11. వానరోత్తముని - దూషణ లాడుచు
రావణు కడకు - ఈడ్చుకు బోవగ |
రక్త నేత్రముల - నిప్పులు రాల్చుచు
లంకేశుడు గ | ర్జించి పలుకగ |
కపిని జంపి విం | దారగించుడని
పలువురు చేరి - ప్రేలుచుండగ |
సభికులందరు - కేకలు వేయగ
మారుతి నిలచె - కడునిబ్బరముగ .... ||శ్రీ||
మంత్రులు మారుతితో :
12. "ఎవడవు నీవు - ఎవని వాడవు
ఎవని పంపున - ఏతెంచినావు ?
ఎవరి ప్రాపున - చేరినాడవు
ఎందులకిటుల - చేసినాడవు ?
విషయములన్నీ - వివరింపుమని
నిజము బల్కుచో - బ్రతికి పోదు " వని |
దశకంఠునిచే - నియమింపబడి
మారుతి నడిగిరి - మంత్రులు గూడి .... ||శ్రీ||
మారుతి మంత్రులతో :-
13. వానరరాజు సు | గ్రీవుని మంత్రిని
నన్ను బిలుతురు - హనుమంతుడని |
రాముని దూతగ - ఇటు వచ్చితిని
సుగ్రీవు నాన - ఇటు జేసితిని |
సీతామాత - జాడ దెలిసితిని
మిము బల్కరించి - పోదలచితిని |"
అని మారు బల్కె - మారుతి దిటవుగ
మంత్రి పుంగవుల - మతులు చేలింపగ .... ||శ్రీ||
__: 48 వ. స. సంపూర్ణము :__
49 వ. సర్గ
1. మణిమయ రత్న కి | రీట శోభితుని
నవరత్నఖచిత - భూషణ ధారుని |
రక్తచందన - చర్చిత గాత్రుని
శ్రేష్టమయిన పీ | తాంబర ధారుని |
లోహితాక్షుని వి | శాల వక్షుని
మేఘవర్ణుని - తేజోవంతుని |
లంకేశ్వరుని - మారుతి కనుగొని
అచ్చెరువొందే మ | హాత్ముడేనని .... ||శ్రీ||
2. ఇరువంకల జే | రి సుందరాంగనలు
వింజామరలు - వీచుచుండగ |
దుర్ధర ప్రహస్త - నికుంభాదులు
మంత్రివర్యులు - పరివేష్టింపగ |
రత్నఖచిత సిం | హాసన మందు
ఇంద్రునివలె ఆ | సీనుడు కాగ |
లంకేశ్వరుని - మారుతి కనుగొని
అచ్చెరువొందే మ | హాత్ముడేనని .... ||శ్రీ||
3. ముల్లోకముల ప్ర | తాపవంతుడు
సర్వసులక్షణ - సంభాతుడు |
వేదశాస్త్రముల - ప్రతిభావంతుడు
మహాతేజుడు - మహాబలుడు |
ధర్మవర్తియై - యుండి యుండిన
స్వర్గాధిపతి - కాదగువాడని |
లంకేశ్వరుని - మారుతి కనుగొని
అచ్చెరువొందే మ | హాత్ముడేనని .... ||శ్రీ|
__: 49 వ. స. సంపూర్ణము :__
50 వ. సర్గ
రావణుడు ప్రహస్తునితో :-
1. "కైలాసగిరిని - పెకలించునాడు
నను శపించెను - నంనీశ్వరుడు |
కపిరూపమున - వాడే వీడుగ
వచ్చియుండేనో - నను వంచింపపగ |
అని లంకేశుడు - మంత్రి ప్రహస్తుని
ఆదేశించెను - మర్మమరయమని ....
ప్రహస్తుడు మారుతితో :-
2. "ఓ వానరుడా - భయము వీడుము
నీకు శుభమగు - నిజమును దేల్పుము |
యమ కుభేర ఇం | ద్రాదు లేవరేని
నిను దూతగ ఇటు - పంపినారేమి ?
విష్ణుదేవుడే - మాపై పగగొని
నిను బంటుగ ఇటు - అంపినాడేమీ ?
నిజము బల్కుచో - బ్రతికిపోదు" వని
మంత్రి ప్రహస్తుడు - మారుతి నడిగెను .... ||శ్రీ||
