తర్వాత రెండురోజుల్లోనే అతని ఉపన్యాసం కాలేజీలో ఏర్పాటు చెయ్యబడింది. సబ్జక్టు చాలా కుతూహలం కలిగించే అంశమై ఉండటం ఉపన్యాసం జరిగే హాలంతా విద్యార్థులతో కిటకిటలాడిపోయింది.
శ్రీహర్షకు స్టేజిమీద ఉపన్యాసాలివ్వడం అంతకుముందెప్పుడూ అలవాటులేదు. వేదికమీదకి రాగానే కాళ్ళు వణికాయి! "సభికులారా" అని మొదలుపెట్టగానే గొంతు తడబడింది.
స్టూడెంట్సులోంచి యీలాలూ, కేకలు, నవ్వులు, చప్పట్లు...శ్రీహర్షకు వళ్ళంతా చెమటలు పడుతోంది.
ఉహూ. వెనుకంజ వెయ్యకూడదు. తన మనసులో ఉన్నదంతా చెప్పగలగాలి. క్రమంగా, క్రమక్రమంగా ఉపన్యాసం పుంజుకుంటోంది. తాను చెప్పదలచిన పాయింట్లన్నీ జోగిని దురాచారం గురించి, పెత్తందార్ల స్వార్థపరత్వాన్ని గురించి, జోగినులు గురవుతోన్న అన్యాయం గురించీ, సమాజాన్ని చెదపురుగులా వేధిస్తున్న ఈ సమస్య గురించీ, ఈ దురాచారాన్ని రూపుమాపవలసిన ఆవశ్యకత గురించీ, ఇలాంటి సాంఘిక ప్రయోజనాలను సాధించడంలో యువతరం చేపట్టవలసిన బాధ్యత గురించీ చాలా ఆవేశంగా ఉత్తేజకరంగా మాట్లాడాడు.
అతనెంత సమస్యలో లీనమై ఉద్రేకపూరితంగా మాట్లాడినా నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు. జోకులేసేవారు జోకులేస్తున్నారు. ఎగతాళి చేసేవారు ఎగతాళి చేస్తున్నారు. చివరకు ఉపన్యాసం ముగిసింది.
ఓ విద్యార్థి లేచి నిలబడ్డాడు. మీ ఉద్దండ ప్రచండమైన ఉపన్యాసం పూర్తయిందా? ఇంకా ఏమైనా చెప్పేదుందా?"అనడిగాడు.
"పూర్తయింది."
"అయితే మేము కొన్ని ప్రశ్నలు వేయవచ్చా?"
"అడగండి."
"సమాజంలో పెళ్ళికాని వారిలో కానివ్వండి, పెళ్ళయినవారిలో కానివ్వండి__వ్యభిచరించడం అనేది జరుగుతోందా?"
"....జరుగుతున్నది."
"మొగవాడికిగానీ, ఆడవాళ్ళకుగానీ కొంత వయసొచ్చాక సెక్స్ తీర్చుకోవడం అవసరమంటారా? కాదంటారా?"
శ్రీహర్ష తికమకపడ్డాడు. "అక్రమమార్గంలో అది జరగకూడదు."
"సక్రమ వ్యభిచారం చెయ్యవచ్చునంటారు." హాలంతా నవ్వులు.
"నా ఉద్దేశం అదికాదు. కేవలం భార్యాభర్తల మధ్యే...."
"అందరూ మీలాంటి ఏకపత్నీవ్రతులే ఉండరు మేష్టారూ."
మళ్ళీ నవ్వులు, కేరింతలు. "పోనీ సక్రమమార్గంలో తీర్చుకుందామన్నా కొందరికి సకాలంలో పెళ్ళవదు. కొందరు పెళ్ళాలు చచ్చిపోయిన వాళ్ళుంటారు. పెళ్ళాన్ని వొదిలేసి వాళ్లో, పెళ్ళాలచేత వొదిలివెయ్యబడ్డవాళ్లో వుంటారు. కారణాంతరాలవల్ల పెళ్లిచేసుకోని బ్రహ్మచారులో, ప్రయత్నించినా పెళ్లికాని బ్రహ్మచారులో వుంటారు. ఒకవేళ సంసారం చేస్తోన్న పెళ్లాం కోపరేట్ చెయ్యకనో, మెకానికల్ గా ఎంతవరకూ అవసరమో అంతవరకే, ఏదీ? అంతవరకే మొక్కుబడి తీర్చుకున్నట్లుగా.... (నవ్వులు) లేకపోతే పుట్టింటికి వెళ్ళి నెలల తరబడి ఉన్నప్పుడు... లేక జబ్బువల్ల సెక్స్ కు పనికిరాకుండా పోయినప్పుడో మొగాడికి బయటకు పోవాల్సిన అవసరం ఉందంటాను. ఏమంటారు?"
శ్రీహర్ష ఏం చెప్పాలో తోచక మెదలకుండా నిలబడ్డాడు. "ఇహ ఈ ఆచారాన్ని నా దృష్టిలో ఇది ఆచారంలెండి. దురాచారం కాదు. (నవ్వులు) నిరోధిస్తూ చట్టం రావాలంటారు. చూడండి మాష్టారూ? కొన్నాళ్ళ క్రితం మద్యపానాన్ని నిషేధిస్తూ చట్టం పెట్టారు. ఎవరయినా తాగుడు మానేశారా? వరకట్నాన్ని నిషేధిస్తూ ఇప్పటికే చట్టముంది. ఎవరయినా కట్నాలు తీసుకోవటం మానేశారా? లక్షలకు లక్షలు పబ్లిగ్గా గుంజుతూనే ఉన్నారు. పైగా కట్నం తీసుకోనివాళ్ళని పిచ్చివెధవల్లా జమకట్టి అమ్మాయిలూ, అమ్మాయిల తల్లిదండ్రులూ వీడిలో ఏదో లోపముందని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. (నవ్వులు) అలాగే వ్యభిచారం మీద కూడా దాన్ని నిరోధిస్తూ చట్టముంది. దాన్ని నిరోధించినకొద్దీ నిరోధ్ ల అమ్మకం పెరిగిపోతోంది. (నవ్వులు, ఈలలు, చప్పట్లు) లాడ్జింగ్ ల మీద రైడింగ్ లుచేసి లంచాలు, శిక్షలు. ఇటు పోలీసులు బాగుపడుతున్నారు. అటు వాళ్ళూ సొమ్ము చేసుకొంటున్నారు. ఈ చట్టం వ్యభిచారాన్ని ఏమైనా అరికట్టగలిగిందా? రోజురోజుకూ ప్రాస్టిట్యూట్స్ ఎక్కువవుతున్నారుగానీ ఏమైనా తగ్గారా? రెచ్చిపోతున్నారు.
