Previous Page Next Page 
జోగబాల పేజి 32


    శ్రీహర్షకు మనసంతా వికలమైపోయింది. ఆ రాత్రి ఎంతకూ నిద్ర పట్టలేదు. అసలు తానీ ఊరు యెందుకు వచ్చాడు? తన వాళ్ళందరికీ దూరంగా జరిగి ఎందుకిక్కడ మకాం పెట్టాడు? ఈ జరుగుతున్న సంఘటనా పరంపరలేమిటి? అతనికెందుకో భయమేసింది. మనసంతా వికలమైపోయింది. తాను చలమయ్యగారి షాపులో పనిచేస్తున్నాడు. ఆయన తనమీద ఆశలు పెంచుకున్నాడు. ఇదంతా ఎటువైపు దారితీస్తోంది! అతను గదిలో ఉండలేకపోయాడు. ఒంటరితనం వేధించుకు తిన్నప్పుడు మనసులో దావాగ్నిజ్వాల యెగసినప్పుడూ ఎంత రాత్రయినా సరే - ఏటి దగ్గరకు వెళ్ళి ఆ యిసుకలో కూర్చోవటం అతనికలవాటు. ఒక్కోసారి ఆ యిసుకమీదే పడుకుని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ తెల్లవారుజాము వరకూ అలా వుండిపోయి, అప్పుడు లేచి గదికి చేరుకునేవాడు.


    అర్థరాత్రివరకూ పక్కమీద పొర్లి యెంతకూ నిద్రపట్టక లేచి ఏటివైపుకు సాగిపోయాడు.విలాస్ ఇంకా గదికి చేరలేదు. అందుకని తలుపులు ఓరగా వేసి ఉంచాడు. దాదాపు రెండు గంటలవేళ శ్రీహర్ష గది ముందుకు ఓ స్త్రీ ఆకారమొచ్చి నిలబడింది.


    ప్రక్కమీద విలాస్ పడుకుని ఉన్నాడు. చీకటిలో ఆనవాలు తెలీడం లేదు. ఆ స్త్రీ లోపలికి వచ్చింది.


    "హర్షా?"


    "ఊ"


    "నేను...వజ్రాన్ని...సాయంత్రమంతా నీకోసం...నీ జవాబు కోసం ఎదురుచూసి ... ఇహ ఉండబట్టలేక వచ్చేశాను..." ఇంకా దగ్గరకు వచ్చింది.


    "నేను...నీదాన్ని...నిన్ను విడిచి ఉండలేను. నిన్ను తప్ప ఇంకొకర్ని పెళ్లి చేసుకోలేను." ప్రక్క మీదకు వచ్చి కూర్చుంది.


    "నువ్వు నాకు కావాలి" అతని గుండెమీద తలపెట్టి ఏడుస్తోంది.


    అతని చెయ్యి ఆమె తల నిమిరింది. వీపుమీదకు ప్రాకింది. తర్వాత రెండు చేతులూ కలిసి ఆమెను చుట్టుకుని బలంగా దగ్గరకు లాక్కున్నాయి.


    "హర్షా! నిజంగా నువ్వేనా! నాకంత అదృష్టమా!" ఆబగా అతనిని పెనవేసుకుపోతోంది. మెడచుట్టూ చేతులు పోనిచ్చి.


    అతను మాట్లాడలేదు. ఆమెకు ఇంకా ఇంకా హత్తుకు పోతున్నాడు.


    "మాట్లాడవేం? నన్ను అనుగ్రహిస్తున్నావా?" అతని మొహం ఆమె మొహానికి దగ్గరగా వచ్చింది. పెదవులు పెదవుల్ని మూశాయి. క్రింద పెదవి భగ్గుమంది.


    "జవాబు చెప్పావుగానీ... నేనంటే ఇంత...ఉహు...వద్దు హర్షా, నాకు భయమేస్తోంది. పెళ్లి కాకుండా ప్లీజ్... ఆమె ప్రాధేయపడింది. కానీ నిరాకరించే స్థితిలో లేదు."


    "అతనామెను ఆక్రమించు కున్నాడు __ ప్రేమతో, దుఃఖంతో, బాధతో కూడిన 'అమ్మా!' అన్న మూలుగులు లెక్క చెయ్యకుండా.


                               *    *    *    *


    వర్ష స్కూల్ నుంచి జోగాపురానికి తిరిగి వస్తోంది. ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడూ యిలా వంటరిగా రావటం తప్పలేదు. తనతో వచ్చే ఇద్దరమ్మాయిలకు చదువుమీద అట్టే శ్రద్ధలేదు. ఏదన్నా కాస్త వంక దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేస్తూ ఉంటారు.


    రోజులు చకచక గడిచిపోతూ పరీక్షలు దగ్గర కొచ్చేస్తున్నాయి. ఆమె రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతోంది. శ్రీహర్ష కూడా వీలయినప్పుడల్లా వచ్చి పాఠాలన్నీ ఆమెకు నూరిపోస్తున్నాడు. యెలాగైనా స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఆమెకు పట్టుదలగా ఉంది. ఇప్పుడిప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి.


    ఉన్నట్లుండి ప్రక్కనే ఏదో అలికిడవటం, బుజాన ఏదో రాసుకోవటం ఒకేసారి జరిగాయి. ఉలికిపడి తల త్రిప్పి చూసింది.


    విలాస్!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS