"బాప్ రే బాప్!" అన్నాడు అంకుష్.
"ఇటీజ్ ఆల్ రైట్ బాయ్!" అని గుహ ముఖద్వారం దగ్గరికి వెళ్ళి తన శక్తి అంతా ఉపయోగించి ఒడుపుగా ఆ బండని పక్కకి నెట్టాడు సాహస్.
బండ పక్కకి దొర్లగానే -
మళ్ళీ ఇందాకటి శబ్దం వినబడటం మొదలెట్టింది.
ఆ బండతో బాటుగా, బ్రహ్మాండమైన వస్తువేదో జారుతున్నట్లు...
మరుక్షణంలో మళ్ళీ గుహద్వారం మూసుకుపోయింది.
కన్ను పొడుచుకున్నా కనబడని చీకటి!
క్షణానికి ఒక సీను చొప్పున మారిపోతున్న హారర్ పిక్చర్ ని చూస్తున్నట్లు చూస్తున్నారు వాళ్ళిద్దరూ.
కొద్ది క్షణాల తర్వాత, గలగలగల శబ్దం వినబడటం మొదలెట్టింది. గుండ్రంగా, చిన్నవిగా వున్న లోహపు ముక్కలు అతివేగంగా వచ్చి వాళ్ళ మొహాలకి బలంగా తగలడం మొదలెట్టాయి.
పది నిముషాల పటు ఏకధాటిగా వర్షం కురిసినట్లు పడ్డాయి ఆ లోహపు ముక్కలు.
ఆ తర్వాత లోహపు ముక్కలు పడడం ఆగింది.
ఆ వెనువెంటనే, గుహ పైభాగంలో వెలుతురు కనబడింది! అది గుహ ముఖద్వారమని గుర్తించారు వాళ్ళు.
ఆ లోహపు ముక్కల వైపు చూశాడు అంకుష్.
"బాస్! గోల్డ్!" అన్నాడు ఎగ్జయిటెడ్ గా.
"అవును! గోల్డే - గోల్డ్ కాయిన్స్!" అన్నాడు సాహస్. వాటిలో కొన్నిటిని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసి, "పద! పైన జరుగుతోంది ఏమిటో చూద్దాం!" అన్నాడు.
ఇద్దరూ గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చారు.
సాయం పట్టి, అమ్కుష్ ని పైకి ఎక్కించాడు సాహస్. తర్వాత తను కూడా పైకి వచ్చాడు.
పైకి రాగానే, చుట్టూరా చూశాడు అంకుష్, "ఓహ్ గాడ్! వాటీజ్ దిస్?" అన్నాడు ఎగ్జయిటెడ్ గా.
"కొండ మీద నుంచి షిప్పు జారి వస్తుందా! ఇంతకంటే తలాతోకా లేని విషయం ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదు!" అన్నాడు అంకుష్.
"అంకుష్! ఇది విచిత్రమే కావచ్చు. కానీ అసంభవం మాత్రం కాదు. కొండమీద ఈ షిప్పు ఉండి ఉండడానికి చరిత్రకి అందని కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన కారణం అయి ఉండవచ్చు. కానీ దానిని "సంఘటన" అనే ఓ చిన్న పదంతో వర్ణించలేం!"
"ఏం జరిగి వుంటుందీ?" అన్నాడు అంకుష్.
"ప్రళయం!" అన్నాడు సాహస్ డ్రమెటిక్ గా.
"ఏమిటీ?" అన్నాడు అంకుష్ నీలుక్కుపోతూ.
"అవును! ప్రళయం! జలప్రళయం జరిగి ఉండాలి! లేకపోతే ఒక నౌక ఈ కొండ కొమ్ము మీద ఉండే అవకాశం లేదు."
"నాకు కాస్త అర్ధం అయినట్లు చెబుతావా?" అన్నాడు అంకుష్ అసహనంగా.
గొంతు సవరించుకుని, చెప్పడం మొదలెట్టాడు సాహస్.
"ప్రతి కొన్ని లక్షల సంవత్సరాలలో కోట్ల సంవత్సరాలలో ఒకసారి ప్రళయం వస్తూనే ఉంటుందని ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా నమ్ముతున్నారు కదా!"
"నిజంగానా?"
"అవును! నిజంగానే! శాస్త్రజ్ఞులు ఇప్పుడు నమ్ముతున్నారు - గతంలో అనేకసార్లు ప్రళయం వచ్చి ఉండాలనీ - శాస్త్రజ్ఞులు ఇప్పుడు చెబుతున్నదే ఇన్నాళ్ళనుంచి అన్ని పెద్ద మతాల తాలూకు పురాణాలూ, గ్రంధాలూ చెబుతూనే ఉన్నాయి. ఉదాహరణకి హిందూ మతం సంగతే తీసుకుందాం! హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రళయం వస్తుంది. ప్రళయానంతరం నూతన సృష్టి జరుగుతుంది. అలా ఎన్నోసార్లు ప్రళయాలు - ప్రళయాల అనంతరం ఎంతమందో మనువులు - మన్వంతరాలు!
అలాగే - బైబిల్ ప్రకారం చూస్తే -
ఇంతకుముందు వచ్చిన ప్రళయానికి ముందు, దేవుడు నోవా అనే వృద్ధుడికి చెబుతాడు. "నోవా! ప్రళయం రాబోతోంది! ఫలితంగా ప్రపంచమంతా జలమయం కాబోతోంది. అందుకని నీవు ఒక పెద్ద నౌకని నిర్మించు! అందులోకి జంతుకోటిని అంతటినీ రకానికి ఒక జంట చొప్పున ఎక్కించు. ప్రతి జంటలోనూ ఒక ఆడా, మగా ఉండాలి. అంటే ఒక ఆడ జిరాఫీ, ఒక మొగ జిరాఫీ, ఒక ఆడ ఏనుగు, ఒక మొగ ఏనుగు, ఒక ఆడ గుర్రం ఒక మొగ గుర్రం - అలా అన్నమాట! ప్రళయం తర్వాత ఈ జంతువులలోనుంచే మళ్ళీ సృష్టి జరుగుతుంది!"
నోవా దేవుడి ఆనతి ప్రకారం ఒక పెద్ద నౌకని నిర్మిస్తాడు. అందులోకి అన్ని జంతువులనీ జంటలుగా ఎక్కిస్తాడు. ప్రళయం తర్వాత వాటి ద్వారానే సృష్టి మళ్ళీ కొనసాగుతుంది. మధ్య ఆసియాలో ఒక కొండమీద నోవా నిర్మించిన నౌక నిలిచిపోయి ఉండవచ్చుననే ఊహతో ఆ మధ్యన కొంతమంది శాస్త్రజ్ఞులు అక్కడ త్రవ్వకాలు సాగించారు. అక్కడ ఆశ్చర్యంగా, నిజంగా నోవా తాలూకు నౌకేనేమో అనిపించే విధంగా కొన్ని శకలాలు కనబడ్డాయి. ఇంకా ఏ విషయం నిర్ధారణ కాలేదు గానీ, మొత్తానికి ఇవాళ కాకపోతే రేపు అయినా, నోవా గారి నౌక తాలూకు అవశేషాలు ఎక్కడో అక్కడ మనకి దొరికినా ఆశ్చర్యం లేదు" అన్నాడు సాహస్.
