Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 33


    మరేం మాట్లాడాక స్కూలుకు పోయింది ఇందిర.

                                    23
    'అబ్బాయి ఇంజనీరు గా పనిచేస్తున్నాడు ఆనందరావు గారూ, ఇంతకన్నా మంచి సంబంధం రాదు. ఆస్తికి తక్కువ లేదు. అబ్బాయా? చూస్తె మీరే తప్పక ఒప్పుకొంటారు."
    'అది కాదు, సుబ్బన్నా . అమ్మాయి చదువై పొతే బాగుండును అని నా ఉద్దేశం."
    "చదువు ఏం అడ్డ మోస్తుందండీ? పెళ్ళి చూపులు కానివ్వండి. ఆ తర్వాత నిశ్చయ తాంబూలాలు తీసుకోండి. చదువైపోగానే మీయిష్టం వచ్చినట్లు గానే పెళ్లి జరిపించండి."
    "ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది?"
    "తొందర అంటా రేమిటండి? మంచి సంబంధం తప్పిపోతే కష్టం. మీరు ఊ అనండి. రేపే వారిని పెళ్లి చూపులకు తీసుకొస్తాను."
    "సరే, నీ యిష్టం" అన్నారు ఆనందరావు గారు. సంతృప్తి గా లేచాడు ఎదుటి వ్యక్తీ పెళ్ళిళ్ళ పేరయ్య లాగా.
    
                           *    *    *    *
    "రాజూ, వారు మధ్యాహ్నం భోజనం చేశారా?"
    "మరేం ఫర్వాలేదులే వదినా. ఒక పూట భోం చెయ్యకుంటే అరిగి పోడులే. అహంకారం అణిగి ఉంటుంది."
    "రాజూ!" బాధగా అంది ఇందిర.
    ఆ కంఠం లో భర్త పట్ల గల ప్రేమను అర్ధం చేసుకోగలిగాడు రాజ్. తన విషయమే అనుకోకుండా ఉండే భర్త ఒక పూట భోజనం చేయలేదని ఎంత ఆవేదన చెందుతుంది. ఆడదాని హృదయం! ఇంతటి పతిభక్తి హిందూ స్త్రీలకూ ఎందు కిచ్చావు భగవంతుడాఅనుకొన్నాడు రాజ్.
    ప్రక్కనే ఉన్న ఆనంద్ ఆమె బాధ చూచి ఈ ఆడవారికి బుద్ది లేదు అనుకొన్నాడు.
    "నువ్వు ఇలాగె బాధ పడుతుంటావా లేక మీ శ్రీవారి దర్శనార్ధం వస్తావా?' పరిస్థితులు మార్చాలని అడిగాడు రాజ్.
    "మరి వారికి రాత్రికి కూడా..."
    "ఆభయం లేదులే వదినా! హోటలు నుండి మేమే పట్టుకెళ్ళి తినిపిస్తాం. సరేనా?"
    "హోటలు కూడు ఆయనకు వంట బట్టదు. ఇక్కడి నుండే కాయర్ లో  తీసి కెళ్దాం."
    "ఇంకేం? ఈ దినం అన్నయ్య గారికి అదృష్టం పట్టింది. అలాగే చెయ్యి.
    ఇందిరా ఉత్సాహంతో లోపలికి పోయింది. మరో అర గంటలో ఆనంద్ , రాజ్ ఇందిర రావు ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే పూర్తిగా చీకటి పడింది. ఇల్లంతా చీకటిగా ఉంది. తలుపులు తెరిచి తారాడుతూ స్వేచ్ వేశాడు రాజ్.
    లైటు వెలిగింది.
    "వదినా, నువ్వు ఈ గదిలో నుండి చూస్తుండు." అని రాజ్ ఆనంద్ ను పిలుచుకొని ప్రక్క గదిలోకి పోయాడు.
    నీరసంగా పడి ఉన్న రావు అడుగుల చప్పుడు విని ఆశతో చూశాడు. వీరిని చూసి దాన్ని చంపుకొన్నాడు.
    ఆనంద్ కట్లు విప్పి అతన్ని కూర్చో బెట్టాడు. ఉదయం నుండి కడుపు లోకి ఆహారం లేదు. అకలి చంపేస్తుంది. బాధపడుతూ తన స్థితికి తిట్టుకున్నాడు. నోటి కున్న కట్టు విడివడగానే వారి పై మితిలేని కోపమొచ్చింది. చేతనైతే వారిద్దరినీ బాగా చావగోట్టాలనుకొన్నాడు. కానీ ఆ పని వాళ్ళే చేయగలరని భయపడ్డాడు. అందునా తాను తిండి కూడా లేక నీరసంగా ఉన్నాడు.
    "మీరు మనుష్యులా, రాక్షసులా? నన్నిలా కట్టి పడేస్తే ఎలాగనుకొన్నారు? అన్నం కూడా లేకుండా మాడి చావవలసిందేనా?" కోపం పట్టలేక అడిగాడు రావు.
    ఎవరూ మాట్లాడ లేదు.
    "మీకు నేనేం అన్యాయం చేశాను? నన్ను ఎందుకిలా ఏడిపిస్తున్నారు?' దుఃఖం పొర్లుకు రాగా అపుకొంటూ అడిగాడు రావు.
    అతని స్థితికి , బేలతనానికి జాలి వేసింది వారికి.
    "ముందు అన్నం తినండి. తర్వాత చెప్తాం" అన్నాడు రాజ్.
    ఆకలితో ఉన్న రావు ఆ మాట విని బాధ మరిచిపోయి ఆశగా కారియర్ వంక చూశాడు.
    ఆనంద్, రావుకు విస్తరి వేసి వడ్డించాడు.
    రాజ్ కు తమ పరిస్థితి చూసి నవ్వు ఆగలేదు. నవ్వితే నాటకం చెడిపోతుందని వదినను పరామర్శిద్దామని బయటి కొచ్చాడు.
    ప్రక్క గదిలో నుండి చూస్తున్న ఇందిర కు కోపం ఆగలేదు. భర్త స్థితి ఆమెనలా మార్చి వేసింది.
    "రాజూ, ఏమిటి అన్యాయం?"
    "కోపపడకు, వదినా!"
    "కోపం రాకుండా ఎలా ఉంటుంది? అటు చూడు. ఆఖరకు కడుపు నిండా అన్నం తినే అర్హత కూడా లేదా ఆయనకు?'
    రాజ్ లోపలికి చూశాడు. ఆనంద్, రావు ను అల్లరి పట్టిస్తున్నాడు. ఆనంద్ పెట్టిన సగం అన్నంతో అర్ధాకలి తో ఏడుపు మొహం పెట్టి కూర్చోనున్నాడు రావు.
    "నేను వారి దగ్గరి కేల్తాను" అని ఇందిర ముందు కడుగు వేసింది.
    ఆమెను పట్టుకొని "వదినా, ఆవేశపడి మా ప్లాను పాడు చేయవద్దు" అన్నాడు రాజ్.
    "ఏమిటి మీ ప్లాను? ఇలా వారిని హింసించమేనా? అసలు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం మీ కేవరిచ్చారు?"
    ఎవరో శూలం తో పోదిచినట్లయింది . రాజ్ మొహం లో ప్రశాంతత మాయమైంది. దాని స్థానం లో గాంబీర్యం, గాంబీర్యం వెనుక బాధ అలుముకోన్నాయి.
    "క్షమించు వదినా! పొరపాటే జరిగింది" అని 'ఆనంద్ " అన్నాడు గట్టిగా రాజ్.
    "వస్తున్నారా" అని బయటి కొచ్చాడు ఆనంద్.
    'ఇక వెళ్ళండి. మీ కుటుంబ వ్యవహారాల్లో తల దూర్చే హక్కు మాకు నిజంగా లేదు. కానీ తెలివి తక్కువతో వచ్చాము. అందుకు మమ్మల్ని క్షమించండి. అనవసర విషయాల్లో జోక్యం తీసుకోవడం మంచిది కాదనే పాఠాన్ని నేర్పారు. వస్తాను వదినా" అని ముందు కడుగు వేశాడు రాజ్. అతన్ని అనుసరించాడు ఆనంద్.
    తనన్న మాటలకే పశ్చాత్తాప పడుతున్న ఇందిర అది చూచి భరించ లేకపోయింది.
    "రాజూ' అంది బాధగా.
    నాలుగడుగులు వేసిన వారిని ఆ పిలుపు అడ్డగించింది.
    "రాజూ, ఎందుకూ కొరగాని ఈ దీనురాలిని ఓదార్చేందుకు నువ్వు దిక్కున్నావని తృప్తి పడ్డాను. నువ్వు కూడా నా పై కోపగించుకొని వెళ్ళిపోతావా?"
    వెనుతిరిగి చూసిన రాజ్ ఆమె కన్నీరు చూసి "వదినా" అని దగ్గరి కొచ్చాడు.
    "నన్ను క్షమించు రాజూ! ఆవేశం లో బుద్ది లేక అన్నాను" అంది తల వంచుకొని ఇందిర.
    "అంతమాటలనకు వదినా!' అని ఆమె కన్నీరు తుడిచి "మీరు కాస్సేపు బయట ఉండండి. నేనిప్పుడే వస్తాను" అని లోపలికి నడిచాడు రాజ్.
    ఎవ్వరూ లేనిది చూచి కరియర్ లోని అన్నమంతా ఖాళీ చేసి తీరిగ్గా కూర్చున్నాడు రావు.
    రాజ్ ను చూడగానే తిరిగి అతనిలో కోపం బయలుదేరింది. కానీ కోపం అతని ముందు పని చేయదని దీనంగా "నేను మీకేం అపకారం చేశాను? అక్కడ నా భార్య రెండో పెళ్లి చేసుకో బోతోంది. ఇక్కడ మీరు నన్ను బంధించారు. ఇంతకన్నా నన్ను ఏ కత్తి తో నైనా పొడిచి చంపెయ్యండి" అన్నాడు.
    అది చూసి అనవసరంగా తాను ఆ భార్య భర్తలను బాదిస్తున్నానేమో ననుకొన్నాడు రాజ్.
    "ఇవి చేతులు కావనుకో. నన్ను విడిచి పెట్టు. నేను నా ఇందిరను దక్కించు కుంటాను."
    "ఎలా? పెళ్ళిలో రభస చేసి తీసుకొచ్చుకొంటావా?"
    "కాదు. ఆమెను కలుసుకొని ప్రాధేయపడి ఒప్పించు కొంటాను."
    'ఆమె అంగీకరించకుంటే?"    
    "తప్పక ఒప్పుకొంటుంది . నాకు తెలుసు. నా ఇందూ మంచిది. నా మాట కాదనదు."
    "అయితే ఈసారి ఆమె నీ ఇంటి కొస్తే ఏ కష్టం కలుగకుండా చూచు కొంటావా?"
    "ఇంకా ఆమెకు కష్టం కలిగిస్తానా? ఆమె దేవత. పువ్వుల్లో పెట్టి పూజించుకొంటాను."
    "సరే ఒక అయిడియా తట్టింది. చెప్తాను వినండి. నేనే ఎలాగైనా మా వదినను ఒప్పిస్తాను. రాత్రి పదకొండు గంటలకు వాళ్ళ వీధి చివర కొస్తే ఆమె వస్తుంది. త్వరపడి ముందుకు రాకూడదు; జాగ్రత్త. ఉదయమే ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్ళిపోయిందని ఆ పెళ్లి కొడుకును తరిమేస్తాం. సరేనా?"
    "అలాగే" అన్నాడు రావు ఆనందంతో.
    ఆ రాత్రే చీకట్లో ఒక స్త్రీ ఆకారం వీధి చివరలో కాచుకొని ఉన్న మరొక పురుషాకారాన్ని కలుసుకొంది.
    "ఇందూ' అందా పురుషాకారం.
    "ఏమండీ" అని ఆ ఆకారం చేతుల్లో వాలిపోయింది.
    "ఊ త్వరగా పద. ఎవరైనా చూస్తారు." అన్న మాటలు వినిపించాక ఆ ఆకారాలు కదిలి వెళ్లి పోయాయి.
    ఆ ప్రక్కనే గోడ చాటునే నిలబడి ఉన్న మరొక ఆకారం అది చూసి నవ్వుకొంది.
    "ఓ భగవంతుడా! నీ లీలా విలాసాలు అద్భుతం. భార్యభార్తలే దొంగతనంగా కలుసుకొంటున్నారు. వారి కున్న హక్కులను పోగొట్టి దొంగలుగా మార్చి పారిపొమ్మని చెపుతున్నావు" అనుకోని వెనుదిరిగిందా ఆకారం.
    "అమ్మా, అక్కయ్య ఎక్కడి కెళ్ళిందే?" అడిగింది ఉదయమే లత.
    "ఇంకెక్కడి అక్కయ్య లతా! ఇవ్వేళ కు మీ బావతో అలా ఊర్లు తిరిగి రావడానికి కెళ్ళింది." జవాబిచ్చాడు రాజ్ మధ్యలోనే.
    "బావా! నీకు ఉదయం లేచినప్పటి నుండి నవ్వులాటలేనా?"
    "మనం పుట్టిందే అందుకు, లతా! మనం నవ్వకపోయినా ఇతరులను నవ్వించాలి."
    "నేను అడిగింది అదికాదు."
    "నీ ప్రశ్నకు జవాబు ఎప్పుడో చెప్పాను. నా మీద నమ్మకం లేకపోతె అత్తయ్య నే అడుగు." అని బ్రష్ నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు రాజ్.
    'ఔనమ్మా , లతా! మీ రాజు బావ చలువ వల్ల అది తిరిగి తన భర్త దగ్గరి కెళ్ళింది."
    "ఏమిటమ్మా నువ్వంటున్నది?"
    అంతా వివరంగా చెప్పింది ఆమె.
    నమ్మాలో లేదో తెలియడం లేదు లతకు. ఎన్నడూ కలలో గూడా అనుకోని విషయం జరిగింది. అదీ బావ తెలివి వలన. 'బావా, మీలాంటి వారిని పోరాపాటున దేవుడు ఈ మానవ లోకంలో పుట్టించాడు. అయినా కనీసం మీబోటి వాళ్ళు లేకుంటే ఈ లోకం ఎప్పుడో నాశన మై పోయేది. నీ ఋణం తీర్చుకొనే విదానాన్నయినా తెలుపవు. ఏం చేస్తే నీ ఋణం తీరుతుంది?"
    "బావా!"
    "ఊ" ఎటో చూస్తూ పళ్ళు తోముతూ జవాబిచ్చాడు రాజ్.
    "ఎన్నడూ భర్త తో కాపురం చేయలేననుకొన్న అక్కయ్య జీవితంలో అంధకారాన్ని పోగొట్టి వెలుగు నిచ్చావు."
    "ఎవరినీ? దేవుడిని ప్రర్దిస్తున్నావా! ఇంకా బాగా ప్రార్ధించు."
    "ఔను. ఆ దేవుడి పాద పద్మాలకే నమస్కరిస్తున్నాను. " అని క్రిందికి వంగింది లత.
    "లతా!' కోపంగా ఆమెను లేవదీసి "ముందు లెంపలు వేసుకో" అన్నాడు రాజ్.
    "ఎందుకు, బావా?"
    "ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయనని లెంపలు వేసుకోనేంత వరకూ నేను నీతో మాట్లాడను."
    "అంత శిక్ష వద్దు. బావా. ఇదో అలాగే చేస్తున్నాను" అని చేసి "తప్పా, బావా!" అంది లత.
    "తప్పొప్పులు నాకు తెలియవు. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే క్షమించేది లేదు."
    "చేసిన మేలుకు కృతజ్ఞత చెప్పు కుండే యోగ్యత కూడా లేదా, బావా?"
    "అందుకు నీ నోరు ఏమైంది? అయినా నేను పరాయి వాడినా? పరాయి వాడిననే భావన తోనే ఇదంతా చేస్తున్నావు."
    "అంతమాటనకు , బావా! పోనీలే క్షమించు."
    "క్షమించాను ఫో." చిరునవ్వు  విసిరాడు రాజ్.
    "బావా!"
    "ఇంకా ఏం?"
    "నేనూ నీ అంత గొప్పదాన్ని కావాలని ఉంది."
    "అయితే నా దగ్గర శిష్యత్వం చేయి."
    "తప్పకుండా."
    "చాలా కష్ట పడతావే అని బాధగా ఉంది."
    "ఫరవాలేదు. ఎన్ని కష్టాలనైనా ఎడురిస్తాను."
    "అయితే నే చెప్పిన మాట ఎన్నడూ కాదన గూడదు. అదీ ఎటువంటి విలువ నిచ్చేదైనా సరే. అంగీకరించాలి."
    "అక్షరాలా నీ అడుగు జాడల్లో నడుస్తాను."
    "అయితే ఇప్పుడు లోపలి కెళ్ళు."
    "ఊ!"
    "వెళతావా, లేదా? బుద్దిగా చదువుకో మంటే గొప్పదాన్ని కావాలనీ, శిష్యురాలిని కావాలనీ కోతి చేష్టలు చేస్తున్నావు పో" అని చెయ్యేత్తే లోగా లోపలికి తుర్రుమంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS