"గిరజాల జుత్తు, ఛామనచాయ, సుమారు ఐదడుగుల ఎనిమిదంగుళాల ఎత్తులో ఉన్నాడు. ఛీజ్ కాటన్ షర్ట్ జీన్ ఫాంట్ లోకి టక్ చేసుకొని వున్నాడు."
"ముఖం మీద కాని, ఒంటిమీద కాని ప్రత్యేకమయిన గుర్తులేమన్నా ఉన్నాయా?"
సర్కిల్ అడిగాడు.
"ఉంది సార్... అతని ఎడం కన్ను మెల్ల...?" అబూ మాటలు పూర్తవుతూనే తనలో రేగిన ఎగ్జయిట్ మెంట్ ని ఆపుకోలేక పైకే అనేశాడు సర్కిల్ "ఖలీల్" అని.
ఒక్కసారి తిరిగి ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
ఎన్నో రక్తసిక్త సమరాలకు వెన్నెముకగా నిలిచిన అత్యంత ప్రమాదకరమయిన వ్యక్తి-బొంబాయి నగరపు అండర్ వరల్డ్ డాన్.... పోలీసులు సైతం భయపడి వెన్నెముక చూపేంత పలుకుబడి, ప్రభుత్వంపై పట్టు ఉన్న కోటీశ్వరుడు ఖలీల్.
"ఖలీల్...." సాలోచనగా అన్నాడు కమీషనర్.
"పెట్టి కేసనుకుంటే పెద్ద శాల్తీలే బయటకొస్తున్నాయి సార్" అన్నాడు సర్కిల్ నెమ్మదిగా.
ఆ ఆపరేషన్ లో ఖలీల్ హస్తముందని ఎప్పుడయితే ధృవపడిందో కమీషనర్ అటెన్షన్ హఠాత్తుగా రెట్టింపయి పోయింది.
"ఆర్యూ ష్యూర్... అతని ఎడం కన్నుకి మెల్ల వుందా?" కమీషనర్ అబూని రెట్టించాడు.
"ఉంది సార్" స్థిరంగా అన్నాడు అబూ.
"ఖలీల్ ఫోటో" కమీషనర్ ఎస్.ఐ.కేసి చూస్తూ అన్నాడు.
ఎస్.ఐ. హడావిడిగా ప్రక్కగదిలోకి వెళ్ళి రేక్ లోని ఒక ఫైల్ ని బయటకు తీసి ఖలీల్ ఫోటో ఉన్న పేజీని వెతికి తీసుకువచ్చి వినయంగా కమీషనర్ కి చూపించాడు.
"ఈ ఫోటోలోని వ్యక్తి, నువ్వు చూసిన వ్యక్తి ఒకరేనేమో ఐడెంటిఫై చేయి" ఫైల్ ని అబూకి చూపించమన్నట్లు ఎస్.ఐ.కి సంజ్ఞ చేస్తూ అబూని ఉద్దేశించి అన్నాడు కమీషనర్.
ఆ ఫైల్లో ఉన్న ఫోటోని చూస్తూనే ఎగ్జయిట్ మెంట్ కి గురయ్యాడు అబూ.
"అవును సార్ ఇతనే ఇంతకీ ఇతనెవరుసార్?" ఆసక్తిని అణుచుకోలేక అడిగాడు అబూ.
"వివరాలు కావల్సింది మాకు తెల్సుకోవల్సింది మేము. నువ్వు మేం అడిగిన వివరాలు చెప్పేందుకే ప్రయత్నించాలి. తెల్సుకొనేందుకు ప్రయత్నించకు ప్రమాదాల్లో చిక్కుకుంటావు" కమీషనర్ ఒకింత కటువుగా అన్నాడు.
అబూ ఉలిక్కిపడి సర్దుకుంటూ "సారీ సార్" అన్నాడు.
"తరువాతేమయింది?" సర్కిల్ ప్రశ్నించాడు.
"ఓ పదినిమిషాలకు పది పదిహేను వెహికల్స్ వస్తున్న శబ్దం వినిపించి నేను వెనుదిరిగి అంధేరి నుంచి జుహుకేసి సాగివచ్చి మా సాబ్ ఇంటి దగ్గర మలుపు తిరిగే రోడ్ కేసి చూశాను. ముందు ఇద్దరు మోటార్ బైక్స్ మీద, వారి వెనుక ఒక్కొక్కరు, దాని వెనుక మరో పెద్దకారు, దాని వెనుక ఒక వ్యాన్, ఆ వ్యాన్ వెనుక మరొకరు సర్... సర్.... మని దూసుకు వచ్చాయి. చివరగా మరో రెండు బైక్స్ కూడా ఉన్నాయి. ఎవరంత సెక్యూరిటీతో వెళుతున్నారని నేను ఆశ్చర్యపోతున్నంతలో గన్ పేలిన శబ్దం వినిపించింది. నేను ఉలిక్కిపడి గేటులోపలకు అడుగేసి మామిడిచెట్టుకేసి చూస్తున్నంతలో అతని చేతిలోని గన్ మరోసారి పేలింది. నాకు భయంతో చెమటలు పట్టేశాయి. ఆ మరుక్షణం ఆ 'జె' అనే వ్యక్తి ఆ చెట్టుకి తను కట్టుకున్న రోప్ ద్వారా సర్రున క్రిందకు జారి తన సామాన్లు తీసుకొని చిరుతపులిలా గేట్ కేసి పరిగెత్తుకొచ్చి చటుక్కున అప్పటివరకూ మా గేట్ కి అవతల ఆగివున్న జీప్ ఎక్కేశాడు. అది మరుక్షణం జుహూ బీచ్ కేసి దూసుకుపోయింది. అప్పుడనుకున్నాను. ఆ జీప్ ట్రబుల్ వచ్చి ఆగింది కాదని, ఇతన్ని ఎక్కించుకొని వెళ్ళేందుకు ఆగిందని" అబూ తన కళ్ళ ముందు జరిగిన దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పాడు.
మరలా కొన్ని క్షణాల నిశ్శబ్దం ఆ గదిలో పర్చుకుంది.
సి.ఐ., ఎస్.ఐ., కానిస్టేబుల్స్, కమీషనర్ ఆర్దర్సు కోసం ఎదురుచూస్తున్నారు.
తను పీకలవరకు ఈ ఇష్యూలో ఇరుక్కుపోయానా అని అబూ భయపడుతూ దిక్కులు చూస్తున్నాడు.
"ఇక నువ్వు వెళ్ళవచ్చు అబూ మేం ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వచ్చేందుకు సిద్దంగా ఉండాలి. నీ అడ్రస్ ఇచ్చివెళ్ళు. వెళ్ళే ముందు ఒకటి గుర్తుంచుకో ఈ విషయాలు కనీసం మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియపర్చటం ప్రమాదకరమని గుర్తు పెట్టుకో" అన్నాడు కమీషనర్ ఆ గదికున్న విండోలోంచి బయటకు చూస్తూ.
అబూ లేచాడు.
"సార్... ఇవన్నీ మీకు చెప్పానని వాళ్ళేమన్నా..." సందేహంగా ఆగిపోయాడు అబూ.
"మిస్టర్ సి.ఐ. నమ్మకస్తులయిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని మఫ్టీలో అబూ కుటుంబ సభ్యులకు ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెయ్" అన్నాడు కమీషనర్.
తన అడ్రస్ ఇచ్చి అబూ వెళ్ళిపోయాడు.
"ఈ విషయాలేమీ మన రికార్డ్సులోకి ఎక్కకూడదు. బయటకు పొక్కకూడదు. లేదంటే మీరుకూడా ఇబ్బందుల పాలవుతారు. ఏమీ జరగనట్లే, ఏమీ తెలీనట్లే ప్రవర్తించండి" అంటూ కమీషనర్ బయటకు సాగిపోయాడు వడివడిగా.
సాధారణంగా బొంబాయి నగర పోలీసులపై ఎటువంటి రాజకీయ ప్రభావం వుండదు.
సిద్దేశ్వర్ ఓబరాయ్ నిప్పులాంటి అధికారి. ఎలాంటి రాజకీయ వత్తిడులకు, ప్రలోభాలకు లొంగని, తల్ల ఒగ్గని వీరుడు. తన 25 ఏళ్ళ సర్వీసులో 21సార్లు ట్రాన్స్ ఫర్ లకు గురయ్యాడు.
ఇతని నీతిని, నిజాయితీని భరించలేక రాష్ట్ర ప్రభుత్వం ఇతన్ని కేంద్రానికి బదిలీ చేయాలనుకున్నది గాని ఇఒతని గురించి పూర్తిగా తెల్సిన మహారాష్ట్ర ఐ.జి. రాష్ట్ర ప్రభుత్వపు ఆటల్ని సాగనివ్వలేదు.
