53 వ. సర్గ
1. "కపులకు వానము - ప్రియభూషణము
కావున కాల్చుడు - వీని వాలము |
వాడ వాడల - ఊరేగింపుడు
| పరాభవించి - వదలివేయుడు |
కాలిన తోకతో - వీడేడు గాక
అంపిన వారికి | తల వొంపుకాగ |"
అని రావణుడు వి | భీషణునిగని
ఆజ్ఞాపించెను - కోపమణచుకోని .... ||శ్రీ||
2. జీర్ణాంబరములు - అసురులు దెచ్చిరి
వాయుకుమారుని - తోకకు జుట్టిరి |
నూనెతో తడిపి - నిప్పంటించిరి
మంటలు మండగ - సంతసించిరి |
కపి కుంజరుని - ఈడ్చుకుబోయిరి
నడివీధులలో - ఊరేగించిరి |
మారుతి మాత్రము - మిన్నకుండెను
సమయము కాదని - సాగిపోయెను .... ||శ్రీ||
3. నడివీధుల ని | నాదము జేయుచు
కూడలి స్తలముల - ఆగుచు సాగుచు |
రామదూత ఇత | డీతడే యనుచు
దూషణలాడుచు - హేళన జేయుచు |
రాజభటులు మహా - వీరులనగ
వానరోత్తముని - వీధులద్రిప్పగ |
పిన్నలు పెద్దలు - అసురులు చేరి
దారి పొడవున - వేడుక గాంచిరి .... ||శ్రీ||
4. కపిని బంధించి తోక గాల్చిరని
నడివీధులలో - త్రిప్పుచుండిరని |
రాక్షస వనితలు - వేడుక మీరగ
పరుగున పోయి - సీతకు దెల్పగ |
అంతటి ఆపద - తన మూలమున
వాయు సుతునకు - వాటిల్లెనని |
సీతామాత - కడు చింతించెను
అగ్ని దేవుని - ప్రార్ధన జేసెను .... ||శ్రీ||
5. ఓర్వరానివై - మండిన మంటలు
ఒక్కసారిగా - చల్లగ దోచెను |
అగ్ని దేవునకు - నా జనకునకు
అన్యోన్యమైన - మైత్రి చేతనో |
రామదూతనై - వచ్చుట చేతనో |
సీతామాత - మహిమ చేతనో |
మండేజ్వాలలు - పిల్లగాలులై
వీవసాగెనని - మారుతి పొంగెను .... ||శ్రీ||
6. ఆనందముతో - కాయము బెంచెను
బంధములన్నీ - తెగిపడిపోయెను |
అడ్డగించిన - అసురులందరిని
అరచేత చరచి - అట్టడగించేను |
గిరి శిఖరము వలె - ఎత్తుగనున్న
నగర ద్వార - గోపురమందున |
స్తంభము పైకి - మారుతి ఎగసెను
లంకాపురమును - పరివీక్షించెను .... ||శ్రీ||
__: 53 వ. స. సంపూర్ణము :__
54 వ. సర్గ
లంకా దహనము :-
1. "ఏ మంటల నా - వాలము గాల్చిరో
ఆ మంటల నే - లంక గాల్తు" నని |
భీమరూపుడై - గర్జన జేయుచు
రుద్ర రూపుడై - మంటల జిమ్ముచు |
మేడ మిద్దెల వ | నాల భవనాల
వెలిగించెను జ్వా | లా తోరణాల |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
2. మంత్రి ప్రహస్త | మహాపార్శ్వుల
విరూపాక్ష - వజ్రదంష్ట్రుల |
ఇంద్రజిత్తు సు | మాలి జంబుల
శోణితాక్ష మక | రాక్ష కరాశుల |
కుంభ నికుంభ - కుంభకర్ణుల
శుక సారణాది - రాక్షస గృహముల |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
.png)
"ఏ మంటల నా వాలము గాల్చిరో
ఆ మంటలనే లంక గాల్తు" నని
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘనవిఖ్యాతి గ డించె మారుతి|
