5. సేనాపతులను - సర్వసైన్యమును
పవన కుమారుడు - నిర్మూలించెను |
ఈ వృత్తాంతము - వినిన రావణుడు
నిశ్చేష్టితుడై - పరివీక్షించెను |
తండ్రి చూపులు - తనపై సోకగ
అక్షకుమారుడు - దిటవుగ నిలువగ |
రావణుండు ప | ల్కె కుమారుని గని
ఆ వానరుని దం | డంప బొమ్మని .... ||శ్రీ||
__: 46 వ. స. సంపూర్ణము :__
47 వ. సర్గ
మారుతితో - అక్షకుమారుని యుద్ధము :
1. స్వర్ణఘటితమౌ - ధ్వజము గలది
రత్న ఖచిత గ | వాక్షములున్నది |
అష్టాశ్వములతో - కూడి యున్నది
ఆకాశమున - ఎగిరి పోగలది |
సూర్యుని బోలిన - కాంతులు గలది
మనోహరముగ - మెరయు చున్నది |
అక్షకుమారుని - తపః ఫలమది
అమూల్యమైన - దివ్యరధమది .... ||శ్రీ||
2. అక్షకుమారుడు - నవయౌవ్వనుడు
వేగవంతుడు - తేజోవంతుడు |
దివ్యాస్త్రములను - పొందినవాడు
మణిమయ స్వర్ణ కి | రీట శోభితుడు |
కాలాగ్ని వోలె - ప్రజ్వరిల్లెడు
రణధీరుడు - మహావీరుడు
అక్షకుమారుడా - దివ్యరధముపై
దాడి వెడలెను - హనుమంతునిపై .... ||శ్రీ||
3. చతురంగ బలాలు - కదలి రాగ
భూమ్యాకాశములు - మారు మ్రోగ |
అక్షకుమారుడు - ఏతెంచినాడు
ఆంజనేయుని | పరికించినాడు |
ఆశ్చర్యముగ | గమనించినాడు
బలాబలములు | యోచించినాడు |
మంచు తొలగిన - బాలార్కునివలె
రణరంగమున | చెలరేగినాడు .... ||శ్రీ||
4. మూడు శరములతో - మారుతి శిరమును
పది శరములతో - మారుతి ఉరమును |
అక్షకుమారుడు - బలముగ నాటేను
రక్తము చిందగ - గాయపరచెను |
ఉదయభాస్కర స | మాన తేజమున
మారుతి ఎగసె - గగన మార్గమున |
ఇరువురి నడుమ - భీకరమైన
పోరు చెలరేగె - ఆకాశమున .... ||శ్రీ||
5. అతి నేర్పుతోడ - రణము సల్పెడు
అక్షకుమారుని - మారుతి దయగొని |
బాలుని చంపగ - చేతులు రావని
వేచి చూచెను - నిగ్రహించుకొని |
అక్షకుమారుడు - అంతకంతకు
అగ్నిహోత్రుడై - రణమున రేగే |
ఇరువురి నడుమ - భీకరమైన
పోరు చెలరేగె - ఆకాశమున .... ||శ్రీ||
6. అగ్ని కణమని - జాలి కూడదని
రగులక మునుపే - ఆర్పుట మేలని |
సింహనాదమును - మారుతు జేసె
అరచేత చరచి - హయముల జంపె
రధమును బట్టి - విరిచి వేసె
అక్షుని ద్రుంచి - విసరి వేసె |
అక్షుని మొండెము - అతి ఘోరముగ
నేలపైబడె - రక్తపు ముద్దగ .... ||శ్రీ||
7. అక్షకుమారుని - మరణవార్త విని
లంకేశ్వరుడు - కడు దుఃఖించెను |
మెల్లగతేరి - క్రోధము బూని
తన కుమారుని - ఇంద్రజిత్తుగని |
ఆ వానరుడు సా | మాన్యుడు గాడని
వానిని వేగ బం | ధించి తెమ్మని |
రావణాసురుడు | ఇంద్రజిత్తును
హనుమంతునిపై | దాడి పంపెను .... ||శ్రీ||
__: 47 వ. స. సంపూర్ణము :__
