Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 34


    'జన్మం రజ్జు సర్పభ్రాంతి వంటిది. దారు పురుష భ్రాంతి, ఎండమావులు నీరను భ్రాంతి. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు చంపుకోవాలి. లేకపోతే ఎరుకలోబడి తనబిడ్డ, తనమగడు, తనఇల్లు తన నగలు, తన సంసారము అని జీవుడు భ్రమించి పుట్టుటా గిట్టుటా అనే మాయలోబడి, మూత్ర పురీషాదుల్లో దొర్లి, అచలతత్వం గ్రహించలేక, ముక్తి పొందలేక ఉంటుంది. శుద్ధనిర్గుణమైన అచలతత్వం గ్రహించాలి. పంచాక్షరి జపిస్తూ ఉండాలి' అని లక్ష్మీనరసమ్మగారు శిష్యురాండ్రకు బోధించుచుండును.
    ఆమెకు బంచీకరణము కంఠస్థము. పండ్రెండు రాజులకథలు, ఇంద్రజాలపు గథలు క్షుణ్ణముగా వచ్చును. సీతారామాంజనేయము మంచినీళ్ళ ప్రాయము, శుద్ధనిర్గుణతత్త్వ కందార్దదరువులు ఎల్లప్పుడూ పాడుకొనుచునే యుండును.
    శారద కివియన్నియు పల్లెటూరి గొడవలని తోచినది. తనతల్లికెప్పుడిట్టి ఛాందసములు లేవు. పట్టణవాసస్థులు వచ్చి పల్లెటూళ్లలో నెట్లు జీవింపగలరో యని యామె తలపోసినది. అత్తవారింటి కథలన్నియు దల్లితో మేనత్తతో దనయింట నున్న యితర స్త్రీలతో జెప్పి నవ్వించినది.
    అత్తగారు వెడలిపోయిన నాలుగురోజులలో శారద యుక్తవయస్కురాలైనది. జమీందారుగారింట మూడురోజులుత్సవములు విందులు జరిగినవి. దినదినము పేరంట్రాండ్రు విచ్చేసినారు. పంచదారతో జిమ్మిలిగొట్టి పంచినారు. బ్యాండుమేళము వచ్చినది. పంక్తినాడు సూర్యకాంతము, మాణిక్యాంబ జమీందారు గారింటికి వచ్చి పంక్తిజరిపి వెలగల బహుమతులు, చీనిచీనాంబరముల నిచ్చి వెడలిపోయిరి. నగరమునందున్నవారి నెందరినో స్త్రీ పురుషులను భోజనములకు బిలిచినారు.
    నవనాగరికుడై వీరేశలింగాఖ్యుని ప్రియశిష్యుడైన జమీందారుగారు నేడు పల్లెటూరివారితో వియ్యమంది ఛాందసపు పూర్వాచార పిశాచగ్రస్తులైనారని పలువురు విచారించిరి.
    యజ్ఞోపవీతముగూడ దీసివేసి అనుష్టానిక బ్రహ్మసామాజికుడైన శ్రీనివాసరావుగారు మిత్రుని జూచి 'ఆడపిల్లకీడురావడమనేది శరీరంలో జరిగే ఒక మార్పుకు చిహ్నం. దానిని లోకానికి టాంటాంజేయడమంత మొరకుదనం ఇంకోటుందా' యని ప్రశ్నించిరి.
    'అది నాకు ఇష్టంలేదు కాని, అది మొరకుతనమని మనం గ్రహించింది పాశ్చాత్యుల సంపర్కం చేతనేనా! మనవాళ్ళ పూర్వాచారాలు అనేకం ఈనాటికి మూఢత్వము అని అనుకుంటున్నాము. ఇదివరదాకా మోటుతనము అని అనుకునేవి నేడు నాజూకువి అయ్యాయి. మనవాళ్లు స్త్రీ, పురుష సంబంధ విషయములయిన చర్యలన్నీ వెల్లడిగా ఉంచారా లేదా!'
    'అదేగా నేను పనికిరాదు అనేది!'
    'ఉండవోయ్! కాని ఇప్పుడింగ్లీషువాళ్ళు ఆడవాళ్ళ మోకాళ్ళపైకి గౌన్లు తొడిగి వక్షోజములు సగం కనపడేటట్టుగా కట్టి తిరగడము, బట్ట ఉందా లేదా అన్నట్లుగా లంగోటీలు కట్టి మగవాళ్ళతో ఈతలీదడము, ఈ రకముగా ఉన్నారు. వాళ్ళను బట్టి మనవాళ్ళు కూడా దుస్తులు అనుకరిస్తున్నారు. కాని అటువంటి దుస్తులు ధరించిన ఆడవాళ్ళను కౌగలించుకొని వందలకొలది జట్టులుగా నాట్యమాడుతూ తిరిగే పురుషులు, స్త్రీలదగ్గిర స్త్రీ రహస్య విషయాల్ని సూచనగానైనా అనకూడదు. డాక్టర్లు మాత్రం వచ్చి రహస్యాలు మాట్లాడవచ్చును. మొగవాళ్ళే పురుళ్ళు బోయవచ్చును. మనవాళ్లో? కాస్త ఒళ్లు కనబడితే సిగ్గులేని రట్టుమనిషి అంటారు. ఆడ డాక్టర్లు తప్ప ఎవ్వరూ రహస్యభాగాలు పరీక్ష చేయగూడదు. విడిగా మగవానితో ఉండకూడదు. స్నానాలకు కూడా గోదావరిలో పురుషులుండగూడదు. కాని సమర్తలని గర్బాదానాలని ఉత్సవాలు చేస్తారు. ఇదంతా నీ దృష్టిపథంలో ఉంది. ఒకటి మొరకుతనం, ఒకటి నాజూకుతనం అని వాటి నుదుటిమీద రాసిలేదోయి శ్రీనివాసు!'
    'అలాగా?'

                         అమెరికా యాత్ర

    రామచంద్రరావు జపాను చేరుకున్నాడు. జపాను దేశములో నొక నెల యాగి, యాదేశమునందున్న వింతలన్నియు దిలకించి, యానందించి మఱి యమెరికా వెళ్ళవలెనని సంకల్పము. రంగూనులో నుండగానే అతడు జపాను వెళ్ళుటకు, అమెరికా వెళ్ళుటకు నారాయణరావు చేసిన కృషి వల్ల 'అనుమతి పత్రములు' రంగూనులో నున్న ఆంధ్రులలో గొప్ప షాహుకారగు పుల్లంరెడ్డిగా రిప్పించినారు.
    రామచంద్రరావు తండ్రి భీమరాజుగారి స్నేహితుడగు అమరచందు గిరిధారిలాలను గుజరాతీ వర్తకుడు రామచంద్రరావోడ దిగుటతోడనే యెదుర్కొని యాతని తన ఇంటికి తీసుకొనిపోయెను. గిరిధారిలాలుకు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాను, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లండు, రష్యా, చైనా మొదలగు దేశములతో వర్తకసంబంధమున్నది. అతడు వివిధ దేశములకు జాలసారులు ప్రయాణము చేసియున్నాడు. కాబట్టి ఆయన మనస్సులో రామచంద్రుని వెనుకకు బొమ్మని చెప్పుట కిష్టము లేకుండెను. అయినను మిత్రునియాదేశము చొప్పన రామచంద్రుని జూచి భోజనమైన వెనుకనిట్లనెను. 'రామచందర్! మీకు ముక్కుపచ్చలారింది లేదు. మీరు చిన్నవాళ్లు! దేశం కొత్తది. చాలా మాయకోరులుంటారు. మీరు ఎనక్కిపోయి కాశీలో లక్నోలో కలకత్తాలో చదవవచ్చును కదండీ? అక్కడ కూడా చాలా ఎక్కువ చదువు చెప్తారు కదా?'
    'మీకూ, మా తండ్రిగారికీ ఉండే స్నేహాన్నిబట్టి అలా చెప్తారు కాని, నా మనస్సు నిశ్చయం అయిపోయింది. ఇంక ఎంతమాత్రము నా సంకల్పము మార్చుకోలేను, మార్చను. మీరు పెద్దలు, నా తండ్రితో సమానులు. మీరు చెప్పడం, నేను వద్దనడం బాగుండదు.'
    'సరే! సరే! మీ యిష్టం, పర్వాలేదు. నేను అంతా జాగ్రత్త కనుక్కుంటాను. మా చుట్టం ఒకాయన లాల్ చంద్ జీవన్ లాలు న్యూయార్కు పట్నములో మకాం. ఆయనకు ఉత్తరం రాస్తా. మీకూ ఒక ఉత్తరం ఇస్తాం.'
    'చిత్తం. మీ మేలు ఎప్పటికీ మరిచిపోను.'
    'మీ నాయనగారు నాకు, మీకు ఇవ్వమని, డబ్బుపంపినారు. అది మీకు ఇస్తాను. జాగ్రత్తగా ఉండండి. చాలా చిన్నవాళ్ళు.'
    మరునాడు పుల్లంరెడ్డిగారు అమృతలాలు గారి హర్మ్యమునకు విచ్చేసి రామచంద్రుని గూర్చి వాకబు చేసెను. పుల్లంరెడ్డిగారు, అమృతలాలుగారు చాలా కాలము నుండి స్నేహితులు, ఒకరన్న నొకరికి గౌరవము.
    పుల్లంరెడ్డిగారు అమలాపురం తాలూకా పేరూరు గ్రామవాసులు. చిన్నతనములో కూలికై రంగూను పట్నము వచ్చి సహజమేధాసంపన్నుడగుటచే త్వరలో మేస్త్రీ అయి, ధనము నిలువచేసికొనెను. తాను గూలికి కుదిరిన గుజరాతీ షాహుకారాక వ్యాపారమునకై తన్ను సింగపూరు పంపినప్పుడు, పుల్లంరెడ్డి తనకాడనున్న ధనమునంతయు నొడ్డి స్వయముగా వ్యాపారము చేసి సింగపూరు నుండు వచ్చులోపల నిరువదియైదువేలు లాభము నొందెను. తన షాహుకారు పనిగూడ చాలా శ్రద్ధమై, లాభకరముగ నెరవేర్చి రంగూను వచ్చివేసెను. చదువురాని పుల్లన్న అంతటనుండి పుల్లంరెడ్డియై, షాహుకారు తనకొక యణా భాగమీయ, నాయన వర్తకములో భాగస్వామియయ్యెను. నాటి నుండియు పుల్లంరెడ్డి పట్టినది బంగారమై, యతని ధనము నాలుగు లక్షల వరకు బెరిగినది. నలుబదవయేట తన షాహుకారనుమతీయదాను వేరుగా వ్యాపారము చేసి పదియేళ్లలో నిరువదిలక్షల సంసారియు, 'రావుబహదూరు' నై పాశ్చాత్యులచే 'పులియన్ రెడ్డి' యని వాకొనబడుచు, దానకర్ణుడై రంగూను నాగేశ్వరరాయుడని ప్రఖ్యాతి వహించినాడు.
    రంగూన్ లో నాంధ్రులందరును గూలిచేయువారలే. కొంతమందిమాత్రముద్యోగములు చేయుచుండిరి. వర్తకము చేయువారు మరియు తక్కువ. వారిలో గొలదిమందియే భాగ్యవంతులు. రంగూన్, మోల్ మేన్ మొదలగు ప్రదేశములలో నెక్కువగాను, దక్కిన దేశమునం దచ్చటచ్చట చాలదక్కువ గాను, ఆంధ్రులు బర్మా దేశమునకు వలసపోయినారు. సముద్రములు దాటి, దూర దేశములకు వర్తక మొనర్చుటకు, మత ప్రచారమునకు, రాజ్యస్థాపనకు పోయిన తొల్లిటి మనయాంధ్రుల సాహసోత్సాహముల దలంచుకొని, నేటి మన భీరుత్వమును అలసతను, పురుషార్ధ శూన్యతను చూచుకొన్నచో సిగ్గగునుగదా! నేటికిని పొట్టలు చేతబట్టుకొని బర్మా, నేపాలు, మలేద్వీపము, అస్సాములకు బోవుచున్న కూలీలు తక్క మనలో పురుషకారపరులు కానరారు. బర్మాలో తెలంగులను నొక జాతి వారున్నారట. వారే పల్లవుల కాలములోనో, చాళుక్యుల కాలములోనో, లేక కాకతీయుల కాలములోనో ఆ సువర్ణ ద్వీపము జేరియుందురు. తన పదియవ యేటనే ఆంధ్రుల చరిత్ర చదివి వినిపించుకొనియున్న పుల్లంరెడ్డిగారు, రామచంద్రరావు సాహసమునకెంతయు మెచ్చుకొనిరి. రెడ్డిగారు నలువదియవ యేట చదువను, వ్రాయను నేర్చుకొన్నారు. అయినను తనకు భారత రామాయణాదులగు పూర్వకాలపు టాంధ్రగ్రంథములను, ఆంధ్రులచరిత్ర మొదలగు నూతనయుగపు గ్రంథములను జదివి వినిపించుటకు విద్యాధికు నొకని నేర్పరచుకొన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS