శ్రీహర్ష అవాక్కయినట్లు చూస్తూ నిలబడిపోయాడు.
"నాకే యెదురు చెబుతున్నావురా రాస్కెల్? దొంగెవరో, దొరెవరో నేను కనిపెట్టలేననుకున్నావా? వెంటనే యిక్కణ్ణుంచి వెళ్ళిపోతావా? లేకపోతే కొట్లో పడేసి చితగ్గొట్టెయ్యమంటావా?"
శ్రీహర్ష నిస్సహాయంగా చూసి చేసేదిలేక అక్కణ్ణుంచి కదిలాడు.
9
అతని గదికి చేరకముందే విలాస్ తన సామాను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు.
ఆ రాత్రంతా శ్రీహర్షకు నిద్రపట్టలేదు. యేదో ఆవేశం, సాధించాలన్న పట్టుదల. వర్ష మీద జరగబోయిన అత్యాచారం అతనికి ఆరాటం కలగజేయగా ఆ ఆరాటం లోంచి అతను కొన్ని రోజులుగా జోగినుల గురించి పడుతున్న తపన వెయ్యింతలుగా ఉత్పన్నమయింది. తెల్లవార్లూ మేలుకుని ఉండి ఈ దురాచారాన్ని రూపుమాపమని కోరుతూ వివిధ సేవాసంస్థలకూ, ముఖ్యమంత్రికీ, గవర్నర్ కూ, ఇంకా ప్రతిపక్షాలలోని కొందరు ప్రముఖులకూ ఉత్తరాలు రాశాడు. మర్నాడు ఆ ఉత్తరాలన్నీ పోస్ట్ చేసేశాడు.
'జోగిని' దురాచారం గురించీ, డాని పుట్టు పూర్వోత్తరాల గురించీ సమాచారం సేకరించటానికి ఎంతో శ్రమించాడు. ఎవర్నడిగినా వివరాలు సరిగ్గా చెప్పలేకపోయారు. ఎప్పట్నుంచి ఉన్నదో, ఎన్ని వందల సంవత్సరాలనుంచి మహమ్మారిలా ఈ జాతిని పట్టుకుని పీడిస్తున్నదో తెలీదు. దానికి చరిత్ర, మూలాధారాలంటూ ఏమీ లేవు. బరంపురంలో జోగులాంబ దేవాలయం ఒకటుంది. అక్కడి విగ్రహం స్త్రీ మర్మావయవం రూపంలో ఉంటుంది. అంతకుమించి అక్కడ వేరే విగ్రహాలు లేవు. మర్మావయవ రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని కరువు కాటకాలు వచ్చినప్పుడు, తీవ్రమైన వ్యాధులు ప్రబలినప్పుడూ, వరదలూ, తుఫానులూ వచ్చి తీవ్రమైన దుర్భిక్ష మేర్పడినప్పుడూ, స్త్రీ పురుషులు సంయుక్తంగా కొలిచి ప్రార్థనలు చేసేవారు. అది క్రమంగా పద్ధతులు మారుతూ వచ్చి స్త్రీ పురుషుల కలయితే ఓ ప్రార్థనా కార్యక్రమంగా పరివర్తనం చెందింది. కాలం గడిచినకొద్దీ అది యింకా రూపాంతరాలు చెంది జోగులాంబలోంచి 'జోగిని' పదం పుట్టి చివరకు జోగిని చట్టానికి అతీతమయిన ఓ దురాచారంగా మారిపోయింది. ఇందులో సుప్రసిద్ధుల, విద్యావంతుల ప్రమేయమేమీలేదు. కామదాహంతో ఉరకలు వేసే ప్రబుద్ధులు, స్వార్థపరులు, పెత్తందార్లు తమ స్వప్రయోజనాల కోసం సృష్టించుకున్నారు. మార్పులు, చేర్పులతో ఇలా విస్తరించి ఊడలతో మరింత ప్రాకిపోయింది. ఎవరూ చెరపడానికి వీల్లేనంత బలంగా ముడిపడిపోయింది.
తన ఉద్యమానికి ఊతకావాలంటే ప్రజల్లో ఒక అవగాహన కలగజెయ్యాలి. అందుకని దగ్గర్లో ఉన్న అయిదారు వూళ్ళకిపోయి అక్కడి పెద్దలను, ఉన్నత కుటుంబీకులను, విద్యావంతులను కలుసుకొని ఈ సమస్యమీద చర్చించనారంభించాడు అవకాశమున్నప్పుడల్లా.
"ఇలాంటి సమస్యల్ని తీసుకుని ఏదో ఉద్ధరించాలనుకోవడం టైమ్ వేస్ట్" అని కొందరు వ్యాఖ్యానించారు. వారిలో జోగినులపట్ల సానుభూతిలేదు. అవకాశముంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి అభ్యంతరమూ లేదు. వాళ్ళల్లో కొందరు జోగినుల వద్దకు వెళ్ళి వస్తున్నవారు లేకపోలేదు.
"చూడబ్బాయి. సమాజంలో వ్యభిచారిణులూ ఉన్నట్లే జోగినులూ ఉన్నారు. నాగరిక దేశాల్లో నైట్ క్లబ్బులూ, లైసెన్సు పొందిన వ్యభిచారిణుల్లేరా? ఇది మనం దురాచారమనుకుంటున్నాము. పోని నీలాంటివాళ్ళు అంటున్నారు. కాని ఆయా దేశాల్లో వాటి అవసరాన్ని గుర్తించి మెదలకుండా వూరుకున్నారు. ఫ్రీసెక్స్ అనేది మొత్తం సమాజంలో దావానలంలా వ్యాపించకుండా దాన్నో మూలకట్టిపడేసి అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. వాస్తవం చెప్పాలంటే సెక్స్ కూడా అన్నం, నీళ్ళు, ఊపిరిలాగానే ఓ ముఖ్యావసరం కదా" అన్నారు చాలామంది. వారిలో అనేకులు జోగినుల దగ్గరకు పోయివచ్చే అలవాటున్న వారున్నారు.
కొంతమంది మాత్రం స్పందించారు. బలభద్రపురంలో ఓ కాలేజీ ప్రిన్సిపాల్ ను అతను కలుసుకున్నప్పుడు "నిజమే ఇది దారుణమైన దురాచారమే. కాలేజి విద్యార్ధుల్లో మేలుకొలుపు పాడితే బాగుంటుందేమో. మా కాలేజీలో మీ ఉపన్యాసమొకటి పెట్టిస్తాను. మీ భావాలను, ఆశయాలను వారికి విశదీకరించండి" అన్నాడు.
