ద్వితీయ భాగము
మంగళగౌరి
శ్రావణమాసము. గోదావరి గాలులతో, వర్షపాతములతో, ముసురులతో, సూర్యనారాయణుని దాగుడుమూతలతో, సర్వత్ర పొడచూపు శాద్వలహరితవర్ణముతో వరదల బురదనీటి జేగురు వర్ణముతో, నీలిమబ్బులతో మంగళవారము నాడు వీధుల తేలియాడు మందగమనల కౌశేయ వివిధ వర్ణములతో బ్రత్యక్షమగును.
ఆడువారి మంగళవారముల నోములీమాసమున ఏల ఏర్పడెను? వివాహమైన వెనుక ఐదు సంవత్సరములీ నోము నోచుకొనవలెనట. నోము పట్టిన పిమ్మట నే వత్సరముననైన నుద్యాపన చేయవచ్చునట. పెళ్ళిలో 'సప్తపది' నాడు ఉద్యాపన చేసికొనవలెను. ఆ వధువునకు మంగళసూత్రము మెడనుగట్టి, కాళ్లకు మట్టియలు దొడిగి, పాదాంగుళులపై మిఠాయి నుంచి, పదమూడు జతల యరిసెలు గిన్నెలో నుంచి, రవికెల గుడ్డ వాసినెగట్టి, పసుపు కుంకుమలతో వాయనమిచ్చి, యుద్యాపన చేసికొనవలెనట. శ్రావణ మంగళవారమునాడుదయమున నభ్యంగన మొనరించి, మడితో మంగళగౌరీదేవి నారాధించి కథ చెప్పుకొని, యక్షతల శిరస్సున నిడుకొని, చలిమిడి గురుగులందు నావుచేతితో దీపాలు వెలిగించి, యా పొగతో కాటుకబట్టి నేత్రముల నలంకరించి, మహానైవేద్యము, సెనగలు నైవేద్యము సమర్పణజేసి ముత్తయిదువులకు బసుపురాచి, బొట్టుపెట్టు, కాటుకనిచ్చి, గంధమలది, తాంబూలములతో సెనగల వాయనమీయవలెను.
శ్రావణ మంగళవారముల నూరిలోనున్న వనితామణు లొకరి పరిచయమొకరు సంపాదించుకొని కుశలప్రశ్నలు లొనర్చుకొనుచు, విడ్డూరముల నాడుకొనుచు, లోకాభిరామాయణము చెప్పికొనుచు, వీరిని వారిని ఆడిపోసుకొనుచు, నగల విషయ మడుగుకొనుచు గాలక్షేప మొనర్తురు. తమకున్న చీని చీనాంబరముల, బనారసు, బెంగుళూరు, మధుర చీరల ధరించి, రవికలు తొడుగుకొని, యత్తరవు లలంది, పూవులు ధరించి, నగల గైసేసికొని, జుట్టులుగా మందగమనములతో వయ్యారముతో దారిలో క్రీగంటి చూపులతో దేవతా స్త్రీలవలె పేరంటములకు బోవుదురు. చేతనున్న రుమాళ్ళయందు సెనగలు మూటగట్టుకొందురు. మాతలు శిశువుల నెత్తికొనియే బయలుదేరుదురు. విలాసవతుల హావభావముల గమనించి యువ్విళ్ళూరుటకు వేషములు దాల్చిన కోడెగాండ్రు పనియున్న వారివలె నూరంతయు దిరుగుదురు. ఇంతలో నొక జడివచ్చిన బరుగిడలేక యెట్లో నొకపంచ జేరి వాల్గంటుల జూచి దరహాసవదనులగుదురు. కొత్తపేటలో సూర్యకాంతమును, ఒక వత్సరము మానివేసినందున, మాణిక్యమును నోముబట్టిరి. తమ యింట నాచారమున్నది గాన గోడలిచే నోము పట్టింపవలయునని సుబ్బారాయుడుగారు వియ్యకునకు వ్రాసినారు.
పూర్ణిమ ముందు శుక్రవారమునాడు జమీందారుగారి యింట వరలక్ష్మీ వ్రతము జరిగినప్పుడు జానకమ్మగారు పూర్ణాభరణభూషితురాలై వరలక్ష్మీ వలెనే వియ్యాలవారింటికి వెళ్ళినది. కోడలికి నిరువది కాసులును, వియ్యపురాలికి గోడలికి వెలగల చీరలును, బంగారు కుంకుమ బరణియు నన్నూరు రూపాయల వెండి బొమ్మసామాను మొదలగునవి శ్రావణపట్టి పట్టుకుని వెళ్ళినది. జమీందారుగారు సోదరితో నాలోచించి యల్లునికి వేయిరూపాయల సరుకు లాషాఢపట్టి పంపించినారు. కోడలిచే నోము నోపించి జానకమ్మగారు కోడలితోపాటు చారుమతీదేవి కథ విని మూడవ వారము వరకు అచ్చటనే యుండుడని సుందర వర్ధనమ్మగారు కోరుటచే నాగిపోయెను.
రాజమహేంద్రవరములో శారదతో నామె పెద్ద పెద్దవారిండ్లకు కారుమీద వెళ్ళివచ్చినది.
మంగళగౌరీదేవి కథ వినినప్పుడు శారద మేనత్తను కథార్థము విపులముగా నడిగినది. బిడ్డలు లేని భార్యాభర్తల తపస్సు, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమగుట, 'అయిదవతనము లేని బాలికయా, ఆయుష్షులేని బాలుడా వర'మన్న ప్రశ్న. బాలుడు కావలెనని కోరుటయు, బాలుడు జనించుటయు, కుమారుని గొనిపోవ యముని దర్శనము, పదునారవ యేట పదునారవరోజు గొనిపోయెదనని యముని వాగ్ధానము (పండ్రెండవయేట, పండ్రెండవ మాసాన, పండ్రెండవ దినాన నని కొందరి మతము), ఆ దినము వచ్చుముందు కుమారుడు మాతులునీతో మృత్యువును దప్పించుకొను మార్గము దొరకదాయని దేశములపాలగుట, వారట్లు పోవుచుండ, నొక నగర బాహ్యోద్యానవనమున గొందరు బాలికలు పూలుగోసుకొనుచుండ రాచవారి బాలయొక్క పూలు ఒలికిపోయి యెప్పటియట్ల చెట్లపై జేరుకొనుట, అది కనుగొని మాతులు డాబాలను ఒప్పించి తన మేనయల్లునకు వివాహము చేయుట, ఆ బాలిక యింటికి పోయి, తల్లిదండ్రుల ఇచ్చచే నా బాలకునికి సరియైన కర్మకాండతో నతివైభవముగ పెండ్లి చేయుట మున్నగు వివరముల నెఱిగికొన్నది. ఆ బాలకుని మృత్యుదినంబునాటి రాత్రి, మృత్యువు పండ్రెండు తలల యాదిశేషుడై వచ్చి నిదురబోవు యువకుని కాటు వేయబోవుచుండ నచ్చట నా రాజకుమారి మిఠాయియుండనునిచెనట. శేషుడా యుండపై కాటువేసెనట. ఆ బాలిక యొక యరిసెల పాత్రను జూపుటయు నా సర్ప మందు దూరెనట. తన కంచుక మూడ్చి యా పాత్రపై వాసన గట్టినదట. అటువెనుక భర్త దేశాలు తిరుగబోయెనట. భర్త దేశాలు తిరిగివచ్చునప్పటికి ఆ పాము బంగారు పామై యుండెనట.
జానకమ్మ గారు సర్వ సౌందర్యాలు వెలిగిపోవు కోడలిని జూచి ఆనందపరవశురాలైనది. అటు నవమన్మథుడగు కుమారుడు, ఇటు సౌన్దర్యోజ్జ్వలయగు కోడలు, సాక్షాత్కరించిన రతీబాల. ఒకరికొకరు జన్మించినారా!
ఆ రాత్రి జానకమ్మగారు కోడలికి ఉప్పు మిరపకాయలను, పారాణి నీళ్ళు దిష్టి తీసి, పారాణి నీళ్ళు దొడ్డిలో దూరముగాను, ఉప్పు మిరపకాయలను నిప్పులోను వేసినది. యెంత దిష్టి తగిలెనో కాని ఘాటేమియు రాలేదట. ఈ వింతను వరదకామేశ్వరీదేవి చూచి వెడనవ్వు నవ్వుకొన్నది.
శారదకివి యన్నియు జిత్రముగా నుండెను. అత్తవారింటివారు పూర్వ సంప్రదాయములతో, పూర్వాచారములతో మెలగుదురు. తన పెద్దత్తగారు నిప్పులు కడుగును. మైలపడితినేమోయన్న భయముచే పదిసార్లు స్నానము చేయును. ఏ పర్వదినము వచ్చినను గోదావరికి స్నానమునాకు బోవును. వంట వండుటకు వలయు జలమంతయు దానే తోడుకొనును. తక్కినవారికొక నీళ్ళ బ్రాహ్మణుడు నీళ్ళు పోయును.
ఆ మరునాడు జానకమ్మగారు కొత్తపేట వచ్చివేసినది.
జానకమ్మగారికంత చేదస్తము లేకపోయినను ఆమెయు పూర్వాచారవతియనియే యెన్నవలెను.
వంటింట్లోకి పిల్లలెవ్వరు వెళ్ళగూడదు. వారి భోజనాల గది వేరు. ఉదయము వారి వంటజేయవలసినదచ్చటనే.
లక్ష్మీ నరసమ్మగారు భోజనము వేళ మంచినీరు త్రాగిన చెంబులోని నీటితో జేయికడుగనీయదు. పట్టుబట్టలగాని, మడిబట్టలుగాని కట్టుకొనకుండ భోజనము చేయరాదు. బొట్టు లేకుండా నుండరాదు. ఆమె మోమోటము లేకుండ నెట్టి వారిని లెక్కచేయకుండ నాచారము గమనించుడని బోధించుచుండును. శారద యత్తవారింటనున్న గృహప్రవేశపు రోజులలో ఆమె కాచారవిషయికములగు నీతులెన్నియో పెద్దత్తగారు కఱపినది. తాంబూలము నమలుచు శారద పంటిలో దూరిన నలుసును చేతితో దీసికొని రుమాలుతో తుడుచుకొనుచుండ లక్ష్మీ నరసమ్మగారు చూచి 'అయ్యయ్యో! యెంగిలమ్మా, తల్లీ! చేయి కడుక్కోవమ్మా. ఆ రుమాలును పనిచేసేది తడిపి ఆరేసే గుడ్డలో వెయ్యి' అని కోడలిచే నాపనులు చేయించినది.
'ఏమే అక్కా! ఇంత చాదస్తం నీకెప్పుడు తగ్గుతుందే?' యని జానకమ్మ పాటపాడుచునే యుండును. అయిన నేమి లాభము?
లక్ష్మీ నరసమ్మ వేదాంతురాలు. ఎప్పుడును వేదాంత గ్రంథాలు చదువుచుండును. చదివించుకొనుచుండును. ఆమెకు జుట్టముల గ్రామములందు పలువురు శిష్యురాండ్రున్నారు. వారందరు గురువుగారిని దర్శించుటకు వచ్చుచూనే యుందురు. అప్పుడు గురువుగారి పాదాలకు నమస్కరించి, ఫలములు, రూపాయలు, వెండి గిన్నెలు దక్షిణలిచ్చి వేదాంతపు ముక్కలు చెవిలో వేసికొని యానందించుచుందురు. నోరూర జక్కగా వేదాంతోపన్యాసాలు చేయగలదామె.
