"అని ఎలా చెప్పగలం?" అన్నాడు అంకుష్.
"మనం చెప్పం. సైన్స్ చెబుతోంది విను!" అని చెప్పడం మొదలుపెట్టాడు సాహస్.
"దాదాపు పది సంవత్సరాల క్రితం అల్లాన్ విల్సన్ అనే శాస్త్రజ్ఞుడు ఒక పరిశోధన చేయడం మొదలుపెట్టాడు."
"ఏమనీ?"
"జీవకణాల్లో డీఎన్ఏ అని వుంటుందికదా! తండ్రి తరఫున సంక్రమించిన డీఎన్ఏలో మైటోకాండ్రియా వుంటుంది. అది తరాలు గడిచేకొద్దీ మార్పులు చెందుతూ వుంటుంది. ఈ మార్పుల సాయంతో ఒక 'గడియారం' లాంటిది రూపొందించగలిగాడు అల్లాన్ విల్సన్. అలా కాలంలో వెనక్కి వెళితే ఇప్పటి జనాభా అంతటికీ పూర్వీకులు రెండు లక్షల సంవత్సరాల క్రితం జీవించి వుండిన ఒక నీగ్రో స్త్రీ అని తేలింది."
"నమ్మడం చాలా కష్టంగా వుంది" అన్నాడు అంకుష్.
"మనిషి మాటలు నమ్మొద్దు. కానీ మనిషి ఒంట్లో వుండే జీన్స్ అబద్ధాలు చెప్పవుగా! ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరగాలి. ఇంకా అనుమానం వుంటే హైదరాబాద్ లో 'సెంటర్ ఫర్ మాలిక్యులార్ బయాలజీ' వుంది కదా. వాళ్ళని అడుగు."
"అడుగుతాను అసలంటూ ఇక్కడనుంచి వెనక్కి వెళ్ళగలిగితే" అన్నాడు అంకుష్ డల్ గా తన పరిసరాలని చూస్తూ.
"నో ఫియర్ బాయ్...ఐ యామ్ హియర్" అన్నాడు సాహస్.
"వాటీజ్ ఫియర్?" అన్నాడు అంకుష్ అంతలోనే పుంజుకుంటూ.
నవ్వి అంకుష్ భుజం మీద చరిచాడు సాహస్.
మళ్ళీ అన్నాడు అంకుష్.
"బ్రదర్! ఇదంతా పదేళ్ళ క్రితం జరిగిన పరిశోధన అంటున్నావు కదా! మరి అందరికీ తెలియలేదేం!" అన్నాడు సందేహంగా.
"ఈ ప్రపంచం అంతా వసుధైన కుటుంబం అనీ, ఇప్పుడున్నవాళ్ళంతా ఒక పురుషుడికీ, ఒక స్త్రీకీ పుట్టిన సంతానమేననీ చెబితే ఎవరికి ఇంట్రెస్టు వుంటుంది? మనమందరం వేరే వేరే అని చెప్పేమాటలే ఇంట్రెస్టుగా వుంటాయి. పైగా ఇలాంటి పరిశోధనలకి ఎవరూ ఎక్కువగా ఫండ్స్ ఇవ్వరు. మిలిటరీ అవసరాలకి పనికివచ్చే పరిశోధనలకీ, వ్యాపారానికీ పనికివచ్చే పరిశోధనలకీ మాత్రం బిలియన్ల డాలర్లు ఫండ్స్ గా వస్తాయి" అన్నాడు సాహస్.
అదే టైంలో -
ప్రొఫెసర్ అన్ వేషీ తన కోసమే ప్రత్యేకంగా అరేంజ్ చేయబడిన ఛార్టర్డ్ ఫ్లయిట్ లో సౌఖ్యంగా వెనక్కి జారగిలబడి కూర్చుని తన పరిశోధనల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
మనుషులని అంగుష్ట మాత్రులుగా మార్చే విధానం కనుక్కున్నాడు తను.
ఈ పద్ధతిని పేటెంట్ చేయాలి.
దీనివల్ల తనకి అపారమైన ధనరాశులు రావాలి.
కానీ...ఎలా?
చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు అన్వేషి. ఆ తర్వాత కులాసాగా తనకి యూనివర్శల్ బ్యాంక్ కి అడ్వయిజర్ గా అసైన్ మెంట్ వచ్చిన సంగతి తన మిత్రులందరికీ అక్కణ్ణుంచే ఫోన్ చేసి చెప్పడం మొదలుపెట్టాడు.
* * * *
అక్కడ -
రాజధాని నగరంలో
ఒక రోడ్డు మీద -
స్కైలాబ్ అనే తమాషా మనిషి తన అలవాటుకొద్దీ స్వగతంలా చెబుతూనే వున్నాడు.
"చూస్కో! ఇక కొత్త పాలన మొదలయిందిగా. ఎవరైనా సరే పవర్ లోకి రాగానే ప్రజలని ఎలా ఫూల్ చెయ్యాలా అని ఆలోచిస్తూ వుంటారు. ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో ఏం చేశారు? ప్రభువులు ప్రజల కష్టాలు తీర్చలేక సర్కస్ లు అనే వినోదాలు ఏర్పాటుచేసి ప్రజలని బుజ్జగించే ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అధినేత ఒక్కొక్క రకం జిమ్మిక్కులు చేస్తూ వుంటాడు. ఆ జిమ్మిక్కుల ఖరీదు అంతా ప్రజలే పెట్టుకుంటారు చివరికి! కానీ ఆ సంగతి ప్రజలకి తెలియదు!" అని తన ప్రక్కనవున్న వాడివైపు తిరిగి "ఇప్పుడు నువ్వు వున్నావా...నీ పేరిట కనీసం లక్ష రూపాయల అప్పు వుంటుంది" అన్నాడు.
ప్రక్కనున్న వాడు స్కైలాబ్ ని వెర్రి గొర్రెని చూసినట్టు చూసాడు.
"నీకేం పిచ్చా వెర్రా! నేను చాలా కరెక్టు మనిషిని. నెలకు వెయ్యి రూపాయలు బ్యాంకులో వేసి తీరుతాను. చచ్చినా అప్పుచెయ్యను. నా పేరిట అప్పేమిటి? అప్పు?"
"అందరూ అలాగే అనుకుంటారు. కానీ ప్రభుత్వాలు చేసిన అప్పులు ప్రజలే తీర్చక తప్పదు. ఇప్పుడున్న అప్పులని అందరికీ పంచితే తలొక లక్షా తేలుతుంది. పైగా..."
"వెర్రిమేళం" అంటూ పక్కవాడు చక్కా పోయి జనంలో కలసిపోయాడు.
సరిగ్గా అదే టైంలో...
