Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 36


    "మరో విషయం - పెళ్ళి కాగానే ఆ ఫోటోలు అన్ని పత్రికల్లో ప్రింటయ్యే ఏర్పాట్లు చెయ్యాలి. పెళ్ళికి రిజిస్టార్ ఆఫ్ మ్యారేజెస్ ని తప్పకుండా పిలవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది - పెళ్ళి కాగానే నీ మనుమరాలి భర్త ఒక దొంగ, దుష్టుడు, దుర్మార్గుడు, ప్లాట్ ఫారం బాపతు, చదువు సంధ్యలు లేనివాడు అని రుజువు చేసే సాక్ష్యాలు సిద్ధంగా వుంచుకోవాలి. ఒక్కసారి వాటన్నింటిని నాగమ్మగారికి చూపించి ఆమెను పూర్తిగా అప్ సెట్ చేయాలి. ఇవన్నీ మూడు రాత్రులు అంటే, నాయకికి, సామంత్ కి శోభనం జరిగాక అయితే మరింత బాగుంటుంది" అర్జునరావు చెప్పడం ఆపాడు.

 

    అతని క్రూరత్వానికి, అతనిలో దాగున్న కసికీ, అక్కడున్న అందరూ ఓ క్షణం భయపడ్డారు.

 

    కత్తితో పొడిచిన వాళ్ళను, పిస్టల్ తో కాల్చిన వాళ్ళను, హేండ్ గ్రెనేడ్స్ విసిరేవాళ్ళను, వుత్త చేతులతో పీకలు పిసికి చంపేవాళ్ళను కూడా చూసాడు కనకారావు.

 

    కాని, ఇలా అర్జునరావులాంటి కూల్ కిల్లర్ ని అంతవరకు చూడలేదు. అందుకే అతనికి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.

 

    సామంత్ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అర్జునరావు ముందు తననే లేపేస్తాడు. అదీ ఎంతో ప్రశాంతంగా, ఏమాత్రం హైరానా పడకుండా చేయించగలడు.

 

    "పెళ్ళిచూపులు రేపే అరేంజ్ చేయించాలి. అందుకు తగిన మంచి ముహూర్తం కూడా రేపే ఉందని ఆ పూజారి నాగమ్మగారికి చెప్పాలి"

 

    సెక్రటరీ అర్జున్ రావు తన పథకం పట్ల చూపిస్తున్న తెలివితేటలకు విస్తుపోతున్నాడు.

 

    పాపం, చాలా మంచిది నాగమ్మగారు- ఆమె మనుమరాలు అంతే.

 

    ఏ అండా లేని ఆ ఇద్దరు ఆడవాళ్ళను ఎందుకిలా పగబట్టి వెంటాడుతున్నాడు అర్జునరావు...?

 

    ఎన్నో రకాలుగా పగ, ప్రతీకారాల్ని తీర్చుకొనే వాళ్ళను తను చూసాడు గాని- ఇలా మానసికంగా కూడా చంపవచ్చని తెలుసుకోవడం ఇదే తనకు తొలిసారి.

 

    ఎప్పుడు చూసినా క్రీమ్ కలర్ సఫారీ డ్రస్ లో ఎంతో నిశ్చలంగా, ప్రశాంతంగా, పెద్ద మనిషిలా ఉండే అర్జున్ రావుకి ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉందా!

 

    ఎప్పుడూ గట్టిగా అరిచి కూడా ఎరుగని అర్జున్ రావులో ఇంత రాక్షసత్వం దాగుందా?!

 

    సెక్రటరీ ఓ ప్రక్క అర్జున్ రావు చెప్పే సూచనల్ని రాసుకుంటూనే, మరో ప్రక్క ఆలోచిస్తున్నాడు.

 

    "ఈ నా పథకం గురించి తెల్సినవాళ్ళు నలుగురు. మీ ముగ్గురూ ప్లస్ సామంత్. ఇది ఏ మాత్రం లీకయినా ఎవరూ ప్రాణాలతో మిగలరు." నవ్వుతూ అన్నాడు అర్జున్ రావు.

 

    పీటర్ తప్ప మిగతా ఇద్దరూ అతని హెచ్చరికకు ఉలిక్కిపడ్డారు.


                                *    *    *    *


    "ప్రామిస్ చేసిన టైమ్ కి రాలేదు. నేను మీకోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తుంటానో మీకు తెలీదా...?"

 

    మెట్లెక్కుతున్న నరసింహానికి వినిపించిన మాటలివి.

 

    ఆమె మాటలకు అతను గర్వపడ్డాడు.

 

    తన కోసమే- కేవలం తన కోసమే ఆమె, పాపం ఆశగా ఎదురుచూసి ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. ఓ అందమైన ఆడపిల్లను, అందునా పెళ్ళికాని ఆడపిల్లను, నిరీక్షణలో ఉంచగలగడం చాలా గొప్ప విషయం. గొప్ప అదృష్టంగా కూడా - అని తనలో తాను ఫీలవుతూ ఫస్టు ఫ్లోర్ డ్రాయింగ్ హాల్లోకి చేరుకున్నాడు.

 

    "కూర్చోండి..." అని వినిపించాయి మధుమతి మాటలు.

 

    "ఈసారి కూడా బాత్ రూమేనా? ఉన్న ఫళాన వెంటనే బయటకు వచ్చేయకూడదు?"

 

    అతని గొంతులో కైపు తొంగి చూసింది.

 

    "అబ్బా... ఆశ ఈసారి అక్కడ కాదు"

 

    "అయితే వెంటనే వచ్చినా పెద్ద ప్రయోజనం వుండదు... అవునా?"

 

    "ఏమో... మీ అదృష్టం మీద ఆధారపడి వుంటుంది అదంతా"

 

    "వెంటనే రానా...?" ఆమె కంఠంలో మార్దవం తొంగిచూసింది.

 

    "కంగారుపడవద్దు. ఎంతసేపైనా ఉండటానికే వచ్చాను. ఒకసారి వచ్చి తిరిగి వెళితేనే బాధ. పని పూర్తి చేసుకొనే రా..." అన్నాడు నరసింహం అక్కడే వున్న డెబోనెయిర్ మేగ్ జైన్ లోని సెంటర్ స్ప్రైడ్ పోస్టర్ ని కసిగా చూస్తూ.

 

    మరో రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి.

 

    అప్పుడు బయటకు వచ్చింది మధుమతి.

 

    అప్పుడామె నైటీలో వుంది. పలచని నైటీలోంచి ఆమె ఒంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

    "మీరు దురదృష్టవంతులు" అంది మధుమతి అతని ప్రక్కనే కూర్చుంటూ.

 

    అతనామె ఒంపుసొంపులకేసే కసిగా చూస్తూ.

 

    "ఏవిధంగా?" అన్నాడు.

 

    "నేనిప్పుడు బయటకు వచ్చింది డ్రస్సింగ్ రూమ్ లోంచి మీరు వచ్చినప్పుడు నేను నా శారీని వదిలేసి నైటీ వేసుకోబోతున్నాను"

 

    "ఆ...!" అతని కళ్ళలో గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నానన్న భావం తొంగిచూసింది.

 

    "అందుకే అన్నాను- మీరు ఈ రోజు కూడా దురదృష్టవంతులని అవునూ...ఇంతకూ లోపలికెలా వచ్చారు...?"

 

    "నిన్న నువ్విచ్చిన కీ ఉందిగదా? దాంతో వచ్చాను" అన్నాడు పోగొట్టుకున్న అదృష్టం గురించి ఇంకా విచారిస్తూ.

 

    "లంకంత ఇంటిలో నేను ఏమూలో ఉంటాను. మీకు ఇబ్బంది కలగకూడదనే కీ ఇచ్చాను. ఇంతకీ ధైర్యంగానే వస్తున్నారా ఇంటిలోకి?"

 

    "ఆహా... ధైర్యంగానే. నాకేమిటి భయం? ఈ ఇంటి వారసురాలు నన్ను ప్రేమిస్తోంది. నేనెందుకు భయపడాలి?" అన్నాడు ఆమె ఎదవేపు చూస్తూ.

 

    "మీకు శారీరకంగా దూరంగా ఉండడం నాకు ఇప్పుడిప్పుడే కష్టంగా అనిపిస్తోంది"

 

    "మరి... కలిసిపోదామా?" ఆశగా అన్నాడు నరసింహం.

 

    "నాకూ తొందరగానే ఉంది. అయితే చిన్న పని మిగిలిపోయింది."

 

    "ఏమిటది? నాకు చెప్పు. నేను పూర్తి చేస్తాను"

 

    "ఏమీ లేదు - నేను సెంటిమెంటల్. ఈ ఇంటిని మన ప్రేమకు చిహ్నంగా భావిస్తున్నాను. అఫ్ కోర్స్ ఇలాంటి ఇళ్ళు మాకింకా నాలుగు వున్నాయి. అవేవీ ప్రేమ మందిరాల్లా ఉండవు. ఇదొక్కటే అలా ఉంది. అయితే యిందులోనూ చిన్న లోపం వుంది"

 

    "ఏమిటది? తొలగిస్తే పోలా!"

 

    "పోతుంది. కానా పని నేను చేయలేకపోతున్నాను"

 

    "ఏమిటది?" అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS