Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 32

లేకపోతే -
ఆ ముని ఎవరో తనంతట తానుగా సంకల్పించి కపాల మోక్షం చేసుకుని ప్రాణాలు త్యజించాడా?
ఈ మహాపురుషుడు ఎవరోగానీ, ఈయన తపస్సు చేసిన స్థలం కావడం వల్లనే ఈ ప్రదేశంలో ఆయన తాలూకు వైబ్రేషన్స్ వున్నాయా?
ఆ వైబ్రేషన్స్ ప్రభావం వల్లనే తను ఎక్కడో వున్న ప్రగతి భావాలని 'వినగలిగాడా?' ప్రగతి తన పేరు కలవరిస్తోంది. అది తనకి వినబడుతోంది.
అది ఇప్పటి సైన్స్ కి అందని పారా సైకాలజీ కావచ్చును.
కానీ -
కొందరి అంచనా ప్రకారం రాబోయే కొత్త శతాబ్దంలో అత్యంత ప్రాముఖ్యంగల అనేకమైన పరిశోధనలు ఈ పారా సైకాలజీ విభాగంలోనే జరగబోతున్నాయి.
మహానుభావులు, మనో శక్తిగల మహా పురుషులు సంచరించిన చోట వారి వైబ్రేషన్స్ తాలూకు ప్రభావం అలాగే నిలిచిపోతుందిట. దానినే బయో ఎనర్జీ అనుకోవచ్చునేమో?
అందుకే పుణ్య స్థలాలకీ, తీర్థయాత్రలకీ, గుళ్ళూ గోపురాలకీ, దర్గాలకీ వెళ్ళమని పెద్దలంటారు.
అలాగే -
పాపచింతన గల కొంతమంది వ్యక్తుల వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉత్పన్నం అవుతూ వుంటాయి.
అందుకోసమే -
ధ్యానం చేసుకునేటప్పుడు అంతకు ముందు అక్కడ తిరిగిన వాళ్ళ నెగటివ్ వైబ్రేషన్స్ సోకకుండా కింద ఏదైనా ఆసనం వేసుకోవాలంటారు.
విజ్ఞులు చెప్పినదాని ప్రకారం -
ఈ ప్రపంచాన్ని అంతా ఆవరించుకుని వుంటుంది ఈధర్.
మన భావాలు, మాటలు, దృశ్యాలు ఈ ఈథర్ ద్వారా నిరంతరం 'ప్రసారం' అవుతూ వుంటాయి.
మానసికంగా, శారీరకంగా ట్యూన్ అయివున్న వాళ్ళు మాత్రమే ఆ భావాలనీ, మాటలనీ దృశ్యాలనీ టెలివిజన్ సెట్టులాగా రిసీవ్ చేసుకోగలరు. మన చుట్టూ వున్న వాతావరణంలో టెలివిజన్, రేడియోల తరంగాలు వుంటాయి. కానీ వాటిని రిసీవ్ చేసుకోవాలంటే మంచి కండిషన్ వున్న టీవీ సెట్టు, రేడియో సెట్టు వుండాలి. అలాగే ఈధర్ లో 'ప్రసారం' అవుతూ వుండే మాటలనీ, దృశ్యాలనీ, భావాలనీ, క్యాచ్ చెయ్యడానికి సరిగా ట్యూన్ అయిన బాడీ, మైండూ వుండాలి. అది కొందరికి సహజంగానే వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వున్నవాళ్ళకి ధ్యానం, యోగం, తపస్సు మొదలైన వాటివల్ల వస్తుంది.
ఈ మహాత్ముడు తపస్సు చేసిన స్థానంలో వుండడం వల్ల తన బాడీ కూడా ట్యూన్ అయి ప్రగతి ఆలోచనలు 'వినబడుతున్నాయా?'
ఏమో!
కావచ్చు!
"వాట్ బ్రదర్! చాలా డీప్ థాట్ లోకి వెళ్ళిపోయావే!" అన్నాడు అంకుష్.
ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడ్డాడు సాహస్.
"నీలాంటి బ్రదర్ దొరకడం నాకు చాలా ఆనందంగా వుంది" అన్నాడు అంకుష్.
"సేమ్ విత్ మీ" అన్నాడు సాహస్ నవ్వుతూ.
"బ్రదర్! నిన్న ప్రగతితో చెప్పావే....ఈ లోకంలో మగాళ్ళందరూ ఒకళ్ళకి ఒకళ్ళు బంధువులేనని, అందరూ దాదాపు రెండు లక్షల సంవత్సరాల క్రితం బతికి వుండిన ఒక పురుషుడి సంతానమేననీ... అది నిజమేనా?" అన్నాడు అంకుష్.
"సైన్స్ చెబుతోంది నమ్మాలి."
"మరి ఆడవాళ్ళ సంగతో?"
"అప్పుడే నీ ఆలోచనలు ఆడవాళ్ళమీదకి పోతున్నాయా?" అని నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు సాహస్.
"మొగాళ్ళందరూ ఒక పురుషుడి సంతానమే అని తేలింది. ఆడవాళ్ళ విషయంలో తండ్రి పరంగా ఇంకా అంత నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. కానీ ఇంకో విశేషం వుంది."
"ఏమిటది?" అన్నాడు అంకుష్ కాస్త ఆసక్తిగా.
"ఇప్పుడు ప్రపంచంలో వున్న మొగవాళ్ళకి, ఆడవాళ్ళకీ కూడా పూర్వీకురాలు ఒకే స్త్రీ."
"నిజంగానా? ఎవరామె?"
"దాదాపు రెండు లక్షల సంవత్సరాల క్రితం జీవించి వుండిన ఒక నీగ్రో వనిత"
"ఏమిటీ...నీగ్రో..."
అవును. ఒక నీగ్రో వనిత సంతానమే మనమందారం!" అన్నాడు సాహస్.
"నీగ్రోలు ఎక్కడో ఆఫ్రికాలో వుంటారు. మనం ఆంధ్రాలో వుంటాం. మరి...?
నవ్వాడు సాహస్.
ఆఫ్రికన్లు, ఆంధ్రులు, అస్సామీలు, అంగ్రేజీ వాళ్ళు ఆడా మొగా...అందరూ ఒక నీగ్రో వనిత సంతానమే. మొన్నమొన్నటిదాకా ప్రపంచంలోకెల్లా అతి నికృష్టంగా పరిగణింప బడుతూ బానిసలుగా అమ్మబడుతూ జంతువుల్లాగా చూడబడ్డారే ఆ నీగ్రోల సంతతి వాళ్ళమే మనమంతా!" అన్నాడు సాహస్ ఉద్విగ్నంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS