Previous Page Next Page 
వైరం పేజి 36


    కూడూ, గుడ్డా, మందూ మాకులకి తగిన డబ్బు దొరికితే తీరిపోయే రకం! మిగతా వాటిగురించి ఆలోచించే తీరిక కూడా ఉండదేమో వాళ్ళకి!
    కానీ-
    ఈ డబ్బున్నవాళ్ళ 'కష్టాలు' వుంటాయే, అవి చాలావరకూ తీరి కూర్చుని తెచ్చి పెట్టుకునే రకాలే! తీర్చడం కష్టం!
    'అరుణా! అరుణా! అంటున్నాడు సూరజ్. వెక్కిళ్ళతో అతని వీపు ఎగిరెగిరి పడుతోంది.
    తాగకుండానే తాగినావ్వాడిలా చేష్టలు చేస్తున్న సూరజ్ ని చూసి అనుకున్నాడు వాంగ్.
    'చీమ కష్టాలు చీమవీ - ప్రేమ కష్టాలు ప్రేమవీను! బహుశా ఈ కుర్రాడి కష్టాలు 'ప్రేమ' బాపతే అయి వుండవచ్చును.'
    వాంగ్ కి ఇంకో విషయం కూడా గుర్తు వచ్చింది.
    తను ఇంతకుముందు తన మాతృదేశమైన చైనాలో నాన్ జింగ్ అనే వూళ్ళోని ఒక హోటల్లో పనిచేసి వచ్చాడు.
    దానిపేరు 'శాడ్ కేఫ్' అంటే 'దుఃఖం హోటలు'.
    అది భగ్న ప్రేమికులకి భలే అనుకూలంగా వుండేలా ప్రత్యేకంగా పెట్టిన హోటలన్నమాట!
    ఆ హోటల్ లోపల విషాద సంగీతం వినబడుతూ వుంటుంది. విస్కీలో నీళ్ళకి బదులు కన్నీళ్ళు కలుపుకుని తాగే వీలు.
    కన్నీళ్ళు ఓ పట్టాన రానివాళ్ళ కోసం  ఇంకో వెసులుబాటు వుంది.
    కొరికితే చాలు కళ్ళెంబడి నీళ్ళు ప్రవాహంలా కారిపోయే కారపు మిరపకాయలూ, వాసన చూస్తేనే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసే ఉల్లిపాయలూ సప్లయ్ చేస్తారు. మెంథాల్ డ్రాప్సు ఇస్తారు. తడిసిపోతున్న కళ్ళు తుడుచుకోవడానికి కర్చీపులు ఇస్తారు. ప్రియురాలి మీద పట్టరానంత కోపంతో వున్నవాళ్ళకి విరగ్గొట్టడానికి వీలుగా వుండే బొమ్మలు ఇస్తారు. గంటకి ఆరు డాలర్లు. అంటే మూడొందల రూపాయలు ఛార్జ్ చేసే ఆ కేఫ్ చాలా పాపులర్!
    భగ్న ప్రేమికులకి!
    వాంగ్ అనుకున్నాడు.
    'ఇతనికి మిరపకాయలూ, మెంథాల్ డ్రాప్సూ లాంటివాటి అవసరం లేనేలేనట్లుగా వుంది. ఏకధాటీగా ఏడ్చేస్తున్నాడు' అని.
    పావుగంట తర్వాత-
    కాస్త తేరుకున్న సూరజ్ అన్నివైపులా దృష్టి సారించాడు.
    ఒకవైపున గాంబ్లింగ్ హాల్సు వున్నాయి. బ్లాక్ జాక్ లాంటి ఆటలు సాగిపోతున్నాయి.
    ఇట్లాంటి కేసినోలలోనే కదా పాపం హాలీవుడ్ హీరో ఒమర్ షెరీఫ్ డబ్బూ, పరువూ రెండూ పోగొట్టుకుని పూర్తిగా దివాలా తీసిందీ!
    హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లుగా సెల్ ఫోన్ తీశాడు సూరజ్.
    అది అతి ఖరీదైన 'వెట్రూ' సెల్ ఫోన్! మూడు లక్షల పైమాటే!
    'ఎంత ఖరీదయితే మాత్రం ఏం లాభం, ఇది అరుణ చేత మాట్లాడించగలదా?' అనుకున్నాడు సూరజ్. డబ్బు కొన్ని పనులు చేయగలదు. చాలా పనులు చేయలేదు కూడా!
    భావన నెంబరు డయల్ చేశాడు.
    రెస్పాన్సు లేదు.
    ఏమయిపోయింది భావన? దాదాపు పదిరోజుల నుంచి పత్తా లేదు!
    మళ్ళీ నెంబర్లు కలిపి, లేట్ లతీఫ్ కి రింగ్ చేశాడు.
    "లతీఫ్?"
    సూరజ్ గొంతు గుర్తుపట్టిన లతీఫ్ "అరె ఏమిరా! యాడ వున్నావురా? ఎట్లున్నావ్?" అన్నాడు ఆనందంగా. అతను సరదాగా మాట్లాడేటప్పుడు యాసగా మాట్లాడతాడు. సీరియస్ గా మాట్లాడేటప్పుడు పుస్తకాలలో నుంచి చదివినట్లు మాట్లాడతాడు.
    "లాస్ వేగాస్ - సీజర్స్ పాలెస్" అన్నాడు సూరజ్ క్లుప్తంగా.
    "అరె! కేసినోలకి ఎందుకెళ్తున్నావ్ రా బిడ్డా?"
    "ఆడడానికి కాదు - చూడడానికి"
    "ఏం చూసినవ్?"
    "ఇది సీజర్స్ పాలెస్ కదరా? ఇక్కడికి వచ్చీరాగానే నా కళ్ళముందు అలనాటి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్, అతని ప్రేయసి, ఈజిప్టుకి రాణీ అయిన క్లియోపాత్రా కనబడినట్లయింది."
    "అరె తౌబా! తౌబా! నీ ప్రేమ పిచ్చి ఇంకా తగ్గలేదా బే?" అన్నాడు లతీఫ్ చిరాగ్గా.
    "ఈ ప్రపంచమంతా ప్రేమ మయమేరా లతీఫ్" అన్నాడు సూరజ్.
    "లండన్ వెళ్ళానా - అక్కడ మధ్యయుగాల మహారాణి క్వీన్ ఎలిజబెత్,సర్ వాల్టర్ స్కాట్ ల ప్రేమాయణం గుర్తు వచ్చింది. ప్రేమ సింహాసనాన్ని అధిష్టించడం కోసం రవి అస్తమించని బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్నే ఎడంకాలితో తన్నేసిన ఒక రారాజు రొమాన్సు గుర్తు వచ్చింది. రోమ్ నగరానికి వెళ్తే అక్కడ ప్రేమకోసం పసి వయసులోనే ప్రాణాలు వదిలేసిన రోమియో జూలియట్ ల కథ గుర్తొచ్చింది. సరే - ఇక్కడ ఈ సీజర్స్ పాలెస్ లో - చెప్పానుగా - సీజర్ క్లియోపాత్రా...
    కొద్దిక్షణాలు మౌనంగా వున్నాడు లతీఫ్. ఆ తర్వాత అన్నాడు.
    "అయితే చాలా బిజీగా వున్నావన్నమాట! మరి ఇక్కడ నేనేం చేస్తున్నానో అడగవేం?"
    "ఏం చేస్తున్నావ్!" అన్నాడు సూరజ్, పెద్దగా ఇంట్రెస్టు లేకుండానే.
    "నా లాప్ టాప్ కంప్యూటరు ముందు పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నా!"
    "మీరందరూ అదృష్టవంతులురా! ఏ చీకూ చింతా లేదు" అన్నాడు సూరజ్.
    "ఉండు! ముందు నేను చెప్పదలుచుకున్నది చెప్పనియ్! రేయ్! మొట్టమొదట్లో కంప్యూటరు అనేది ఎంత పెద్దదిగా వుండేదో తెలుసా?"
    సాఫ్ట్ వేర్ ఇంజనీరయిన సూరజ్ కి తెలియకేం! కానీ అతను మౌనంగా వుండిపోతే, లతీఫే చెప్పాడు.
    "మొట్టమొదటి కంప్యూటర్ ముప్ఫయ్ టన్నుల బరువు వుండేదని నీకు తెలిసే వుంటుంది. ఒక వెయ్యీ ఎనిమిది వందల చదరపు అడుగుల స్థలం ఆక్రమించేది. ఆరువేల స్విచ్ లు వేస్తూ ఆర్పుతూ దాన్ని నడిపించవలసి వచ్చేది.
    మరి ఇవాళ నేను నా ఒళ్ళో పెట్టుకుని పనిచేస్తున్న ఈ లాప్ టాప్ కంప్యూటరు బ్రీఫ్ కేసులో నాలుగో భాగం మాత్రమే వుంటుందిరా! రేయ్ సూరజ్! మనిషి కూడా అంతే! అనవసరమైన బరువు వదుల్చుకుంటేనే మనం ముందుకి సాగేది. వదిలించుకోవలసిన వాటిల్లో ఈ 'భగ్నప్రేమ' అనే భారం కూడా ఒకటిరా!"
    మాట్లాడకుండా వింటున్నాడు సూరజ్.
    "చాలా సీరియస్ గా ఉన్నట్లున్నావ్ బేటా - నాలుగు జోకులు చెప్పి నవ్వించనా?" అని సూరజ్ సమాధానం కోసం ఎదురుచూడకుండానే చెప్పడం మొదలుపెట్టాడు లతీఫ్.
    "బ్యాచిలర్ అంటే ఎవరో తెలుసునా? పొద్దున్న లేవగానే మంచంమీంచి ఎటువైపు నుంచి అయినా సరే దిగగలిగేవాడుట! ఎందుకంటే, మరి పక్కన పెళ్ళాం వుండదుకదా! అందుకనే ఆ వీలు! నువ్వెప్పుడూ బ్యాచిలర్ గానే వుండిపోదల్చుకున్నావా బిడ్డా?
    లతీఫే మళ్ళీ అన్నాడు.
    "నీ వ్యక్తిత్వంలో ఏం చూసి ఆ అరుణ - అరుణ కాకపోతే మరే అమ్మాయి అయినా సరే - నిన్ను ప్రేమించాలి? నీది కేవలం ఒక ఫెయిల్యూర్ స్టోరీ కాదు - యూ ఆర్ ఏ డిసాస్టర్! ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో, అదీ వజ్రాల వర్తకుల కుటుంబంలో పుట్టావ్! వజ్రాల గనిలాగా ఎంత త్రవ్వినా తరగనంత విజ్ఞానం వుంది నీలో! అయినా ఆ లైనులోకి వెళ్ళలేకపోయావ్! మీ అమ్మకి అమెరికా గ్లామరు! ఇరుగింటి పొరుగింటి పిల్లలందరూ ఇంజినీర్లయి అమెరికాకి ఎగిరెళ్ళిపోతుంటే తను కూడా వంతుకి గంతేస్తూ నిన్ను కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివించింది. అటు తండ్రి వ్యాపారమూ నీకు నచ్చలేదు. ఇటు తల్లి చూపించిన దారీ నచ్చలేదు. నువ్వు మెచ్చిన అమ్మాయికేమో నువ్వే నచ్చలేదు!"
    ఇంకా చెబుతూనే వున్నాడు లతీఫ్.
    "అరుణగానీ, లేదా మరో అమ్మాయిగానీ, మరో అమ్మాయిగానీ నిన్ను ఇష్టపడాలంటే ఒకటే పద్ధతి. బతుకుమీద ఇష్టం లేకుండా బతికేయకు బ్రదర్! నీకు నిజంగా ఏది కావాలో తేల్చుకో! దొరకనిదాని వెంటపడి దారి తప్పకు!"
    సూరజ్ కి అనిపించింది.
    భావన తనకి మంచి చేస్తున్నానానుకుని తనని మరింత మరింతగా అరుణవైపు తోసేసింది.
    ఈ లతీఫేమో, మెల్లిమెల్లిగా తనని అరుణని దూరం చేసే దారి చూపిద్దామని చూస్తున్నాడు.
    వెంటనే అనేశాడు సూరజ్.
    "లతీఫ్! నువ్వు కూడా అమెరికా వచ్చేయరాదూ? ఇద్దరం కలిసి ఏదైనా సాధిద్దాం!"
    చాలాకాలం తర్వాత లేని ఉత్సాహం తెచ్చుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం అప్రయత్నంగానే చేశాడు సూరజ్.
    "ఆ సాధించేదేదో అక్కడ అమెరికాలోనే సాధించాలా ఏమిటీ? రత్నగర్భరా నా దేశం! ఈ దేశాన్ని వదిలి రాదు ఈ దేహం!" అని చెప్పి, ఫోన్ లోనే చిన్నగా ఒక పాత సినిమా పాట హమ్ చేశాడు లతీఫ్.
    "జీనా యహా - మర్ నా యహా -
    ఇస్ కే సివా - జానా కహా ?"
    పుట్టింది ఇక్కడే - గిట్టేది ఇక్కడే - ఇది వదిలి వెళ్ళేది ఎక్కడికీ?
    "ఈ దేశపు ప్రజల డబ్బుతో, ఇక్కడి స్కాలర్ షిప్పులతో చదివాను. అక్కడికి వచ్చి వూడిగం చేయమంటావా - నాకు ఇష్టం లేదు. బెస్టాఫ్ లక్ బ్రదర్!" అని చెప్పేసి ఫోన్ డిస్ కనెక్ట్ చేసేశాడు లతీఫ్.
    షాక్ తగిలినవాడిలా నిటారుగా కూర్చుండిపోయాడు సూరజ్. నిజమే! తనకి అటు తరతరాలుగా వస్తున్న వజ్రాల వ్యాపారమూ నచ్చలేదు.
    ఇటు ఈ కంప్యూటర్ ఇంజనీరుగా ఉద్యోగాలూ నచ్చలేదు.
    అమ్మకి అది ఎంత గ్లామరస్ గా కనబడినా కూడా! ఇష్టం లేకుండానే ఇక్కడ అమెరికాలో ఉద్యోగానికి రావడం అనేది-
    కేవలం అరుణకి దూరమైపోవాలనే ఆలోచనతోనే కదా ఇండియాకి కూడా దూరమైపోవడం?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS