Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 35


    "హౌవ్ డూయీలైక్ హైద్రాబాద్?"

 

    "అయ్ లైకిట్ వెరీమచ్."

 

    (పద్మ బావుంటుంది. మాటా పలుకూ బావుంది. సంస్కారం సరేసరి! ఒక్కటే ఒక్కలోటు- పద్మ లక్ష్మీపతి కూతురు!)

 

    "హిందూదేశంలో హైదరాబాదుకంటే అందమైన నగరాలు చాలా ఉన్నాయి" అన్నాడు సత్యం.

 

    "విన్నాను!"

 

    "చూళ్ళేదా?"

 

    "ఉహు."

 

    "చూడాలని ఉందా?"

 

    "అఫ్ కోర్స్!"

 

    "చూడాలనుకుంటే ఖర్చు బాగానే అవుతుంది."

 

    "... ... ..."

 

    "కాదంటాడని భయమా?"

 

    "ఆడపిల్ల అందమయిన నగరాలు చూడాలనే రూలేమైనా ఉందాండీ?"

 

    "అది నా ప్రశ్నకి సమాధానం అవుతుందా? కాదు. చూడు బేబీ! మీ నాన్న గురించి నీకెంత తెలుసో, నాకూ అంతే తెలుసు. కాశ్మీరు చూడాలని ఉందన్నావో కాలూ చెయ్యీ తీసేసినట్టు విలవిల్లాడిపోతాడు. ఇండియా వదిలేయి. భూగోళంలో బోలెడు నగరాలున్నాయి. నేపుల్ ని చూసి చచ్చి పొమ్మన్నాడు ఇంగ్లీషు కవి. అక్కడికెళ్ళే ఏర్పాట్లు చెయ్యమని చెప్పేవనుకో మీ నాన్నకి గుండె ఆగిపోతుంది, అవునా?"


                                                              *  *  *


    గొడుగుపేట ఇంట్లో.

 

    "నా గుండె చాలా గట్టిదండి. రేపటిమీద నమ్మకమున్న గొప్ప ఆశావాదిని" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "తల్లి తండ్రులున్నారా?" అడిగాడు లక్ష్మీపతి.

 

    "తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి ఉన్నాడుగానీ, నా బాగోగులు నాకే వదిలేశాడు. నీ యిష్టమొచ్చినట్టు అఘోరించమని తరిమికొట్టేడు. బట్ స్టిల్- నాన్నంటే నాకు చాలా ఇష్టం."

 

    ఆ మాటతో అతనికి వాళ్ళబ్బాయి గుర్తుకువచ్చాడు. తనగురించి ఈ రకమైన అభిప్రాయం ఎక్కడా ఎప్పుడూ చెప్పడని తెలిసి బాధపడ్డాడు.

 

    ఎందుకయినా మంచిదని కృష్ణమూర్తికి ఒక చురక తగిలించేడు ---

 

    "నువ్వు చెబుతున్నది నమ్మబుద్ధి కావడంలేదు!"

 

    "బహుశా- నేను చెప్పడంలో మిమ్మల్ని నమ్మించాలనే తాపత్రయం తక్కువయిందేమో?"

 

    "అదేంకాదు. తరిమికొట్టే తండ్రిని ఏ కొడుకూ ఇష్టపడడు, గౌరవించడు."

 

    "కావచ్చు! కానీ - నావరకు నేను ప్రతి విషయాన్నీ, చర్చనూ ప్రాక్టికల్ ధోరణితో ఆలోచించడం అలవాటు. అంచేత మానాన్న నాకు నచ్చుతాడు. మీరేం అనుకోనంటే మీకో విషయం చెబుతాను."

 

    "చెప్పు."

 

    "ఈ ఇంట్లో అద్దెకు దిగేముందు మీ గురించి చాలామంది చాలా చెడ్డగా చెప్పారు."

 

    అతని స్టేట్ మెంట్ కి లక్ష్మీపతి మొహం మాడ్చుకున్నాడు. కృష్ణమూర్తి చిన్నగా నవ్వేసి అన్నాడు---

 

    "చూసేరా? మీక్కోపం వచ్చింది."

 

    "రాలేదు."

 

    "అయితే సరే! స్టడీగా వినండి. అందరూ మిమ్మల్ని నీచాతినీచంగా చిత్రీకరించారు. పిల్లికి బిచ్చంపెట్టని పిసినిగొట్టన్నారు. న్యాయం ధర్మం తెలీని నరకాసురుడన్నారు. డబ్బుకోసం గడ్డితినే గండభేరుండన్నారు. పొరుగువాళ్ళే---"

 

    "ఇంక ఆపు" అన్నాడు అతను కళ్ళెర్రచేస్తూ. కృష్ణమూర్తి ఈజీగా తీసుకుంటూ అన్నాడు---

 

    "ఇప్పుడు మీకు ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. మీ కోపం కాదిక్కడ ముఖ్యం. మీ గురించి ఎవరెంత హీనంగా మాట్లాడినా నేను మీ ఇంటిలోనే అద్దెకు దిగానంటే ఏమిటర్ధం?"

 

    అదేమిటో వినాలని అతను కుతూహలంగా ముందుకు వంగాడు. కృష్ణమూర్తి చెబుతున్నాడు--

 

    "చెబితేనే ప్రతి విషయాన్నీ చర్చనీ నేను ప్రాక్టికల్ ధోరణిలో ఆలోచిస్తానని, అట్లా ఆలోచించగా నాకు దొరికిన సమాధానం ఒకటే ఒకటి"

 

    "ఏమిటది?" ఆత్రంగా అడిగాడు అతను.

 

    "మీరు పరిపూర్ణమైన మానవుడు" అన్నాడు కృష్ణమూర్తి.

 

    ఆ బిరుదు వినగానే అతను పులకించిపోయేడు. ఇన్నేళ్ళ జీవితకాలంలో ఎవరూ ఎప్పుడూ అతనికి ఆ జాతి బిరుదు ఇవ్వలేదు గనక వళ్ళు పులకించింది.

 

    మరోసారి ఆ పొగడ్త వినాలనే ఉద్దేశంతో అడిగాడు---

 

    "నువ్వంటున్నదేమిటో సరిగా అర్ధం కావడంలేదు."

 

    "సింపుల్! మనిషి సుఖంగా బతకాలనుకున్నప్పుడు మనము కొన్ని సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. అది మీరు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. అయామ్ ప్రౌడాఫ్ యు" అన్నాడు కృష్ణమూర్తి.


                                                               *  *  *


    లక్ష్మీపతి ఇంటిలో - పద్మతో అంటున్నాడు సత్యం---

 

    "అంచేత- మీ నాన్నని వదిలేడు! నీకున్న అందమైన ఊహలన్నీ నిజం కావాలంటే నిన్ను కట్టుకునేవాడు. అంతో ఇంతో వెనకున్న వాడయి ఉండాలి! ఫారిన్ లో బ్రేక్ ఫాస్టు... న్యూయార్క్ లో లంచ్ ... సింగపూర్లో డిన్నరు తీసుకునే స్థాయిలో వాడు వెలిగిపోతుండాలి. అవునా? కాదా?"

 

    పద్మ సమాధానం చెప్పకుండా లేచి నిలబడింది.

 

    "ఆల్ రైట్--- నీ జవాబేమిటో కొంచెం టైము తీసుకునే చెప్పు" అన్నాడు సత్యం.

 

    పద్మ అక్కడినుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయింది.

 

    అతడు కాఫీ సిప్ చేస్తే చప్పగా చల్లారిపోయివుంది. నాలుకమీద వున్న చల్లటి కాఫీని మింగాలో తుపుక్కున ఉయ్యాలో తెలీక సతమతమవుతున్నాడు సత్యం.


                                     *  *  *


    గొడుగుపేట ఇంట్లో--- కృష్ణమూర్తితో అంటున్నాడు లక్ష్మీపతి.

 

    "నువు నాకు నచ్చావు."

 

    "థేంక్యూ!" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "రేపట్నుంచి మా అబ్బాయికి ట్యూషన్ చెప్పు!"

 

    "విత్ ప్లెజర్!"

 

    "వాడు పరీక్ష పాసవ్వాలి!"

 

    "తప్పకుండా పాసవుతాడు. మీరు నిశ్చింతగా ఉండండి!" అన్నాడు కృష్ణమూర్తి.


                                                                 22


    లక్ష్మీపతి ఇల్లు.

 

    కృష్ణమూర్తి హాల్లో నిలబడ్డాడు. హాలు గోడలకు పాత ఫోటోలు తగిలించివున్నాయి. వాటిని చూస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణమూర్తిని 'ఎవరదీ' అంటూ పలకరించింది లక్ష్మీపతి భార్య అన్నపూర్ణమ్మగారు.

 

    కృష్ణమూర్తి అన్నపూర్ణమ్మకు చేతులు జోడించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS