Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 35


    వెంకటరత్నం నాయుడుగారు మొదలగు మువ్వురు ముఖ్యులచే రెడ్డిగారికి నుత్తరములు వ్రాయించి పుచ్చుకొని, తన బావమరది బాలకుడనియు, నతనికి వలయు సహాయమొనర్చి తన కుటుంబపు కృతజ్ఞతకు బాత్రులు గావలయుననియు వ్రాయుచు గమ్మలన్నియు నారాయణరావు రెడ్డిగారికి బంపించెను. రంగూనులో నుండి వార్తాపత్రిక నెలకొల్పి యనేక విధముల నాంధ్రులకు సహాయ మొనరించు ఆవటపల్లి నారాయణరావు గారికి గూడ నారాయణరా వుత్తరములు వ్రాయించినాడు.
    రెడ్డిగారి వలన, నమృతచందువలన, నారాయణరావుగారి వలన పెక్కు విధములగు సలహాలనొంది రామచంద్రరావు జపాను వెళ్ళినాడు. టోకియో, యోకొహామా మొదలగు నగరములు, ధ్యాన బుద్దుని, ప్యూజియామా పర్వతమును రామచంద్రరావు దర్శించెను. జపాను విశ్వవిద్యాలయములను రసవిహారి బోసు గారి సహాయమున దర్శించెను. బోసుగారనేక పరిశ్రమాగారములను గూడ జూచుటకు సౌకర్యములు సమకూర్చినారు. బొమ్మలు, కాగితములు, గ్లాసు సామానులు, కత్తులు, సూదులు మొదలగు లోహపు సరుకులు, బొత్తాములు, పూసలు, దువ్వెనలు, వస్త్రములు, రబ్బరు సరుకులు, మందులు నింకనెన్నియో వస్తువులను జపానుదేశము భారతదేశమున కెగుమతి జేయుచున్నది. ఆ కర్మాగారములలో బెక్కింటిని రామచంద్రరావు కనుగొనెను.
    హిందూదేశము తన్నావరించిన దౌర్భాగ్య పిశాచమును వదల్చుకొని మరల సర్వతోముఖముగ నెప్పటికి విజృంభించగలదో యని రామచంద్రరావు నిట్టూర్పు నించెను. నారాయణరావునకు గొన్ని కుంచెలు రంగులు కొని రామచంద్రరావు పంపించెను.
    రామచంద్రరావు అమెరికాకు వెడలు దినము సమీపించినది. రాజకీయ కారణము వలన జన్మభూమిని విసర్జించి జపాను దేశమును బెంపుడుతల్లి నొనరించుకొని, కలలలో, జాగ్రదావస్థలో గంగానదిని, కాళీ ఘట్టమును, హిమాలయ పర్వతశ్రేణిని స్వప్నములగాంచు రసవిహారుడు రామచంద్రరావును కౌగిలించుకొని 'బాబూ! అప్పుడప్పుడీ దేశము వచ్చు భారతీయులే నాకు భారతదేశము సుమా! వారి మూర్దములందు హస్తతలములందు నా వంగదేశపు పంట భూములను, శేఫాలికా జపాకుసుమములను నాఘ్రాణించుచు వారి కన్నుల కాంతిలో నా గంగానదీ పావనోదకముల దర్శించుచు, వారి నుదుటిలో నా దేశపు నీల గగనాల ప్రత్యక్షించుకొందును.
    'పంజాబ్ సింధు గుజరాత మరాటా ద్రావిడ ఉత్కల వంగా
    వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధితరంగా'
    'నువ్వు బాలుడవు. నా దేశమాత ముద్దుబిడ్డను. నా సోదరుడవు. అహో రామచంద్ర! నువ్వు నాలుగేళ్ల కయినా మన తల్లి ఒడిలో ఆడుకొందువు. మన తల్లి మట్టిలో దొర్లుదువు. మనమాత ఇచ్చిన ఆట వస్తువులతో గేరింతలాడుదువు. ఆ పవిత్ర వాయువులు పీల్చెదవు. ఆ యమ్మ చనుబాలు గోదావరి పావనోదకాలు త్రాగుదువు. పో! పో! ఒక్కసారి నన్ను కౌగిలించుకో. మరల నింటిదారి నిటు వచ్చిన సంతోషించెదను. అమెరికా జేరిన వెంటనే నాకు జాబు వ్రాయి' అని యతని నా తరణిలో దిగవిడిచి గట్టునకు విసవిస వెడలిపోయినాడు.
    టంగ్ టంగ్ మని గంట మ్రోగి తుదికూత నుచ్చైస్వనమునగూసి యా యోడ పెద్ద చప్పుడుతో యోకొహామారేవు వదలినది. రామచంద్రుడు రసవిహారిబాబు మొదలగు భారతీయుల సలహాచే మొదటి తరగతి టికెట్టు పుచ్చుకొన్నాడు.
    అమెరికా దేశము బీదలను రానీయదు. డబ్బుగల వారిని గౌరవించును. విద్య నేర్చుకొనుటకు వచ్చినాను సరియే, నిర్భాగ్యుడు అమెరికా దేశమున ఉపజీవి క్రిమి (ప్యారాశైట్) వలె సంచరించుటకు వీలులేదు. భరతభూమి కన్న పెద్దదియైనను నచ్చట పదికోట్ల జనులు మాత్రమున్నారు. వారికి అమెరికా చాలదట. అమెరికన్లు రంగుజనులను తమ కుక్కలు, పిల్లులు, గుఱ్ఱములకన్న హీనముగ జూతురు. నల్ల నీగ్రోలు, చైనా జపాను దేశముల పసుపుపచ్చని మంగోలియన్లు, ఆదిమ నివాసులగు ఎర్ర ఇండియన్లు, వివిధ వర్ణములు కలవారైన హిందూ దేశస్థులు వారి దేశములో నివసించి అమెరికన్లు కాగూడదట. తాత్కాలికముగ కొలది సంవత్సరములు మాత్రము నివసించి పోవలయునట. నీగ్రోజాతివాడేదైన తప్పు చేసినచో, న్యాయస్థానములకు గొనిపోయి విచారించకుండానే ప్రజలు వాని నురుదీయుదురు. లేదా స్తంభమునకు గట్టి కిరసనాయిల్ నూనెలో తడిపిన కఱ్ఱలను బేర్చి కాల్చుదురు. వానిని గుఱ్ఱములకు గట్టి, చచ్చునంతవరకు రాళ్ళమీద నా గుఱ్ఱమును పరుగెత్తింతురు.
    హిందూదేశ మమెరికనుల దృష్టిలో నొక చిత్రభూమి. భారతీయులకు మతము లేదు. రాళ్ళను రప్పలను గొలిచి రౌరవాది నరకమునబడు మూర్ఖులతో భరతభూమి నిండియున్నదట. కాన కోటీశ్వరభూమియగు నమెరికా, భారతభూమికి క్రైస్తవ మతప్రచారకుల బంపుచుండును. భారతభూమిలోని రాజాధిరాజులైనను, అమెరికాలోని గొప్ప హోటళ్ళలో బస చేయుటకు వీలులేదు. అమెరికా రైళ్ళలో 'పుల్ మాను' అను నుత్తమ తరగతి బండ్లలో ప్రయాణము సలుపకూడదు.
    ఉత్తంగములై లేచు సముద్ర వీచికల గమనించు చూపులతో రామచంద్రుడమెరికాను గూర్చి యాడిపోసిన పంజాబీయుడగు నొక సిక్కు సోదరుని మాటలను దలపోయుచు నౌకా ముఖ్యోపరిభాగమున నడ్డముగా గట్టిన ఇనుపగొట్టపు కడ్డీల నానుకొని నిలుచుండి యుండెను.
    జపాను దేశము నిన్ననే కొన్ని వందలమైళ్ళ దూరాన మాయమైపోయినది. రాత్రియంతయు వివిధాలోచనలతో నిదురరాక, పన్నెండు గంటలకు గొంచెము కన్నుమూసి, తరువాత నావికులు మ్రోయించిన నాలుగు గంటల చప్పుడు విని మోము కడుగుకొని, శుభ వస్త్రముల ధరించి, యాబాలకుడు ఓడ పైతట్టునకు బోయి సముద్రమున సూర్యోదయాద్భుతము కనుగొనవలెనని వేచియుండెను.
    ఎటు చూచినను సముద్రమే. ఆ కనుచీకటిలో ఆకసము, నీరధి ఏకమైపోయినవి. ఊయల వలె నా మహాతరణి యిటునటు నూగుచు పోవుచున్నది. ఓడలోని యంత్రముల పెనుమ్రోతలు రామచంద్రుడున్న తావునకు మద్దెల మ్రోతవలె మాత్రము వినవచ్చుచున్నవి. ఆ శ్రుతి మేళవింపులో ఓడను ముందునకు ద్రోయు ఆకు చక్రములు నీటిలో నపరిమిత వేగమున తిరుగు కవ్వపు మ్రోతయు, ఓడ ముందు భాగమున ఉక్కు (కీల్) బద్దియ నీటిలో మహావేగమున గోయుచు బోవు గంభీర నాదమును లీనమై ఉత్క్సుష్ట గీతికయై యతని హృదయమును రంజించినవి.
    కలలలో, కథలలో, గ్రంథములలో, వార్తా పత్రికలలో వినబడిన విదేశ కంఠములు, విదేశ శబ్దములు నేడు వినిపించినప్పుడు, నూతన వర్ణములు, నూతన రేఖా ప్రవాహములు, నవీన వస్తు సంబంధములు నేడు గోచరించునప్పుడు రామచంద్రుని కంతయు విచిత్రమై, విస్మయమై మాయా పూర్ణమై కనబడి యతడు నిస్తబ్దుడైపోయినాడు. తాను మున్నెన్నడు విననివియు, నూహింపనివియు నాగు నద్భుత సందర్భము లచట సర్వసామాన్యములై తోచి యతనికి గనులు మూయని కలలైపోయినవి.
    ఇంతలో నెవరో యతని భుజముపై తట్టినారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS