కారు హరన్ వినిపించింది. వసంత లోపలికి వచ్చింది. పైకి వెళ్ళిపోయింది.
తల్లి లేని బిడ్డ అని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచాడు. బహుశా తల్లి పెంపకం లేని లోటే ఆమెను అలా మర్చిందేమో? తను ఆమెకు ఏ లోటూ రాకుండా చూశాడు. కోరింది తెచ్చి యిచ్చాడు. ఆమె పాడింది పాటగా ఆమోదించాడు. స్వాతంత్ర్యాన్నిచ్చి చదువు చెప్పించాడు. అందుకు ప్రతిఫలమీదా? తాను కోరింది యిదేనా? తను ఆశించింది యిదేనా? తనకు కావలసింది యిదా? బిడ్డలను కని పెంచి పెద్ద చేసినందుకు ప్రతిఫలం దుఖమేనా? నలుగురి లో తలవంపులు, పలువురి లో అవమానం. వంశ మర్యాద మట్టిలో గలవవలసిందేనా? ఆశతో తమ బిడ్డలు పెరిగి పెద్దవారై తమకు పేరు తెస్తారని ఆశించే వారికి ఆశలు నిరాశ లేనా? కీర్తీ తేకుంటే పోనీ అపకీర్తీ వద్దు, భగవంతుడా అని ఏడ్చే తల్లి దండ్రుల హృదయాల కు రంపపు కోతనిచ్చే బాధనేనా బిడ్డలు మిగల్చ వలసినది? తల్లితండ్రుల సుఖం మట్టిలో కలిపి, వారి పేరు ప్రతిష్టలను గంగలో కలపదమేనా వారి బాధ్యత? అటువంటి విద్దలు కలుగ కుంటే నేమి? ప్రపంచం మునిగిపోతుందా? లోకం గొడ్డు పోతుందా? ఉన్న బాధలకు తోడుగా వీరు తెచ్చే బాధలను ముసలి తనంలో భరించలేక మనశ్శాంతి కి దూరమై కనీసం చచ్చే టప్పుడైనా సుఖంగా చావలేని ఈ మనుష్యులకు ఇటువంటి బిడ్డలను ఎందుకు ప్రసాదిస్తావు? మమత మమకారాలతో పెంచి పెద్ద చేసి, ప్రేమతో చేరదీసి, విద్యాబుద్దులు చెప్పించి, విజ్ఞానాన్నిచ్చినది వారి నుండి నిర్లక్ష్యతను అసహ్యాన్ని పొందడాని కెనా?
ఆలోచిస్తున్న వారికీ వసంత తిరిగి వెళ్ళిపోవడం వినిపించింది. ఆ క్షణం లో ఆమెను పట్టుకొని ఆ చెంపా ఈ చెంపా వాయించేయా లనుకున్నాడు. కానీ అది చేతనై ఉంటె ఇప్పుడామె ఆ స్థితిలో ఉండేది కాదు; తనకీ గతి పట్టి ఉండేది కాదు.
శేఖరం! తల్లీ, తండ్రీ లేరు. ఎవరూ ఏదీ నేర్పలేదు. చిన్నప్పటి నుండీ అదే వినయం, అదే గౌరవం తన పట్ల చూపుతున్నాడు. మంచి నడవడిక, మంచి గుణాలు, అలవాట్లు, ఇతరులపై దయ, ఇతరుల కష్టాలకు ఆదుకోవడం , ఇతరుల పై సానుభూతి చూపించడం -- ఇవన్నీ ఎవరు నేర్పారు? ఎలా అలవడ్డాయాతనికి ? అనే అందరి బిడ్డలలో నూ ఎందుకు ఉండవు? సుఖం అంటే ఎరుగని జీవి. ధనమే మానవులను చెడి పెస్తుందా? మనిషికి సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ చేడుదారులు, చెడు బుద్దులు వృద్ది పొందుతున్నాయా? అదే కారణమైతే ఎందుకీ దానం? మనిషీ మంచి తనాన్నీ, సహ్రుదయాన్ని అతనికి కాకుండా జేసే ఈ ధనం ఏం చెయ్యను? అది లేనిదే మనిషి జీవించలేడు. అతని ప్రాపు లేనిదే దానికి విలువ లేదు. దాని గుణం తెలిసి ఉండి దాన్ని ఆదరించే మానవుడు గొప్ప వాడా? అతని బలహీనతను గుర్తించి తాను లేనిదే మనిషికి బ్రతుకే లేదని అందరికీ అందక అందరినీ ఆకర్షించే డబ్బు విలువ గొప్పదా? దాన్ని అందుకోలేక పోయిననాడు మనిషికి జీవితమే లేదు. అతని ఆదరణ లేనినాడు ధనమే లేదు. మనిషికి కావలసిన సౌఖర్యాలను ఇచ్చే డబ్బు ప్రతిఫలంగా అతనిలోని మంచి గుణాలను బయటికి గెంటి వేస్తుందా? దానికి లోబడిన వాడు లోకానికి గొప్పవాడై మనసును, మమతను చంపుకొని, పరువు మర్యాదలను అమ్ముకో ప్రయత్నిస్తాడా? అందరూ అంతేనా? ఆఖరుకు దాని వలన మానవుడు పతనం కాక తప్పదా?
25
"రాజూ!"
"ఏమిట్రా అలా వున్నావు? నాన్నగారేమైనా అన్నారా? ప్రొద్దున్నే ఏడుపు మొహం పెట్టుకోమని ఎవరు చెప్పర్రా?"
"రాజూ!" బాధగా పిలిచాడు ఆనంద్ మొహం త్రిప్పేసుకుని. అది చూసి తాను అనవసరంగా వాడినేమో అన్నానే అని బాధపడ్డాడు.
"ఏమిట్రా విషయం?"
"ప్రకాశం చచ్చిపోయాడు."
"ఎవరూ? మీ దూరపు చుట్టమని చెపుతుంటివే అతడేనా? ఎలా? ఎప్పుడూ? ఎందుకు? నిన్న సాయంకాలం మనతో మాట్లాడి పోయాడు కదరా?' ఆత్రుతగా అడిగాడు రాజ్.
'ఆత్మహత్య చేసుకొన్నాడు."
"ఏమిటి? ఆత్మహత్యా?"
"ఔను, ఇది చదువు" అని ఆనంద్ చేతిలోని వార్తా పత్రిక రాజ్ కిచ్చాడు.
రైలు క్రింద పడి ఒక విద్యార్ధి దుర్మరణం.
ఈ దినం ఉదయం 'ఒక విద్యార్ధి హౌరా మెయిల్ క్రింద పడి చచ్చిపోయాడు. ట్రెయిన్ వేగంగా వస్తుండగా రైలు రోడ్డు ప్రక్కనే పోతూ పోతూ హటాత్తుగా పట్టాల పై పడిపోయాడట. పోలీసులు అతని జేబులు వెతికి ఒక చీటిని బయటికి తీశారు. అందులో ఇలా ఉంది.
"జీవితంలో భయపడ్డ నిజం ఎదురైంది. ఆశించకూడదనుకున్న దాన్ని, పరిస్థితులకు బానిసనై పోయి అర్ధం లేకుండా కోరాను. ఆకోరిక ఫలించలేదు. జీవితం పై విసుఫు పుట్టింది. బ్రతకడం నిరర్ధకమని పించింది. అందుకే ఈ లోకాన్ని వదిలి పోతున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు."
క్రింద సంతకముంది.
"ఇదేమిట్రా! నమ్మశక్యం కాకుండా ఉంది. అసలతనికి ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?"
"అదే అర్ధం కావడం లేదు." ఏదో పెద్ద విషయమే అతన్ని బాధించి ఉంటుంది."
"అతని మిత్రులకేవరి కైనా అతని గురించి తెలుసా?"
"ఊహూ. ఎవరి తోనూ ఎక్కువ మాట్లాడాడు. ఒకనెల క్రింద చూశాను. ఆ ఆనందరావు గారి కూతురు వసంత తో ఎక్కువగా తిరుగుతుండడం చూశాను."
"ఎవరూ? వసంత తోనా!" ఆశ్చర్యంగా అనుమానం వచ్చి దిన పత్రిక లోని వార్తను మరొక సారి చదివాడు రాజ్. ఏదో ఊహ అతని మనసులో లీలగా మెదిలింది. అది నిశ్చయించుకోవడానికే బయలుదేరాడు.
హల్లో ఎవరూ లేకపోవడంతో నేరుగా మేడ పైకి పోయాడు రాజ్. గది వాకిట్లో నిలిచి లోపలికి చూశాడు. వసంత తల టేబిల్ పై ఆన్చి చేతులతో తల పట్టుకొని కుర్చీ లో కూర్చొని ఉంది. దీర్ఘాలోచన లోనే ఉందని గ్రహించాడు. పలుకరించాలా, వద్దా అనే సందిగ్ధావస్థ లో పడ్డాడు. అప్పుడే తల ఎత్తి కళ్ళు తుడుచు కొబోయిన వసంత రాజ్ ను చూసింది. గుండె ఝల్లు మంది. "రండి." అంది. రాజ్ కదలకుండా పలుక కుండా ఆమెను పరీక్షించాడు. అతని దృష్టి క్రింద పడి ఉన్న దినపత్రిక మీద పడింది. పూర్తిగా అర్ధం చేసుకొన్నాడు. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. జరిగిన దుర్ఘటన కు కారణం నేనే అని ఆమె చూపులు చెపుతున్నాయి. అది గ్రహించ గలిగితే చాలు ఇంకా ముందు ముందు అంతకన్నా ఎక్కువ మేలు జరగడానికి. కాస్త ఉపశామనాన్నే ఇచ్చిందతనికి ఆమె పరిస్థితి. అమెకా విషయం తెలియదేమో, తెలిసినా లక్ష్య పెట్టదేమో అనుకొన్నాడు. కానీ ఆశించని మంచి పనే జరిగింది. ఇక తనకక్కడ పని లేదనుకొని వెనుదిరిగాడు.
"వెళ్ళిపోతున్నారెం?"
"వచ్చిన పని అయిపొయింది." అన్నాడలాగే.
"ప్రకాశం విషయమా?"
వెనుతిరిగి ఆమె దగ్గరి కొచ్చాడు. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు.
"ఇలా ప్రతి విషయం లో నేను జోక్యం తీసుకోవడం నీకు బాధగా ఉంటుంది. కానీ......"
"లేదు. మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు. ఇంత త్వరగా తెలుసుకుంటారని అనుకోలేదు. మీ రాకే నా అశాంతికి శాంతి."
"సంతోషం. కానీ నా మాటలు కానీ, నేను కానీ నీ పాలిటికి గాయం పై చల్లబడిన కారంలా ఉంటుందన్న విషయం మరిచి పోతున్నావు."
"ఫరావాలేదు. గాయానికి కారం తగిలితే అప్పటికది బాధాకరం గానే ఉన్నా గాయానికి త్వరలో పూర్తిగా మాన్పి వేయడానికే తోడ్పడుతుంది."
"ఫరవాలేదు. కొద్ది కొద్దిగా నేర్చు కుంటున్నావు. నువ్వు కూడా కొన్ని సత్యాలను అలోచించి కనుగొనుంటూన్నావంటే అంతకన్నా సంతోషించవలసినది ఏముంటుంది?" అనుకొన్నాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
"లోకానికి ఈ సత్యం తెలిసిన నాడు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను."
మౌనం వహించింది వసంత.
