Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 34


    "పూలెందుక్కొన్నారు. ఆ డబ్బుతో క్షౌరం చేయించుకోకపోయారా?"
    'సారూ! ఎందుకలా అంటావు? క్షౌరం కూడా అవుతుంది' మాసిన గడ్డాన్ని చేత్తో రుద్దాను. 'అంతేకాదు. నీకోసం ఒక చీర కొనాలనే ప్లానూ ఉంది. ఎంత? మరొక ఏడాది. ఎఫ్.ఏ. పాసవుతాను. ఆ తరువాత బి.ఏ. ఇహ ఎమ్.ఏ. కావడం ఎంతసేపు? అప్పుడు నువ్వు రాణివి' నా జీవిత ప్రణాళిక సాంతం గబగబా ఆమె చెవుల్లో గుమ్మరిస్తుండగానే పిన్ని వచ్చేసింది.
    'వచ్చాడయ్యా చదువుల దొర! దాన్ని పనిచేయనీ', అని సరస్వతిని ఉద్దేశించి "మొనగాడినని నరుకుతున్నాడు. వట్టి అబద్దాలకోరు. మూడేళ్లయింది ఎఫ్.ఏ.లో ఫెయిలవుతూ కష్టం లేకుండా తిండి దొరుకుతుంటే తల ఎందుకు బద్దలు చేసుకుంటాడు" అని తనలో తాను నవ్వింది. సరస్వతి నవ్వలేదు. మల్లెమొగ్గ అందుకుంది. తల్లో పెట్టుకుంది.
    "పూలు నచ్చలేదా?" నా ధ్వనిలో ప్రాణంలేదు.
    ఆమె నవ్వింది. ఒక పూవుతో నన్ను కొట్టింది. పూవు విసిరింది. దాని తాకిడికి నా కోరికల కవాటాలు తెరచుకున్నాయి-విచ్చుకున్నాయి. నా హృదయనౌక ఆనందభారంతో కుంగసాగింది. కోరికలు తీరడంలోనూ భరించరాని వ్యధ వుందని అప్పుడు నాకు అనిపించింది.
    నా చీకటిగదిలో చప్పున వెన్నెల పరచుకుంది. చూరులోని పిచ్చుకలకూ తెలిసిందీ విషయం. అవీ నన్ను అభినందిస్తున్నాయి. వెంటనే "కల్పన" తెరిచాను. ఇలాంటి సమయాల్లో హీరో ఏంచేస్తాడు? షబ్బూ, మున్నూ ఇచ్చే రెండు రూపాయిల ఫీజు దాచశక్యం కావడంలేదు. అందం అయిన బహుమతి ఏమిటది? అర్ధంకావడం లేదు. నిన్నటి సాయంత్రం కంటిముందు కదిలింది. ఒక స్త్రీ పట్టు బ్లవుజు కుట్టించుకోవడానికి వచ్చింది. సరస్వతి పట్టుబట్టమీద తన తెల్లని వేళ్ళను తిప్పుతూంది. ఎంతబావుంది! దీనిమీద్ గుండ్రని అద్దాలు కుడ్తే ఎంతో బావుంటుంది. చాలా ఖరీదు కావచ్చు.
    ఆనాటి సాయంత్రం అదే నల్లని బ్లౌజ్ తనముందు పరచుకొని కూర్చుంది సరస్వతి. నేను అద్దాలు దానిమీద గుమ్మరించాను.
    'ఎంత బావున్నాయి! ఎవరివి?' ఆమె కళ్లు అల్లల్లార్చి అడిగింది. ఆమె కన్నుల్లో అద్దాల మెరుపు నిండిపోయింది.
    'నేనే తెచ్చాను-నీకోసం' నేను ఎగిరి గంతేసి అన్నాను. నా తల నిక్కింది. తలవంచి చూస్తే దీపాలు మలిగాయి.
    కణకణలాడే నిప్పుకణికల్ను ఏరినట్లు ఏరి పక్కకు పెట్టింది. 'ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు? వీటితో నేనేం చేసుకుంటాను?' అన్నది.
    'నల్లని పట్టు బ్లౌజ్ మీద అద్దాలు కుట్టుకో. చుక్కలు నిండిన ఆకాశం కప్పుకున్నట్లుంటావు. నీవు నేలమీద నిలిచిన సరస్వతిలా కాక కాళిదాసు శకుంతలవు అవుతావు.'
    పిన్ని కన్నుకొట్టినప్పుడు పిల్లలు చూచేట్టు చూసింది. అద్దాలన్నీ ఏరి ఒక పొట్లం కట్టింది. లేచి వెళ్లిపోయింది.
    సాయంకాలం ఇంటికి వచ్చాను. పిన్ని లేదు. బయటకు పోయింది. సరస్వతి కనిపించలేదు. పొయ్యిమీది కుండ కనిపించింది. కూర ఉడుకుతూంది. కూర నన్ను పిలిచింది. కాస్త రుచి చూడమన్నది. ఇంకా నేను మూత తీయనే లేదు. సరస్వతి వూడిపడ్డది. అద్దాల ఆనందం ఆమె ముఖంలో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఆమె ఎగురుతూంది. గంతులు వేస్తూంది. గుండ్రంగా తిరుగుతూ వస్తూ ఢీకొన్నది.
    'మీకు సుబ్రహ్మణ్యం కలిశాడా?' ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూంది.
    'సుబ్రహ్మణ్యం! ఎవడా సుబ్రహ్మణ్యం?' నేను గుర్తుతెచ్చుకోవడానికి తంటాలు పడుతున్నాను.
    'వెండి బంగారం వ్యాపారం చేయడూ అతనే - ఇవ్వాళ పిన్ని దగ్గరికి వచ్చాడు.' నేను దొంగనై, నా నుండి వెండి బంగారు రాసులను దాచినట్లు సిగ్గుతో తన శరీరాన్ని చింపుల చీరతో దాచుకోవడానికి ప్రయత్నిస్తూంది.
    'ఏమి! మీరు అతన్ని చూళ్ళేదా? ఇహ మేం అతని కార్లో కూర్చుని వెళ్ళిపోతాం."
    అది విన్నాను. నేను కొయ్యబొమ్మనైనాను. చేతులు సైతం వణకలేదు. వేళ్ళ సందున బీడీ పడిపోలేదు.
    ఆమె అటూ ఇటూ చూచింది. నా దగ్గరికి వచ్చింది. 'వాడు ఏడు చీరలు తెస్తున్నారు. ఏడు నగలు.' వేళ్లు చూపించి చెప్పింది. తరవాత నవ్వింది. పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వింది. తరవాత గిరగిరా తిరిగింది. కట్టెల్లో పడబోయింది. నన్ను పట్టుకుంది. నిలదొక్కుకుంది. "క్షమించు బాబా...." బీడీ గట్టిగా దమ్ములాగుదామనుకున్నాను. అనుకోగానే బీడీ చేయిజారి పడిపోయింది.
    ఆమె కనులు ఆనందాశ్రువుల్లో ఓలలాడుతున్నాయి. అటుచూస్తే ఎవరో "కల్పన"ను కిటికీలోంచి విసిరారు అది వచ్చి నా ముఖానికి తగిలింది. అప్పుడు నేను ఏడవడానికీ, నవ్వడానికీ ప్రయత్నించాను. ఏదీ చేయలేకపోయాను.
    ఏదో విధంగా గదిలోకి చేరాను. నా ముందు ఏ పుస్తకం ఉన్నదీ తెలియదు. ఏం చదువుతున్నానో అర్థం కాదు. అమాంతంగా మల్లెపూల పరిమళం వచ్చింది. ఉలిక్కిపడి చూచాను. ఆమె చేతుల్లో పూలున్నాయి. పూలలా పరిమళం వ్యాపింపచేస్తూ వచ్చింది.
    ఆమె నా చేతిలోంచి పుస్తకం లాక్కుంది. 'నేను వెళ్లిపోతానంటే మీకు దుఃఖంగా ఉంది కదూ!' అన్నది.
    'సరే ఏవైనా మంచి ముచ్చట్లు చెప్పు. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో?'
    నా మౌనాన్ని చూసింది. విసిగింది "మాట్లాడరాదూ?" అన్నది.
    "ఏం మాట్లాడను?" అదే ఆలోచిస్తున్నాను.
    'అబ్బా! నాకు ఎలాంటి రంగులు బావుంటాయో చెప్పండి. డబ్బుకు లెక్కచేయకు అన్నాడు సుబ్రహ్మణ్యం. వారితో చెప్పి మీకూ ఒక కొత్త చొక్కా కుట్టిస్తా'
    'నాకు తేలు కరిచినట్లుంది' అన్నాను.
    'అయ్యోరామా! ఎక్కడ?' అని కాళ్ళూ చేతులూ చూచింది.
    "ఎక్కడో తెలియడం లేదు. ఇదిగో ఈ చేయి, ఇదిగో ఇక్కడ...." శరీరం సాంతం పరుగులు పెడుతున్న బాధను ఒకచోట నిలపడానికి ప్రయత్నించాను.
    "ఆగండి ఉల్లిగడ్డ రసం తెస్తాను" అని ఉరికింది- చీర కుచ్చెళ్లు పట్టుకొని.
    రెండోరోజు తెరిచిన మొసలి నోరులాంటి నల్లని కారు వచ్చింది. సుబ్రహ్మణ్యం దిగాడు. భారమైన దేహం పెరుగుతున్న బొర్ర, ముఖాన ముడుతలు అన్నింటిలోనూ ఒక ఠీవి ఉంది. అతని సూటునుంచి బూటుదాకా అన్నీ మెరుస్తున్నాయి. అతను తళతళా మెరిసే బంగారు ముద్దలా ఉన్నాడు. అణచి దువ్విన అతని తెల్లని వెంట్రుకల అందాన్ని చూచి నల్లని వెంట్రుకలు సిగ్గుపడేట్లున్నాయి. అతను నా గదిలో అడుగుపెడితే సువాసనల వాన కురిసినట్లయింది. లోపలికి వచ్చి మనిషి ముడుచుకుపోయాడు. అతని ముఖం మొత్తం సీసా ఆముదం తాగినట్లయింది.
    అతని మొదటి అడుగు 'కల్పన' మీద పడింది. తరువాత నా దిండును తొక్కాడు. తరువాత రాత్రి బాపతు మల్లెపూలను తొక్కాడు. అన్నీ అతని బూట్ల అడుగులకింద నలిగిపోతున్నాయి. నేను ఒక మూలకు నక్కి వణుకుతున్నాను- నామీదా ఒక అడుగువేసి వెళ్ళిపోతాడా అనిపించింది.
    ఇల్లంతా తలక్రిందులు అవుతూంది. పిన్ని పయ్యద లాక్కొని మెటికలు విరవాలని ఉబలాట పడుతూంది. మడమల మీద లేచినా వాడి భుజాలదాకా ఆమె చేతులు పోలేదు. సరస్వతి పయ్యద సాంతం పంటితో పట్టుకొని, తలవంచి తన ముందున్న చీరలను ఆశ్చర్యంగా చూస్తూంది.
    "బాగా చూడు" సుబ్రహ్మణ్యం చీరల్ని సరస్వతి ముందు పరిచేశాడు.
    "పిచ్చిదానా! కలలో సైతం ఇలాంటి చీరలు చూచి ఉండవు. అచ్చం అమీరులు కట్టే చీరలు" అన్న పిన్నిని చూచి 'నిజం పిన్ని- నీతోడు- అయిదు వందల రూపాయల చీరలు' అన్నాడు.
    ఆ మాట విని సరస్వతి పంటి సందు పయ్యద ఊడిపోయింది. చూపుల్తో సుబ్రహ్మణ్యాన్ని కొలిచింది. తరువాత సిగ్గుపడ్డది చిరునవ్వు నవ్వింది. తేలుకొండిని పట్టినట్లు చీరలు తాకింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS