7. "అతి బలశాలిని - వాలిని గూల్చి
సుగ్రీవుని కపి | రాజుగ జేసిన |
ఒకే భార్యయు - ఒకే మాటయు
ఒకే బాణమను - కీర్తి వహించిన
జానకీపతి - పురుషోత్తముడు
శ్రితజనపాలుడు - ధర్మరక్షకుడు |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
8. "సీతామాతను - అపహరించితివి
లంకకు దెచ్చి - బంధించితివి |
జానకీమాత - అవనీజాత
పావన చరిత్ర | మహా పతివ్రత |
ఆమెను వేల్చు వి | యోగజ్వాల
నీ సర్వమును ద | హించగల కీల |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
9. "ఇంద్రుడేని చ | తుర్ముఖుడేని
ఎవ్వడేని మరి | త్రినేత్రుడేని |
తిరుగులేని శ్రీ - రామబాణమును
ఎదిరించి నిలిచి - బ్రతుకనేర్తురే |
ఇంతటనైన - సీతమాతను
రామున కొసగి - శరణు వేడుము |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
రావణుడు ఆజ్ఞాపించుట :-
10. "సూటి పోటిగ - హితము దెల్పెడు
చాటు మాటుగ - భేదము గొల్పెడు |
ఈ వానరుని - పలుకులు ములుకులు
వినజాలము క | ర్ణ కఠోరములు |
మన యెడ ద్రోహము - చేసిన పాపుడు
వేగమె వీని వ | ధించి వేయుడు |"
అని రావణుడు - గర్జన చేయగ
మారుతి నిలచె - కడు నిబ్బరముగ ..... ||శ్రీ||
__: 51 వ. స. సంపూర్ణము :__
52 వ. సర్గ
విభీషణుడు రావణునితో :-
1. "అన్నా ! రావణ - తెలిసినవాడవు
శాంతముగా నా - మనవిని వినుమా |
దూతను జంపుట - ధర్మము గానిది
లోకముచే గ | ర్హింపబడునది |
శూరుడవైన - నీకు తగనిది
రాజధర్మ వి | దుద్దమైనది |"
అని విభీషణుడు - లంకేశునితో
దూతను జంపుట - తగదని తెల్పెను .... ||శ్రీ||
రావణుడు విభీషణునితో :-
2. హితవు దెలిపిన - సోదరునిగని
రావణుండు రో | షాన మండిపడి |
"దూతగ వచ్చిన - ఈ వనచరుడు
మన ఎడ ద్రోహము - చేసిన పాపుడు |
పాపిని జంపుట - పాపము గాదు
ద్రోహిని వదలుట - ధర్మముగాదు |"
అని రావణుడు మ | హోగ్రడై నిలిచె
కపిని బట్టి వ | దింపగ బలికె .... ||శ్రీ||
విభీషణుడు రావణునితో :-
3. "అన్నా ! రావణా - కరుణ జూపుమా
ప్రసన్నుడవై - ఆలకింపుమా |
మంత్రి సుతులను - సేనాపతులను
అక్షకుమారుని - ఈ కపి చంపెను |
మనకీతడు శ | త్రువేను నిజముగ
అయినను దూతగ - వచ్చినాడుగ |"
అని విభీషణుడు - లంకేశునితో
దూతను జంపుట - తగదని తెల్పెను .... ||శ్రీ||
4. "అన్నా ! వీనిని - వధియింపకుమా
తగురీతిని దం | డించి పంపుమా |
దూతయెడల వి | దింపబడినవి
వధ గాక తగిన - దండనలున్నవి |
తల గొరిగించుట - చబుకు వేయుట
గురుతు వేయుట | వికలాంగు జేయుట |"
అని విభీషణుడు - లంకేశునితో
దూతను జంపుట - తగదని తెల్పెను .... ||శ్రీ||
5. "ఈ వానరము | పరబ్రహ్మమో
దివ్యతేజమో - సత్యరూపమో |
యమ కుబేర ఇం | ద్రాది దేవతలు
తపో బలమున - పంపిన భూతమో |
వైష్ణవ మాయ - కపి రూపమున
నను వంచించి వ | దింప వచ్చెనో | "
అని దశకంఠుడు - తర్కించుకొనెను
పరిపరి విధముల - తనలో తాను .... ||శ్రీ||
_: 52 వ. స. సంపూర్ణము :__
