Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 36


    ఒక అందమయిన అబ్బాయి ఎంతో వినయంగా చేతులు జోడించినప్పుడు తనేం చేయాలో తోచలేదామెకు.

 

    అంచేత కొంచెంసేపు తటపటాయించి అన్నది.

 

    "వారికోసం వచ్చారా?"

 

    "అవునండి రమ్మని వారే అన్నారు."

 

    "మరక్కడే నిలబడ్డారే? రండి!"

 

    అంటూ అతన్ని ఆ పక్కగదిలోకి తీసుకెళ్ళింది. సోఫా చూపెడుతూ అన్నది.

 

    "కూచోండి!"

 

    కృష్ణమూర్తి కూర్చున్నాడు! ఆమె చెబుతోంది.

 

    "వారు పనిమీద బజారుకెళ్ళేరు. ఏ క్షణమయినా రావచ్చు!" అని అక్కడినుంచి గబగబా వెళ్ళిపోతూ అనుకుంటోంది.

 

    "కుర్రాడెవరోగాని అందంగా ఉన్నాడు. బాగా చదువుకొన్న వాడివలే కనిపిస్తున్నాడు. అతని వినయం, వందనం చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఏం పనిమీద వచ్చాడో ఏమిటో? పద్మకి ఈడుజోడుగా ఉన్నాడు. అల్లుడంటే ఇట్లాగే ఉండాలి!"

 

    ఆ వేళకి అన్నపూర్ణమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది. క్షణాలమీద కాఫీ ఏర్పాటు పూర్తిచేసింది. పద్మని పిలిచి కాఫీ కప్పు అందిస్తూ అన్నది.

 

    "నాన్నగారికోసం ఎవరో వచ్చారు తీసుకెళ్ళివ్వు"

 

    పద్మ కాఫీ కప్పుతో వెళ్ళబోతూంటే చెప్పింది.

 

    "వీలయితే అతనెవరో ఏమిటో కనుక్కో?"

 

    అంత అవసరమేమిటన్నట్టు పద్మ తల్లి మొహంలోకి చూసింది.

 

    "అసలు నేనే కనుక్కునేదాన్ని! నాకు చదువా? చట్టుబండలా? ఎలా మాట్లాడాలో తెలీక వచ్చేశాను. వెళ్ళెళ్ళు. కాఫీ చల్లారిపోగలదు!" అన్నది తల్లి.

 

    ఇన్నేళ్ళుగా ఆ తల్లి ఏ విషయంలోనూ అంత శ్రద్ధ తీసుకొన్న సందర్భం రానేరాలేదు. అలాంటిది ఇప్పుడెందుకంత హడావిడి పడిపోతుందో పద్మకి అర్ధంకాలేదు.

 

    అర్ధంకాకపోవటం అటుంచి అమ్మ ఆదుర్దా చూసేక తనక్కూడా ఆ మనిషెవరో అర్జంటుగా చూడాలనిపించింది.

 

    అంచేత కాఫీ కప్పుతో గబగబా నడిచింది.

 

    సోఫాలో కూర్చున్న కృష్ణమూర్తిని చూడగానే పద్మ నీరుజారి పోయింది. ఒక పెద్ద నిట్టూర్పు విడిచి అన్నది.

 

    "నువ్వా?"

 

    "ఏం? అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావ్?" అడిగాడు కృష్ణమూర్తి.

 

    "ఎవరో వచ్చారు కాఫీ ఇచ్చి వివరాలు కనుక్కోమని అమ్మ ఖంగారు పడిపోతుంటే-ఎవరో అనుకున్నాను!"

 

    "ఖంగారెందుకు?"

 

    "ఏమో! నాకేం తెలుసు!" అంటూ కాఫీ యిచ్చింది.

 

    కృష్ణమూర్తి కాఫీ తీసుకుంటూ అన్నాడు.

 

    "ఎట్ లాస్ట్-మీ ఇంట్లో నాక్కొంచెం చోటు దొరికింది!"

 

    "అంటే?" ఆశ్చర్యంగా అడిగిందామె.

 

    "మీ బ్రదర్ కి ట్యూషన్ చెప్పమన్నాడు మీ నాన్న?"

 

    "ఓహో! ప్రైవేటు మాస్టారి అవతారమెత్తేవన్నమాట?"

 

    "నీకోసం ఏదో ఒక అవతారం ఎత్తాలిగా?"

 

    "కోరి కష్టాలు తెచ్చుకోడం నీకు సరదాగా ఉంటుందేమో! నీ యిష్టమొచ్చినట్టే కానివ్వు?"

 

    "థేంక్యూ! మన పూర్వ పరిచయం మీ ఇంట్లో తెలీకుండా సహకరించు జరిగే కథ చూస్తుండు. ఇదొక్కటే నా రిక్వెస్టు!"

 

    పద్మ అక్కడ్నుంచి విసుగ్గానే వెళ్ళిపోయింది.

 

    అన్నపూర్ణమ్మ పద్మని అడిగింది.

 

    "ఎవరే అతను?"

 

    "అన్నయ్యకి ప్రైవేటు మాస్టారు!" తేలిగ్గా అనేసింది.

 

    "మాస్టరయితే మాత్రం? ఆ ఠీవి అదీ కలెక్టర్లాగా ఉన్నాడు. ఏ ఊరో?"

 

    "హైదరాబాదు!"

 

    "అదీ అట్లా చెప్పు? అందుకే ఆ దర్జా అతను! ఏం చదువుకొన్నాడో?"

 

    "ఎమ్మెస్సీ!"

 

    "మరి చెప్పవే? పెద్ద చదువే చదివాడు. తల్లిదండ్రులు?"

 

    "ఆ విషయం తెలీదు!"

 

    "అదేమిటే ఇన్ని అడిగినదానివి అదికూడా అడక్కపోయావా?"

 

    "నేనేం అడగలేదు!" అనేసింది విసుగ్గా.

 

    "ఏమిటే విడ్డూరం? అడక్కుండానే అన్ని వివరాలూ అతనే చెప్పేడా?"

 

    అప్పటిగ్గాని పద్మ నోరు జారినట్టు తెలిసిందికాదు. తన తొందరపాటుకి నాలుక్కరుచుకుంది. చేసిన పొరపాటు డబాయింపు ధోరణితో కప్పేసుకోవాలనే ఉద్దేశంతో చిరాకు నటుస్తూ అన్నది.

 

    "అయినా-ఇప్పుడతని గొడవ మనకెందుకు?"

 

    "ఎందుకా? ఎందుకో ఏమిటో ఇప్పుడు నీకేం తెలీదులే. నువ్వు కూడా ఒక ఆడపిల్లకి తల్లివయిన తర్వాతగాని అర్ధంకాదు" అని ఇంకా ఏమిటేమిటో గొణుక్కుంటూ వెళ్ళిపోయిందామె.

 

    అమ్మ మనసులో ఏముందో పద్మకి తెలిసిపోయింది. తెలిసింతర్వాత ఆనందించింది.

 

    బయట కారు శబ్దం వినగానే లక్ష్మీపతి వచ్చి వుంటాడనే ఉద్దేశంతో కృష్ణమూర్తి లేచి నిలబడ్డాడు.

 

    ఆ గదిలోకి లక్ష్మీపతి రాలేదు. సత్యం ఒక్కడే వచ్చాడు.

 

    సత్యాన్ని అక్కడ చూడగానే కృష్ణమూర్తి కలవరపడ్డాడు.

 

    "నాన్నా!" అన్నాడు అకస్మాత్తుగా.

 

    ఆ పిలుపు వినగానే సత్యం ఖంగారుపడ్డాడు. అటూ ఇటూ చూసి అన్నాడు.

 

    "ఇంకా నయం! ఎవరూ విన్నారుకాదు! చూడు కిస్టుడూ-ఈ ఇంట్లో జనానికి మన బంధుత్వం తెలిసిపోతే మొత్తం కథే అడ్డం తిరుగుతుంది. అప్పుడిక నీ ఛాలెంజ్ కి విలువే వుండదు మైండిట్!"

 

    "ఈ లక్ష్మీపతి నీకిదివరకే తెలుసా?" అన్నాడు కృష్ణమూర్తి సంశయంగా...

 

    "తెలుసు వాడూ తెలుసు-వాడి చరిత్రా తెలుసు."

 

    "తెలుసని అప్పుడు నువ్వు చెప్పలేదు"

 

    "చెప్పినా వినిపించుకోని పరిస్థితుల్లో వున్న వాడికి చెప్పేం ప్రయోజనం? ఇక్కడ నువ్వేం డ్రామా ఆడాలనుకుంటున్నావో అది నాకనవసరం. లక్ష్మీపతి నీ మాయలకు పడిపోయే ఆషామాషీ మనిషికాడు. అంచేత మనకున్న షరతులతో ఈ పిల్లతో నీ పెళ్ళికాదు"

 

    "అది చెప్పడానికేనా ఇంత దూరం వచ్చావ్!"

 

    "అంతేకాదు పందెం గెలిచేందుకు నువ్వు అడ్డుదారులు తొక్కకుండా హెచ్చరించడానిక్కూడా వచ్చేను."

 

    "అంటే?"

 

    "ప్రేమ ఎంతపనైనా చేయించగలదు. రా కిస్టుడూ నువ్వు అడ్డుదారులు తొక్కకుండా ఓడిపోయేసమయంలో మన ఒప్పందం గాలి కొదిలేసి-నువ్వు ఫలానా కోటీశ్వరుడి బిడ్డననీ నీ అసలు అడ్రస్సు చెప్పచ్చుగదా!"

 

    "ప్రాణం పోయినా ఆ పరిస్థితి రాదు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS