24

"వసంతా" అన్నాడు ప్రకాశం బాధగా.
"ఏమిటి, ప్రకాశం" అంది వసంత. అతనెందుకు అంతగా బాధపడుతున్నాడో ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు తానా బాధ తీర్చలేదు. ఎవ్వరినీ నవ్వించలేదు. తను నవ్వదు. ఏది ఆనందమని అనుకొందో దాన్ని సాధ్యమైనంత వరకూ దూరం చేసుకొంది. తన అలవాట్ల ను పూర్తిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నానికి అప్పుడప్పుడు ఎవరో ఒకరు అడ్డు వస్తున్నారు.
ప్రకాశం తనను నిర్లక్ష్యం చేయడం సహించలేక అతన్ని ప్రేమ మాటలతో వంచించింది. అతడు వలచాడు. ఈనాడు అతన్ని వంచించ దలుచు కోలేదు. ఇంక ఎవరినీ మోసగించ దలచు కోలేదు. పరిస్థితులు ఆమెను మార్చి వేశాయి. ఎవ్వరితోనూ మాట్లాడదు. కానీ వారామేను అలా ఉండనివ్వరు.
"నువ్వు ఏ విషయం తేల్చక ఇలా బాధిస్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు."
"ఇందులో తేల్చవలసింది ఏముంది?"
"అదే-- మన ప్రేమ."
"ఈ ప్రేమా, గీమా నాకేం తెలియదు."
"వసంతా, ఈనాడు నువ్విలా ఏం తెలియనట్లు ప్రక్కకు తప్పుకోవడం న్యాయం కాదు. నన్ను కవ్వించావు. పిచ్చి వాడిలా తయారు చేశావు. అందని పండు లెమ్మని దూరంగా ఉంటున్న నన్ను అందుకొమ్మని ఆశలు కల్పించి దగ్గరి కొచ్చి అందుకో బోయెంతలో ఏం తెలియదు అంటున్నావు. నా మనసులో రగిలే బాధ నీకర్ధం కాదు. ఏ పని చెయ్యబోయినా నువ్వే , ఎక్కడున్నా నువ్వే కనిపించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు."
"దానికి నన్నేం చేయమంటావు? అది నీ బలహీనత.
"అదే నేనూ అంటున్నాను. ఈ బలహీనత ను నువ్వే నాలోకి ఎక్కించావు. సుస్థిరంగా ఉన్న నా హృదయాన్ని నీ చూపుల బాణాలతో , చిలిపి చేష్టలతో కదిలించి పటుత్వాన్ని పోగొట్టి, విలవిలలాడించి, క్రింద పడిపోతూ పట్టుకొమ్మని ప్రాధేయ పడితే ఏమీ పట్టించుకోని అమాయకురాలి లా వెళ్ళిపోతున్నావు. ఇలా మగవారి హృదయాలతో ఆటలాడుకొనే అధికారం నీ కేవరిచ్చారు?"
'ఆడే నేనూ అడుగుతున్నాను. అమాయకులయిన ఆడపిల్లల వెంట బడడమేనా మీ పని?
"అమాయకురాలివా నువ్వు? కత్తి అక్కర లేకుండానే మగవారి మనసులను హింసించి చిత్రహింసకు గురిచేసే మాయవివి, వారికి జీవితం పై ఆశను కల్పించి నిరాశను నిమ్పుతున్నావు. ఆనందమంటూ దుఃఖాన్నిస్తున్నావు. ప్రేమ జ్యోతిని వెలిగిస్తానంటూ అగ్నినే రగిలిస్తున్నావు. నీ అందం ఎరగా పెట్టి జీవితాలనే బలిగా కొంటున్నావు. తృప్తి నిస్తా నంటూ అసంతృప్తి నే నింపుతున్నావు. శాంతిగా సాగే జీవితాలలో అశాంతిని రేకెత్తిస్తున్నావు."
"ప్రకాశం!' గట్టిగా అరిచింది వసంత.
"ఎందుకలా అరుస్తావ్? అయిపొయింది. అంతా అయిపొయింది. ఇందరి జీవితాల్లో చిచ్చు పెట్టిన నీ జీవితం ఎన్నడూ సాఫీగా, సుఖంగా సాగదు. అందరి శాపం నీకు తగిలి నీ జీవితంలో కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. అప్పుడర్ధం చేసుకో -- మా హృదయాలలో రగిలే బాధను . నువ్వు బ్రతికి ఉండగా నీకు శాంతి లభించదు. సుఖాన్ని దరి చేరలేవు. ప్రశాంతంగా జీవితాన్ని గడపలేవు." అని గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు ప్రకాశం.
ఆ మాటలు విని వణికి పోయింది వసంత. ఎన్నో చేతులు తన గొంతును నులుమను వస్తున్నాయి. తనను దరి చేర్చే వారిని నిర్దయగా దూరంగా విసిరి వేస్తున్నాయి. తనపై జాలి చూపేవారే లేరు. తన నాదరించే వారే లేరు. తన ఆవేదనను వినేవారే లేరు. ఒక వ్యక్తీ......ఆ వ్యక్తే తనకు శాంతి నివ్వాలి. అభయమిచ్చి చేరదీయాలి. అతని ఎదుటే నుంటే తనకు ఏ కష్టమూ, ఏ భయమూ ఉండదు. ఎవరతను?
* * * *
అప్పుడే వస్తున్నా రాజ్ ను చూసి 'అదుగో నాన్నా! వారు కూడా వచ్చేశారు" అంది రజియా ఉత్సాహంతో.
రాజ్ అక్కడ ఉన్న క్రొత్త కారును చూసి ఎవరోచ్చారా అని చుట్టూ చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. కారును పరీక్షిస్తున్న ఖాన్ గారు, రజియా మాత్రమె అక్కడ ఉండడంతో ఓహో అనుకున్నాడు.
"రా, అబ్బాయ్, రా! ఈ కారు కోనేంత వరకూ రజియా ప్రాణాలు తోడేసిందనుకో. కొని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇక దీని బాధ్యత అంతా నీదే."
"నాదా!" ఆశ్చర్యపోయాడు రాజ్.
"అవును, అమ్మాయి నీ కోసమే కొనిపించింది ఈ కారు. నీకు డ్రైవింగ్ కూడా వచ్చటగా? అమ్మాయి గూడా నేర్చుకోవాలంటోంది. ఆ భారం కూడా నీకే అప్పగిస్తున్నాను. ఇంద తాళం చెవులు" అని ఖాన్ గారు రాజ్ చేతిలో అవి ఉంచి లోపలికి వెళ్ళిపోయారు. రాజ్, రజియా ను చూశాడు. ఆమెలో క్రొత్త ఆనందం వెల్లి విరుస్తుంది. ఏం మాట్లాడలేక పోయాడు. ప్రక్కనే ఉన్న తోటలోకి నడిచాడు.
"కోపమా?' అనుసరించింది రజియా.
".........."
"రాజ్, నేనిప్పుడెం చేశానని?"
"కారు కొనమని మీ నాన్నగారిని ఎందుకు వేధించావ్.
"మరి అందరికీ కారుంది. మనకు లేదు. అందుకని."
"అదే నాకిష్టం లేదు."
"రాజ్, ఈ ఒక్క తప్పు మన్నించు. ఇంకెప్పుడూ నిన్ను అడగనిదే ఏ పనీ చెయ్యను."
"ఊ" అని మూలిగాడు రాజ్.
'అది కాదు, రాజ్, కారుంటే చాలా బాగుంటుంది. అదీ గాక ప్రతిదినం మనం అంతదూరం నడిచి పోవాలంటే కష్టంగా ఉంది."
"అప్పుడే అంత సుకుమారివయ్యావన్న మాట!"
"పోనీలే. నీకిష్టం లేకుంటే ఆ కారు తిరిగి అమ్మి వెయ్యమని నాన్నగారితో చెప్తాను."
లేచింది రజియా. కంగారు పడ్డాడు రాజ్. "రజీ" అంటూ ఆమెను పట్టుకొన్నాడు. అప్పటికే రెండడుగులు ముందుకు వేసిన రజియా కొంగు మాత్రమే అతనికి చిక్కింది.
"అబ్బ! వదులు రాజ్!" ప్రయత్నించింది రజియా.
"ఊహూ" అని ఆమెను లాగాడు. గుండ్రంగా తిరుగుతూ అతని మీద వాలిపోయింది. రెండు చేతులతో బంధించి "అప్పుడే అమ్మాయి గారికి అలుకా?' అన్నాడు.
ఆ కౌగిలిలో అమితమైన సుఖాన్ని అనుభవిస్తున్న రజియా మాట్లాడలేక పోయింది.
"నీ యిష్ట ప్రకారమే కానీ. ఏదీ నవ్వు."
నవ్వింది రజియా జయించానన్న గర్వంతో.
"రజీ అటు చూడు నీ నవ్వుకు పువ్వులు వికసిస్తున్నాయి."
"ఇక ఈ కవిత్వం చాలించ కుంటే నే వెళ్ళిపోతాను."
'అంతేకాదు , రజీ , నీ నవ్వు నాలోని కోరికలను మత్తెక్కిస్తోంది."
"రాజ్!" మధురమైన బాధ రజియాను ఆవరించింది.
"అవును రజీ. ఇంత అందమైన అందాల రాశితో అంతులేని ఆనందాన్ని అనుభవించు అంటున్నాయి ఈ నిలకడలేని కోరికలు. కానీ అంతరాత్మ ప్రమాదం సుమా అని హెచ్చరిస్తోంది."
"నీ భావం నా కర్ధం కాలేదు."
"నా జీవితానికి ఇంత సౌఖ్యాన్నిస్తున్నావు ఇంకా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నావు. విదివశాత్తు నువ్వు నా తోడు విడనాడితే నేను జీవితంలో ఎదురు దెబ్బలు తిని పతనమైపోతానేమో నని భయంగా ఉంది."
"రాజ్, అటువంటి మాతలానే కన్నా నీ చేతులతో గొంతు నులిమి చంపెయ్యి."
"రజీ!"
"లేకుంటే ఏమిటి? నువ్వు నన్నిలా ఏడిపించడం బాగుందా?"
"మాట వరస కన్నాను. అంతే కాని ఇంకేం లేదు."
"నిజం చెపుతున్నాను. నిన్ను విడిచి బ్రతకడం దుర్భరం . నువ్వు ఎప్పటికి నా హృదయం లో పదిలంగా ఉంటావు. నువ్వు లేనినాడు నాకు ఈ లోకంలో పని లేదు."
"రజీ , నాకు ఈ విశాల ప్రపంచంలో నీ హృదయములో తప్ప ఎక్కడా శాంతి లేదు. పద కొత్త కారు చూద్దాం."
* * * *
"మీసంబంధం వారి కిష్టం లేదటండీ!"
"కారణం?"
"అమ్మాయి నచ్చలేదట."
"మల్లన్నా , నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు."
"క్షమించండి, ఆనందరావు గారూ, వారన్న మాటలు నే చెప్పలేను."
"మల్లన్నా , ఫరవాలేదు చెప్పు."
"అమ్మాయి ప్రవర్తన ఏమీ బాగులేదట. కాలేజీ లో ఆమె ప్రవర్తన గురించి ఎవరో ఆ వరుడికి చెప్పారట. అమ్మాయి నీతి మాలినదని, ఇంకా ఏమేమో అన్నారు లెండి."
బాధగా నిట్టూర్చి చేతులతో తల పట్టుకున్నారు ఆనందరావు గారు.
"క్షమించండి . నేను మాట్లాడిన సంబంధం తప్పిపోవడం ఇది మొదటిసారి. మీగురించి నేను కూడా మాటలు పడవలసి వచ్చింది. చెపితే మీరు కోప పడతారు కానీ మీ అమ్మాయిని ఇప్పటి కైనా మందలించ కుంటే చాల విపరీత పరిస్థితులు సంభవించవచ్చు. ఊళ్ళో ఆమె పై రేగుతున్న పుకార్ల కు అంతు లేదు. ఇక సెలవు. వస్తాను" అని ఆ మల్లన్న ఉరఫ్ పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళిపోయాడు.
'హా! ఎటువంటి ఖర్మం పట్టింది. ఆఖరకు ఒకరి చేత బుద్ది చెప్పించుకునే గతి పట్టిందా! ఊళ్ళో అందరికీ తమ పైనే కన్ను పడిందా! ఇన్ని సంబంధాలు వచ్చాయి. ఒక్కటి స్థిరపడలేదు. అందరూ పలు రకాలుగా తిట్టి వెళ్లి పోయేవారే! ఒక్కరైనా ధైర్యంతో జాలిపడి ముందుకొచ్చి పెళ్లి చేసుకొనేవారే లేదా! తనిలా లోకం చేత ఛీ అనిపించుకుంటూ బ్రతక వలసినదేనా! నేను ఎవరికీ తెలిసి ఏ అన్యాయం చెయ్యలేదు. మరి ఎందుకు తనకీ శిక్ష?"
