48 వ. సర్గ
మారుతితో - ఇంద్రజిత్తు యుద్ధము :-
1. ఎనుబదివేల - కింకర వీరుల
అవలీలగ దును | మాడినవాడు |
జంబుమాలిని - గూల్చినవాడు
మంత్రి సుతులు హత | మార్చిన వాడు |
ఆ వానరుడు సా | మాన్యుడు గాడని
వానిని వేగ బం | ధించి తెమ్మని |
రావణాసురుడు | ఇంద్రజిత్తును
హనుమంతునిపై | దాడి పంపెను .... ||శ్రీ||
2. సేనాపతులను - చంపినవాడు
అక్షకుమారుని - ద్రుంచినవాడు |
వాయువు కంటెను - వేగవంతుడు
అగ్నికంటెను - తేజోవంతుడు |
ఇందరినోకడే - నిరాయుధుడై
కూల్చినవాడు సా | మాన్యుడు గాడని |
రావణాసురుడు | ఇంద్రజిత్తును
హనుమంతునిపై | దాడి పంపెను .... ||శ్రీ||
3. ఓ కుమారా - మహావీరా
ఇంద్రాదుల అడ | లించినశూరా |
బ్రహ్మదేవుని - వరమున నీవు
దివ్యాస్త్రములను - పొందినాడవు |
భూమ్యాకాశము | ల రణము చేయగ
సాటిలేని మే | టి యోధుడు వీవని |
రావణాసురుడు | ఇంద్రజిత్తును
హనుమంతునిపై | దాడి పంపెను .... ||శ్రీ||
4. ఇంద్రజిత్తు దశ | కంఠు కుమారుడు
తండ్రిని బోలిన - ప్రతిభావంతుడు |
తపోధనుడు - ధనుర్ధరుడు
అస్త్రశస్త్ర వి | ద్యా విశారదుడు |
తండ్రికి తాను ప్ర | దక్షిణజేసి
భక్తితో మ్రొక్కి - దీవనలంది |
చతురంగ బల స | మేతుడై వెడలె
పర్వములందు పొం | గేటి కడలివలె .... ||శ్రీ||
5. ఇంద్రజిత్తు వి | శాల నేత్రుడు
సుందరుడు సు | రేంద్ర సమానుడు |
రత్నఖచిత కి | రీట శోభితుడు
మణిమయ భూషణ - మండిత గాత్రుడు |
శరగతి పోగల - నాల్గు సింహముల
పూన్చిన కాంచన - స్యందన మందున |
చతురంగ బల స | మేతుడై వెడలె
పర్వములందు పొం | గేటి కడలివలె .... ||శ్రీ||
6. నాగ యక్ష ఋ | ష్యాదులు నింగిని
రణము జూడ వే | డుకతో చేరగ |
రధ గజ తురగ ప | దాతి దళముల
రణగుణ ధ్వనులు - దిక్కులు నిండగ |
మేఘనాధుడు - నారి సారింప
భూతములదిరి - పరుగిడ సాగ |
చతురంగ బల స | మేతుడై వెడలె
పర్వములందు పొం | గేటి కడలివలె .... ||శ్రీ||
7. నానావిధముల - వాడిశరముల
ఇంద్రజిత్తు రో | షాన వేయగ |
వాయునందనుడు | గగనాని కెగసి
నేర్పుగ శరముల - గురి తప్పుకొనగ |
ఇరువురి నడుమ - పోరు చెలరేగె
భూమ్యాకాశముల - కడు భీకరముగ |
దేవగణంబులు - సంగ్రామము గని
తహతహలాడిరి - ఏమగునోయని .... ||శ్రీ||
8. కపికుంజరుడు - భయంకరముగ
కాయము బెంచి - సమరము చేయగ |
ఈ వానరుడు సా | మాన్యుడు గాడని
మహిమోపేతుడు - కామరూపుడని |
ఇంద్రజిత్తు బహు | యోచన జేసి
బ్రహ్మాస్త్రమును ప్ర | యోగము జేసె |
దేవగణంబులు - సంగ్రామము గని
తహతహలాడిరి - ఏమగునోయని .... ||శ్రీ||
9. బ్రహ్మాస్త్రముచే - బంధింపబడి
పవన కుమారుడు - నేలపై బడె |
వనజభవుడు తన | కు ఒసగిన వరము
స్మరియించుకొని - ప్రార్ధన జేసె |
వాయు బ్రహ్మ ఇం | ద్రాది దేవతల
కాపాడుమని - ధ్యానము జేసె |
దేవగణంబులు - సంగ్రామము గని
తహతహలాడిరి - ఏమగునోయని .... ||శ్రీ||
10. కట్టుపడి యున్న - వానరోత్తముని
అసురులు తలచిరి - తమకు లొంగెనని |
త్వరత్వరగా దా - నవులు దరిజేరి
నారచీరలతో - బిగి బంధించిరి |
బ్రహ్మ వరమున బ్ర | హ్మాస్త్ర బంధము
క్షణకాలములో - తొలగిపోయెను |
మారుతి మాత్రము - నార చీరలకె
కట్టుబడినటుల - కదలకయుండె .... ||శ్రీ||
