"ఏడ్చాడు! గెంటితే పోలీస్ రిపోర్ట్ ఇద్దువుగాని - కట్న కానుకలు తెమ్మని వేధిస్తున్నాడని ఒక్క లెటర్ రాసిస్తే చాలు- ముందు మీ ఆయన్ని మూసేస్తారు."
"సరే అక్కా! ముందు హైద్రాబాద్ వెళ్ళి దాని సంగతి తేల్చుకుని వస్తా-దాని అడ్రస్ ఓ కాగితం మీద రాసివ్వు."
సుజాత అడ్రస్ రాసిచ్చింది.
అష్టలక్ష్మి అప్పటికప్పుడే బయల్దేరి రైల్వేస్టేషన్ చేరుకుంది.
* * * *
"చంద్రకాంత్ గారూ!" హడావుడిగా చంద్రకాంత్ గదిలోకొచ్చేసింది పూజ.
"హలో పూజాజీ! ఎనీ ఇంప్రూవ్ మెంట్?"
"చూశారా! అప్పుడే నవల తాలూకూ ఓ చాప్టర్ రాసేశాను."
"ఒండర్ ఫుల్! నాకు తెలుసు మీలో రచయిత్రి లక్షణాలు క్రిక్కిరిసిపోయి వున్నాయని."
"చదివి వినిపించమంటారా?" ఉత్సాహంగా అడిగింది.
"ఏమాత్రం ఆలస్యం చేయకుండా...."
ఆమె చదవటం ప్రారంభించింది.
"శైలేష అభిలాష్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లోని ఆకర్షణ అభిలాష్ ని చిత్తు చేసింది. అమాంతం ఆమెని కౌగలించుకుని తనలో ఐక్యం చేసేసుకున్నాడు"
"అద్భుతం పూజాజీ! ఇతర రచయితలూ, రచయిత్రులూ ఒకే దృశ్యాన్ని ఎంత సెక్సాత్మకంగా వర్ణిస్తారో, ఎంత సెక్స్ ప్లాయిటేషన్ చేస్తారో నాకు తెలుసు. కానీ మీరు బ్రహ్మాండమయిన డీసెన్సీ మెయింటైన్ చేసి అదే అర్థం తీసుకొచ్చారు."
పూజ ఆనందంతో పొంగిపోయింది.
"అంటే నేను ఫస్ట్ ఎటెంస్ట్ లోనే సరిగ్గా రాశానంటారా?"
"తిరుగులేకుండా రాశారు."
"ఇంకేం మార్పులు అవసరంలేదంటారా?"
"చాలా చిన్న మార్పులు చేయాలి."
"ఏమిటవి?"
"హీరో హీరోయిన్ ఒక విచిత్రమయిన పరిస్థితిలో కలుసుకున్నారన్నారు కదా?"
"అవును."
"అనుకోకుండా వారి మధ్య రొమాన్స్ అంత ఫాస్ట్ గా డెవలప్ అవకూడదు."
"అంటే- ఎలా డెవలప్ అవ్వాలి?"
"అదే చెప్పబోతున్నా- ఉదాహరణకు ఆ హీరో, హీరోయిన్ మనమే అనుకోండి."
"మనమా?" ఎగ్జయిట్ మెంట్ తో అంది.
"మీకేమైనా అభ్యంతరమా?"
"నో నో! మీ దగ్గర నేర్చుకునే అవకాశం ఇవ్వటమే గొప్ప నాకు."
"ఆల్ రైట్! హీరోయిన్, హీరో కళ్ళల్లోకి చూసిందని రాశారనుకోండి- అది ఓకే! ఆ తర్వాత హీరోయిన్ కళ్ళల్లోని ఆకర్షణ హీరోని మంత్రముగ్ధుడిని చేసిందని రాస్తే సరిపోతుంది."
"మరి రొమాన్స్"
"అక్కడికే వస్తున్నాం. కానీ సడెన్ గా ఐక్యమైపోయారని రాయకూడదు."
"మరెలా రాయాలి?"
"ముందు మీరు ఇంకొంచెం దగ్గరకు రండి."
పూజ అతనికి సమీపంగా జరిగింది.
"ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడండి."
పూజ అతని కళ్ళల్లోకి చూసింది.
"ఇలా నా కళ్ళల్లోకి ఎందుకు చూస్తున్నట్లు మీరు సడెన్ గా?"
"రొమాన్స్ అన్నాక ఎక్కడో చోట స్టార్టవాలి కదా మరి?"
"అవ్వాలిగానీ, అది అసహజంగా వుండకూడదు."
"సహజంగా వుండాలంటే ఎలా రాయాలి?"
"నా కళ్ళల్లోకి చూసేముందు ఓ చిన్న సంఘటన జరిగి వుండాలి."
"ఉదాహరణకి..."
"ఉదాహరణకి'- అదిగో అ పెన్ నాకు ఇవ్వబోయారనుకోండి మీరు..."
ఆమె పెన్ తీసుకుని అతని కందించింది.
ఆమె చేతిలోని పెన్ బదులు ఆమె చేతిని అందుకుని పెదాలకు హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు భవానీశంకర్.
పూజ ఆశ్చర్యంగా అతనివేపు చూసింది.
"చూశారా! ఇప్పుడు మీరు నా కళ్ళల్లోకి చూడటం సహజం- ఎందుకంటే మీరు ఊహించని చర్యకు నేను పాల్పడ్డాను కాబట్టి- అంటే పెన్ కు బదులు, మీ చేయి పట్టుకున్నాను కాబట్టి మీరు ఆశ్చర్యంగా నా కళ్ళల్లోకి చూశారు.
కనీ నేను చేయి వదలకుండా ఇంకోచేత్తో మిమ్మల్ని కౌగిట్లోకి తీసుకున్నాను"
అంటూ పూజని నిజంగా తన కౌగిట్లోకి లాక్కున్నాడు భవానీశంకర్.
పూజ వళ్ళంతా అతని వేడి స్పర్శకు గగుర్పొడిచింది.
అకస్మాత్తుగా శరీరంలో విద్యుత్ ప్రవహిస్తున్న ఫీలింగ్.
అతని రెండోచేయి ఆమె నడుముని బలంగా చుట్టేసరికి పూజ మరింత గాఢంగా అతనికి హత్తుకుపోయింది.
"ఇప్పుడేం రాయాలి?" వణుకుతోన్న గొంతుతో అడిగింది.
"హీరో ఇప్పుడు ఆమె కళ్ళల్లోని ఆకర్షణా శక్తికి తుఫానుగాలిలోని తీగ మొక్కలా గిలగిల కొట్టుకున్నాడు. విచ్చుకున్న ఆమె పెదాలను తన పెదాలతో మూసివేశాడు."
అంటూ పూజ పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
పూజ శరీరం ఒక్కసారిగా భగ్గుమన్నట్లయింది.
అతని తలను తన రెండు చేతులతో పెనవేసుకుని తనలో ఐక్యం అయిపోవడానికి ప్రయత్నించసాగింది.
కాలం కొద్ది క్షణాలు స్థంభించిపోయింది. ముందు భవానీశంకరే స్పృహలో కొచ్చాడు.
"చంద్రకాంత్!" మత్తుగా పిలిచింది పూజ.
"ఎస్ డియర్!"
"నన్ను నిజంగా లైక్ చేస్తున్నారా?"
"ఇంకెవ్వరినీ లైక్ చేయలేనంత ఎక్కువగా."
"నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారా?"
"ఎప్పటికీ తరగనంత మిక్కుటమైన ప్రేమ."
"నన్ను... నన్ను.... పెళ్ళి చేసుకోవటం మీకిష్టమేనా?"
"ఈ ప్రశ్న నేనడగాలి పూజాజీ."
"చంద్రకాంత్! నేను మిమ్మల్ని మీ మొదటి నవల చదివినప్పుడే ప్రేమించాను. మీ టీవీ సీరియల్ చూడగానే మిమ్మల్నే పెళ్ళి చేసుకోవాలనుకున్నా! అప్పట్నుంచీ మిమ్మల్ని కనీసం కొద్ది క్షణాలయినా కలుసుకుని మీతో ఏకాంతంగా గడపాలని, కొద్ది నిమిషాల కోసమయినా మీ కౌగిట్లో ఇమిడిపోవాలనీ ఎన్నో కలలు కన్నాను. కానీ కలలన్నీ ఇలా నిజమయిపోతాయనుకోలేదు."
"థాంక్యూ పూజా! నేనూ మీలాంటి అందగత్తెను పెళ్ళిచేసుకోగలనని వూహించలేకపోయాను.
"మీరింతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు చంద్రకాంత్?"
"ఎందుకేముంది? మీరు కనిపించింది ఇప్పుడు కదా!"
ఇద్దరూ నవ్వుకున్నారు.


