"అయితే ఇప్పుడేడవండి మొత్తం పోయింది కదా!"
"ఎలా పోతాయో నేనూ చూస్తాను. ఆ కమీషనర్ ని దుమ్ము దులిపేస్తాను. బ్యాంకు వాళ్ళమీద కోర్టులో దావా వేస్తాను. హోం మినిస్టర్ని అసెంబ్లీలో నిలేయిస్తాను" ఆవేశంగా అన్నాడు త్వరత్వరగా రడీ అవుతూ.
* * * *
పోలీస్ స్టేషన్ లో అడుగుపెడుతూనే బిగ్గరగా అరచాడు "ఎవరు- ఇన్ స్పెక్టర్ రాంబాబు ఎవరిక్కడ?"
"ష్- అరవకు- మెల్లగా మాట్లాడు" ఓ కానిస్టేబుల్ దబాయించాడు.
"లోపలికెళ్ళు- ఆ కుర్చీలో కూర్చున్నాయనే ఇన్ స్పెక్టర్ గారు."
లోపలకు నడిచి కుర్చీలో కూర్చుంటూ "ఐ యామ్ కల్నల్ కనకారావ్" అన్నాడు.
"ఓ! వెరీ గ్లాడ్ టు సీయూ కల్నల్."
"నా డైమండ్స్ సంగతేమిటి? ఐ వాంట్ టు స్పీక్ విత్ పోలీస్ కమీషనర్."
"పోలీస్ కమీషనరయినా, మినిస్టరుగారయినా ఏమీ చేయలేరు కల్నల్ గారూ! అల్టిమేట్ గా చేయాల్సింది నేనే- మీరు కోపరేట్ చేస్తే త్వరగా వాళ్ళను బుక్ చేయడానికి వీలవుతుంది."
"ఆల్ రైట్! నేనేం చేయాలి?"
"ఆ రోజు మీరు మీ కుక్కపిల్ల మీదకు జీపు వచ్చినప్పుడు రివాల్వర్ కాల్చారు కదా- ఆ జీపులో వున్న వాళ్ళనెవరినయినా చూశారా?"
"ఎస్! ఒకడు కిందకు దిగి నా కుక్కపిల్లను ఎత్తి అవతల పారేశాడు. వాడిమీద కోపంతోనే రివాల్వర్ కాల్చాను కానీ టైర్ కి తగల్లేదు. మిస్సయిపోయినయ్"
"ఆ కుక్కపిల్లని ఎత్తిపారేసినవాడిని యిప్పుడు చూస్తే గుర్తుపట్టగలరా?"
"ఎస్!"
"అయితే రండి."
ఇద్దరూ వెళ్ళి జైల్లో వున్న విక్కీని చూశారు.
"ఎస్! వీడే- బాస్టర్డ్! నా కుక్కపిల్లని విసిరేసింది వీడే. వీడి వలనే డాని కాలు ఫ్రాక్చరయ్యింది. వీడిని కాల్చిపారేస్తాను" ఆవేశంగా అన్నాడు కల్నల్ రివాల్వర్ తీస్తూ.
"కాల్చిపారేస్తే వజ్రాలు దొరకవు" అన్నాడు రాంబాబు.
కనకారావ్ కూల్ అయిపోయాడు.
"ఇంకా ఆలస్యం ఎందుకు? వాడిని టార్చర్ చేయండి. వజ్రాలు ఎక్కడ దాచాడో బయటపెడతాడు."
"వాడంత తేలిగ్గా బయటపెట్టే రకం కాదు కల్నల్. అదీగాక వాడో పెద్ద లాయర్ని పెట్టుకున్నాడు. వాడికేమయినా గాయం తగిలితే చాలు హాస్పిటల్లో ట్రీట్ మెంట్ అన్న వంకతో చేరి అక్కడి నుండి పారిపోవాలని ప్లాన్"
"అయితే ఏం చేస్తారు మరి?"
"ముందు వాడిని కోర్టులో మీరు గుర్తుపట్టి ఆ రోజు జీప్ లో పారిపోయింది వీడేనని సాక్ష్యం చెప్పాలి. చెప్తే వీడిని మన కస్టడీలో ఎంతకాలం కావాలంటే అంతకాలం వుంచుకోవచ్చు."
"ఓ యస్! పదండి కోర్టుకి"
"కోర్టు ఎప్పుడంటే అప్పుడు మనకోసం తెరచి పెట్టుకోరు! వచ్చేవారం మన కేస్ వస్తుంది. అప్పుడు రావాలి మీరు. ఏ రోజు రావాల్సింది మీకు ఫోన్ చేసి చెప్తాను."
"ఓకే!"
కల్నల్ వచ్చేశాడు.
* * * *
చంద్రకాంత్ భార్య అష్టలక్ష్మి మధ్యాహ్నం తీరిగ్గా ఆ ల్యాప్ టాప్ తీసుకెళ్ళి అందులో మెయిల్ పక్కింటి సుజాతకు చూపించింది.
"ఇది ఎవరి దగ్గర్నుండి వచ్చిందో, అందులో ఏమి రాసి వుందో అన్నీ చెప్పు?" అంది ఆత్రుతగా.
సుజాత చకచకా చదివింది.
ఆమెకు కాపురాలు చెడగొట్టేయడం హాబీ. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఆమె ఒక్కర్తే ఇంగ్లీషు తెలిసిన కేండిడేట్ అవటం వల్ల అందరూ రకరకాల ఉత్తరాలు, డాక్యుమెంట్లు, విల్లులు అన్నీ తెచ్చి చదివించుకుంటుంటారు.
అలాంటి సందర్భాల్లో ఆమె అక్కడ రాసున్న దానికంటే కొంచెం ఎక్కువ కలిపి వాళ్ల సంసారాల్లో వీలయినంత పెద్ద చిచ్చు పెట్టేయడానికి ప్రయత్నిస్తూంటుంది.
మొగుడూ పెళ్ళాలు ఆవిడ వలన కొట్టుకుని రోడ్డున పడటం, సంసారాలు ముక్కలయిపోవడం, కాపురాలు వేరుపడిపోవడం చూస్తే ఆమెకి ఎక్కడలేని ఆనందంగా వుంటుంది.
అందుకని ఆ మెయిల్ మేటర్ చదువుతూనే తన మషాలా కలిపి తెలుగులో చెప్పటం మొదలెట్టింది.
"అయ్యో-అయ్యో! అదెవత్తో ఎంత సిగ్గు విడిచి ఏం రాసిందో చూశావా?"
"ఏం రాసిందక్కా?"
"ఇంకేం రాస్తుందే పిచ్చి ముఖమా? నువ్వట్లా అడ్డగాడిదలాగా మీ ఆయన్ని నమ్ముతూండు- ఏదొకరోజు నిన్ను గెంతి, ఎవత్తెనో తెచ్చుకుని సెటిలైపోతాడు."
అష్టలక్ష్మి కన్నీరొత్తుకుంది.
"నాకు మొదటి నుంచీ అనుమానమేనే అక్కా! ఆ శంకర్రావ్ యాదగిరి ఎప్పటికప్పుడు చెప్తూనే వున్నారు. చంద్రకాంత్ సార్ ఇవాళ ఒకామెతో హోటల్లో లంచ్ చేస్తుంటే చూశాం. ఆటోలో బయటకొచ్చి కార్లో దిగుతూంటే చూశాం. లాడ్జింగ్ లో నుంచి ఒకావిడతో బయటకొచ్చి కార్లో వెళుతూంటే చూశాం అంటూ...
"ఇంతకూ ఇందులో ఏం ఉందక్కా?"
"అదెవత్తో సీతాగోపాల్రావ్ అని- గోపాల్రావు అనే వాడి పెళ్ళాం సిగ్గు విడిచి, బరితెగించి ఏం రాసిందో తెలుసా?"
"ఏం రాసిందక్కా?"
"అర్జంటుగా వున్నపళాన వచ్చెయ్. మా ఆయన లేనప్పుడు వస్తే స్వర్గ సుఖాలు అనుభవిద్దాం విరహంతో చచ్చిపోతున్నాను. రా, కదలిరా, మన్మథదేశం నిన్ను పిలుస్తోంది. రా-ఇట్లు నీ సయ్యాటల సీత."
"ఓర్నాయనో! ఈ మనిషి అందుకనే ఇవాళ సెంట్ తెగ రాసుకెళ్ళాడు నాకప్పుడే అనుమానం వచ్చేసింది."
"ఇదిగో అష్టలక్ష్మీ! నువ్విలా వూరుకుంటే లాభం లేదు. వెంటనే చీరకొంగు బిగించు. సిటీ బండెక్కు- హైద్రాబాద్ లో ఈ సీతా గోపాల్రావ్ ఇంటికెళ్ళి గొడవ చెయ్. దాన్ని వీధిలోకీడ్చెయ్. నలుగురినీ పోగెయ్- ఈ మెయిల్ గురించి చెప్పు వీలయితే డాని మొగుడు ఆ గోపాల్రావుని కూడా జాడించు."
"అంతేనంటావా అక్కా!"
"లేకపోతే సంసారం కూలిపోతుందే పిచ్చిదానా! ఆ తర్వాత నువ్వింకెవడి నయినా చూసుకుని వాడితో సయ్యాటలు మొదలుపెట్టు. ఆ సంగతి మీ ఆయనకు తెలిసేట్లు చేసి అప్పుడు బెదిరించు. సిటీలో నువ్వు వెధవ్వేషాలు వేస్తున్నావు గనుక నా యిష్టమొచ్చినోడితో గడిపే హక్కు నాకుందను"
"అమ్మో! అలా చేస్తే నన్ను గెంటేస్తాడేమో!"
