Previous Page Next Page 
వారధి పేజి 35


    అంతవరకూ  చెప్పి  ఆరిపోయిన  పైపు  అంటించుకోవడంలో  నిమగ్నుడయిపోయేడు  రాఘవయ్య.

    తల్లికి  వరదరాజును  పరిచయం చేస్తూ  అతడికి పరీక్షల్లో  వచ్చిన మార్కుల్నికూడా  పరిచయం చేసింది అనూరాధ. ఆ గాలానికి  చక్కగా  తగులుకొంది  రాజమ్మ.

    "చూడబ్బాయి, అప్పుడప్పుడు  వస్తూండు. మా రాధకి  రాని లెక్కలేమైనా  ఉంటే  చెప్పి పెడుదువు  గాని" అంది.

    అనూరాధ  వరదరాజును  వెంటపెట్టుకొని  మేడమీదికి  వెళ్ళగానే  రాజమ్మ  ముందుహాలులో  కూర్చున్న  భర్తదగ్గిరకి  వచ్చింది.

    "పిల్లడు  తెలివైనవాడే, బుద్ధిమంతుడులాగే  ఉన్నాడు, కాని ఆ బట్టలు...."

    "వాళ్ళు వ్యవసాయంమీద  ఆధారపడి  బ్రతుకుతున్న  గ్రామవాసులు  రాజీ! బట్టలకు అంతకన్న  అధికంగా  ఎలా ఖర్చుచెయ్యగలరు?" అన్నాడు రాఘవయ్య.


       
                            *    *    *


    రాఘవయ్య దంపతులదగ్గిర  సెలవు  పుచ్చుకొని  మళ్ళీ  వస్తానని  అనూరాధతో చెప్పి  హాస్టలుకి  వచ్చేక తిరిగి పది పదిహేను రోజులవరకు  వరదరాజుకు  వారింటికి  వెళ్లే  అవకాశం  కలగలేదు. తరుచు రమ్మని  ఆహ్వానించినా  రాజు రాకపోవడం చేత  అతడు చాలా మొహమాటస్థుడనే అభిప్రాయం  ఆ ఇంటివారికి  కలిగింది. అందువల్లనే  రాజు ఎప్పుడైనా  వారింటికి  వెళితే  తమంతట  తాము కల్పించుకొని  ఒకటో అరో  మాట  అనేవారు  రాఘవయ్యా, రాజమ్మా.

    రాజమ్మకి వరదరాజుని  చూసి, అతడితో  మాట్లాడేక  మొదట కలిగిన  అనుమానం  కరిగిపోయింది. పిల్లడు  మర్యాదస్థుడు. పెద్దలపట్ల  గౌరవభావం  కలవాడు  అన్న నిర్ణయానికి  వచ్చింది.

    "ఈ రోజుల్లో  పిల్లలు  ఇటు మాట్లాడుతుంటే  అటుచూస్తారు. ఈ పిల్లడు  అట్లాకాదు. ఏది చెప్పినా  ఎంతో నెమ్మదిగా  వింటాడు. కాదు కూడదని  మాట తోసిపోడు" అంటూ తన మెచ్చుకోలు  అందించింది.

    "అమ్మకి  మంచివాడనిపిస్తే  నిజంగా రాజు మంచి వాడన్న మాటే కదూ, నాన్నా?" అంటూ తల్లిని  గేలి చేసింది  అనూరాధ.

    "ఏమిటే నీ ఆగడం? అక్కడికి  ప్రతివారిలోనూ  తప్పులెన్నడమే నా పని అన్నట్లు!" కూతుర్ని కేకవేసింది  రాజమ్మ.

    ఆ ఇంటికి  వరదరాజు  రాకపోకలు  దగ్గిరయినకొలదీ  ఆ ఇంటి వారికి  అతని పట్ల  మంచి అభిప్రాయమే  నిలిచింది  కాని, వారి నమ్మిక కుంటుపడలేదు. పెద్ద  పరీక్షలు దగ్గిరపడి  వరదరాజు  రావడం  తగ్గించిన నాడు  అనూరాధకు ఏదో వెలితిగానే  అనిపించింది.

    ఒకరోజు  రాజమ్మా, అనూరాధా  బట్టలషాపులోనించి  వస్తూంటే  రాజు దారినే పోతూ  కనిపించేడు.

    "మా ఇంటికి  రావడమే  మానేసేవు" అంటూ  నిలదీసింది  రాధ.

    "పరీక్షలు  దగ్గిరికి  వస్తున్నాయి కదా. మరి చదువుకోవాలి" అన్నాడు రాజు, లేకపోతే  రాకుండా  ఉండగలనా  అన్నట్లు.

    "చదువుకొంటున్నానంటే  నీ చదువు  పాడుచేసుకొని  రమ్మననుకాని  తీరిక  ఉంటే  ఈ ఆదివారంనాడు  ఒకసారి రా. మా చెల్లెలి పిల్లలు వచ్చేరు. అనూరాధ  చెప్పిన  దగ్గిరనుంచి  నిన్ను  చూస్తామంటున్నారు" అంది రాజమ్మ.

    కొత్తవారిని కలుసుకొని  మాటలు  పెంచుకోవాలనే  కోర్కె వరదరాజుకి  లేదు. "అలాగేనండి, అవకాశం  అయితే  వస్తాను" అన్నాడు.

    వరదరాజు  మనసు  తెలుసుకొన్నట్లు  ఆ రోజు  ఇంగ్లీషు  తెచారు ప్రయివేటుక్లాసు  పెట్టేడు. చెప్పేందుకు  కారణంకూడా  దొరికినందుకు  ఆ రోజు  వరదరాజు  వారింటికి  పోలేదు.



                            *    *    *


    రాఘవయ్య  చిన్ననాటి మిత్రుడు  రంగారావు  స్నేహితుణ్ణి  చూసిపోదామని  వచ్చేడు. మిత్రులిద్దరూ  కలిసి  ఆ మాటా, ఈ మాటా  చెప్పుకొంటూ  పార్కులోకి  షికారుగా  వచ్చేరు.

    "ఈ పార్కులోకంటే  మీ తోటలో ఎక్కువ రకాల  మొక్కలు ఉన్నాయి లాగుంది" అన్నాడు రంగారావు  పార్కు కలయజూస్తూ.

    రాఘవయ్య  ఎటో చూస్తూ  మిత్రుడి  మాటకు వెంటనే  జవాబు చెప్పలేదు.

    "ఏమిటలా  చూస్తున్నావు?" తిరిగి రంగారావే  ప్రశ్నించేడు.

    "ఏం లేదు. అక్కడ  కూర్చున్న  కుర్రాడు  తెలిసినవాడే అవునా, కాదా అని చూస్తున్నాను. రా. ఒకసారి  వెళ్ళి పలకరించి  వద్దాం" అన్నాడు  రాఘవయ్య.

    ఎవరో కుర్రాణ్ణి  పలకరించడానికి  కాలు  కదుపు తూంటే  రంగారావు  ఆశ్చర్యపోయేడు.

    "ఎవరేమిటీ, బంధువులా?" అంటూ ప్రశ్నించాడు.

    "కాదు, మా అనూరాధ  మిత్రుడు" అన్నాడు  రాఘవయ్య.

    వరదరాజు  రాఘవయ్యగారిని  చూసి  లేచి  నిలబడ్డాడు.

    "ఏమయ్యా! పరీక్షలు, క్షణం  తీరికలేదంటూ  కబుర్లుచెబుతూ పార్కులవెంట  షికార్లు  కొడుతున్నావా?" మందలిస్తున్న  ధోరణిలో అన్నాడు  రాఘవయ్య.

    ఊరికే  తమాషాకి  అన్నానోయి  అన్నట్లు  అంతలోనే  నవ్వేసేడు.

    "నువ్వు అన్యాయంగా  ఆ పిల్లడిమీద  నిందవేస్తున్నావు. అతని  చేతిలో  పుస్తకం చూడు" అన్నాడు రంగారావు.

    అది పి. యు. సి. ఇంగ్లీషు పుస్తకం. పక్కనున్న నోటు పుస్తకంలో  అవసరమైన  సమాచారాన్ని  వ్రాసుకొంటున్నాడు వరదరాజు.

    "అదేమిటోయి! చక్కని  సాయంకాలం. పార్కులో  కూడా  చదువేనా?" అంటూ  ఆశ్చర్యం వెల్లడించేడు రాఘవయ్య.  
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS