సర్వాధికారి పాలెస్ లో అదే విషయం మీద చర్చ జరుగుతోంది.
"ప్రజల కష్టాలు తీర్చడానికిగాను ప్రభుత్వాలు వుండేవి. ప్రజలకు ఆశలు కల్పించడానికీ, బుజ్జగించడానికీ, అది సాధ్యం కాకపోతే భయపెట్టడానికీ మాత్రమే ప్రభుత్వాలు వుంటాయి. అందుకని ఎప్పటికప్పుడు ఏదో ఒక జనాకర్షణ పథకం కావాలి! మనకి ఏమిటి?" అన్నాడు సర్వాధికారి.
"పేదరికాన్ని పారదోలడం, కులాల పేరిట రిజర్వేషను, చౌకబియ్యం, మద్యనిషేధం, వగైరాలన్నీ కొన్నేళ్ళపాటు పని చేశాయి. తర్వాత మూలబడ్డాయి. ఇప్పుడు కొత్త జనాకర్షక పథకం ఏది పెట్టినా ఖర్చులేనిదై వుండాలి" అన్నాడు సర్వాధికారి కొడుకు మదన్.
"కులాలని చీల్చడానికి వీలవదా?" అంది సర్వాధికారి భార్య చతుర సాలోచనగా.
వింటున్న గంభీర్ అన్నాడు.
"కులాలని ఇప్పటికే నేతలు ఎంతగా విభజించారంటే అవి సూక్ష్మమైన అణువుల స్థితికి వచ్చేశాయన్నమాట. అణువుని కూడా విభజిస్తే... తెలుసుగా ఏమవుతుందో... ఆటంబాంబుని పేల్చినట్టే! అన్నాడు.
సర్వాధికారి అసహనంగా అతన్ని కట్ చేశాడు.
"అదంతా అలా వుంచండి. ప్రభుత్వోద్యోగులకి ఈ నెల జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవు. ముందు ఈ గండం గడవాలి" అన్నాడు.
"కొత్త పన్నులు వేస్తే?" అంది చతుర.
"అవును! పెళ్ళిళ్ళ మీద పన్ను వెయ్యవచ్చు. అలాంటి పన్ను విజయనగరం రాజుల టైంలో వుండేదిట. మంచి ఆదాయం" అంది సర్వాధికారి కూతురు కామిని.
"ఇంకా కొత్త పన్నులు కట్టే స్థితిలో ప్రజలు వున్నారనుకోను" అన్నాడు గంభీర్.
"అలా కుదరకపోతే ఎక్కణ్ణుంచన్నా అప్పు తేవాలి." అన్నాడు మదన్.
గంభీర్ అన్నాడు. "నెదర్ లాండ్స్ లాంటి చిన్న దేశాల దగ్గర నుంచి కూడా దొరికినంత అప్పుచేసింది ఇండియా. మన మురికి కాలువలు శుభ్రం చెయ్యడానికీ, చివరికి హుస్సేన్ సాగర్ ని క్లీన్ చేయడానికి కూడా చిన్న చిన్న దేశాల నుంచి దానాలు పట్టాం. ఇంక ఎవరూ మనకి అప్పుగానీ, ధర్మంగానీ ఇస్తారనుకోను" అన్నాడు.
"అయితే యూనివర్శల్ బ్యాంక్ వాళ్ళ కాళ్ళమీద పడడం తప్ప గత్యంతరం లేదా?" అన్నాడు సర్వాధికారి.
సరిగ్గా అదే టైంలో -
ఫోన్ రింగ్ అయింది.
"హలో?" అన్నాడు సర్వాధికారి చిరాగ్గా.
"హలో! సర్వాధికారీ...నేను...అన్వేషి...గుడ్ న్యూస్...తెలుసా? నేను యూనివర్శల్ బ్యాంక్ కి ఆర్డనరీ అడ్వయిజర్ గా అపాయింట్ అయ్యాను" అన్నాడు అన్వేషి ఆనందంగా.
* * * *
ఎక్కడో వున్న ప్రగతి భావాలు తనకి "వినబడుతున్నాయి" గానీ, తన మనసులో మెదులుతున్న భావాలు మాత్రం ప్రగతికి చేరడం లేదని నిర్ధారణ కావడానికి సాహస్ కి ఎంతోసేపు పట్టలేదు.
ప్రగతి భావాలు తనకి చేరుతూ, తన భావాలు ప్రగతికి "ప్రసారం" అవుతూ వుంటే, ఇంక ఎంత దూరంలో ఉన్నా కూడా ఆమెతో టెలిఫోన్ లో మాట్లాడినంత సులభంగా కాంటాక్ట్ పెట్టుకోవచ్చు కదా!
కానీ -
కేవలం తనకి మాత్రమే ఆమె భావాలు అర్థం అవుతున్నాయంటే, తను ఊహించినట్లు ఇది తప్పకుండా ఈ స్థలప్రభావమే అయి వుండాలి!
దానికి తోడుగా -
తన శరీరం మొదటినుంచీ కూడా నిరంతర యోగాభ్యాసం వల్లా, ధ్యానం వగైరాల వల్లా కూడా అనుకోకుండానే మంచి "రేడియో రిసీవింగ్ సెట్" లాగా మారి వుండవచ్చు.
మరి ఈ లైన్ కి అవతల ఉన్న ప్రగతి పరిస్థితి ఏమిటో తనకి తెలియదు కదా!
నిజంగా కాంటాక్ట్ ఏర్పడగలిగితే...
"ప్రగతీ!" అనుకున్నాడు ఆర్తిగా.
అతని మనసుకి ప్రగతి గొంతు వినబడుతూనే వుంది.
"సాహస్...సాహస్...సాహస్..."
అతను అలా ఆలోచిస్తూ ఉండగానే
వాళ్ళు నిలబడి వున్న ఆ చిన్న గుహలాంటి దాని పైభాగంలో ఏదో గందరగోళం జరుగుతున్నట్టు శబ్దాలు వినబడడం మొదలెట్టాయి.
ఆదిశేషులాగా బ్రహ్మాండమైన పరిమాణం గలదేదో జరజర పాకుతున్నట్టు భ్రమ!
ఒక్కసారిగా దుమ్మూ మట్టీ వాళ్ళమీద పడడం మొదలయింది. క్షణాలలోనే వాళ్ళ పాదాలు ఆ మట్టిలో కూరుకుపోయాయి.
"అయ్యో! ఏమిటిదీ?" అన్నాడు అంకుష్ ఆదుర్దాగా.
అతనిమాట పూర్తి అయ్యేలోపలే, ఒక పెద్ద బండ అతివేగంగా జారుతూ వచ్చి సరిగ్గా ఆ గుహ ముఖద్వారానికి దగ్గరగా వచ్చి, ద్వారాన్ని మూసేస్తూ ఆగింది.
