నిర్లక్ష్యంగా ఓ చూపుచూసి ముందుకు నడవబోయింది. అతని చెయ్యి ఆమె రెక్కపట్టుకుని బలంగా ఆపింది. "ఏయ్! ఏమిటిది? ఒకసారి పరాభవం జరిగినా బుద్ధిరాలేదా?" ఆమె విసురుగా వదిలించుకోబోయింది.
కాని అతని చెయ్యి ఆమెను వదిలిపెట్టలేదు. 'ఆడపిల్లవు. అంత పొగరు కూడదు.' అంటూ రెండు చేతులూ ఆమె భుజాలమీద వేసి దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె మెరుపులా ముఖం ప్రక్కకి త్రిప్పుకుని వెనక్కి జరిగి చెంపమీద ఫెడీమని కొట్టింది.
విలాస్ కళ్ళు యెర్రబడ్డాయి. అతని నోట్లోంచి సెగలతోపాటు, బ్రాందీవాసన వెలువడుతోంది. దగ్గరలో కనుచూపుమేరలో ఎవరూలేరని అతను ముందే నిర్ధారణ చేసుకున్నాడు.
"నీ ఒంట్లోని పొగరు నాకు తెలుసే. అందుకే నిన్ను నలిపి పారేస్తాను. అణువణువునా జుర్రిపారేస్తాను" అంటూ చేతులు చాచి ఆమెను అందుకోబోయాడు.
'ఏడిశావు' అంటూ మళ్ళీ విసురుగా అతని చెంపమీద కొట్టింది.
"రాస్కెల్" అంటూ కోపంతో అతను చేతిని గాల్లోకి విసిరాడు. ఆమె చెంప పగిలిపోయినట్లయింది. కళ్ళు చీకట్లు క్రమ్మాయి.
ఆమెను రెండు చేతులతో పొదివి పట్టుకుని ప్రక్కకి లాగుతున్నాడు. వర్ష తెలివి తెచ్చుకుని బలమంతా ఉపయోగించి అతన్ని ఎదిరించింది. అతను తూలిపడబోయి అంతలో సర్దుకున్నాడు. అప్పటికే ఆమె తప్పించుకుని పొలాల్లో దిగి పారిపోతోంది. కోపం, కసి, కామం అతన్ని రాక్షసుడిగా చేశాయి. ఎక్కడకు పారిపోగలవే, లం..." అంటూ ఆమె వెంట పడ్డాడు.
ఆడపిల్ల, సుకుమారి, భయంతో ఒణికి అదుపు తప్పుతోన్న పాదాలు ఎంతదూరం పారిపోగలదు? ఎక్కువ దూరం పోకముందే అతను చేజిక్కించుకున్నాడు.
'వొదులు నన్ను...నీకు' ఆమె కళ్ళవెంట నీళ్ళు జలజల రాలుతున్నాయి.
"ప్రతిఘటించడం పోయి ప్రాధేయ పడటంలోకి వచ్చిందా?" అతను వక్రంగా నవ్వి ఆమెను వెనక్కి తోశాడు.
నిలద్రొక్కు కుందామనుంది. శక్తి చాలలేదు. తూలి వెనక్కి పడిపోయింది. తలకి దెబ్బతగిలి 'అమ్మా' అని మూలిగింది. కళ్ళముందు చీకట్లు ఆవరిస్తున్నాయి.
"వొద్దు...నన్ను...న...న్ను"
అతనిలో జాలిలేదు. మానవత్వం లేదు. కామంతో పులిసి, బలిసిన ఎనుబోతులా ఆమె మీదకు వ్రాలుతున్నాడు.
ప్రపంచంలో లక్షలాదిసార్లు జరిగినట్లు ఓ అబల కామాంధుడి చేతుల్లో ఆహుతి కాబోతోంది.
మీదకు వొరుగుతున్నాడు. ఉన్నట్లుండి తలమీద బలంగా ఓ దెబ్బ తగిలింది. అదిరిపడి ప్రక్కకి తిరిగి చూశాడు.
శ్రీహర్ష!
విలాస్ జుట్టు పట్టుకుని లేవదీసి బలంగా మొహంమీద ఇంకోసారి చరిచాడు. 'దుర్మార్గుడా! చదువుకున్నవాడివి బుద్ధిలేదా? ఓ ఆడపిల్లను బలాత్కారం చేస్తావా?"
విలాస్ కళ్ళు యెర్రబడి జ్వాలల్లా మండుతున్నాయి. అతనిలోని పశుత్వం మరింత విజృంభించినట్లయింది. 'ఇది నా సొంత విషయం. అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు యిక్కణ్ణుంచి వెళ్ళు' అన్నాడు.
"ఒక ఆడపిల్లను రేప్ చెయ్యబోవడం నీ సొంత విషయమా? అది రెండో వ్యక్తికి అనవసరమా? ఏదో తమదార్న తాము బ్రతుకుతుంటే యితరుల జీవితాల్లోకి దూరి అరాచకాలు చెయ్యటానికి ఎవరిచ్చార్రా నీకధికారం."
"ఒరేయ్! దాన్ని నాకు వొదిలిపెట్టి యిక్కడనుంచి వెడతావా? వెళ్ళవా?"
శ్రీహర్ష అతనివైపు అసహ్యంగా చూసి వర్ష దగ్గరకు వెళ్ళి ఆమెను లేవదీస్తున్నాడు.
అహం, అవమానం, ప్రతీకారం అతన్ని మరింత రాక్షసుడిగా మార్చాయి. ముందుకు ఒక్క దూకుదూకి శ్రీహర్ష మెడ పట్టుకున్నాడు. అతను వదిలించుకునేటంతలో బలంగా పక్కకి తోశాడు.
శ్రీహర్ష బ్యాలెన్స్ తప్పి ప్రక్కకి పడిపోయాడు.
విలాస్ ఆగలేదు. మీదకు వెళ్ళి మొహం పగిలిపోయేటట్లు ఫెడీఫెడీ తన్నాడు. రెండు మూడు క్షణాలు తల తిరిగిపోయినట్టయింది. మూర్తీభవించిన కిరాతకుడిలా విలాస్ అతని మీద పడి గొంతుపట్టి పిసుకుతున్నాడు. శ్రీహర్షకు ఊపిరాగిపోతున్నట్టనిపించింది. ఒక్కక్షణం...ఊహూ- వీడికి ఓడిపోకూడదు. శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని రెండు చేతులూ బిగించి నుదుటమీద బలంగా కొట్టాడు. విలాస్ ఈ ప్రతీఘాతాన్ని ఊహించలేదు. శ్రీహర్ష కంఠం మీది అతని చేతులు కొంచెం సడిలాయి. ఇదే అదను చూసి శ్రీహర్ష ఒక్కతోపుతో అతన్ని కింద పడవేసి లేచి నిల్చున్నాడు. విలాస్ కూడా విసురుగా లేవబోయాడు. శ్రీహర్ష అవకాశమివ్వలేదు. కాలిని బలంగా గాల్లోకి విసిరి ఫుట్ బాల్ ని తన్నినట్లు తన్నాడు. విలాస్ నేలమీదే పడి ఉండి రెండు దొర్లులు దొర్లాడు. తర్వాత శ్రీహర్ష అతని ఊపిరి సలపనివ్వలేదు. దెబ్బమీద దెబ్బ నడుంమీద, వీపుమీద, మొహంమీద....
