Previous Page Next Page 
జోగబాల పేజి 34


    విలాస్ పెదవి చిట్లి నెత్తురు చిమ్ముతోంది. లేవడానికి విశ్వప్రయత్నం చేశాడు. తలమీద యింకో దెబ్బ. కళ్ళు తిరిగి నేలమీద వెనక్కి వ్రాలిపోయాడు.


    వర్ష శ్రీహర్ష గుండెమీద తల ఆన్చి వెక్కి వెక్కి యేడ్చింది.


    "హర్షా! ప్రపంచంలో అందరూ నాకు రాక్షసుల్లా కనిపిస్తున్నారు. వీళ్ళు నన్ను బతకనివ్వరు. నన్ను బతకనివ్వరు."


    శ్రీహర్ష ఆమెను ఇంకా ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. "వర్షా! ఈ ప్రపంచంలో యెక్కువగా దుష్ట స్వభావాలే, ఇతరుల్ని హింసించేవాళ్ళే. ఇతరుల బాధల్ని చూసి సంతోషపడే వాళ్ళే యెక్కువగా ఉంటారు. తప్పదు. వీటినుంచి తప్పించుకుని పారిపోలేము. ఒక మంచి మనిషి చుట్టూ అవినీతి యెప్పుడూ వల పన్నుకుని కూర్చుని ఉంటుంది. ఈ కల్మషమంతా భరిస్తూ బ్రతకాలి." అని ఓదార్చాడు.


    వర్షను ఇంటిదగ్గర దింపేశాక శ్రీహర్ష పోలీసుస్టేషన్ కు వెళ్ళాడు.


    ఎస్.ఐ. కోదండపాణి సిగరెట్ కాలుస్తూ కూర్చుని ఉన్నాడు. అతన్ని చూస్తూ కనుబొమ్మలెగరేశాడు.


    "సార్! నా పేరు శ్రీహర్ష. మీకో కంప్లెయింట్ యిద్దామని వచ్చాను."


    అతనిని కూచోమని అనలేదు. "ఏమిటి?" అన్నట్టు చూశాడు. ఆ యూనిఫాంలో ఉన్న పులి.


    "సార్! విలాస్ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు. అతనేం చేశాడంటే..." అంటూ జరిగిందంతాచెప్పి "ఒక ఆడపిల్లను చెరిచి ఆమె జీవితాన్ని పాడుచెయ్యదల్చిన నీచుడు సార్. వాడికి బుద్ధి చెప్పాలి. వాణ్ణి అరెస్టు చేయాలి. చట్టం ద్వారా శిక్ష పడేటట్లు చేయాలి" అన్నాడు ఆవేశంగా.


    ఎస్.ఐ. మాట్లాడలేదు. సిగరెట్ కాలుస్తూ అతనివంక తీవ్రంగా చూస్తున్నాడు.


    "సార్! నేను చెప్పేది...."


    "ఏమిట్రా నువ్వు చెప్పేది స్కవుండ్రల్!"


    ఈ సంబోధన విని శ్రీహర్ష ఉలికిపడి అమాయకంగా చూశాడు.


    ఎస్.ఐ. డ్రాయరు సొరుగులోంచి ఓ కాగితం తీసి అతని మీదకు గిరాటేశాడు. "నీమీద వచ్చిన కంప్లెయింట్ చదువు." అన్నాడు. అతని గొంతు ఖంగుమని మ్రోగుతోంది.


    శ్రీహర్ష ఆ కాగితం అందుకుని చదివాడు. అది విలాస్ యిచ్చిన కంప్లెయింట్. అందులో అతను జరిగిందంతా తారుమారుచేసి, శ్రీహర్షను దోషిగా చిత్రిస్తూ తనా అబలను కాపాడబోతే హత్యా ప్రయత్నం చేశాడని కూడా రాశాడు.


    "సార్! ఇదంతా...."


    "నేనతన్ని చూశాను. వళ్ళంతా తీవ్రంగా గాయాలు తగిలాయి. పెదవి చీరుకుపోయి నెత్తురు కారుతోంది. నువ్వే నేరం చేసి అతనిమీద దొంగ కంప్లెయింట్ యివ్వడానికి వచ్చావు."


    "సార్! నా మాట నమ్మండి. కావాలంటే వర్షతో కూడా జరిగింది చెప్పిస్తాను."


    "ఏమిట్రా చెప్పించేదీ? దాన్ని బెదిరించి దొంగ సాక్ష్యం చెప్పిస్తావా? పిచ్చిపిచ్చి వేషాలెయ్యక ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. ప్రథమ తప్పిదంగా తీసుకుని క్షమించి వదిలేస్తున్నాను."


    "సార్! నే చెప్పేది కొంచెం వినండి సార్..."


    "ఏమిట్రా నువ్వు చెప్పేది" అని కోదండపాణి సిగరెట్ గిరాటేసి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు చూస్తుండగానే ఎర్రబడిపోయాయి. కుడిచెయ్యి బెల్టుమీదకు వెళ్ళింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS