Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 36


                                       నిరీక్షణ

    ముందు అందరూ నన్ను రాణిని చేశారు. తరవాత నేను దొంగనయినాను.
    నా కళ్లకు గుడ్డ కట్టారు. నేను చేతులతో వెదుకుతూ తిరుగుతున్నాను. ఎవరివో ఎరుగని చూపులు నా చేయి పట్టుకొని నడుస్తున్నాయి. నేను బెదిరాను. కట్టిన గుడ్డ విప్పిపారేశాను. చుట్టుపక్కల ఎవరూ లేరు. పిల్లలందరూ నన్ను వదిలేశారు. బామ్మల దుప్పట్లలో చేరారు. పేదరాశి పెద్దమ్మ కథల్లో మునిగిపోయారు.
    నేను వంటరిగా నుంచున్నాను. ముందు బామ్మను నిద్రపుత్తునా? నేను నిద్రపోదునా? అని ఆలోచిస్తున్నాను.
    అప్పుడు ఉరికివచ్చాడు. ఎక్కణ్ణించి వచ్చాడో తెలీదు. బరువుతో వంగిపోతున్నాడు. పూలతో నిండిన బుట్ట నాకు అందించాడు. వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ నిలిచాడు.
    'ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను' అన్నాడు.
    నా నోట మాట రాలేదు. బుట్టనూ చూడలేదు ఎంత నిర్దయుడు - మొగ్గల్ను తెంచాడు! ఇవి వికసించడానికి ఇంకా చాలారోజులు కావాలి.
    ఇదేమిటి? జీవితాంతం ఇక్కడే నుంచొని ఉంటానా? షబ్బూ, మున్నీ, సారా అంతా నన్ను వదిలేశారు. అత్తవారిండ్లకు వెళ్ళిపోయారు. అటు అమ్మ కేకలు- ఏమోనమ్మా మేమెరగం-మనిషి జాడ పడనీయరు. మేంరాము - మమ్ములను ఎవరూ పిలవద్దు! బావుంది. ఏమిటీ బలవంతం! ఎప్పుడూ గదిలోనే కూర్చోవాలా? ఏమిటో ఈ పేరంటాలు- గీరంటాలు. గుర్తించగలడా ఎవడైనా? వెదకడానికి వస్తే వెళ్ళిపోవాల్సిందే.
    ఇవ్వాళ తేదీ ఎంత? ఓ చిన్నకోడలా ఇవ్వాళ 'గుడ్డూ' జన్మదినం. ఈ కాలపు పిల్లల తెలివి తెల్లవారినట్లే ఉంది. ఏదీ గుర్తుండదు. కాస్త తేదీలు వారాలు గుర్తుంచుకోండి. మేం కొండలాంటి జీవితాన్ని దాటేశాం. మేం ఏదీ మరువలేదు. ఇప్పుడు ముసలిదాన్ని అయినానా? అయినా ప్రతి ఒక్కటీ గుర్తు ఉంటుంది.
    ఏయ్ పిల్లలూ కాస్త రొద తగ్గించండి. గుమ్మంలోకి ఎవరొచ్చారో చూడండి. ఇప్పుడు నాకేమీ వినరావడంలేదు-గుమ్మందాకా ఎవరో వస్తున్నట్లు మళ్లీ పోతున్నట్లూ అనిపిస్తోంది.
    చాలు కొడకా! చాలించు. ముసలితనానికి మందెక్కడ? చావును తప్పించగలవా? నన్ను వంటరిగా ఉండనీ! కదులు ఇక్కణ్ణించి. అవును, ఇప్పుడు అల్లాను ఎందుకు స్మరిస్తాను! నా కష్టాలు గట్టెక్కించే అల్లాను పిలుస్తాను- అతడు నా కనుల వెలుగు లాక్కొని వెళ్లిపోతాడు. నా కళ్లు మంకువి-మొండివి-ఇంత ముసలితనంలో కళ్ళలో ఈ వెలుగేమిటి? గుండె పడిపోయింది. కాళ్లు చేతులు మాట వినడంలేదు. అయినా కళ్ళల్లో జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి. కంటికీ, కంటి వెలుగుకూ వార్ధక్యం లేదా?
    పిల్లల్లూ! నా ప్రాణం దేనిమీదా లేదు. నేను డబ్బు దాచుకోలేదు-మూట కట్టలేదు. నా పూలబుట్టుంది. చూచారా? దాన్ని జాగ్రత్తపరచండి. పిల్లలు తాకకుండా కాపాడండి. పిల్లలకు తెలివి ఉండదు.
    ఎవడైనా ఇలాంటి మొగ్గలను తెంపుతాడా?

                                                                               * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS