరు కనిపించకుండా ఆ ప్రాజెక్టు నిర్వహించండి మాస్టారూ! ఆర్ధిక సాయం మాత్రం ఆపను. అయితే మనీ ఎప్పుడు అందుతుందో నేను మీకు తెలియజేస్తాను. అప్పటివరకూ రిజిస్ట్రేషన్ ఆపండి. ఆతర్వాతే నిర్మాణ కార్యక్రమాలు."
"అలాగే తల్లీ! నీ పేరుకు ఇంటి దగ్గర అమాత్యుల వారి నుండి అభ్యంతరం వచ్చివుంటే కొన్నాళ్ళు పేపరులో కనపడనీయను. కానీ లావాదేవీలన్నీ నీ పేరుమీదే జరుగుతాయి."
రుక్మిణి ఆ తర్వాత ఏం మాట్లాడలేదు.
తిరుమలరావు ఆమెను తన ఇంటికి రావలసిందిగా మరోసారి అభ్యర్ధించి ఫోన్ పెట్టేశాడు.
రుక్మిణి మెల్లగా నిట్టూర్చింది.
నొసటి మీది గాయం రక్తం కారకుండా గడ్డకట్టి బిగుసుకుంటుందేమో...ఎవరో అక్కడ చర్మాన్ని లాగుతున్నట్టు అదో రకమైన ఫీలింగ్ నూ, బాధనూ అనుభవించింది.
వంటచేసే మనిషి మరోసారి వచ్చి-
"అమ్మగారూ! ఏదన్నా పూతమందూ, బిళ్ళలూ తేమంటారా? ఒకసారి డాక్టరు దగ్గరకెళ్ళి వస్తే బాగుంటుంది."
తను ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేస్తే క్షణాల్లో వస్తాడని రుక్మిణికి తెలుసు. కానీ ఆయన గాయం ఇలా ఎందుకయిందంటే ఒక అబద్దం చెప్పాలి. కనుక తనే ఏదో ఒక ఆసుపత్రికి బయటకెళ్ళి వస్తే బాగుంటుంది. గాయం నీరు పట్టకుండా యాంటీ సెప్టిక్స్ వాడటం మంచిదనుకుంది.
ఆ తర్వాత వంట మనిషి వైపు చూసి-
"సరే- వెళదాం పద! బయట సెక్యూరిటీ మెన్ ఎంతమందున్నారో ఒకసారి చూసిరా!" అంది.
పనిమనిషి బయటకెళ్ళి వచ్చింది.
ఇరువురు మాత్రమే గేట్ హౌస్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారనీ, ఇంకెవరూ లేరనీ చెప్పింది.
రుక్మిణి బయటకు వచ్చింది.
ఒక కారు మాత్రం భవంతి ముందు ఒక పక్కన పార్కు చేయబడి వుంది. డ్రయివర్ ఇంకా రాలేదు.
రుక్మిణి వంటమనిషిని వెంటబెట్టుకొని కారు దగ్గర కెళ్ళింది. సెక్యూరిటీ మెన్ ఎలర్ట్ అయ్యారు.
ఆ రోజు ఆమె స్వయంగా నడుపుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ మెన్ కు అంత ఉదయమే అటూ మినిస్టర్ గారెళ్ళటం...ఇటు అమ్మగారెళ్ళటం కాస్తంత ఆశ్చర్యమేసింది.

                       *    *    *    *
మరుదినం పేపరులో అంబరీషుడు గతుక్కుమనే వార్త వచ్చింది.
"అమాత్యులు అంబరీషుడుగారి గెస్ట్ హౌస్ లీలలు! బసంతి అనే అమ్మాయితో రాత్రి మొత్తం రాసక్రీడలు! ఫ్రంట్ పేజీలో ఒక ప్రక్క వివరంగా వ్రాయబడి వుంది.
అమాత్యుల వారి ఫోటో-బసంతి ఫోటో ఆ వార్త దగ్గర బాక్స్ కత్తి ముద్రించారు. ఎరువుల కుంభకోణం బయటపడటంతో ఆయన తనపాత పర్సనల్ స్టాఫ్ ను అనుమానించి తొలగించటం జరిగిందనీ...వచ్చిన అనంతరం మంత్రిగారికి కొత్తయినా పదవికి కొత్త కాదనీ, అనంత్ గారి దగ్గర అనంతకోటి ఉపాయాలున్నాయనీ అందులో బసంతి ఒక ఉపాయమనీ మొత్తం వివరంగా వ్రాశారు.
చదివిన అంబరీషుడికి మరింత ఆశ్చర్యమేసింది. బసంతికీ, తనకీ జరిగినా సంభాషణతొ సహా ఆ పత్రికలవాళ్ళు ముద్రించారు. తన కదలికల మీదే నిఘా అనుకుంటే....తన మాటలమీద కూడా నిఘా ఎలా పెట్టగలిగారు.
ఈ మేటర్ క్రింద మాత్రం ఒక న్యూస్ ఏజన్సీ పేరు వుంది. అంటే దీనిలో కూడా ఆ పావని ప్రమేయం వుండి వుంటుంది. తనమీద ఒక వార్ డిక్లేర్ చేసింది ఆవిడే! కనుక....ఈ న్యూస్ కూడా ఆమెకు తెలీకుండా బయటికి రాదు.
రేపు దీన్ని కిడ్ నాప్ చేసి తన గెస్ట్ హౌస్ లో అవమానపరస్తే ఆ విషయము కూడా వివరాలతో సహా రాస్తుందా? అదే జరిగితే ముందు ముందు దీనికి పెళ్ళీ పెటాకులూ లాంటివి జరిగే అవకాశమే వుండదు. ఆయన ఆగ్రహంగా అటూ ఇటూ తిరుగుతూ అక్కడే నిలబడిన అనంతం వంక చూసి__
"ఏం సార్! ఈ న్యూస్ ఎలా బయటకుపోయింది. బెడ్ రూమ్ లో మేము మాట్లాడుకున్న విషయాలుకూడా వీళ్ళు వ్రాశారు. అక్కడ బసంతికి నేను ప్రామిస్ చేసినమాట నిజమే!
నా రుక్కుకంటే నీవే బాగున్నావన్నాను. నీవు ఎంత కోరితే అంత మనీ యిస్తానన్నాను. సిటీలో నీవు కోరుకున్న ఇంటిని కొనిపెడతానన్నాను. నేను బ్రతికున్నంతకాలం నీవు నాకు సెకండ్ సెటప్ గా వుండి పోమన్నాను. అందుకు బసంతి కూడా కరిగిపోయింది.
ఈ విషయాలు పత్రికలకు రోజు గడవకుండా ఎక్కడమేమిటి? ఇవి బయటికెలా వస్తాయి? చెపితే నేను చెప్పాలి. లేకుంటే బసంతి నీకు చెపితే నీవు చెప్పాలి. నాలుగురోడ్ల కూడల్లో చర్చించుకునే అంశం అయిందంటే...ఎలా అయింది. ఇంతమంది మంత్రులుండగా ఈ గంటెవరయ్యా దీని రీఫిల్ ను రైఫిల్లా నామీదే ఎక్కుపెట్టింది. చివరికి నా ప్రైవేటు పడక గదిలోకి కూడా దీని జర్నలిస్ట్ క్ 'ఐ'వి సారించిందంటే దీన్ని ఉపేక్ష చేయాలంటావేం?
ఎరువుల కుంభకోణంలో పరారీ అయినవారి సంగతీ-జనార్ధన్ సంగతీ తర్వాత చూద్దాం. ఈ రాత్రికి దాన్ని గెస్ట్ హౌస్ కి ఈడ్చే ఉపాయం చూడు. మన ప్రైవేటు గూండాలు ఎంతమంది అవసరమో అంతమందినీ తీసుకెళ్ళు.
తీగెను ఎక్కడో ఒకచోట పట్టుకు లాగితే తప్ప డొంక కదలదు. దీన్ని లాగితే.....డొంకనే లాగినట్టు...దీని కొంగుచాటు బాచ్ ఎంతవుందో తెలుస్తుంది. దాన్ని దాని వైపునుండే నరుక్కురావాలి. ఆఫ్టరాల్ ఒక బుడ్డది....నా పర్సనల్ జీవితంతొ ఆడుకోవటమా?
అయినా ఎంతమంది లేరు....!
ఎన్ని కుంభకోణాలు ఎంతమంది చేయలేదు. ఇప్పుడు చేయడం లేదు. జుడిషియల్ స్కాం జరిగింది. న్యాయశాఖ మంత్రుల దగ్గర్నుండీ జడ్జీలవరకూ అందులో భాగముంది. దాని జోలికెళ్ళిందా యిది!
ఎన్ని స్కామ్స్ లేవయ్యా ఇది బయటికి తీస్తే.....ఉహూ వాళ్ళెవరి జోలికీ ఇదెళ్ళదు. వాళ్ళంతా సైడ్ రొమాన్స్ ఎంత లాగించటంలేదూ? ఒక్కొక్కడికి ముగ్గురు నలుగురు....వలల జోలికెళ్ళిందా యిది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS