Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 35

రాష్ట్రంలో తమ తమ నియోజకవర్గాలనే కాకుండా అవసరమైన ప్రదేశాలకు కూడా మంత్రులూ, యం.యల్.ఏ.లు సందర్శించి సమస్యల్ని కనుక్కోమని ఆదేశాలు జారీ చేస్తున్నాడు. వెళ్ళినచోటల్లా ఆడది దొరకటమంటే కష్టం.
లోకల్ లీడర్స్ ని తేమంటే తెస్తారు. ఏ కంపెనీ సరుకునో, కాస్తంత క్వాలిటీ వున్నదాన్ని తగిలిస్తారు. అలాకాక ఈ బసంతిని వెంటేసుకు తిరిగితే- సుఖానికి సుఖమూ, క్వాలిటీ క్వాలిటీ దక్కుతాయి. ఆరోగ్యమూ వుంటుంది. ఒకటి-రెండుసార్లు తనకు వి.డి.లు తగిలాయి. పర్సనల్ వైద్యులున్నారు కాబట్టి వెంటనే సప్రెస్ చేయటం జరిగింది.
ఈ బసంతిని పర్మినెంట్ చేసుకుంటే అప్పుడప్పుడూ అవసరాల్లో దగ్గరకొచ్చిన వారిని కాటందినా...ఇది తన క్రింద పర్మినెంట్ ఫిగరయి పోతుంది.
అంబరీషుడికి ఆలోచనలు సాగుతున్నాయి. మరోసారి బసంతి వంక ఫన్నీగా చూసి-
"బసంతీ!" అన్నాడు.
"చెప్పండి సార్!" బసంతి కాస్తంత మెలితిరిగి అంది.
"జీవితంలో ఎవరినైనా ప్రేమించావా?"
"ప్రశ్న గొప్పదే-సమాధానమే నా దగ్గర సరిగ్గాలేదు."
"ఎందుకని?"
"మీ ప్రశ్నలాగే ప్రేమ కూడా గొప్పది కనుక."
"అంటే?"
"అది నాలాంటివారికి అందదు సర్! మనీ మడతల్లో తన అడ్రస్ ను కోల్పోయింది."
"మనీ నా దగ్గరుంది కదా? మా గెస్ట్ హౌస్ లో దొరుకుతుందేమో చూస్తావా?"
"ఇంకా ఈ గెస్ట్ హౌస్ లో అదేం దొరుకుతుంది? మీ శ్రీమతి మొత్తం మూట కట్టుకొని ఇంట్లో దాచుకొని వుంటుందికదా?"
ఆమె అలా అనటంతో అంబరీషుడు పెద్దగా నవ్వాడు. తర్వాత ఆమెకు దగ్గరగా జరిగి-
"అదేంలేదు బసంతీ! ఇంట్లోది ఇంట్లోదే- బయటిది బయటిదే....ఇంట్లోకంటే ఈ గెస్ట్ హౌస్ లోనే అదెక్కువగా వుంది. దాన్ని మొత్తం నువ్వు స్వంతం చేసుకుంటానంటే నేను కాదనను."
అందుకు బసంతి కూడా కిసుక్కుమని నవ్వింది.
అంబరీషుడు ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. బసంతి ముఖంలో మరింత ఆకర్షణ కనపడింది.
అంబరీషుడి శరీరంలో వేడెక్కుతున్న రక్తం....
అతడే మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని గట్టిగా పెదవుల మీద ముద్దుపెట్టుకున్నాడు.
"గెస్ట్ హౌస్ బోయ్ వస్తాడేమో సార్!"
"వస్తే బయటుంటాడు. మనం లోనుంటాం."
"మనం లోనేగా వుంది?"
"లోనంటే- గదిలోకి నీవూ, నీలోకి నేనూ...."
"భలే కొంటెవారే?"
ఆమె అంబరీషుడు చెప్పకుండానే గదిలోకి దారితీసింది.

                      *    *    *    *
ఉదయం అంబరీషుడు నిద్రలేచాడు.
లోక్ సభ రద్దయింది. పేపరు చేతిలోకి తీసుకోగానే ప్రముఖంగా వార్త!
ఎన్నికల కమీషన్ తిరిగి ఎన్నికల తేదీని కూడా ప్రకటించింది. ముఖ్యమంత్రిగారు ఎవరినీ సిటీలో వుండనిచ్చేట్టులేరు. అందరూ ఏదో ఒక వంకతో బయలుదేరి ఎన్నికల ప్రచారం చేయాల్సిందే! మంచి సమయంలో బసంతి తనకు పి.ఏ.గా చేరింది.
శరీరం వంపూ-సొంపూ_
ఆడదంటే అలా వుండాలి.
ఆయన మనసులో అనుకుంటూ పేపరు తిరగేస్తున్నాడు. ఆయన చూపులు ఆశ్చర్యంగా ఒకచోట ఆగిపోయాయి.
"ఇదో విద్యా యజ్ఞం!"
పేద విద్యార్ధుల పాలిట కల్పవృక్షం.
పైసా ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించి- తెలివిగల పిల్లలకు ఇంటర్ లో కోచింగ్! ప్రభుత్వ మెడికల్- ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు స్వంతం చేసుకునే విద్యా దానం!
అమాత్యులు అంబరీషుడిగారి సతీమణి రుక్మిణిగారు కరస్పాండెంట్ గా- రిటైర్డ్ లెక్చరర్ తిరుమలరావుగారు ప్రిన్సిపాల్ గా- ఆంధ్రప్రదేశ్ లోని వైజ్ఞానిక చంద్రునికి మొదటిసారిగా అందిస్తున ఓ చిన్ని స్వచ్చందమైన నూలుపోగు!
మరిన్ని వివరాలకు ఈ క్రిందివారిని సంప్రదించండి" అంటూ తిరుమలరావు అడ్రస్ ఇవ్వటం జరిగింది.
అంబరీషుడు చదివి మెల్లిగా లేచాడు. ఆయన ముఖంలో ఎన్నడూ చూడని ఆగ్రహం.
"రుక్కూ!" బిగ్గరగా పిలిచాడు.
వంటింటిలో భర్త లేస్తే పెట్టటానికి ఆమె టిఫిన్ కు పిండి రెడీ చేస్తోంది. వంటమనిషికి కొబ్బరి తురిమి పచ్చడి చేయమని పురమాయిస్తోంది.
ఇంతలో భర్త ఆగ్రహంగా పిలిచినా కేక. ఏమయిందో? అనుకుంటూ ఆమె బయటికి వచ్చింది. పత్రికలోని ప్రకటన ఆమె ఇంకా చూడలేదు. తిరుమలరావుకు రెండు లక్షలు మాత్రం అందజేసింది.
పత్రికా ప్రకటన ఎలా వచ్చిందీ, ఆయనే చూపిస్తాడనీ, ఆ తర్వాత స్టెఫ్ ఏమిటనేది వివరిస్తాడనీ ఆమె ఎదురుచూస్తోంది.
"ఎందుకండీ పిలిచారు?"
"ఈ పేపరులోని ప్రకటన చూశావా?"
రుక్మిణి అలాగే నిలుచుండిపోయింది. బహుశా అది మాస్టారుగారు తలపెట్టిన కాలేజి ప్రకటన అయివుంటుంది.
అంబరీషుడే అది తెచ్చి ఆమెకిచ్చాడు.
ఆమె కూడా ఆ ప్రకటన మొత్తం చదివింది.
తర్వాత భర్త వంక ఆ....ఇప్పుడేమయింది అన్నట్టు చూసింది.
"కరస్పాండెంటు అంటే అర్ధం తెలుసా? దానికయ్యే ఖర్చు మొత్తం నీవే భరించాలి. అంతమనీ నీవు ఎక్కడనుండి తెచ్చి అతనికిస్తావ్? నేను వద్దంటున్నా కూడా ఆ విషయాన్ని తిరిగి ఎందుకు కొనసాగిస్తున్నావ్. దానర్ధం నేనన్నా - నా మాటన్నా నీకు లెక్కలేదన్నమాట."
"ఇందులో మిమ్మల్ని లెక్కచేయంది ఏముందండీ?"
"ఏమీలేదా? మరి మనీ ఎక్కడనుండి తెస్తావు? నీ బాబుగాడిసొమ్ము నాకేం ఇవ్వలేదే నీవు....చెంగు నెత్తినేసుకుని మా ఇంటి గుమ్మం తొక్కావు. ఆఫ్టరాల్ ఓ గుమాస్తా కూతురిననే విషయం మర్చిపోయావు."
"నిజమే! ఆ విషయం మర్చిపోయి ఓ మంత్రిగారికి భార్యననే విషయాన్ని మాత్రమే గుర్తుంచుకున్నా. త్వరపడి ఆయనకు మాటిచ్చాను. అది నిలబెట్టుకోకపోతే మంత్రిగారి భార్యగా నా డిగ్నిటీ పోతుందిగా?"
"ఏమిటే వ్యంగ్యం వెలగబెడుతున్నావు? నేనడిగిన ప్రశ్నకు ఇంతవరకూ నువ్వు సమాధానం చెప్పలేదు. అంత మనీ నీవు తిరుమలరావుకు ఎక్కడనుండి తెచ్చిస్తావు?"
"మీరు ఇవ్వనన్నారుకదా! ఎలాగో తంటాలు పడతాను."
"అంటే బయట నా పేరుపయోగించి చందాలడుగుతావా?"
"అడగను."
"బిజినెస్ ఫరమ్స్ నుండి విరాళాలు సేకరిస్తావా?"
"సేకరించను."
"మరి మనీ ఎలా వస్తుంది?"
"ఎలాగో తంటాలు పడతాను."
"నాకు తెలీకుండా."
రుక్మిణి మాట్లాడలేదు.
"ఏం మాట్లాడవు! కోటిరూపాయలు నీవెట్లా సంపాదిస్తావే. ఈ పావని హైటెక్ సిటీలో క్లాసికల్ బ్రోతల్ హౌస్ ఒకటి తెరచి, వాడి కూతురులాంటి వాళ్ళను పదిమందిని నిట్టుకొనినీవు గేటుదగ్గర కూర్చుంటే తప్ప నీకు కోటి-రూపాయలు వచ్చే మార్గంలేదు."
ఆ మాటలతో రుక్మిణి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో రంగులుమారాయి. తన భర్త నుండి అంత లావుమాట వస్తుందని ఆమె కలలోకూడా అనుకోలేదు. తమ సంకల్పాన్ని దీవించి, ప్రోత్సహించి తనకు పిల్లలుకలుగని ఒక లోటు మర్చిపోయేందుకు.....సానుభూతిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఆశపడింది. తరువాత ఆమెకు ఆవేశం_దుఃఖం రెండూ ఒకేసారి పెల్లుబికి అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS