Previous Page Next Page 
వారధి పేజి 36


    "రోజూ చాలా  రాత్రివరకు  నేను ఇక్కడే  చదువుకొంటానండి. హాస్టల్లో పిల్లలు గోలచేస్తూ  చదువుకోనియ్యరు. ఎంత  ప్రయత్నించినా  అక్కడ ఏకాగ్రత  కుదరదు" అన్నాడు  రాజు బిడియపడుతూ.

    "చదువుకోసం వచ్చి  ఉన్న  విద్యార్ధులమధ్య  కుదరని  చదువు ఇక్కడ ఈ రేడియో పాటలు, వచ్చేపోయేవారి  మాటలు, అందమైన అమ్మాయిల  కవ్వింపుల  మధ్య  సాగుతుందా?" వింతగా  అడిగేడు  రంగారావు.

    "చదువుకోవాలని మనం  నిర్ణయం చేసుకొంటే, వీరెవరూ  చేతిలోని పుస్తకాలు లాక్కుని  దాచేయరండీ. హాస్టల్లో అయితే...."

    "ఆఁ. తెలుసులే....తెలుసు. పరీక్షలు  పదిరోజులకి  వస్తాయనగా  నోట్సులు, గైడ్సు ముందరవేసుకుని  ఆ ముక్కున  పెట్టుకొన్నది పేపరు మీద దించి  పాసయే రకం వాళ్ళు చేసే అల్లరి నాకు తెలుసులే. ముందు నించీ  వాళ్ళు చదువుకోరు, ఇంకొకర్ని  చదువుకో నివ్వరు" అన్నాడు రాఘవయ్య.

    'అంతేనండి' అన్నట్లు  చిన్నగా  నవ్వి ఊరుకొన్నాడు  రాజు.

    "సరే....చదువుకో. మరి వస్తాం" అంటూ  రాఘవయ్య  కాలు కదిపి  అంతలోనే  ఏదో ఆలోచన  వచ్చినట్లు  ఆగిపోయేడు.

    "చూడు, వరదరాజూ! ఈ దీపాలముందు  పచ్చికలో  ఈ దోమల్ని  తోలుకొంటూ  ఇక్కడ  చదువుకోకపోతే  మా ఇంటికి  వచ్చేయి. నీకో గది ఏర్పాటుచేస్తాం" అన్నాడు.

    అటువంటి మాట ఆశించని  వరదరాజు  ఏమి చెప్పాలో  తోచక తెల్లబోయి  అతనివైపు  చూసేడు.

    తన మాట  ఆ కుర్రాడికి  అర్ధంకాలేదేమో  అని తిరిగి  చెప్పేడు  రాఘవయ్య.

    "అదేనోయ్, హాస్టల్లో  చదువు సాగకపోతే  మా ఇంట్లో  ఉండి  చదువుకో  అంటున్నాను."

    రాఘవయ్య మాట  రాజుకి అర్ధమయింది. దానికి సమాధానం  ఎలా చెప్పాలా అన్నదే  తోచలేదు.

    "అక్కరలేదండీ. నాకిలా  బాగానే  ఉంది. పరీక్షలు  దగ్గిర పడుతూంటే  అంతా బుద్ధిగా  చదువుకొంటారు. ఇంక  ఇటువంటి  చిక్కు ఉండదు" అన్నాడు రాజు నెమ్మదిగా.

    "సరే....నీ ఇష్టం" అంటూ  దారితీసేడు  రాఘవయ్య.

    "చాలా మంచిపిల్లడులా  ఉన్నాడు" అన్నాడు రంగారావు  దారిలో.

    "మరేం ?" అన్నాడు రాఘవయ్య, మిత్రుని మాట బలపరుస్తూ.

    "నీ కూతురికి  ఇటువంటి  వరుణ్ణి  సంపాదించేవంటే  నీకు కొడుకులు లేని కొరత తీరుతుంది."

    "నీ అభిప్రాయం  నాకు అర్ధమయింది. కాని  ఈ కుర్రాడికి  ఆస్తిపాస్తులు  లేవు. బొత్తిగా  పల్లెటూరి  సంప్రదాయం."

    "ఆస్తి లేకపోతే  నేమోయి? పిల్లడు  మణిపూసలా  ఉన్నాడు. నీకున్న ఆస్తి  నీ కూతురికి చాలదా? ఏ అపాత్రుడి  చేతిలోనో  కూతుర్ని, ఆ ఆస్తిని పెట్టేబదులు, చక్కగా  పిల్లడికి  చదువు చెప్పించి  పిల్లనిస్తే  తీరిపోదూ?" అన్నాడు  రంగారావు.

    "ఓహో, నీ ప్లీడరుబుర్ర  పోనిచ్చుకున్నావు  కాదోయి! మహగొప్ప   సలహా ఇచ్చేవు. ఫీజుకి  రేపు బిల్లు  పంపు" అంటూ  మిత్రుని  భుజం గట్టిగా  చరిచేడు  రాఘవయ్య.

    "ఫీజు  మాటకేంగాని  మెడకోళ్లు  విరిగి  పడ్డాయి  నీ చరుపుతో. డాక్టరు బిల్లు  నీ ఇంటికే  పంపమంటాను" అన్నాడు రంగారావు.

    మరి కాస్తసేపు  ఆ విషయం  గురించే  సావధానంగా  మాట్లాడుకొన్నారు  మిత్రులిద్దరూ.

    భర్తనోట  ఆ మాట విన్నాక  ఏమీ అర్ధంకానట్లు  చూసింది రాజమ్మ. అప్పుడు రాఘవయ్య  రంగారావు చేసిన  హితోపదేశాన్ని  తన వ్యాఖ్యానసహితంగా  భార్యకి  తెలియబరిచేడు.

    అంతా వివరంగా  విన్నాక  అంత తేలిగ్గా  తీసి  పారవేయవలసిన  విషయం  కాదని  రాజమ్మ  గ్రహించింది. అయినా ఆ పిల్లడి పట్ల  కూతురి మనోభావం  ఎలా ఉందో  తెలుసుకోవాలనుకొంది.

    అనూరాధ భోజనం  చేస్తూంటే  రాజువిషయం  తెచ్చి "వరదరాజుకి హాస్టల్లో తిన్నగా చదువు సాగక పార్కులంట  పడి చదువుకొంటున్నాడుట: మన ఇంట్లో  గది ఇస్తాం రమ్మని  మీ నాన్నగారు  చెప్పేరుట" అంది.

    చేతిలోని  ముద్ద  విడిచి, తను విన్నది  నిజమేనా? అన్నట్లు  తల్లి కళ్ళల్లోకి  చూసింది రాధ. ఆ చూపులలో  కూతురి మనసు  చదివేసింది  తల్లి.

    "ఎప్పుడు వస్తాడు?" ఆత్రంగా  ప్రశ్నించింది అనూరాధ.

    "ఇంకా సరిగా తెలియదు. తొందరలోనే. బహుశా  రెండు మూడు రోజుల్లో  రావచ్చు" అంది రాజమ్మ.

    తరవాత  నాలుగు రోజులవరకూ  వరదరాజును  కలుసుకోడం  పడలేదు  రాఘవయ్యకు. అయిదోనాడు  సాయంకాలం  తిరిగి పార్కులోనే  వరదరాజు  కనిపించేడు.

    "రేపు  నీ గదికి కారు పంపుతాను. నీ సామాన్లు  అందులో  పెట్టుకొని  వచ్చేయి. మరేం  మొహమాట పడకు. మా ఇంట్లో  అంతా నీకు  తెలిసినవారిమే కదా!" అన్నాడు రాఘవయ్య.

    "ఇప్పటికి ఇలా జరిగిపోనీండి. మా అన్నయ్యని, వదిన్ని  అడగందే  నేను బస  మార్చలేను" అన్నాడు వరదరాజు  నెమ్మదిగా.

    అతని నిరాకరణతో  వారికి  అతనిపట్ల  ఏర్పడిన  మంచి  భావం  వృద్ధి అయిందే కాని క్షీణించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS