Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 33

"ఆ అనుమానం మీ కెందుకొచ్చింది సర్?"
"మాకూ కొన్ని కోర్కెలుంటాయి. కత్తుల దారుల్ని ఎంచుకొన్న మీరు కళ్యాణం గురించి ఆలోచించరేమో అనే భయం పట్టుకుంది. మా పేద దంపతులకు జీవితంలో వున్న ఆ ఒక్కకోర్కె తీరదేమో అనే ఆందోళన కూడా కలుగుతోంది!"
అందుకు సాజిత్ కాస్త బిగ్గరగానే నవ్వుతూ....
మీ ఆదోళనల్ని మా మీద వెలుబుచ్చకుండా మీ ఆశీర్వాదాల్ని మా మీద వుంచండి సర్! అవే వేయి ఏనుగుల బలం అయి- మమ్మల్ని ముందు జీవితంలో అజేయుల్ని చేస్తాయి."
తిరుమలరావు సాజిత్ దగ్గరకు పోయి__
"చూడు బాబూ! మా ఆకాంక్షలూ- అభిమానాలూ, ఆప్యాయతలూ అన్నీ మీతో వున్నప్పుడు ఆశీర్వాదాలు కూడా వాటితోనే వుంటాయి. పరిస్థితుల అననుకూలతలో ఆందోళనలు కూడా వుంటాయి.
సరే....మీ దారుల్లో మీరు విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
పెళ్ళిపీటల మీద కూడా మిమ్మల్ని ఆశీర్వదించే శుభ ఘడియల కోసం ఒక ఆడపిల్ల తండ్రిగా తపిస్తూ తిరిగి నీ గదికి తరచూ వస్తానని కూడా చెప్పుకుంటున్నా" అని తిరుమలరావు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఆయన గమ్యం...వీరిని గురించి ఆందోళన కాదు. తను సాధించాలనుకున్న ఫూర్ విద్యార్ధుల విద్యాయజ్ఞం! అందులోంచి మరెందరో సాజిత్ లాంటి-పావనిలాంటి ధైర్యో పేతమైన తరం కదిలి రావాలి.
నిజానికి తను ఇప్పటివరకూ ఒక అర్ధంలేని భయమే అనుభవించాడు. అది తండ్రిగా సహజమే కావచ్చు. కానీ ఒక జాతిలోని వీరుడిగా నిజాయితీగా మాత్రం ఆలోచించలేకపోయాడు.
ఈ దేశానికి స్వాతంత్ర్యం రావటం ఒక ఎత్తయితే....దాన్ని కాపాడి, ప్రజల కందించటం మరో ఎత్తు.
ఆంగ్లేయులతో చేసిన బాహ్య పోరాటం కంటే- ఈ నీతిబాహ్యమైన పాలకులతో చేసే అంతర పోరాటానికే తాము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది ముందు ముందు నిరంతరం సాగిపోవాలి.
ఈ స్వంత ఇంటి పోరాటంలో ఈ యువతరమంతా సైనికులుగా మారుతున్నారు. సాజిత్ అన్నట్టు తన ఆందోళనకంటే ఆశీస్సులే వారికి రక్షగా నిలుస్తాయి. తిరుమలరావుగారు గట్టిగా అనుకున్నారు.
తరువాత ఆయన పాదాలు అంబరీషుడన్న హైటెక్ సిటీ వైపుగా దారితీశాయి.
రుక్మిణి రెండు లక్షల కోసం తనను రమ్మంది.
తరువాత కోటి రూపాయలు కూడా దొరికే దారి తన కళ్ళ ముందు స్పష్టంగా వుందని కూడా చెప్పింది.
ఏది ఆగిపోయినా....ఈ విద్యాయజ్ఞం ఆగిపోకూడదని చెప్పింది. అది తనను ఆనందం లోతుల్లోకి తీసుకుపోయింది. కొందరు 'జీవితం' రిటైర్ అవ్వగానే అయిపోయిందనీ- ఆగిపోయిందనీ అనుకుంటారు. నిరుత్సాహపడతారు.
కానీ ఈ ప్రాజెక్టుతో తన జీవితం ఇప్పుడే మొదలయింది. ఇప్పటివరకూ తను జీతం తీసుకుంటూ చదువు చెప్పాడు. నానీ ఇప్పుడు జీవితం ఇచ్చుకుంటూ ఒక యజ్ఞం పూర్తి చేస్తాడు.
ఆయన అనుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆయన వెళ్ళగానే సాజిత్ ఫోన్ దగ్గరకొచ్చి, పావనికి రింగ్ చేశాడు.
అవతల పావని తీసుకుంది.
"హలో...."
"పావనీ...ఐయామ్ సాజిత్!"
"ఏమిటి....ఆ కోతి చేష్టలు-"
"స్వీట్ సారీ డియర్! చైనీస్ వే ఆఫ్ లవ్ లో చిన్న టెక్నిక్ వుంది. 'మంకీ' మల్లెపొదను పట్టుకు వూపినట్టు ప్రియుడు తన ప్రియురాలిని నడుము దగ్గర పట్టుకుని పులకింతలుగా ఊపుతాడు. ప్రియురాలు మల్లెపువ్వులా ....గల గల మణి నవ్వుతుంది. ఆమె ఒంటిమీద పలువలు కూడా వదులయి...ఎరోటికా సింబల్స్ అతన్ని మరింత మత్తులోకి తీసుకెళతాయి.
అయితే డియర్!
నా హైటెక్ ప్రాసెస్ లో నేను మంకీ అయినప్పుడు తమరి డాడీ గదిలోకి ఎంటరయ్యాడు.
నేను అప్పుడు నిజంగా నిన్ను పట్టుకుని లవ్ లీగా ఊపుతూ....చైనీస్ టైపులో శృంగార తరంగాల్ని అనుభవిస్తున్నట్టూ, ఆయనది చూసినట్టూ ఫీలయి- గభాల్న నన్ను మాత్రమే ఆ రొమాంటిక్ వర్క్ నుండి డిస్ కనెక్టు చేసుకుని....నిన్ను కాస్తంతసేపు మర్చిపోయాను. నేను మర్చిపోయినా- నా హైటెక్ చాంబర్ లోని మైక్రోమిషన్ నాకంటే 'మంకీ'కదా! అది నిన్ను చక్కిలిగింతలూ- గిలిగింతలూ పెడుతూ అలాగే వుండిపోయింది. మీ డాడీతో సంభాషించి .....మన పెళ్ళి త్వరలో ఖాయమ్చేసి....అప్పుడు నిన్ను అందులోంచి విముక్తం చేశాను."
సాజిత్ నవ్వాడు.
పావని కూడా మెల్లిగా నవ్వింది.
మరలా మరోమారు....మన ప్రేమను యూరోపియన్ టైపులో" సాజిత్ అన్నాడు.
ప్రేమించటానికి తమరికి ఓపికున్నా-ప్రేమించబడటానికి నేనిక్కడ అలసిపోయాను.
ప్రేమల్ని గురించి కాస్సేపు ప్రక్కకు జరగండి. ముంచుకోస్తున్న ప్రమాదం గురించి ఆలోచించండి. మా డాడీ ఒకటే గోల. కత్తుల పదునుమీద నడక మొదలెట్టావ్. ఆడపిల్ల తండ్రిగా నేను ఆందోళన చెందుతున్నానన్నాడు" పావని టోన్ లో ఆందోళన.
"ప్రమాదాలదేముంది మేడమ్! ఈ దేశంలో నిత్యం దొరికేవీ- ఇంతా బయటా జరిగేవీ అవే. ప్రేమలే దొరకవు. అవిప్పుడు మన విషయంలో అంతర్జాతీయ స్థాయిని అందుకున్నాయి. మనం ప్రపంచ ప్రేమికులం" సాజిత్ అన్నాడు.
సాజిత్ అలా అనటంతో...
ఇరువురూ పెద్దగా నవ్వుకున్నారు. వీరిలా పెద్దగా నవ్వుకుంటున్న క్షణాలకు....

                     *    *    *    *
అంబరీషుడి గెస్ట్ హౌస్!
జనార్ధన్ కు బదులు మరో సీనియర్ పి.ఏ.ని అంబరీషుడు అపాయింట్ చేసుకున్నాడు. అతని పేరు అనంత్. వయసు ఏభైసంవత్సరాలకు పైబడింది. మనిషి లావుగా, గుమ్మడికాయలా వుంటాడు. పదేళ్ళ క్రితం ఒక కేంద్ర మంత్రిగారికి ఢిల్లీలో పి.ఏ.గా చేరి ఆయన్నే కుంభకోణం చేసి ఇంటికి పంపబడ్డాడు.
కొన్ని విషయాల్లో అనంత్ గారికి మంచి పేరుంది. ఎలాంటి కుంభ కోణాన్నయినా, తమ కనుకూలంగా ఉండే లంబ కోణంగా మార్చి...అంతా సమమట్టం చేసే దిట్టనీ...కాకుంటే ఆయన్ను గురించే జాగ్రత్తపడాలనీ సెక్రటేరియట్ లో చెప్పుకుంటారు.
అలాంటి పేరున్న అనంత్ అంబరీషుడి క్కూడా తెలియటంతో జనార్ధన్ను ఇంటికెళ్ళమన్న రాత్రే తన మనిషిని ఒకరిని పంపి అతన్ని తన గెస్ట్ హౌస్ కి పిలిపించుకున్నాడు.
ఆ రాత్రే అంబరీషుడు అనంత్ కు జరిగినదంతా చెప్పాడు. మరుదినం తన పి.ఏ.గా జాయిన్ కమ్మని చెప్పాడు.
అనంత్ అంబరీషుడితో అన్నాడు.
"అడుగుజారిన కుండలో నీళ్ళు తేవాలన్నా అనంతకోటి వుపాయాలుంటాయ్ సార్. ఈ విషయంలో తమరేం కంగారుపడకండి.
ఈ కుంభకోణంలోని కొందరు వ్యక్తులు పరారీలో వుంటారు. వారు ఇక తిరిగి రాజధాని రారు. సి.బి.ఐ. కాదు కదా....అమెరికన్ సి.ఐ.ఏ.లూ- రష్యన్ కె.బి.జీ.లూ దిగినా వారు దొరకరు."
"అదేమిటయ్యా! ఎందుకు దొరకరు?"
"దొరకరు సార్! మనం దొరకనీయం!"
పరారీలు రెండు రకాలుగా వుంటాయి. ఒకటి ఈ భూమి మీదే శరీరంతో పరారీలో ఎక్కడో ఒక చోట వుంటాడు. అతడు ఎప్పటికయినా సామాన్య పోలీసులక్కూడా దొరికే అవకాశం వుంటుంది.
ఇక రెండో పరారీ....
బొందితో కైలాసం పరారీ అయిపోతాడు. అతని శరీరం ఇక్కడే ఎక్కడో మట్టిలో మట్టిగా మారిపోతుంది! వాళ్ళు దొరికితేనే మన కుంభకోణం బయటికి వస్తుంది. వాళ్ళు సి.బి.ఐ.కి దొరికితేనే మన కుంభకోణం బయటికి వస్తుంది. వాళ్ళు సి.బి.ఐ.కి దొరికి సాక్ష్యమిస్తేనే బోనెక్కేది. వాళ్ళు అంగీకరిస్తేనే మనం మన దగ్గరున్న మనీ కక్కేది. వారు అప్రూవల్స్ గా మారితేనే మనం ఊచలు లెక్కపెట్టేది.
అసలు నేరస్థులు పెఅస్తుతం వాళ్ళే గనుక....వారు మొదటి రకం పరారీలో వున్నారు. ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవటానికి వారికి రెండో రకంవి అప్లెయ్ చేద్దాం. కుందేలుగా గెంతి కోర్టుకెక్కాల్సిన కేసు-జబ్బుపడ్డ తాబేలు అవుతుంది. ఈ లోపు ప్రభుత్వాలు మారతాయి. అంటే....తమరున్న పార్టీ ఓడిపోయే పరిస్థితి వస్తుంది.
మార్పు సహజం సార్!
మీరప్పుడు గెలిచే పార్టీకి మారే ఏర్పాటు నేను చేస్తాను. మీరు ఆ పార్టీకి బోలెడంత ఫండ్ ఇస్తారు. మా నియోజక వర్గంనుండి మీరు తిరిగి తప్పకుండా గెలుస్తారు. అధికారంలోకి రాబోయే పార్టీకి ఆ మాత్రం చాలు.
అయితే మనం ఒక షరతు పెడతాం.
తాబేలులా నడుస్తున్న ఫైలును తిరగేసి-తిరగేసి అని ఎందుకన్నానంటే తాబేలును తిరగేస్తే తప్ప చంపటం సాధ్యం కాదుగనుక. కనుక....తాబేలును చంపినట్టు ఆ ఫైలును కూడా చంపేసి....తమరిని ఒడ్డువేయాలని.
అందుకు వారు ఆనందంగా అంగీకరిస్తారు, కారణం అందరి వెనుకా ఇలాంటి కుంభకోణాల టార్ టాయిస్ స్పీడ్ వాకింగ్ ఫైల్స్ ఎన్నో వున్నాయి గనుక."
అనంత్ అలా మాట్లాడుతుంటే అంబరీషుడు ఆశ్చర్యంగా వింటున్నాడు. మనసులో అనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS