కొడుకు రాడని తెలుసుకుంది. పిన్ని మరిది విరల్ ను ఇంటికి తెచ్చుకుంది. విరల్ను సొంత సంతానంలా సాకింది. ఇప్పుడు కదిలే పన్నులా సహిస్తూంది. డబ్బు సాంతం అతనికి దోచిపెట్టింది. అతనికి మౌనం అంటేనూ, వంటరితనం అంటేనూ ఇష్టం. రోజంతా మత్తులో మునిగి గదిలో పడిఉంటాడు. అప్పుడప్పుడూ అతని కాళ్ళకు సత్తువ వస్తుంది. లేచి నుంచోగలుగుతాడు. అలాంటప్పుడు పిన్ని మెత్తని డొక్కలో తంతాడు. ఈ మాట పిన్ని ఎవరికీ చెప్పదు, దాచిపెడ్తుంది. నాకూ సరస్వతికి కూడా అబద్ధాలు చెపుతుంది. విరల్ కొట్టాడనే విషయం దాచి ఉంచుతుంది.
నేను ఆ విషయాలు మీకు చెప్పాలనుకోవడం లేదు. నా విషయంలో మీకు చెప్పాలని-అదీ నేను జన్మతః కవినని. నాకు అందమైనవన్నీ బాగనిపిస్తాయి. రంగు రంగుల కలలు వస్తాయి. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నేను మెట్రిక్ పాసైనాను. అందుకే నన్ను పుస్తక బండారం అంటారు. నా దగ్గర "కల్పన" నవల ఉంది. 'కల్పన' నాకు చాలా ఇష్టం. ఆ నవలా రచయిత నా ఎదలో చేరిపోయాడు. ఆ నవలా నాయిక అందగత్తె-అమాయకురాలు- అమాంతంగా ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సర్సలా అనిపిస్తుంది.
ఉలిక్కిపడ్డాను. లేచి నుంచున్నాను. తరవాత కూర్చున్నాను. కన్నీరు తుడుచుకున్నాను. చూస్తే పిన్ని ఇంట్లోంచి ఆ అమ్మాయే వస్తూంది-అదే 'కల్పన' నాయిక-ఆకాశం నుంచి దిగివస్తూంది-నావైపే.
'పిన్ని పిలుస్తూంది' పయట సాంతం పంటితో చించుతూ అన్నది. కవిని అయితే ఎంత బావుండేది? జీవితంలో ఒకే ఒక్క కవిత రాయగలిగినా దాని శీర్షిక ఇప్పుడే రాసేవాణ్ణి!
ఆనందంతో గుండె గంతులు వేసింది. అమాంతంగా లేచాను. కాళ్లు ఊగిసలాడాయి. పడిపోయాను. మూట విచ్చుకుంది. మళ్ళీ బాటన పోయే పిల్లలు పకపకా నవ్వారు.
మళ్ళీ ఇంట్లో చేరాను. గదిలో సామాను సర్దుతున్నాను. పిన్ని కేకలు పెడ్తూంది. 'మరో పుక్కిటి మనిషి పెరిగింది. ఉంచుకోవద్దనుకుంటే పిచ్చిముండ ఎక్కడెక్కడ చూపులు కలుపుతూ తిరుగుతుందో! నా వంశానికేం మచ్చ తెస్తుందో! నా ముఖాన మసి పూస్తుందో! పిచ్చిముండ దాని ముఖం చెక్కిపారేస్తా"
ఇప్పుడు అర్థం అయింది. కుడికన్ను ఎందుకు అదిరిందో!
పిన్ని నాకు పాసిపోయిన అన్నం, పప్పు పెట్టేది. అదే అమృతంలా ఉండేది. అందమైన కలలు వచ్చేవి. ఆకాశంలో ఎగిరేవాణ్ణి. నా బలహీనత మరిచాను. పేదరికం మరచాను. పిన్ని నాకు మరో గదిచ్చింది. అందులో కూర్చుంటాను. ఆ గది సగంలో పిడకలున్నాయి. మధ్యన నా చాప ఉంది. ఒక మూలకు పుస్తకాలున్నాయి. చూరులో పిచ్చుకల బృందం ఉంది. ఆ పిచ్చుకలు నాకు బంధువులు. అది ఎడతెగని బంధం. పిడకలకింద తేళ్లు బస్తీలు ఏర్పరచుకున్నాయి. అవీ నాకు పొరుగులే. వాటి అలవాట్లు పిన్ని అలవాట్లలాంటివి. రాత్రిళ్లు నేను మొత్తుకునేవాణ్ణి- సరస్వతి నిద్రలేవాల్సివచ్చేది. ఉల్లిరసం అంటించేది. సిరా రాసేది. ఏది రాసినా ఆమె తాకితే తేలు విషం అమృతం అయిపోయేది. ఆమెలో ఏదో ఆ ఆకర్షణ ఉంది. అలా చూస్తే ఇలా తనది చేసుకుంటుంది. ఇహ నా విషయం చెబుతా వినండి. పొద్దుతిరుగుడు పూవులా నా చూపు ఆమెనే అంటి వుంటుంది.
ఆమెకు పూలంటే చాలా ఇష్టం. రంగు రంగుల బట్టలు, నగలు, అందమైన ఆడవాళ్లు, ఠీవిగల మగాళ్ళ మీదినుంచి ఆమెచూపు కదలదు. ఆవిడా నాలాంటిదే. పేదరికం ఏమిటో తెలీదు. పేదవాళ్ళకోరికలు అక్రమ సంతానం లాంటివి. వాటిని ఎవడూ పట్టించుకోడు. పేదలు తమ కోరికలు తాబేలు తలలా దాచుకోవాల్సిందే. వెళ్ళబెట్టలేరు- రాదు అయినా ఆమె తెలివైంది. నేను ఆమె ముందు మూర్ఖుణ్ణి అయినాను. ఆవిడ మెట్రిక్ పాస్ కాలేదు. అయినా నాకు తెలివి చెప్పేది. సరే నేనైతే మొద్దునే. పిన్ని నన్ను గాడిదగా నిరూపించింది. అందుకు ఆవిడ దగ్గర అనేక ఆధారాలున్నాయి. స్కూల్లో పిల్లలు నన్ను ఆటలాడిస్తారు. రాత్రికి మున్నా, షబ్బో చదువుకోవడానికని వస్తారు. వాళ్లు సతాయిస్తారు. సరస్వతే అడ్డుతగుల్తుంది. నన్ను కాపాడుతుంది. ఈ వెధవలకు చదువు చెప్పొద్దు అంటుంది. కాని ఎలా? జీతం సాంతం పిన్ని తన్నుకపోతుంది. ఈ రెండు రూపాయలే నా స్వంతం.
ఒక్కోసారి పిన్ని విరల్ను సంతోషపెట్టడానికి నా "కల్పన" లాక్కుంటానని బెదిరించేది. అది విని నేను ఏడ్చేవాణ్ణి. ఆ పుస్తకం నాకు ప్రాణం అలాంటిది. దుఃఖం దిగమింగడానికీ, ఆనందం అనుభవించడానికీ నా ధనం. అందులోనే సరస్వతికి అందమైన విషయాలు వివరిస్తాను అని అంటుంది. ఆమె నవ్వుతుంది. అలాంటి పుస్తకం లాక్కుంటానంటే ఏడ్పు రాక ఏమవుతుంది? నేను ఏడుస్తానా? నన్ను చూస్తాడు-వాగుతున్న విరల్ నవ్వుతాడు, విన్నారా-నా కన్నీరు ఈ ఇంటిలో వెలుగులు నింపుతుంది. ఏమంటారా? విరల్ నవ్వుతాడుగా! అది పిన్నికున్న ఒక్క పన్నూ బయటపెడుతుంది. సరస్వతి నవ్వడం తప్పనిసరి. అలాంటప్పుడు ఏదైనా మన్నిస్తుంది. అది గ్రహిస్తుంది సరస్వతి. అన్నంలోకి ఆవకాయ చేయమని సిఫార్సు చేస్తుంది. ఇంత బెల్లం గడ్డపడేయిస్తుంది. సరస్వతి నా "కల్పన" నాయిక. ఆమె కోరికలన్నీ తీర్చాలనిపిస్తుంది. ఆమెకు "ఖలాఖంద్" తినిపించాలనిపిస్తుంది. మంచి మంచి బట్టలు కొనిపెట్టాలనిపిస్తుంది. కారులో షికార్లు చేయించాలనిపిస్తుంది. ఇవి ఏమంత పెద్ద కోరికలు చెప్పండి. అయినా ఈ విషయాలు ముచ్చటిస్తే పాపాలు చేసినవాడు స్వర్గసుఖాలు కోరినట్లు చూస్తుంది సరస్వతి.
'కారులో కూర్చుంటే కళ్ళు తిరగవా? మీ పుస్తకాల్లో ఏం రాసి ఉంది?' అని వింతగా అడుగుతుంది. ఆమె మాటలు వింటుంటే నాకు ఎకనామిక్స్ గుర్తుకు వస్తుంది. ఇందుకు కారణం అందులో వెదుకుతాను.
'ఎంత చదివారు-మీకేదో పెద్ద ఉద్యోగమే దొరుకుతుంది. కారు కొంటారుగా' అంటుంది అమాయకంగా.
ఒకటేమిటి పది కార్లు కొందామనుకుంటాను!
ఆ రోజు నా సంతోషానికి అంతులేదు, ఎంతో కష్టపడి దాచిపెట్టిన పావలా తవ్వి బయటికి తీశాను. స్కూలుకు వెళ్ళేప్పుడు నేలమీద కాళ్లు నిలవడం లేదు. కార్లు, టాంగాలు, సైకిళ్లు అన్నింటిపైగా ఎగిరిపోతున్నాను. వీధుల్లో ఆనందం వెల్లివిరుస్తూంది. నాలుక వెళ్ళపెట్టి ఒక చిన్నపిల్లవాణ్ణి దడిపించాను. ఒక అమ్మాయి నా చిరునవ్వు చూచి నన్ను వెక్కిరించింది. ఆరోజు నాకు చాలా కవితలు గుర్తుకు వచ్చాయి. గునిశాను, కూనిరాగాలు తీశాను. అణా మిషనులో వేశాను. బరువు చూచుకున్నాను. చిన్న టిక్కెట్టు వచ్చింది. 'అదృష్టపు తాళంచెవి మీ చేతిలో ఉంది' - టిక్కెట్టు మీద ఉంది. పిడికిలి తెరిచాను. మూడణాలున్నాయి మల్లెపూలు కొన్నాను. సరస్వతికి ఇలాంటి బహుమానమే ఇవ్వాలి. పూలు అందంగా ఉన్నాయి. పూలలాగే సరస్వతి నాజూకుగా ఉంది.
పిన్ని దుకాణానికి లావుపాటి స్త్రీలు వస్తుంటారు-బట్టలు కుట్టించుకోవడానికి. సరస్వతి వారి కొలతలు తీసుకుంటుంది. వాళ్ళను అదోలా చూస్తుంది. బట్టలు కుడుతున్నప్పుడు పిన్నితో అంటుంది: "ఎంత సుఖం ఉందో-ఇంత ఊరింది-ఏనుగు అయింది" అని. ఆ మాట వింటుంది పిన్ని. ఆమె ఏనుగులాంటి దేహాన్ని దాచుకొని ఒంటి పంటిని బయటపడేస్తుంది. పిన్ని ఎందుకలా నవ్వుతుందీ అంటే దానికీ అర్థం ఉంది. సరస్వతి సంతోషంగా ఉండాలని పిన్ని సంకల్పం. ఎంచేతటంరా, బట్టలు కుట్టిన డబ్బంతా పిన్ని బొక్కసంలోకి పోతుంది. దిక్కులేని సరస్వతి పిన్ని పాలబడ్డప్పుడు సరస్వతికీ తనకూ ఎలాంటి సంబంధమూ లేదని చెప్పుకుంది. ఏదో పుణ్యమని ఇంత తిండి పడేస్తున్నానంది. సరస్వతి కుట్టుపని చూచి వన్నెల విసనకర్రలు కూడా ముగ్గులయితే సరస్వతి పిన్నికి సాక్షాత్తు మేనకోడలు అయిపోయింది. 'లేడీస్ టైలరింగ్ ఫర్మ్' అని బోర్డు తగిలించింది. ఇప్పుడు సరస్వతి ముందు ఎప్పుడూ రంగు రంగుల బట్టలు పడుంటాయి. ఆమె సదా మిషను మీద వంగి ఉంటుంది.
ఇంటికి చేరుకున్నాను. సరస్వతికి పూలు సమర్పించాలి. ఎలా సమర్పించాలో అర్థం కాలేడు. దోవ పొడుగునా ఎన్నో ఆలోచిస్తూ వచ్చాను. ఆమెను చూచాను. అన్నీ మరచాను. మాటలు మోసం చేశాయి. పలుకు బయటపడ్డంలేదు. మౌనంగా, వణికే చేతుల్తో, పూలు మిషను మీద ఉంచాను. రెండుమూడు రాలి పడ్డాయి. ఒకటి ఆమె వడిలోకి దొర్లింది. మరొక లేత మొగ్గ సూదికిందపడి ముక్కలు ముక్కలయింది. ఈ ప్రమాదం నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది. ఆమె మిషను ఆపింది. నన్ను చూచింది. ఆ చూపులో గౌరవం ఉంది.
