శారద నెమ్మదిగా జేయి లాక్కొన్నది. ఆమె గుండియలు దడదడ కొట్టుకొన్నవి. 'ఇంత మెత్తని వేళ్ళకు వీణ తీగెల నొక్కులు బాధకాదూ శారదా?' యని నారాయణరావు ప్రశ్నించెను. 'కుడి బొటనవ్రేలికి గోణము తగిలించుకొంటాను. ఎడమచేతివేళ్లు నొక్కులు పడ్డాయి'యని యాబాల వామహస్తము భర్తకు జూపించినది. అతడా పాణిని గ్రహించి 'హృదయవచశ్శరీరముల సౌందర్యాన్ని బలియిస్తే కాని ఆనందాన్ని సృష్టించలేము కాదూ? ఎన్ని గంటులో! పాపము, ఈ చిన్న వేళ్ళకు ఎంత శ్రమో' యని యామె చేయి తన పెదవులతో నల్లన స్పృశించి కన్నుల కద్దుకొనెను.
శారద యపరిమిత త్రపామూర్తియై చేయి లాక్కొని, చిరునవ్వు మోమును రాగరంజితము చేయ, మెరపువలె నా మేడమీద నింకొక గదిలోనికి మాయమైనది.
నారాయణరావు హర్ష ప్రఫుల్లములగు నయనములతో దన చిన్నారి భార్య పోయిన దెస చూచుచుండెను.
ఇంతలో జమీందారు గారు లోనికి వచ్చి యాలోచనామగ్నుడైయున్న యుల్లుని వీపుపై చేయి నిడెను. నారాయణరావు ఉలికిపడి తలెత్తి మామగారిని జూచి, చివాలున లేచెను. 'కూర్చోవోయి! నీ స్నేహితులంతా నీకోసం కాబోలు చూస్తున్నారు. మా జగన్మోహనుణ్ణి ఆడిస్తున్నట్లున్నారు. అతడో వెఱ్ఱివాడు. గర్వి. దుష్టహృదయం కలవాడు. నీవు ఎఫ్.ఎల్.లో మొదటివాడవుగా మొదటితరగతిలో నెగ్గినందుకు నాకు చాలా సంతోషం అయింది. నువువ్ వెళ్లేటప్పుడే నేనూ చెన్నపట్టణం వస్తాను. నువ్వు హాస్టలులో వుండడం మానివేసి కీల పాకులో నా బంగళా వుంది, అందులోనే ఉండు. అద్దెకున్నవారిని ఖాళీ చేయవలసిందని వ్రాశాను. వారునూ రేపు జూలై నెలలో వెళుతున్నారు. నీ యిష్టం వచ్చిన కారొకటి చూడు. మా దివానుగా రదికొని, నీకు ఇస్తారు. 'చ్యాపుయరు' (మోటారునడుపువాడు) నొకణ్ణి చూచి ఉంచారు. ఆ కారు నీకు బహుమతి.'
'నేనే ఒక చిన్నరకం కారు కొనుక్కోడానికి ఏర్పాటులు చేసుకున్నానండి.'
'నా ముచ్చటకు నువ్వు అడ్డం చెప్పవద్దు.'
'చిత్తం.'
'శారదా!'
పక్కగదిలోనున్న శారద 'ఎందుకు నాన్నగారూ?' అని పలికినది.
'ఇలారా అమ్మా!'
శారద గుమ్మం కాడకు వచ్చినది.
'కొంచెముసేపు క్రిందికి వచ్చి వీణ వాయిస్తావా? నీ సంగీత గదిలోనే కూర్చో.'
'ఇప్పుడు వాయించలేనండి.'
'పోనీలే.' 'కాదు, ఇక్కడే నా గదిలో కూర్చుండి వాయిస్తానండి.'
'సరేలే, నీకు కులాసా లేకపోతే ఇబ్బంది లేదులే.'
'ఇష్టం లేక కాదండి! క్రింది గదిలోకి ఎందుకని.'
శారద పరిచారికను బిలిచి సంగీతపు గదిలోనున్న వీణను తెమ్మని యాజ్ఞ యిచ్చినది. జమిందారు గారల్లుని జూచి 'సంగీతపు గది ధ్వని శాస్త్రవేత్త నొకణ్ణి కలకత్తా నుండి రప్పించి తయారుచేయించినాను. చాలా చక్కగా కుదిరింది. పొడుగాటి హాలులా వుండటం వల్ల పదిమంది కూర్చొని వినుటకు వీలుగా ఉంటుంది. నీ స్నేహితులను పైకి తీసుకొని రావోయి' యని యనెను.
'చిత్త' మని నారాయణరావు స్నేహితులను మేడమీదికి బిలిచికొని రాబోయెను.
శారద వీణియ సారెలు బిగించి, శృతి మేళవించి, కలస్వనమున పాడనారంభించినది.
నారాయణరావు, స్నేహితులు వచ్చి, మేడమీద మధ్యశాలలో నాశనములపై నధివసించిరి. జగన్మోహనరావు మాత్రము శారద శయనగృహము లోనికి పోయి, యచ్చట శారద కెదురుగ నొక దిండ్లున్న సోఫాపై నుపవిష్టుడై శారదను దేరిచూడ సాగెను.
జగన్మోహనుని కుర్కుర హృదయమునకు శారదా సౌందర్య మద్దముల పెట్టెలోని పలల ఖండమై కలచి వేయుచుండెను.
జగన్మోహనుడు లోనికి బోవుట జూచి రాజేశ్వరరావు భ్రూయుగ్మము ముడిచినాడు.
నారాయణరావు, పరమేశ్వరుడు సంగీతలోలురై యా యానందలహరీ వేగములో దేలిపోయిరి.
అహో, విమల గాంధర్వమా! నీ వానందమూర్తివి! నిర్మలకళారూపమవు. సాక్షాత్కరించిన పరదేవతవు. నీ దర్శనమాత్రమున పవిత్రత నొందని చేత నా చేతనములున్నయవియే! పరమశివుని డమరుక కింకిణీద్వయి నుండి జనించిన నీయం దాత్యస్వరూపమే వ్యక్తమగును. ప్రాణదుగమునిచ్చు సురభీ మతల్లివి నీవు!
ఆ సంగీతము దిశల నావరించి ప్రణవస్వరూపమయినది.
