"ఇప్పటికే ఎరువుల కుంభకోణం అంటూ తమమీద పత్రికల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆయన భార్య హైటెక్ సిటీల్లో క్లాసికల్ బ్రోతల్ ను నడుపుతూ, కలవారికి గాలాలువేసి కోట్లు సంపాదిస్తుందని వ్రాస్తే దిగజారుతున్న పరువు మరింత అఘాతంలోకి జారితే....దాన్ని బయటికెవరూ తీయలేరండీ. అడ్డదారుల్లో సంపాదించిన మనీ తిరిగి ప్రభుత్వాన్ని కప్పజెప్తే అంత పరువు నిలుస్తుంది. నైతికచట్రంలోని ఒక నీతిని నేను ఈ హైటెక్ వీధుల్లో శీలం పోగొట్టుకోవటం ద్వారా దిగజార్చితే....ఇక నిలిచేదేం వుండదు.
అలా కూడా సంపాదించుకోవచ్చని మీరు మార్గం చెప్తే నేనూ ఆలోచిస్తాను. ఎందుకంటే మనీ సంపాదించటంలో తమకు అనేక మార్గాలు తెలుసుకదా?"
రుక్మిణి పళ్ళబిగువున ఆ మాటల్ని అందేకాని...ఆ సమయంలో ఆమె గొంతులో దుఃఖం స్పష్టంగా కనపడింది.
అంబరీషుడు ఆ మాటలతొ తోకతొక్కిన పాములా అయ్యాడు.
ఒక్కసారి ముందుకు కదిలి....
"ఏమిటే కూశావ్?" అంటూ ఆమె చెంపకేసి ఫెఠీమని గట్టిగా ఒక దెబ్బ తీశాడు. ఈ అనూహ్యపరిణామానికి రుక్మిణి కూడా బిత్తరపోయింది. పెళ్ళయిన తర్వాత ఆయన తన అభిరుచుల్ని కొన్నింటిని నిర్లక్ష్యంచేస్తే చేశాడేమోగాని ....ఫిజికల్ గా హెరాస్ చేయటం ఇదే మొదటిసారి. అతనిదెబ్బకు నిలదొక్కుకోలేక తూలిపోయి క్రిందపడింది.
అంతకుముందు ఆగ్రహంగా మంత్రిగారి మాటలు వినపడటం-తరువాత దెబ్బ-క్రిందపడిన చప్పుడు....వినటంతో ఏదో జరిగిందని భయపడుతూ కిచెన్ లోని వంటమనిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన వంటమనిషివంక ఆగ్రహంగా చూశాడు అంబరీషుడు. ఆమె భయపడి ప్రక్కకు తప్పుకుంది.
ఈ లోపు క్రిందపడిన రుక్మిణిని జుట్టుపట్టుకుని లేవదీసి....
"ఎంత పొగరే నీకు? కుక్కలా కాళ్ళదగ్గర పడుండాల్సినదానివి మొరగటం కూడా నేర్చుకున్నావ్. అసలు వాడికి-అంటే నీ గురువుగాడికి మనీ ఎలా ఇస్తావో చూస్తాను. అసలు కాలేజీ ఎలా రన్ చేస్తాడో కూడా చూస్తాను. త్వరలో వాడి సంగతీ, పత్రికల్లో వ్రాసినందుకు వాడి కూతురు సంగతీ....పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ సంగతీ...అన్నీ చూస్తాను" అంటూ బలంగా ఆమెను గోదావైపుకి విసిరి గబగబా లోనికి పోయాడు.
ఆ విసురుకు రుక్మిణి గోడకు గుద్దుకుంది. ముందుగా ఆమె తల తగిలి ఆ తర్వాత శరీరం కూడా దభీమని కొట్టుకుని ఆమె అక్కడే కుప్పలా కూలింది.
నొసటిమీద చర్మం చిట్లి రక్తం ధారగా ఆమె వంటిమీద కారింది. రాత్రి సమయాల్లో కట్టుకున్న ఖరీదయిన తెల్లటి కాటన్ చీర మీద ఆ ఎర్రటి రక్తం చూసేవారికి భయంగా కనపడింది.
వంటమనిషి గభాల్న ఆమె దగ్గరకొచ్చి-
"అమ్మగారూ! దెబ్బబాగా తగిలింది. నెత్తురు" అంటూ రుక్మిణి కట్టుకున చీరె పయ్యెద చెంగునే గభాల్న చించి అందులోంచి మరో ముక్క విడిగా చించి- దాన్ని మడతపెట్టి గాయానికి తిన్నగా దాన్నుంచి-మిగిలిన పీలికను తలకు కట్టుకట్టింది.
"అమ్మగారూ! ఆసుపత్తిరికి" మరలా ఆ మనిషే అంది.
"ఏం వద్దు!" అంటూ రుక్మిణి మౌనంగా బాత్ రూమ్ కి వెళ్ళి వంటి మీది రక్తాన్ని కడిగి చీరె రవికె మార్చుకుని బెడ్ రూమ్ కెళ్ళి అలాగే పడుకుంది.
తన భర్త ఇంత విచిత్రంగా, దుర్మార్గంగా ప్రవర్తించటం ఇదే మొదటిసారి. ఆయన ప్రస్తుతం తిరుమలరావుగారినీ, ఆయన కుమార్తె నీ ప్రధమ శత్రువులుగా తలుస్తున్నారు. తనేమో అదే తిరుమలరావుతో విద్యా పరమైన ఒక ప్రాజెక్టుకు మనీ డొనేట్ చేసి కరస్పాండెంట్ గా వ్యవహరించబోతుంది. ఆయన ఆగ్రహానికి అదే బలమైన కారణం.
రుక్మిణికి తలమీద తగిలిన గాయం మరింత చురుకుగా మారింది. నొప్పి కూడా మొదలయింది. రక్తం చెమ్మగా లోపలినుండి బయటకొచ్చి కట్టిన క్లాత్ తడిసిపోయింది.
అంబరీషుడు ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయలేదు. బయట సెక్యూరిటీ గార్డ్స్ ఒకదరిని నిలబడి వున్నారు. విజిటర్స్ రూమ్ లోకి ఒక రొకరుగా జనం పోగవుతున్నారు.
ఇంటి దగ్గర లేకుండా గెస్ట్ హౌస్ కు చేరాలి.
అప్పటికే కొత్త పి.ఏ. అనంత్ వచ్చి వరండా హాలులో కూర్చుని ఆ రోజు పేపరు తిరగేస్తున్నాడు. అంబరీషుడు లుంగీ- లాల్చీతొ బయటికిరావటం...మనిషి అదోలా వుండటం గమనించి శాల్యూట్ చేసి....
"వాట్ సర్!" అన్నాడు.
"మిస్టర్ అనంత్ జీ! ముందు గెస్ట్ హౌస్ కెళ్దాం పదండి...." అన్నాడు.
ఇంటిలో ఏదో జరిగిందని అనంత్ చాలా తేలిగ్గా కనిపెట్టాడు. వెంటనే ఆయన గెస్ట్ హౌస్ కి బయలుదేరటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు.
ఇంటినుండి కార్లు గెస్ట్ హౌస్ కి బయలుదేరాయి. మంత్రిగారి ప్రక్కన అనంత్ సర్దుకున్నాడు.
అంబరీషుడి ముఖంలో ఇంకా గంభీరత!
రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూసిన చౌకబారు స్త్రీలా అంబరీషుడు మారతాడనీ. తను లింక్ చేసిన బసంతిని ఇక వదలలేడనీ అనంత్ గెస్ చేసేడు.
బసంతి మంత్రిగారి గెస్ట్ హౌస్ లోనే వుండే ఏర్పాటు జరిగింది. ఒకరకంగా అనాధ రైజ్ద్ సెకండ్ హౌస్ గా దాన్ని తను ముందు ముందు మార్చగలడు. బసంతి కూడా అందుకు సమర్ధురాలే!
సో....అంబరీషుడి ఆదాయానికి గండి పడింది. అది తన ప్రవాహ దిశను మార్చుకుని, బసంతి దిశగా ప్రవహిస్తోంది. ముందు ముందు తన దిశగా కూడా!
చిన్నపిల్లలకు పంటి రుచీ- పెద్దవాళ్ళకు వంటి రుచీ అన్నారు. పసి పిల్లల్ని మచ్చిక చేసుకోవటానికి చాకొలెట్స్, మిఠాయిలూ ఇస్తే చెప్పినట్టువింటారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెంటపడి వస్తారు. పరిచయంలేక పోయినా అంకుల్, ఆంటీ అంటారు.
ఇక అంబరీషుడి లాంటి పెద్దవాళ్ళకూ, కోటీశ్వరులకూ 'వంటి రుచి' తగిలించాలి. బసంతి లాంటి తీపి వంటికి తగిలిందంటే ఇక అంతే సంగతులు.
అంబరీషుడు బసంతి రుచిలో పడ్డాడు. ఇకతడు బసంతి ఎలా చెపితే అలా వింటాడు. బసంతి తనెలా చెపితే అలా వింటుంది.
బసంతికి ఒక ప్రావీణ్యముంది.
అంబరీషుడి శరీరం ఒక 'కీ' బోర్డనుకుంటే- అందులో ఏ బటన్ నొక్కితే ఆయన బాగా వెలుగుతాడో ఆమె ఇట్టే కనిపెడుతుంది. అంబరీషుడి భార్యకు అన్ని సంవత్సరాలు కాపురం చేసినా, భర్త శరీరంలోని బటన్ సిస్టం తెలీదు. కొందరు గృహిణులు భర్తలు చేజారిపోయేవరకూ అంతే...' అందుకే అన్నిరంగాల్లోనూ టెక్నిక్స్ తెలియాలంటారు.
ఈ రంగంలోనూ టెక్నిక్స్ వున్నాయి.
అనంత్ ఆలోచిస్తుంటే....వారెక్కిన కారు వారి గెస్ట్ హౌస్ ముందు ఆగింది.
అప్పటికే బసంతి నాజూగ్గా అలంకరించుకుని- అంబరీషుడికి స్వాగతానికి సరసత్వాన్ని జేర్చి- లవ్ లీగా పలికింది.
అంబరీషుడు చిన్నగా నవ్వి...ముఖంలో తిరిగి అదే గంభీరాతను నింపుకొని లోనికి నడిచిపోయాడు.
"ఇంటి దగ్గర ఏదో అయింది. బండి 'లూప్ లైన్లో' పడింది. గేటు తెరిచావు కదా? వెనుతిరిగి పోనీకు. వెంటనే లోనికి పద."
అనంత్ అనటంతో - అతని బుగ్గమీద బసంతి నాజూగ్గా చూపుడు వ్రేలితో సరసంగా మీటి, లోనికి గబగబా పోయింది.
అనంత్ బ్రెయిన్ లో అనంతమైన ఆశ!
అతని కళ్ళు ఆశగా మెరుస్తున్న క్షణాల్లో-
ఆ గెస్ట్ హౌస్ కు దూరంగా-
అదే అంబరీషుడి భవంతిలో....
* * * *
