"వసంతా, నువ్వు ఇప్పటి కైనా మగవారి హృదయాలను అర్ధం చేసుకొని ఉంటావను కొంటాను. కేవలం నీ పైని ప్రేమను చంపుకోలేక, చంపుకొని బ్రతక లేక ఆడవారిలా ఆత్మహత్య చేసుకొన్నాడు ప్రకాశం. అందుకు అతన్ని లోకం ఏమంటుందో తెలుసా? ఒక చేతకాని వాడు గానూ, తెలివి తక్కువ వాడుగానూ పరిగణీంప బడతాడు అతడు.అందుకు కారణమైన నిన్ను ఏమీ అనలేదు. అనకూడదని దానికి వ్రతమేమో చెప్పలేను గాని అతని హృదయ దౌర్భాల్యాన్ని అర్ధం చేసుకో ప్రయత్నించదు. దాని ఆ విషయం అక్కరలేదు."
ఆగి ఆమె నుండి ఏదైనా జవాబు వస్తుందని చూశాడు. "చిన్నప్పుడు నీకు జ్ఞాపకం ఉందను కొంటాను. చిన్న చిన్న చీమలను పురుగులను చేతులోకి తీసుకొని వదిలుపెడుతూ తిరిగి చేతుల్లో బందిస్తుంటాం. ఆఖరకు దాని చావుకు కారకులం అవుతాం. అది పసితనం, ఇప్పుడున్నది యౌవ్వనం. అది జీవితానికి పసితనం. ఇది యౌవనానికి పసితనం. అప్పుడేం చేసినా చెల్లుతుంది. ఇప్పుడటువంటివి చేస్తే కొందరు మాత్రం జాలి చూపగలుగుతారు. ఆ అలవాతునే మనం కొనసాగిస్తుంటే భరించదు లోకం. రాక్షసులు మానవులను ఒకేసారి చంపరట. ఆడుకొని బాధించి మరీ చంపుతారట. మనం రాక్షస ప్రవృత్తి ని కాదు అలవరచు కావలసింది. మనలో ఉన్నది మానవత్వం. దాన్ని గుర్తించి నడుచుకో లేనివాడు ఆ మానవత్వానికి , మనుగడ కూ , అర్ధమూ అంతర్యమూ లేవు.'
వసంత మౌనంగా అన్నీ వినసాగింది.
"ఒక్కసారి అతడు చనిపోయేముందు ఏ విధమైన బాధకు గురై ఉంటాడో ఊహించుకో గలవా? ఆ బాధ నేవ్వరూ వర్ణించలేరు. ఒకవేళ ఆ ఆదిశేషుడే వర్ణించగలిగినా దాన్ని వినే శక్తి మనకు ఉండదు. దానిలో ఏ నూరవ వంతు ఊహించుకోగలిగినా , లేక విన్నా, పగవారికి వద్దు ఈ బాధ అని చింతిస్తాము. నీ జీవితానికి వెలుగు చూపడానికీ, సరియిన త్రోవన నడపడానికి అది చాలు. అతను చనిపోతూ నీ కళ్ళు తెరిపించాడనే భావిస్తున్నాను. అతని మరణానికి బాధపడాలో, నీ కళ్ళు తెరవబడినందుకు ఆనందించాలో తెలియడం లేదు."
"దీనికి విముక్తి లేదా?"
"విముక్తి మాట దేవుడెరుగు . కొందరి జీవితాలు దుఃఖ మయమైనవైనా వారి పై ఆధారపడ్డ మరి కొందరికి నష్టం కలిగించకుండా ఉండడం నేర్చుకో. ఈ వయసులో మీ నాన్నగారిని హింస పాలు చెయ్యకు. అదే నా కోరిక."
క్రింద ఆనందరావు గారి గొంతు వినిపించింది.
"ఏమిటోయ్, బాగా చదువుతున్నావా? అన్నట్లు మీ పరీక్ష లెప్పుడు?"
"ఇంకో వారం రోజులున్నాయండి."
"అవును ఎవరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకోన్నాడట. అతడొట్టి పిచ్చి వాడు లాగున్నాడే!"
నవ్వుకొన్నాడు రాజ్. ఆ మాట విని.
* * * *
"ఒరేయ్!"
"ఏమిట్రా అలా అరుస్తావు?"
"ప్రమాదం!"
"ఏమిట్రా ఆ ప్రమాదం?"
"అటు చూడు."
ఇంటి ముందు టాక్సీ దిగుతున్న ఇందిరను రావుని చూసి గతుక్కు మన్నాడు రాజ్.
"చచ్చాం. ఇప్పుడాయన ఎదురు పడడమెలగరా?"
"అదే కదా నే చెప్తుంటా? ఉపాయం?"
"పలాయనమే. పద. పైన నా గదిలో కూర్చొని తలుపులు బిగిద్దాం." అని రాజ్ ఆనంద్ ను పిలుచుకొని మేడ పైకి పోయాడు.
అప్పుడే మేడ పై నుండి అక్కయ్య నూ. బావను చూసిన లత హుషారుగా క్రిందికి వస్తూ రాజ్ ను డీ కొంది. అది కూడా గమనించ కుండా పైకి వెళ్ళిపోయారు వారు. ఏమిటా వీళ్ళంత హడావుడి గా పోతున్నారు అనుకొన్న లత , అప్పుడే లోపలి కొచ్చిన అక్కయ్య నూ, బావను చూసి గంతు లేస్తూ పోయి అక్కయ్యను కౌగలించు కొని చిలిపిగా రావును చూసింది.
"ఏం కొంటె పిల్లా! బాగున్నావా?' అడిగాడు రావు.
"బాగున్నాను కొంటె బావగారూ! అయినా మనుష్యులు చేదుగా కూడా ఉంటారా!' అంది.
"నీకు తెలియదు లే చిన్నపిల్లవు." నవ్వాడు రావు. ఇంతలో వాళ్ళమ్మ లోపలి నుండి నవ్వుతో వచ్చింది.
రావు క్రింద నున్న రెండు మూడు గదులలోకి వెళ్లి చూశాడు. ఇందిర కూడా ఎవరి కోసమో వెదుకుతుంది.
"లతా, రాజు ఎక్కడి కెళ్ళాడే?' అప్పుడు గ్రహించింది లత బావ హడావుడి కి కారణం.
"అక్కయ్యా, బావ ఈ మధ్య ఆడపిల్ల యి పోయాడు. మీరు వస్తున్నది చూచి తన గదిలో దాక్కున్నాడు. " పగలబడి నవ్వుతూ చెప్పింది లత.
"లతా, ఏమిటే అది!" మందలించింది వాళ్ళమ్మ.
"రాజూ!" మేడ పైకి పోయింది ఇందిర.
వదిన గొంతు విని బయటికి రాక తప్పింది కాదు, రాజ్ కు.
"వదినా!" అంటూ గదిలో నుండి బయటి కొచ్చి ఇందిర ప్రక్కనే ఉన్న రావును చూసి తల వాల్చేశాడు రాజ్.
"ఏమయ్యాయ్ కాలంతకుడా! నువ్వే ఇలా సిగ్గుపడి పొతే ఎలా చెప్పు? సిగ్గు పడవలసింది నువ్వు కాదు; నేను."
"అన్నయ్యా!" అన్నాడు తలెత్తి రాజ్.
"ఊ. అదీ వరస. ఇక పద. అత్తయ్య చేసిన వేడి వేడి వంటకాలు తిందాం" అని ప్రక్కనే ఉన్న ఆనంద్ ను చూసి "ఓ! నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా! మరీ మంచిదైంది. పద. నాకు ఆకలి ఎక్కువ." అన్నాడు రావు. నవ్వుకొని అనుసరించారు ఇద్దరూ.
చల్లని గాలి, మనోహర దృశ్యాలు , కన్నుల కింపైన తోట, తోటలోని పువ్వుల ఘుమఘుమ గాలిలో కలిసి మనసును మైమరపిస్తుండగా మల్లె పందిరి, నిశ్శబ్దము -- వీటి మధ్య కూర్చొన్న మానవుడికి అవతలి లోకముతో పనిఏమి? ఆకలి డప్పులకు అల్లాడవలసిన అవసరమేమిటి? వీటికి తోడు అన్నింటినీ మించిన అందమైన అప్సరస లాంటి యువతి ప్రక్క నుంటే ఇక ఆ ఆనందానికి హద్దు ఉండదు. మల్లె పందిరి మధురమైన హాయి ప్రసాదిస్తుండగా పిల్లగాలి కోరికల అలలను అప్పుడప్పుడు రేపుతుండగా , ఆ నిశ్శబ్దం లో ఆ మనోహర దృశ్యాలను చూస్తూ ఆ చక్కని తోటలో ప్రక్కన అమ్మాయితో ఆ ఆనందాన్ని , ఆ సుఖాన్నీ , ఆ హాయినీ , ఆ తృప్తి నీ, ఎవ్వరికీ పంచి పెట్టక ఒక్కడినే అనుభవించాలనే స్వార్ధం మానవుడి లో తప్పక కలుగుతుంది. ఆ తోటలో విహరించే భాగ్యం కలిగినప్పుడు ఏ దేవ లోకం లోనో విహరించిన తృప్తి అతనికి కలుగుతుంది. ఆ ఆనందాన్ని అనుభవించి దేవతలతోనే పోటీ చేయమంటుంది అతని హృదయం. ఆ పడతి అందాన్ని అలాగే కళ్ళతో త్రాగి అమృతాన్ని గ్రోలిన సంతోషాన్ని పొందుతాడు అతడు. ఆ చల్లగాలి శరీరాన్ని పులకింప జేస్తుండగా మనసులోని వేడి కోరికలను మరగింప జేస్తుండగా , ఆ పులకింత లో ఆ వేడి మిళితమై బాధకరమైన ఆనందాన్ని అనుభవిస్తాడతడు. ఆ బాధతో తియ్యదనం, ఆ తృప్తి లో లోపం, ఆ ఆనందం లో అందుకోలేమనే ఆవేదన, ఆ సంతోషం లో భయం పెనవేసుకొని ఉండగా తనది అదృష్టమో, దురదృష్టమా అని తెలుసుకోలేక అన్నీ చెయ్యాలని ఏమీ చెయ్యలేక ఉండిపోతాడు.
మల్లెపందిరి నీడలో ఒక చిన్న బల్ల. ఆ బల్ల చుట్టూ కుర్చీలు. ఆ బల్ల పై రెండు ఖాళీ చెయ్యబడ్డ తీ కప్పులు. అక్కడ ఉన్న ఇద్దరినీ దీనంగా చూస్తున్నాయి. కానీ వాటి పై దృష్టి లేదు ఆ వ్యక్తులకు. వారి కళ్ళు కలిశాయి. నాలుగు కళ్ళూ ఏకమై ఏవో గుసగుస లాడుకుంటున్నాయి. వారి హృదయాలు మూగగా మాట్లాడు కొంటున్నాయి.
"అన్నయ్యా" అన్న పిలుపుతో ఈ లోకం లోకి బలవంతంగా వచ్చాయి కలిసి ఎక్కడో తిరుగుతున్న వారి మనసులు.
"సుగుణా! కూర్చో." చిరునవ్వుతో చెప్పాడు రాజ్.
"మీ ఏకాంతానికి భంగం కలిగించానా?" అడిగింది సుగుణ.
'సుగుణా! నువ్వు మెడిసిన్ లో చేరావు. మాటలు సూటిగా విసరడం నేర్చుకోన్నావు."
"అంతా నీ చలువే కదా, వదినా?"
"సుగుణా!"
"మరిచానన్నయ్యా! ముందు అన్నయ్య, తర్వాతనే వదిన."
ఫక్కుమంది రజియా.
"రాజ్, ఇవ్వేళ తో పరీక్షలు అయిపోయాయి. మరి ఏం చెయ్యదలుచుకొన్నావు?"
"అదే ఆలోచిస్తున్నాను , రజీ! చేస్తే లెక్చరర్ ఉద్యోగమే గతి. అసలు అది చెయ్యాలన్నా క్లాసు రావాలి."
'నీకు యూనివర్శీటీ ఫస్టు ఇవ్వకుంటే అసలు ఆ యూనివర్శీటీ యే పనికి రాదు." లోపలికి వస్తూ చెప్పాడు ఆనంద్.
"వచ్చావా! అయితే ఇక కాలక్షేపం బాగా జరుగుతుంది."
"ఏం? నేనంటే అంత లోకువై పోయావట్రా నీకు? ఏం చెల్లమ్మా , ఇంటి కొచ్చిన అతిధిని ఇలా అనుమానిస్తున్నారే మీవారు? చూస్తూ ఊరుకుంటావా?"
రజియాకు మీవారు అన్న పదం చెవిని పడగానే రాజ్ అప్పుడే తనవాడై పోయినట్లు గర్వపడింది. కానీ వెంటనే సిగ్గు ముంచుకు రాగా అక్కడి నుండి లేచి పోవాలను కొంది. కానీ సభ్యతా, సంస్కారం అడ్డు వస్తున్నాయి. ఎంత చదువు కున్నా, నలుగురి లో మెలగినా స్త్రీకి పెళ్లి విషయం ఆమె ముందే చర్చించడం జరిగినా, ఆమెలో ఆ భావాలు మెదిలినా సిగ్గు పడడం సహజం.
"ఏమమ్మా, వదినా? జవాబు చెప్పు."
సుగుణ పై కోపం వచ్చింది. ఏదో సామెత చెప్పినట్లు, అత్తగారు తిట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు కోపమొచ్చి నట్లు సుగుణను చిలిపి కోపంతో చూసింది.
రజియా అవస్థ చూసిన రాజ్ తిరిగి ఏదో అనబోతున్న ఆనంద్ ను తీక్షణంగా చూశాడు. అది చూసి మాట మార్చేశాడు ఆనంద్.
"పరీక్షలై పోయినా ఇంకా ఘోషా వాళ్ళ మాదిరి ఇంట్లో కూర్చొని ఉండటం ఏం బాగోలేదు."
"ఇంకేం చేయమంటావు?' నవ్వుకొని అడిగాడు రాజ్.
"అలా కాళ్ళ కున్న చెప్పులు అరిగి పోయేలా ఊరంతా చక్కర్లు కొట్టుకొని రావడమో, చుట్టూ ఉన్న కొండల్లో షికారు కొట్టడమో అదీ కాకుంటే ఏ బాంబే యో, కలకత్తా యో, చూసి రావాలి. ఇది ఎండల కాలం కాబట్టి ఊటీ కెళ్ళితే బాగుంటుంది."
"ఇంకా నయం. ఈ కొండల్లో ఒక ప్రతి ధ్వనిలా, ఆ నీలగిరి లో నువ్వూ ఒక కొండగానో చిన్న సెలయేరు గానో నిలిచి పోవాలనే కోరిక కోరలేదు."
"నేనేం కవిని కాదు అటువంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరడానికి. మనకు కావలసింది కేవలం సుందరమైన దృశ్యాలు చూడటం , సుందర మైన వారితో పరిచయం చేసుకోవడం, గొప్ప అనబడే స్థలాలను సందర్శించడం -- అంతే . అందులోనే మనకానందం."
"అయితే, అన్నయ్యా, ఇప్పుడు నువ్వు చెప్పినదంతా చేస్తే ఏమిటి ప్రయోజనం?' అడిగింది సుగుణ.
"ప్రయోజనమా! లేకేం? చాలా ఉంది."
"ఏమిటో కాస్త చెప్పరా. మేం వింటాము."
"ఊ. కేవలం అందాన్ని తెలుసుకోవడమే దీనికి ప్రయోజనమేముంది?" తికమక పడ్డాడు ఆనంద్.
నవ్వింది సుగుణ.
"అయితే, రాజ్, ఏ పని చేసినా ప్రయోన మంటూ ఒకటి ఉండవలసిందేనా?"
"తప్పదు రజీ. ఇప్పుడు వాడు చెప్పినట్లు ఏదైనా ఊళ్లు తిరిగొస్తే విజ్ఞానం ఆర్జించుకోవచ్చు. ఆ అందం వెనుక నున్న ఆనందాన్నీ, అర్ధాన్నీ ఆస్వాదించవచ్చు."
"మహా చెప్పొచ్చావు. ఈ జీవితానికి ప్రయోజన మేమిటోయ్?"
'అనుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. లేకుంటే ఏమీ లేవు. ఈ లోకంలో ఒక ఆదర్శంగా నిలిచిపోవాలి. పలువురికి పలు ధ్యేయాలుంటాయి . అందరూ ఆచరిస్తున్నారా అని అడుగువద్దు. అసలు ఈ జీవితానికి ఏ ప్రయోజనమూ లేదనుకొంటే అదీ ఒక ప్రయోజనమే అవుతుంది. నాకు ఏ కోరికలూ లేవు అన్ననాడు అది ఒక కోరికవుతుంది."
"ఒరే నీతో మాట్లాడే శక్తి మాకు లేదు. సినిమాకు టైం అవుతోంది . పోదాం పద."
