Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 36

"నిజంగానా?" అన్నాడు అంకుష్.
"నిజంగానే - చెప్పొచ్చేదేమిటంటే - గతంలో ప్రళయం వచ్చిందని అన్ని మతాలూ చెబుతున్నాయి. అనేకసార్లు ప్రళయం వచ్చిందని హిందూమతం చెబుతోంది. అదే ఇప్పుడు సైంటిస్టులు కూడా చెబుతున్నారు."
"అసలు ప్రళయం అంటే ఏమిటీ?" అన్నాడు అంకుష్.
"ప్రళయం అంటే రకరకాల భీభత్సాలు జరిగి, భూకంపాలూ వగైరాలు వచ్చి సముద్రాలు పొంగి, ప్రపంచమంతా జలమయమైపోయి, జీవరాసులన్నీ నశించిపోవడం అని చెప్పుకోవచ్చు."
హఠాత్తుగా మౌనంగా అయిపోయాడు అంకుష్. తర్వాత, నెమ్మదిగా అన్నాడు.
"బ్రదర్! ఇప్పుడింక ఏ సంవత్సరంలోనైనా సరే ప్రళయం వచ్చేస్తుందని చాలామంది చెబుతున్నారు కదా - అది నిజమేనంటావా? నమ్మొచ్చా?"
కొద్ది క్షణాలు ఆలోచించి అన్నాడు సాహస్ -
'మత విశ్వాసాలూ, జ్యోతిష్యాలూ - ఇలాంటివన్నీ పక్కనపెట్టి, కేవలం సైన్సు దృష్టిలో చూసినా కూడా, అతి త్వరలో ప్రళయం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అలా ఉన్నాయి పరిస్థితులు"
"ఏమిటవీ?" అన్నాడు అంకుష్.
సంతోషంలేని నవ్వు నవ్వాడు సాహస్.
"మనిషి చేతులారా చేసుకుంటున్నదే! ఈ నాగరికత అనేది మనిషి మనుగడకే ఒక ముప్పుగా మారుతోంది గదా!"
"అంటే!" అన్నాడు అంకుష్.
"అంటే ఏముందీ! ఇవాళ కార్లు లేకుండా పనులు జరగడం లేదు. ఎయిర్ కండిషనర్ లూ, వగైరాలు లేకుండా రోజు గడవడం లేదు. ముఖ్యంగా నాగరికత మరీ ముదిరిపోయిన దేశాలలో...వీటివల్ల భూమి చుట్టూ ఆవరించుకుని ఉండే ఓజోన్ పొర దెబ్బతిని పోతుంది.
"ఓజోన్ పొర దెబ్బతింటే ఏం నష్టం?"
"చాలా నష్టం! భూమి చుట్టూ ఆవరించుకుని ఉండే ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్టుగా మనని తాకకుండా ఫిల్టర్ చేస్తూ వుంటుంది. ఇప్పుడు ఓజోన్ కి కంత పడింది - ఆ కాంత రోజు రోజుకీ పెద్దదవుతుంది. ఆ కంతలోనుంచి, ఫిల్టర్ కాని సూర్యుడి కిరణాలు డైరెక్టుగా భూమిని తాకుతాయి. ఫలితంగా వాతావరణం వేడెక్కిపోతుంది. ఆ వేడిమి వల్ల ధృవప్రాంతాలలో వుండే మంచు కరగడం మొదలెడుతుంది. మంచు నీరుగా మారడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల భూభాగం జలమయమై పోతుంది. జననాశనం జరుగుతుంది. అదే ప్రళయం! పురాణాలని పక్కకి పెట్టి సైన్సు దృష్టితో చూసినా కూడా, మనం బ్రహ్మప్రళయానికి అతి దగ్గరలో వున్నాం - అది రేపే కావచ్చు. ఇంకో పదేళ్ళ తర్వాత కావచ్చు - కానీ పరిస్థితులు ప్రళయానికి దారితీసేవిగా వున్నాయి" అన్నాడు సాహస్.
"గాడ్!" అన్నాడు అంకుష్ ఆదుర్దాగా.
అని అంతలోనే గుర్తు వచ్చినట్లు అన్నాడు. "అయితే నోవా తాతగారి నౌక అదేదో కొండ శిఖరం మీద నిలిచిపోయి వుంటుందని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నట్లు ఈ షిప్పు కూడా..." అని సగంలో ఆగిపోయాడు.
"కావచ్చును. ప్రళయం వచ్చినప్పుడు సముద్ర మట్టం ఈ కొండ ఎత్తుకి చేరుకుని ఉండాలి. ఆ టైంలో సముద్రంలో ఉన్న ఈ నౌక ఈ కొండ కొమ్ముకి తగిలి శిథిలమై, ఇక్కడే ఉండిపోయి ఉండాలి" అని ఆగి సాలోచనగా అన్నాడు. "కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పేదాని ప్రకారం, తిరుపతి వెంకటేశ్వర స్వామి వుండే ఏడుకొండలూ కూడా సముద్ర మట్టానికి సమానంగా ఉండేవిట. అంటే సముద్రం ఆ కొండలని తాకేటంత ఎత్తు ఉండేదని అర్థం!"
"ఐసీ!" అని, ఒక్క క్షణం ఆగి అన్నాడు అంకుష్. "ఇంతకాలంగా కొండ కొమ్మున ఉన్న ఈ షిప్పు ఇవాళే ఎందుకు కదిలిందీ?"
"అక్కడేదో బండ అడ్డం ఉండడం వల్ల లంగరు వేసినట్లు అది ఇన్నాళ్ళూ అక్కడ ఆగింది. ఇవాళ ఆ బండ దొర్లింది. నౌక దానితోబాటే కిందకు జారింది. బండ మనం ఉన్న గుహ ద్వారానికి అడ్డం పడింది. దాన్ని మనం లాఘవంగా జరిపాం. బండ జరగగానే, దానితో బాటుగా నౌక తాలూకు శిథిలాలు కూడా జారడం మొదలెట్టాయి. నౌకలో ఒక చోట బంగారు కాసుల కుప్ప వుంది.దానికిందే కంతపడి ఉండాలి. ఆ కంత గుహద్వారం దగ్గరికి రాగానే, సహజంగానే కుప్పలో ఉన్న బంగారు కాసులన్నీ జలజలా గుహలోకి కారిపోయి మన మీద పడ్డాయి. కాసుల రాసులు ఖాళీ కాగానే, కింద వున్న కంత బయట పడింది. అందులో నుంచి మనం ఎక్కి ఈ షిప్పులోకి వచ్చాం!" అన్నాడు.
మళ్ళీ కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండి, తర్వాత ఏదో తట్టినట్లు అన్నాడు అంకుష్.
"మరి...వేల, లక్షల సంవత్సరాల నుంచో, కోట్ల సంవత్సరాల నుంచో అలా కొండ కొమ్ము మీద ఉండి, ఆ షిప్పుని ఆపిన బండ ఇవాళ ఎందుకు జరిగిందీ?
"తరతరాల ఒత్తిడికి పట్టుజారి ఉండవచ్చు" అన్నాడు సాహస్.
"లేదా...నువ్వన్నట్లు ఇది కొత్త ప్రళయానికి నాంది కావచ్చును" అన్నాడు అంకుష్ డల్ గా.
అతను అలా అనగానే -
పక్కనే ఉన్న కలుగులో నుంచి, ఒక ఎలుక తొంగి చూసి, తల ఆడించింది.
మరుక్షణంలో - అది కలుగునుంచి బయటకు వచ్చి, వెర్రెత్తినట్టు పరిగెత్తి పోవడం మొదలెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS