Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 35


    'అయితే నాకు తెలీదనా! మీరు నాసి సరుకు ఎందుకు తెస్తారు?' పిన్ని పన్ను ఆనందంతో ఊగిసలాడింది "అయినా ఈ పిచ్చిదానికి కట్టడం వచ్చా ఏమన్నానా? రెండు రోజుల్లో చించేస్తుంది.'
    'నేనుమాత్రం రెండురోజుల్లో దీన్ని సరిచేయనూ!' సుబ్రహ్మణ్యం తల నిక్కించి గర్వంగా అన్నాడు.
    'కొడుకా! ఈ పేద ముసలిదాన్ని మాత్రం మరువకు. చంద్రునిలాంటి వధువును ఇప్పిస్తున్నాను. వాడ వాళ్ళంతా ఆడిపోసుకుంటారు - పదిహేనేళ్ళ పిల్లను యాభైఏండ్ల వాడికి అంటగట్టిందని"
    'సరే-సరే ఇహ వాగకు. రేపు చెక్కుబుక్కు తెచ్చినప్పుడు జ్ఞాపకం చేయి' అనేశాడు సుబ్రహ్మణ్యం అయిష్టంగా.
    'పిన్నీ, చీరలు సుందరానికి కూడా చూపించు' అని సరస్వతి చీరలను నావిఅపు నెట్టింది. సుబ్రహ్మణ్యానికి అది నచ్చలేదు. నేనూ కళవరపడ్డాను. ఏంచేయాలో బోధపడలేదు. ఇదంతా మామూలుగా కనిపించాలని ఒక చిరునవ్వు నవ్వాను. వణికే నా చేతులు చీరలకోసం కదలనేలేదు. సుబ్రహ్మణ్యం చీరలు లాగేశాడు. "ఇస్త్రీ చెడిపోతుంది. మురికి చేతులతో ముట్టవద్దు" అన్నాడు.
    సరస్వతి లేచి వెళ్లిపోయింది. తిరిగి వచ్చేప్పుడు పొరుగింటివారి విరిగిన కుర్చీ తెచ్చింది. కుర్చీ గది మధ్యలో వేసింది. సరిగ్గా నా ముందు కూర్చుంది. పయటికొంగు పంటితో చించుతూంది.
    "కూర్చోండి" అని పిన్ని తన చెంగుతో కుర్చీమీది దుమ్ము దులిపింది. అది సాంతం సుబ్రహ్మణ్యం సూటుమీద సవారి చేసింది.
    "ఉహ్" సుబ్రహ్మణ్యం మరికొంత ఆముదం నాకాడు. దస్తీతో దుమ్ము దులిపాడు. రెండు జేబుల్లో చేతులు పట్టుకొని, తలెత్తి మిడుకుతున్నాడు-ఏదో తన కాళ్లమీద నేల తలకిందులవుతున్నట్లు.
    "అద్దాలు" ఊపిరి బిగపట్టి చూచాడు. సరస్వతి చేతిలో అద్దాలు మెరుస్తున్నాయి- అవి నేను తెచ్చినవి!
    "ఇవేం ముక్కలు?" అతను సరస్వతి చేతిని తన కంటి ముందుకు తీసుకున్నాడు.
    'ఇవి బట్టమీద కుట్టే అద్దాలు. దీనికి నల్లబట్ట కావాలి' వాడి తీవ్ర దృక్కుల్నుచూచి బెదిరి వెనక్కు జరిగింది సరస్వతి.
    'వెధవ అద్దాలు, ఈ పల్లెవేషాలు మానెయ్యి' అతడు సరస్వతి చేతిని నెట్టాడు. అద్దాలన్నీ ఎగిరి నేలమీద పడ్డాయి. నేను వేయి ముక్కలుగా విరిగిపోయాననిపించింది. ఒక్క ముక్క నా తొడమీద పడింది. అందులో సరస్వతి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూంది. ఇవ్వాళ ఆమె ముఖం మల్లెపూలలా లేదు- గులాబి మొగ్గలా ఉంది.
    సరస్వతి తొలగిపోయింది. సుబ్రహ్మణ్యం కనిపించాడు. అతని టై మీద ఉన్న రంగురంగుల పిట్టను గద్ద తన్నుకుపోతూంది. కాలర్ లో ఒక వాడిన ఎర్రగులాబీ మొగ్గ ఉంది. అతని ముక్కు ఎండిన పిడకల వాసన భరించలేకపోయింది. 'అయితే మళ్లీ ఎల్లుండి వస్తా'నని వెళ్ళిపోయాడు.
    అద్దంలోకి పిన్ని వచ్చేసింది. ఉన్న ఒక్క పన్ను ఫిరంగిలా ఉంది. ముఖం చేటంత అయింది. నవ్వడం వల్ల మెడకింద మాంసగ్రంధుల సంఖ్య పెరిగిపోయింది. "పాము చచ్చింది. కర్ర విరగలేదు. రేపు అయిదువందల రూపాయలు అందుతాయి" అన్నది.
    పిన్నికూడా తొలగిపోతే వికారి అయిన ముసలివాడు అద్దంలో మిగిలిపోయాడు. అతని ముఖంమీద బిచ్చగాని ఛాయలున్నాయి. రోడ్డుపక్కన కూర్చున్నాడు. అంతా అతన్ని తప్పుకొని వెళ్తున్నారు. 'క్షమించు బాబా' అని సాగిపోతున్నారు.
    పెళ్ళి ఏర్పాట్లు-బట్టలు కుట్టడం - ఇంటికి వెల్లవేయడం హడావుడిగా ఉంది. సరస్వతి నన్ను స్కూలుకు వెళ్ళనీయలేదు. ఆనందంతో ఆమె గుండె ఉప్పొంగుతూంది. ఎప్పుడూ ఏదోఒకటి మరుస్తూంది. గోరింటాకు కోసం ఉరకమంటుంది. కంసాలి దగ్గరికి పరిగెత్తమంటుంది.
    "నేనంటే నీకెంత ఇష్టం! నాకోసం ఎంత కష్టపడుతున్నావు" అంటుంది. కృతజ్ఞతా దృక్కుల్తో చూస్తుంది. చాలు ఆ చూపుల నీడలో అలసట మరచాను. దుఃఖం మింగేశాను.
    "పిన్నిలా లావెక్కుతానేమోనని భయంగా ఉంది" ఎరుపు చీరమీద పూలుకుడ్తూ అన్నది.
    'ఛ నువ్వెన్నడూ లావు కావు' నేలమీద కూర్చొని తెగిన చెప్పుకు మేకు దిగేస్తూ అన్నాను.
    "పనివాళ్ళే అన్నిపనులూ చేస్తారాయె-రోజంతా నేనేం చేయను?"
    'అబ్బ! ఎంత వేడిగా ఉంది!' అని ముఖంమీది చెమట తుడుచుకున్నాను.
    రెండోరోజు సుబ్రహ్మణ్యం ఉత్తరం తెచ్చాడు నౌకరు. నౌకరు పిన్ని ఇంటి బెల్లపుచాయ్ తాగనన్నాడు. సుబ్రహ్మణ్యం దస్తూరి మహా చెడ్డది. ఒక్కొక్క అక్షరం గుణించుకొని చదవాల్సివచ్చింది.
    పిన్ని ఇంట్లో పెళ్లిచేయడం అతనికి ఇష్టంలేదట. రేపు సాయంత్రం సరస్వతిని కారులో తీసికెళ్తాట్ట. అక్కడే అతని బంగళాలో పెళ్లి జరుగుతుందట.
    కాలానికి కరుణ లేదు. ఉదయానికి హృదయం లేదు. సాయంకాలానిది చచ్చు గుండె. ఎందరు విన్నవించుకున్నా చెవిని పెట్టదు. నా విన్నపాలు-ప్రార్థనలు ఆ సాయంత్రానికి అందినట్లు లేదు-ఉరికి వచ్చేసింది.
    సరస్వతి పెళ్ళికూతురు అయింది. ఆమెను చూచాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నావి మసక కళ్లు. వాటికి ఇంత వెలుగు ఎలా వచ్చింది? నా గుండె గుండెలోనే ఉంది. నేను మామూలు మనిషిలా ఉన్నాను. ఇంటికి చాలామంది వచ్చారు. అల్లరిగా ఉంది. ఏమీ అర్థంకావడం లేదు.
    వచ్చినవాళ్లు వధువును చూచారు. వెళ్ళిపోయారు. నన్ను ఉడికించడానికి ఎవరూ లేరు. అలసినట్లు కూలబడ్డాను. నన్ను చూచింది సరస్వతి. నవ్వింది.
    "ఏమిటి ఆలోచిస్తున్నారు......"
    'అదే......నువ్వు వెళ్ళిపోతావు గదా అని'
    "ఆఁ" సరస్వతి ఉలిక్కిపడ్డది. అప్పుడే నిద్ర లేచినట్లు నలువైపులా పరికించింది. తన బట్టలను చూచుకుంది. 'ఏమి? నిజం! మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా?' అది సంతోష సమయం. అయినా ఎక్కెక్కి ఏడ్చింది. నేనూ కన్నీటి కోసం తపించాను. కాని ఎడారిలో మబ్బుముక్కలేడ!
    సరస్వతిని పిన్ని ఓదార్చింది. ఇతర స్త్రీలు ఏడవరాదన్నారు విఠల్ కూడా వచ్చాడు. అయినా ఆగలేదు. నగలు ఒక్కొక్కటే తీసి విసురుతూంది.
    'సరే, ఇహ బుద్ధితెచ్చుకో. అతడు వచ్చేవేళ అయింది'
    "ఎవరూ....?" ఆమె పిచ్చిదానిలా గుమ్మంవైపు చూచింది. 'నాకు భయంగా ఉంది. కార్లో కూర్చుంటే కళ్లు తిరుగుతాయి. నేను పోను' అనేసింది.
    అది విన్నాను. లేచాను. ఎక్కడికి వెళ్ళడం? ముందు కటిక చీకటి. బుద్ధికి సంబంధించిన దీపాలన్నీ ఆరిపోయాయి. మండుతున్న జ్వాలల్లోంచి బయటపడినట్లు సరస్వతిని తప్పుకొని బయటపడ్డాను. ఒక్కొక్క మెట్టు దిగాను. దర్వాజాలోకి వచ్చాను.
    "సుబ్రహ్మణ్యం వస్తున్నాడు...." ఎవడో రోడ్డుమీదనుంచి అరచాడు.
    'ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళొద్దు.......' సరస్వతి అరుస్తూంది.
    నేను మాట్లాళ్ళేదు. ఫుట్ పాత్ దాటాను. చౌరస్తా వైపు సాగాను.
    "వెళ్ళొద్దు.....వెళ్ళొద్దు" ఆమె వేగంగా మెట్లు దిగి ఉరికివస్తూంది-నన్ను ఫిరంగుల గుళ్ళనుంచి రక్షించడానికన్నట్లు - బయట హంతకుల వీరవిహారం విన్నట్లు ఉరికివస్తూంది-
    "వెళ్ళొద్దు......ఓ" వాతావరణంలో ఒక ఫిరంగి పేలింది.
    తరవాత ఆకాశంలో ఎరుపు వలయాలు ఏర్పడ్డాయి. మలిగాయి. చెరిగాయి. మండే కళ్ళమొసలి నోరు తెరచుకొని దుమికింది. చిన్నారి మల్లెమొగ్గ కేకపెట్టింది.......
    భయంకర స్వప్నం నుంచి బయటపడ్డట్టు అంతా అచేతనంగా ఉంది. మౌనంగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది.
    పిన్ని సరస్వతి బంగారు నగలను ఒకచోట పోగుచేసింది. సుబ్రహ్మణ్యం వాటిమీద వంగి విరిగిన అవయవాల్లో ఇరుక్కున్న గాజులనూ, ఉంగరాల్నూ, గొలుసుల్నూ గుర్తిస్తున్నాడు. పిన్ని నా 'కల్పన'ను వీధిలోకి విసిరితే జాగ్రత్తగా దాని గాయాలు సవరించినట్లు అతి జాగ్రత్తగా నగలు తొలగిస్తున్నాను.

                                                                              * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS