ఆ హామీ విన్నాక ధైర్యం కలగటంతో నోట్లకట్ట తీసుకుని జేబులో తోసేసుకున్నాడు లక్ష్మీపతి. తండ్రి ఆరాటం చూసి సిగ్గుతో తల దించుకుంది పద్మ.
ఆమె సిగ్గుపడటం గమనించిన సత్యం లక్ష్మీపతితో అన్నాడు-
"షీ ఈజ్ సెన్సిటివ్! మీ కడుపున తప్పు పుట్టింది!"
"చిత్తం!" అన్నాడు లక్ష్మీపతి సిగ్గులేకుండా.
లక్ష్మీపతి లేకితనానికి వళ్ళు మండిపోగా పద్మ అక్కడ్నించి గబగబా వెళ్ళిపోయింది.
లక్ష్మీపతి కూడా లేచి నిలబడ్డాడు.
"రెస్టు తీసుకోండి. సాయంత్రం కలుద్దాం!" అనేసి ఆ గది విడిచేడు లక్ష్మీపతి.
లక్ష్మీపతి హాల్లోకి రాగానే అక్కడో విడ్డూరమైన దృశ్యం చూసేడు.
శాస్త్రి అనబడే సత్రకాయ సిగరెట్టు కాలుస్తూ గొప్ప విలాసంగా వున్నాడు. అతన్నా ఫోజులో చూడగానే లక్ష్మీపతికి చిర్రెత్తుకొచ్చింది. బహుశా తనని చూసి వుండడనే అభిప్రాయంతో చిన్నగా దగ్గి సిగ్నల్ యిచ్చేడు.
శాస్త్రి లక్ష్మీపతిని చూసేడు. చూసి కూడా తన వరస మార్చుకోలేదు. "శాస్త్రి" అని గావుకేక పెట్టేడు లక్ష్మీపతి.
అతని గాండ్రింపుకి శాస్త్రి కించిత్తు కూడా చలించలేదు. స్టెయిల్ గా పొగ వదులుతూ అన్నాడు-
"గొడుగుపేట ఇంటిలో ఒక ఆసామి అద్దెకు దిగేడు. ఇదిగో ఆర్నెల్ల అడ్వాన్సు"
అంటూ జేబులో డబ్బుతీసి బల్లమీద వుంచేడు.
ఇంటిలో అద్దెకు చేరడం, ఆర్నెల్లద్దె అడ్వాన్సివ్వడం - అదంతా ఆనందదాయకంగానే వుంది లక్ష్మీపతికి. కానీ-శాస్త్రిగాడి దర్జా చూస్తుంటే లక్ష్మీపతికి ముక్కుపుటా లెగిరెగిరి పడ్తున్నాయి.
శాస్త్రి సిగరెట్టు దమ్మొకటి పీల్చి హొయలుగా పొగ వదులుతూ అన్నాడు-
"జీతాల గండం కొలువుకి ఇవాల్టితో గుడ్ బై! అది చెప్పేందుకు వచ్చాను గనుకనే సిగరెట్టు కాల్చుతున్నాను. అండర్ స్టాండ్?"
లక్ష్మీపతి ఆ వార్తకి అవాక్కయిపోయేడు. శాస్త్రికింత ధైర్యం ఎక్కడ్నించి వచ్చిందో అతనికి ఒక పట్టాన అర్ధంకాలేదు. అంచేత అతనివేపు వెర్రిచూపులు చూస్తున్నాడు.
రాత్రి విగ్రహంలాగా నిలబడ్డ లక్ష్మీపతి చుట్టూతా ఠీవిగా తిరుగుతూ మీటింగు పెట్టేడు శాస్త్రి.
"మీ దగ్గిర గూండాల కొలువుకి తిలోదకాలిచ్చి ఎట్లా బతగ్గలనని కాదూ మీరు అడగవలసిన ప్రశ్న? కోనేరు సెంటర్లో సైకిలుషాపు పెట్టుకుంటాను. అద్దెకు సైకిల్ కావాల్సివస్తో శాస్త్రీ షాపెక్కడని అడగండి, ఎవరైనా జెబ్తారు. మీకిచ్చే సైకిల్ కి మాత్రం అద్దె పుచ్చుకోను. అదేదో తమమీద నాకు గల అభిమాన మనుకొనేరు! కానేకాదు. మీ దగ్గరున్నది ముదనష్టపు ముడుపు. అందులో పైసా పడిన మైలపడిపోతాను. కళ్ళెర్ర చేయొద్దు ఉన్నమాటన్నాను. దట్సాల్! మరో ముచ్చట. మిమ్మల్ని విడిచిపోతున్నందుకు వర్రీ కావద్దు. నన్ను మించిన అమాయక చక్రవర్తి మరొకడు గొడుగుపేట మీ యింట్లో సిద్ధంగా వున్నాడు. దయ్యాల కొంపని తెలిసినా ఆర్నెల్లు అడ్వాన్సిచ్చేడు. వాడిని పట్టుకోండి." అనేసి వేగంగా వెళ్ళిపోతున్నాడు శాస్త్రి.
లక్ష్మీపతి తిన్న షాకునుంచి కోలుకోడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. టేబిల్ మీద నోట్లు రెపరెప చూసేడు గబిక్కున గుప్పెట్లో వాటిని దాచేసేడు.
గొడుగుపేట ఇంటిలో అమాయక చక్రవర్తి ఎవడు?
21
శుభోదయం అనాలో దిక్కుమాలిన మార్నింగనాలో అనవసరం.
అదొక ఉదయం.
లక్ష్మీపతి గొడుగుపేట ఇంటిముందు తచ్చాడుతున్నాడు.
అమాయక చక్రవర్తి కాబోలు సుబ్బారావు పిల్లల్ని ఆడిస్తూ పాడుతున్నాడు.
అతను పాడుతూవుంటే ఇంటిల్లిపాదీ ఆనందిస్తున్నారు.
లక్ష్మీపతిని చూడగానే సుబ్బారావు దంపతులు సుమతీ తమ వాటాలోకి వెళ్ళిపోయారు.
కృష్ణమూర్తి పాట పూర్తి చేసేసరికి లక్ష్మీపతి అతని వాటాలోకి అడుగుపెట్టేడు.
కృష్ణమూర్తి భుజాల మీద సుబ్బారావు మూడో కొడుకు కూచుని వున్నాడు-ఉప్పుమూటలాగా.
లక్ష్మీపతి కృష్ణమూర్తిని పలకరించాలనే ఉద్దేశంతో చిన్నగా సకిలించేడు కానీ పలకరించలేదు.
కృష్ణమూర్తి లక్ష్మీపతిని ఎగాదిగా చూస్తున్నాడు-ఈ కొత్త పాత్ర ఎవడాని?
కృష్ణమూర్తి అవస్థ అర్ధం చేసుకున్న సుబ్బారావు పెద్దకొడుకు పాత్ర పరిచయం చేసేడు-
"మన ఇంటి ఓనరుగారు!"
ఆమాట వినగానే అవసరమైన పాత్ర రంగప్రవేశం చేసిందని ఎంతో సంతోషించేడు కృష్ణమూర్తి. భుజాల మీద బుజ్జిగాడ్ని దించేడు.
"వెళ్ళి ఆడుకోండి!" అన్నాడు పిలల్లతో.
పిల్లలు ముగ్గురూ వెళ్ళిపోయేరు.
కృష్ణమూర్తి తీరుబడిగా ఎంతో వినయంతో లక్ష్మీపతికి నమస్కరించేడు.
అతని మర్యాదా ప్రవర్తన లక్ష్మీపతిని బాగా ఆకర్షించింది.
లక్ష్మీపతి తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో కృష్ణమూర్తిని అడిగేడు..
"నీపేరు?"
"కృష్ణమూర్తి! నిలబడిపోయారే? కూచోండి!" అంటూ ఒక కుర్చీని లాగేడు.
లక్ష్మీపతి సంతోషించేడు. కుర్చీలో కూర్చున్నాడు.
కృష్ణమూర్తి చేతులు కట్టుకుని వినయంగా అంటున్నాడు-
"నేనే స్వయంగా వచ్చి మీ దర్శనం చేసుకుందామనుకున్నాను. ఈలోగా మీరే వచ్చేసేరు"
"మీది ఏఊరు?" అడిగేడు లక్ష్మీపతి.
నిరుద్యోగికి ఒక ఊరేమిట్లెండి? పొట్టచేత బట్టుకుని తిరుగుతున్నాను!"
"ఉద్యోగం లేదా?" అన్నాడు.
కృష్ణమూర్తి చేతులు కట్టుకుని వినయంగా అంటున్నాడు-
"నేనే స్వయంగా వచ్చి మీ దర్శనం చేసుకుందామనుకున్నాను. ఈలోగా మీరే వచ్చేసారు.
'మీది ఏ ఊరు?" అడిగేడు లక్ష్మీపతి.
"నిరుద్యోగికి ఒక ఊరేమిట్లెండి? పొట్టచేత బట్టుకుని తిరుగుతున్నాను!"
"ఉద్యోగం లేదా?"
"లేదని కాదండీ, దొరకలేదు!"
"నిరుద్యోగికి రెండువందల రెంటుకట్టే స్తోమత ఉంటుందా?"
"ఉద్యోగం లేదన్నానేగని కాలూ చెయ్యీ లేవని చెప్పలేదుగదండి! దేవుడిచ్చిన నోరుకూడా మంచిదే నలుగు ట్యూషన్లు చెప్పుకుంటే అద్దె బాధ ఉండదు. మరో నాలుగు చెబితే తిండిసమస్య తీరుతుంది. మనిషికి అంతకంటే ఏం కావాలి చెప్పండి?"
"ఊ! ఎంతవరకు చదువుకున్నావు?"
"ఎమ్మెస్సీ."
అతని క్వాలిఫికేషన్ వినగానే లక్ష్మీపతికి కృష్ణమూర్తిపట్ల పిసరంత గౌరవం కలిగింది.
* * *
లక్ష్మీపతి ఇంట్లో సత్యం గదికి ఏ.సి. ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సత్యం పేపరు తిరగేస్తున్నాడు.
అప్పుడొచ్చింది పద్మ కాఫీతో. ఆమెదగ్గర కాఫీ తీసుకుంటూ అన్నాడు సత్యం---
"కూచోమ్మా!"
పద్మ ఒద్దికగా కూచుంది.
సత్యం కాఫీ సిప్ చేసి అడిగాడు---
"హైద్రాబాద్ లో చదూకున్నావుట కదూ?"
పద్మ తలూపింది.
