Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 36


                             జపాను

    రామచంద్రారావులికిపడి వెనుదిరిగి చూచెను. జపానులో రసవిహారుని గృహమునందు దనకు స్నేహితుడై ఆ యోడలోనే అమెరికా పోవుచున్న సర్దారు అర్జునసింగుగారును, చెంతనొక యమెరికా దేశీయుడును, ఒక అమెరికా బాలికయును నిలిచియున్నారు.
    'అయ్యా! ఈ బాలుడు మా హిందూదేశములో దక్షిణాపథమందున్న ఆంధ్రదేశస్థుడు. ఉత్తమ బ్రాహ్మణుడు. బుద్ధవరపు రామచంద్రరావు. మీ దేశము చదువునకు వచ్చుచున్నాడు. రామచంద్రరావ్ జీ! వీరు న్యూయార్క్ పట్టణ వాసస్థులు. రౌనాల్డుసన్ గారు. సుప్రసిద్ధ డాక్టర్లు, వడ్డీ వ్యాపారస్తులును, అనేక కంపెనీలలో పెద్ద షేర్లున్న వారునుకూడ వీరికి దాసానుదాసులు. ఆమె వారి తనయ, ఆమె బి.ఏ. ఆనర్సు హార్వర్డులో జదువుచున్న లియోనారాకన్య.'
    డా.రౌనా: రామచంద్రరావుగారు! మాకు మిమ్మును చూడడం చాలా సంతోషం.
    లియో: నమస్కారములు రామచంద్రరావు గారూ!
    రామచంద్రునకు జాల సిగ్గువేసినది. పరదేశయాత్ర ప్రారంభించినది మొదలు రామచంద్రుడు విదేశీయులతో ననవసర సంభాషణ నెన్నడు చేయలేదు. ఇంగ్లీషు భాష తప్ప మరే విదేశీయ భాషయు రామచంద్రునికి రాదు. పెద్దవారితో జనువుగా మాట్లాడుట చిన్నతనము నుండియు నెరుంగడు. తండ్రికడ కూడా భయభక్తులతో సంచరించువాడు. కాబట్టి రామచంద్రుడు నమస్కారమని మిన్నక నిలిచెను.
    అర్జున సింగ్: రామచంద్రరావుగారు మెత్తని హృదయము కలవాడు. మా దేశములో గొంచెము తలయెత్తుకొని తిరుగు కుటుంబములోనివాడు. అమెరికా దేశము నందు జ్ఞానము సరస్సులు కట్టియున్నదని యాయన నమ్మకము. ఆ జ్ఞానము మనసార గ్రోలవలెనని తలంపు.
    డా.రౌనా: రామచంద్రరావు గారూ! బ్రాహ్మిన్సు మీదేశం వదలి వెళితే నరకములో పడతారట కదా! మీరేల వచ్చారు?
    రామ: ఇప్పుడంత పట్టింపులు లేవండి.
    లియో: కులము తేడాలు పుట్టుకతోనే వుంటాయట కదూ? వారు వీరిని, వీరు వారిని వివాహము చేసుకోకూడదట, భోజన ప్రతిభోజనము లుండవట?
    రామ: అవునండి. మ... మ...
    డా.రౌనా: మీ సిక్కులు గూడా హిందువులేనా అర్జునసింగుగారూ?
    అర్జున: హిందూదేశములో వున్న క్రైస్తవులూ హిందులే.
    లియో: ఎలాగు?
    అర్జున: అమెరికా దేశములో జ్యూమతస్థులున్నారు. మహమ్మదీయులున్నారు. బౌద్దులున్నారు. వీరందరూ అమెరికన్లే. హిందూదేశములోని వారంతా హైందవులు.
    డా.రౌనా: (నవ్వుచు) అలాగా! అయితే క్రైస్తవులూ, మీరూ హిందూ మతస్థులు కారన్నమాట.
    అర్జున: మా మతం సర్వమత సమ్మతము. అన్ని మతాలను తల్లివలె హిందూమతం కడుపులో పెట్టుకుంటుంది. హిందూమతంలో ఉన్న లోటును తీర్చడమునకు శ్రీ నానక్ సింగ్ గురుమహారాజ్ సిక్కుమతము ఉద్భవింపజేశారు. కాబట్టి సంఘసంస్కరణ రూపమైనది మా మతం. అలాంటి అంతర్మతలే బౌద్ధ జైనమతములును, ఇప్పటి బ్రాహ్మసమాజము, ఆర్యసమాజము, సత్సంగసమాజము మొదలైనవన్నీ.  
    లియో: ఈ సంఘ సంస్కరణ మతాలలో బ్రాహ్మణులున్నారా?
    అర్జున: లేరు. ఈ మతాల్లో చేరిన వారికి వర్ణ భేదము ఉండదు.
    డా.రౌనా: ఒక సంఘము వారికీ ఇంకో సంఘంవారికీ వివాహాలున్నవా?
    అర్జున: లేవు. కాని ఏ పిల్లనైనా వారు చేసుకొనుట కభ్యంతర పెట్టరు. దానిని బట్టి వెలితప్పులేదు.
    లియో: ఆంధ్రదేశం అన్నారు. అదేమిటి?
    అర్జున: హిందూదేశములో పదిహేనో పదహారో పెద్ద భాషలున్నవి. అందులో అంధ్రభాష లేక తెలుగుభాష ఒకటి. ఆ భాష మాట్లాడే జనులు మూడుకోట్లపైన ఉన్నారు.
    లియో: అమెరికాలో ఏమి చదువుకొనుటకు వచ్చుచున్నారండి రామచంద్రరావు గారూ?
    "రామ: ఆఁ... ఉఁ... లెక్కలండి.
    లియో: ఏ విశ్వవిద్యాలయములో?
    రామ: జపానులో స్నేహితులు యేల్ విశ్వవిద్యాలయములోనో లేక హార్వర్డులోనో చేరమన్నారు.
    లియో: మీ దగ్గిర సిఫారసు ఉత్తరాలున్నాయా?
    రామ: నాలుగైదున్నాయండి.
    లియో: హార్వర్డులో చేరండి. నేను ఎమ్.ఏ.చదువుచున్నాను. విద్యుచ్చక్తి అభిమానశాస్త్రంగా. తర్వాత అమెరికాకు శాస్త్ర పరిశోధనములో తండ్రి, మహావిద్వాంసుడు, విద్యుచ్చక్తిచే వూడిగం చేయిస్తున్న మంత్రవేత్త థామస్ ఎడిసన్ గారి విద్యుచ్చక్తి కర్మాగారాలలో కృషి చేయవలెననియూహ.
    రామ: అలాగాండి. హార్వర్డు బాగుంటే అక్కడే చేరతాను.
    డా.రౌనా: మీ దేశంలో వైద్యసహాయం చాలా తక్కువట కదా?
    అర్జున: అవునండి. మీ మిషనరీలు మా దేశ దౌర్భాగ్యములన్నీ గ్రంథములలో వ్రాసినారు. పాపం మిషనరీలే లేకపోతే మాదేశం ఈపాటికి నీగ్రో దేశంవలె అయిపోయుయుండును.
    రామచంద్రుని వినయ సంపదయు జ్ఞానసముపార్జనా తీవ్రోత్కంఠయు డాక్టరు రౌనాల్డుసన్ గారి హృదయమును జూరగొన్నది. రామచంద్రుడు చక్కని ఇంగ్లీషు భాషలో తన దేశస్థులు, తన మతము, తన దేశములోని రాజకీయాందోళన, గాంధీగారి వర్తమాన కార్యక్రమము మొదలైనవానిని గూర్చి ఆయనకు దెలిపినాడు. గాంధీ మహాత్ముని యుపదేశములు ప్రజా సామాన్యమునకు బాగుగా నచ్చినవనియు, నుద్యోగ వాంఛాపరులగు విద్యాధికులకు మాత్రము పదవులపై నాశ వదలలేదనియు తెలిపినాడు.
    డాక్టరు రోనాల్డుసన్ అమెరికాకు ప్రథమమున వలసపోయిన పిలిగ్రిం ఫాదర్సు (యాత్రిక వృద్ధులు) సంతతివాడు. 'నీలిరక్తము' (అచ్చరక్తము) ప్రవహించు ఉత్తమకుటుంబములోనివాడు. కష్టపడి చదువుకొని అమెరికాలోని గొప్ప వైద్యులలో నొకడై భాగ్యవంతుడై గౌరవము సంపాదించుకొన్నాడు. సహృదయుడు, నీగ్రోల బానిసత్వము సంపూర్ణ నాశనము చేయవలెనని వాదించు నానుష్టానిక క్రైస్తవుడు. క్రైస్తవ మతము చర్చిమతమైనదనియు, యేసుక్రీస్తు బోధించిన మతము మహోత్కృష్టమైనదనియు అందలి పరమార్ధమును గ్రహించినవారు కొలదిమందియే యనియు రౌనాల్డుసన్ వాదించును. హోల్మ్సు మతగురువు బోధ రౌనాల్డుసన్ మహాశయునకు పూర్తిగా నచ్చినది. అన్ని శక్తులలో బ్రేమశక్తి దొడ్డది. ప్రేమయే భగవత్స్వరూపము. సూర్యుడు మంచును కరగించునట్లు, ప్రేమ పాషాణ హృదయమునైన ద్రవింపజేయును. ప్రేమ జగమును వెలిగించు దివ్యజ్యోతి. ప్రేమలేనివాడే క్రోధము. హింస, స్వలాభము, మాయ, అహంభావము, అసత్యము విజృంభించును. లోకమునందలి యుద్ధములు, దొంగతనములు, వర్తక కౌటిల్యము మొదలగు దుర్గుణములకు గారణము ప్రేమలేనియే యని యాయన స్నేహితులతో వాదించుచుండును.
    పరదేశ స్వతంత్రత, యుద్ధ రాహిత్యము, వర్ణభేదవిచ్చేదనము మున్నగు నాశయములతో పనిచేయుట కమెరికా దేశములో నెవ్వరు ప్రయత్నించుచున్నను వారికి రౌనాల్డుసన్ తన చేతనైన సహాయము జేయుచుండును. సన్ డర్ లాండు, హోల్మ్సు, శాసన సభికుడు బోరా మొదలగు వారాయన స్నేహితులు. 'రామచంద్రగారు! అమెరికా దేశ ప్రజలు విచిత్ర భావములు కలవారు. స్వతంత్రతకై ప్రయత్నించు ప్రజలకు జయము గోరుదురు. జయము గాంచినచో మిక్కిలి సంతసించెదరు. కాని ఫిలిప్పైనుదీవులను వారు వదలరు. వారి క్రైస్తవ మతము సర్వదేశముల వ్యాపింప కోట్లకొలది డాలర్లు ఖర్చుచేసెదరు. తమ దేశస్తులకు క్రీస్తు ఉపదేశవాక్యముల నేర్పుటకైనను రాగి డబ్బు ఖర్చుచేయరు. తాము ఆంగ్లదేశముపై శఠించి విడిపోయి స్వతంత్రత సముపార్జించుకొన్నారు. హిందూదేశము స్వతంత్రతకై సర్వస్వము ధారపోయుచుండ, క్రైస్తు అవతారమనదగు మహాత్ముని గూర్చియు, హిందూదేశమును గూర్చియు నీలి వార్తలు ప్రకటించెదరు. కాని ఎన్ని చెప్పినను చదువుకొన్న ప్రతి అమెరికన్ కు హిందూదేశము మాయా సంపూర్ణము, సర్వమతజనని, సర్వకళాశ్రయము, సర్వాద్భుత నిలయము. ప్రతి హిందువుడు కవి, వేదాంతి, భక్తుడు. ఊహా ప్రపంచ సంచారి. కాబట్టియే, ప్రతి ఏట అనేకులు అమెరికన్లు హిందూదేశ యాత్ర గావించెదరు. కోట్లకొలది ధనము ఖర్చు చేసెదరు. క్రిందటి సంవత్సరము నుండియే నేను, మా అమ్మాయి ఆసియాను దర్శించ ప్రారంభించినాము. అదివరకమెరికా ఖండములలోని దేశము లొకసంవత్సరము, యూరోపియను దేశము లొకసంవత్సరము చూచినాము.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS