
22
"రజీ!"
"ఊ."
"నన్ను పెళ్లి చేసుకొంటావా?"
"ఛ, పో. ఎప్పుడూ నన్నేడి పించడమేనా నీకు పని" అని రజియా సిగ్గుతో చేతులతో మొహం కప్పుకోంది.
ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకోనున్న రాజ్ ఆమె చేతులు తీసివేసి "నా దగ్గర సిగ్గెందుకు? నువ్వు చెప్పకుంటే నీకిష్టం లేదను కుంటాను" అన్నాడు.
"అటువంటి మాటలు మాట్లాడే కంటే నన్ను చంపెయ్యి."
"మరి చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా?"
"ఊ."
"అలా కాదు.
"ఇంకెలా చెప్పమంటావు?'
"మిమ్మల్ని భర్తగా స్వీకరించి మీ పాద సేవకు నా జీవితం అంకితం చేస్తాను అని చెప్పాలి."
"అంత అదృష్టం ఉంటె ఈ జన్మకు ఇంకేం కావాలి?"
'ఉంటె ఏమిటి మధ్యలో పానకంలో పుడకలా" అని రాజ్ కమ్ము మూసుకొన్నాడు.
అతని మొహంలోకి చూసింది రజియా. నిర్మలంగా ఉన్న ఆ మోహంలో అతని భావాలను అర్ధం చేసుకోవాలని ప్రయత్నించింది . అలా చూస్తుండగా రజియాలో ఏదో వికారం బయలుదేరింది. ఆమె కళ్ళలోకి ఆశ, ఆవేశం ప్రవేశించాయి. వాటికి లొంగి పోయింది. అతని పెదవులను ముద్దు పెట్టుకుంది.
"రజీ" అన్నాడు రాజ్ గట్టిగా కళ్ళు తెరవ కుండానే. ఆ కంఠం లోని కాఠిన్యానికి భయపడిపోయింది రజియా. రాజ్ మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. తప్పు చేసినదానిలా చూపు తప్పించింది రజియా.
ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె మొహాన్ని దగ్గరగా లాక్కొని చిరునవ్వుతో "ఇటువంటి బలహీనతకు లొంగి పోకూడదు రజీ" అన్నాడు రాజ్.
రజియా మాట్లాడలేక పోయింది.
"పిచ్చి రజీ!' అని ఆమెను మరింత దగ్గరగా లాగాడు రాజ్.
రజియా అతని కళ్ళలో కళ్ళు పెట్టి వెదికింది. ప్రశాంతంగా ఒక దివ్యానందాన్ని అనుభవిస్తున్నాయి ఆ కళ్ళు. తనకు ఒక సందేశాన్ని చెపుతున్నాయి.
నవ్వాడతడు. ఆమె కూడా నవ్వింది.
"రాజ్!"
"ఊ"
"నన్ను పెళ్లి చేసుకోవడానికి సంఘం అంగీకరిస్తుందా?"
రాజ్ ఆమెను వదిలిపెట్టి కూర్చున్నాడు.
"నీ కిప్పుడీ సందేహం ఎందు కొచ్చింది?" అని అడిగాడు.
"నేను హిందువుల అమ్మాయిని కాదుగా?"
'అయితే ? దాన్ని కొచ్చిన అభ్యంతరమేమిటి? అయినా నువ్వు అచ్చమైన బ్రాహ్మణుల అమ్మాయివి గా?"
"ఆ విషయం లోకానికి తెలియదు."
"రజీ, ప్రేమ పేదరికాన్ని, నాగరికత కుల మత భేదాన్ని ఎంచదు. ఏ కులం కానీ, ఏ మతం కానీ నా కక్కరలేదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేను. అందుకు నీకెందుకు భయం?"
'అనవసరంగా నువ్వు సంఘంలో వ్రేలెత్తి చూపబడటం నాకు బాధగా ఉంటుంది."
"నువ్వు చెప్పే సంఘం మారింది. ఇప్పటి సమాజంలో అసహ్యించు కొనేవారి కన్నా ఆదరించే వారు, ఆనందించే వారు , జాలిపడే వారు ఎక్కువగా ఉన్నారు."
"ఏమో, ఎవరు చూచారు?"
"రజీ, సంఘమంటే ఎవరు?"
"ప్రజలు."
"మనం కూడా అందులోని ప్రజలమే కదా?"
"కాదనలేను."
"మరి మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా?"
"ఇతరులు కూడా మనలాగే ఉంటారని అనుకోవడమెలా?"
"ఎందు కనుకోకూడదు?"
"పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నారు. అందరూ మనం అనుకున్నట్లే అనుకోరు."
"పోరాబడుతున్నావు. అందరూ కాకపోయినా కొందరైనా ఉంటారు. నేటి సమాజం నాగరికత, సభ్యత, సంస్కారం వీటిని నేర్చుకుంది. ఇతరుల కష్టాలను చూసి ఎగతాళి చేయడం మాని జాలిపడి చేతనైతే సహాయం చేయగలదు."
"పురాతన ఆచారాలతో మట్టి పట్టిపోయిన మన సంఘం లో ఇంత మార్పు ఎలా వచ్చిదంటావు?"
"ఎందరో అమాయకుల యువతీ యువకుల ప్రాణాలు ఆ సమాజం కరాళ హస్తాల మధ్య నలిగి పోయాయి. ఎందరి జీవితాలో దాని పాదాల క్రింద క్రుంగి కృశించి నశించి పోయాయి. ఆదర్శవంతులైన యువతీ యువకులు ధైర్యంతో ముందంజ వేసి తమ ప్రాణాలు దానికి బలిగా యిచ్చి దాని కళ్ళు తెరిపించారు. మహానుభావులైన కవులు చాలా మంది తమ కలాలను నడిపించి ఎన్నో ఆదర్శాలను, సత్యాలను లోకానికి చూపించారు. గూడు కట్టుకుపోయిన సమాజపు ధూళిని తుడిచారు."
"పుస్తకాలు మానవుడికి విజ్ఞానాన్ని సమకూరుస్తాయా?"
"అవి అందుకే నియోగింపబడ్డాయి. వాటి నుండి దాన్ని గ్రహించలేని నాడు మానవుని మనుగడ కే అర్ధం లేదు. కానీ, లోకజ్ఞానం కూడా పుస్తుక విజ్ఞానానికి తోడైన నాడు అతడు పరిపూర్ణ విజ్ఞాన వంతుడు కాగలడు."
"మరి కవులు కొందరు అసంభవమైన విషయాలను గురించి వ్రాస్తే అవి నమ్మవలసిందేనా?"
"రజీ , ఇది అణు యుగమన్న మాట మరిచి పోతున్నావు. ఇక్కడ అసంభవమన్నమాటకు తావు లేదు. ప్రతి అసంభవాన్ని సంభవంగా మార్చ ప్రయత్నిస్తున్నాడు మానవుడు. తన తెలివితో ఊహించరాని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. నీ ఉద్దేశ్యం పుస్తుకాలతో ఎన్నడూ జరుగని, జరుగ రాని విషయాలు ఉంటాయని కదూ?"
"అవును."
"లోకం లో మంచే కాక చెడు కూడా ఉంది. అలాగే సహజమైన సంఘటనలతో పాటుగా అసహజమైన సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. జరిగిన విషయాలే అందరూ వ్రాస్తూ కూర్చుంటే ఎలా? జరగబోయేవి, జరగవను కొన్నవి కూడా వ్రాసి లోకానికి చూపిస్తే మంచిది కదా? ఇంతకు మునుపు మానవుడేప్పుడైనా ఆకాశం లో షికారు చేస్తాడనీ, కొద్ది నిమిషాలలో ప్రపంచాన్ని చుట్టి రాగలడనీ అనుకోన్నామా? అదీ అంతే."
"ఈ మధ్యే ఒక నవల చదివాను. అందులో ఒక తండ్రి మన ముగ్గురి కూతుళ్ళ జీవితాలను చూస్తూ చూస్తూ నాశనం చేస్తాడు. తన కడుపున పుట్టిన వారు తన ముందే అసభ్యంగా నీచంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడు. అది సంభవమంటావా?"
"ఎందుకు కాకూడదు? అతడు తన ప్రతి కూతురి నీ ఒక్కొక్క విధంగా తీర్చి దిద్దాలని ప్రయత్నించి ఉంటాడు. కానీ మధ్యలోనే పరిస్థితులు ఎదురు తిరిగి అలా జరిగి అతణ్ణి నిస్సహాయుడ్ని చేసి ఉండవచ్చు."
"అంత చేతకాని తండ్రులు ఉంటారా?"
'చేతకాని వారే కాదు చేతనైన వారు కూడా ఉంటారు. తన సుఖం కోసం కన్న కూతురిని వ్యభిచారిగా మార్చి కాలం గడిపే తండ్రులు, తల్లులు కూడా ఉన్నారు. వారు రాక్షసులా, ప్రశువులా అనే ప్రశ్న అడగవద్దు. వారిలో కాస్త మానవత్వ ముంటుంది. ఆ మానవత్వాన్ని విధి మరో మార్గంలో ఆడిస్తోంది. దాన్ని ఎదిరించి నిలువగలిగే శక్తి లేనినాడు వారే కాదు, నువ్వూ అంతే. నేనూ అంతే. పతనం కాక తప్పదు."
* * * *
"నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు?"
"కోప్పడవద్దండి. నేను ఈ జన్మలో మిమ్మల్ని వదలదలుచు కోలేదు."
"నీ ఉద్దేశ్య మేమిటి?"
"మీ నిర్ణయం చెప్పండి."
"ఇంతకూ ముందే చెప్పాను అంతే."
"అది జరగదని నేనూ చెప్పాను."
"అయితే నీ యిష్టం."
"సరే. మీ నిర్ణయం మార్చుకోక పొతే ఒక ఎప్పుడూ మా వదిన మీతో కాపురం చెయ్యదు."
"బెదిరిస్తున్నావా?"
"బెదిరింపు కాదు. మా వదినే రెండో పెళ్లి చేసుకో బోతోంది."
ఆ మాటలు విని నెత్తిన ఎవరో కొట్టినట్టయింది నారాయణ రావుకు.
'అంటే నాకు విడాకు లిస్తుందా? రెండవ పెళ్లి ఎలా చేసుకుంటుందో నేనూ చూస్తాను. కోర్టు లో దావా వేస్తాను. నాలో ఏం లోపం చూపిస్తుందో నేనూ తేల్చు కుంటాను."
"కోర్టుకు పోనవసరం లేకుండానే ఆవిడకు రెండో పెళ్లి జరుగుతుంది."
'అంటే?"
"నీకు విడమర్చి చెప్పే అవకాశం నాకు లేదు. వస్తా."
"ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పకూడదు?" అంటున్న నారాయణ రావు మాటలు వినకుండా వచ్చేశాడు రాజ్.
ఇందిరకు పెళ్లి. రెండో పెళ్లి. మొదటి మొగుడు బ్రతికి ఉండగానే, అతడికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటుందా? ఇదేమిటి అని తలపై చేతులు పెట్టుకొన్నాడు నారాయణరావు.
దారిలో ఆలోచిస్తూ వస్తున్న రాజ్ కు ఆనంద్ ఎదురయ్యాడు. నారాయణరావు సామాన్యంగా లొంగే ఘటం లా లేడు. అతనికి ఇందిర అంటే ఇష్టమే. అభిమానం అడ్డు వచ్చి మొండిగా పట్టుదలగా ఉన్నాడు. ఏదో ఊహ తట్టగా చిక్కావురా బ్రదర్ అనుకొన్నాడు విజయ గర్వంతో రాజ్.
"ఒరేయ్ , ఏమిట్రా అది? నీలో నువ్వే మాట్లాడు కుంటున్నావు?' అర్ధం కాక అడిగాడు ఆనంద్.
"తర్వాత చెప్తాలే . నావెంట రా" అని ఒక ప్రెస్ లో ప్రవేశించాడు రాజ్.
రాజ్ ఇచ్చిన శుభలేఖ చదువుకొన్న నారాయణరావు కు కళ్ళు తిరిగినట్ల యింది. నాలుగు సార్లు చదువు కున్నాడు. ఇందిర పెళ్లి పిచ్చి పట్టినట్ల యింది.
"ఏయ్, ఎవరీ వెంకటేశ్వర్లు గాడు? నేను బ్రతుకుండగానే నా భార్యను పెళ్ళి చేసుకోవడానికి వీడికి అధికారం ఎవరిచ్చారు?' గర్జించాడు నారాయణరావు.
"నీ గర్జనలకు బెదిరేవారు ఎవరూ లేరిక్కడ. అతడూ మనలాగే ఒక మనిషి. ఆ అధికారాన్ని అతడికి మేమే ఇచ్చాం."
"మీకేం హక్కుంది? నా ఇందిరకు పెళ్లి చేయడానికి నువ్వెవరు? నేను చచ్చి పోయాననుకున్నారా?"
"నీ ఇందిరా? ఈ మాటలు ఆనాడే మమ్మాయి?" రావు మాట్లాడలేదు.
"త్రాగి తందనాలాడి కులుకుతున్నప్పుడు ఆమె నీ ఇందిర కాదా? కన్న బిడ్డకు మందు తెమ్మని ప్రాధేయ పడ్డనాడు ఆమె నీ భార్య కాదా? ఇన్నాళ్ళు ఆమె పుట్టింట్లో పుట్టెడు దుఃఖంతో ఏడుస్తూ కూర్చొని ఉందే? అప్పుడామె పరాయిదా? ఇప్పుడిలా మాట్లాడడానికి సిగ్గు లేదూ? ఆమెకు అందం వుంది. చదువూ ఉంది. వయసు, గుణం అన్నీ వున్నాయి. ఏం తక్కువని ఇలా జీవితాంతం చితిస్తూ కూర్చోవలసిన ఖర్మ పట్టింది?"
తల వాల్చేసాడు రావు.
"మా వదినకేం? హాయిగా రెండో పెళ్లి చేసుకొంటుంది. సుఖంగా ఉంటుంది. ఇక నువ్వే నీ పాపాలకు ఏడుస్తూ కూర్చో."
"ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేనూ చూస్తాను. నాకు న్యాయం చేకూర్చడానికి కోర్టులు చాలా ఉన్నాయి."
'అంత అవకాశం నీకు లేదు. పెళ్లి రేపు ఉదయమే. వరుడు అమెరికా లో పనిచేస్తున్నాడు. పెళ్ళయి పోగానే మధ్యాహ్నమే వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లి పోవడానికి ఏర్పాట్లు జరిగి పోయాయి."
"పెళ్ళిలో ఇందిర నా భార్య అని చెప్పేస్తాను."
"నీకు అందుకు కూడా అవకాశం ఇవ్వను. రేపు రాత్రి వరకూ నిన్ను ఇక్కడే బంధించి వేస్తాం."
"ఏమిటి మోసం! దౌర్జన్యం! నారాయణా! నారాయణా!' కేకలు వేశాడు రావు భయంతో.
"ప్రయోజనం లేదు. వాడిని అప్పుడే పంపించి వేశాం. ఈ చుట్టూ పక్కల నీకెవ్వరూ సహాయ పడేవారు లేరు."
"అన్యాయం, పోలీసు రిపోర్తిచ్చి మిమ్మల్ని జైలు కు పంపుతాను." పిచ్చిగా అరిచాడు రావు.
"ఆ, ఆ అలాగే చేద్దువులే!" అని ఆనంద్, రావు నోటికి చేతి రుమాలు కట్టేశాడు. ఇంకొక త్రాడుతో రావు కాళ్ళూ, చేతులూ కట్టేసి మంచం పై పడుకోబెట్టారు వారు. రావు కళ్ళలో దీనత్వం కనిపిస్తుంది. బయటికొచ్చి వాకిలి వేశారు.
స్కూలు కు బయలుదేరుతున్న ఇందిర చేతిలో పెళ్లి పత్రికతో వస్తున్న రాజ్, ఆనంద్ లను చూసి ఆగిపోయింది.
"ఎవరిది రాజూ పెళ్లి?"
"నీదే వదినా!"
"రాజూ!" కోపంగా అరిచింది ఇందిర.
"కోప్పడకు వదినా! చూడు." పత్రిక అందిచ్చాడు రాజు.
అది చదివి ఆమెకు ఏడవాలో కోప్పడాలో అర్ధం కాలేదు.
"రాజూ, ఏమిటిదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా! ఈ వెంకటేశ్వర్లు ఎవరు? అతనితో నాకు పెళ్ళేమిటి? జీవితాలతో ఆటలాడుకుంటున్నావా?"
"అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితె ఎలా చెప్పను? మరేం భయపడకు. ఇది ఆధారంగా పెట్టుకొని మీ శ్రీవారిని ఒక అట అడిస్తాను." అని అంతా వివరంగా చెప్పాడు రాజ్.
"ఏమో, రాజూ? ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. వారు మంచి వారై ఉంటె నేను వారు కోరిన ప్రకారం క్షమా బిక్ష వేడుకోవడానికి సిద్దమే."
"వదినా, నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు. నా పధకం సఫలం కాకపొతే అపనే చెయ్యి. భార్య అంటే ఏమిటో, ఆమె విలువ ఎంతనో అని అతనికి చూపించదలుచుకొన్నాను."
"నన్ను ప్రశాంతంగా బ్రతక నివ్వవా?"
"కొద్ది రోజుల తర్వాత నీ భర్తతో నువ్వు ఇంతకన్నా సుఖంగా జీవించ గలవులే నీకెందుకు? నువ్వు స్కూలు కెళ్ళు. నాకూ కాలేజీ కి టైమవుతోంది. అంతా నే చూసుకొంటాను."
"రాజూ, వారిని బందీ గా ఉంచడం నాకిష్టం లేదు."
"ఉండవమ్మా వదినా! అంత సుకుమారంగా బ్రతికారేం మీవారు! కాస్త బాధ కూడా సహించాలి. సాయంకాలం నువ్వు కూడా వస్తే మీ వారి స్థితి చూద్దువు గానీ.'
