3. రధ గజ తురగ ప | దాతి దళములు
రణరంగమున - కూలిపోయెను |
జంబుమాలి తన - వాడి బాణముల
పవనకుమారుని - బహు పీడించెను |
అంతట మారుతి - పరిఘతో మోది
అంతము చేసెను - జంబుమాలిని |
మారుతి ఇంకను - పోరు పెంచగను
తోరణ స్తంభము | పైన నిల్చెను .... ||శ్రీ||
4. జంబుమాలిని - సర్వ సైన్యమును
ఒక్క వానరుడు - ఉక్కడగించేను |
ఈ వృత్తాంతము - వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు - ఆజ్ఞాపించెను |
మంత్రికుమారుల - తగిల బలముగొని
ఆ వానరుని దం | డింప బొమ్మనెను |
మంత్రికుమారులు - ఏడ్గురు చేరి
హనుమంతునిపై | దాడి వెడలిరి .... ||శ్రీ||
__: 44 వ. సంపూర్ణము :__
45 వ. సర్గ
మారుతితో - మంత్రికుమారుల యుద్ధము :-
1. మంత్రి కుమారులు - తేజోవంతులు
అస్త్రశస్త్ర వి | ద్యా విశారదులు |
ఉరుముల బోలిన - శబ్దములెగయగ
చతురంగ బలా | లు సాగిరాగ |
ధ్వజములెగయగా - వాయువేగముగ
రధములపై రవి | కాంతులు చిమ్మగ |
మంత్రికుమారులు - ఏడ్గురు చేరి
హనుమంతునిపై | దాడి వెడలిరి .... ||శ్రీ||
2. పదములతో మ | ర్ధించి కొందరిని
ఉరముతో కుమ్మి - మరికొందరిని |
పిడికిలి బిగించి - పొడిచి కొందరిని
గోళ్ళతో చీల్చి - మరి కొందరిని |
వరుసగ ఏడ్గురు - మంత్రి సుతులను
పవన కుమారుడు - యమపురి కంపెను |
మారుతి ఇంకను - పోరు పెంచగను
తోరణ స్తంభము - పైన నిల్చెను .... ||శ్రీ||
3. మంత్రి సుతులను - సర్వసైన్యమును
మారుతి తృటిలో - సంహరించెను |
ఎటు చూచినను - మృత దేహములు
ఎటు బోయినను - రక్తపు టేరులు
ఈ వృత్తాంతము - వినిన రావణుడు
కొంత తడవు యో | చించి పల్కెను |
సేనాపతులను - తగిన బలముగొని
ఆ వానరుని దం | డింప బొమ్మనెను .... ||శ్రీ||
__: 45 వ. స. సంపూర్ణము :__
46 వ. సర్గ
మారుతితో సేనాపతుల యుద్ధము ;-
1. విరూపాక్ష - యూపాక్షులు
దుర్ధర ప్రఘస - భాసకర్ణులు |
మహావీరులు - వేగవంతులు
శత్రు భయంకర - మహా యోధులు |
రధ గజ తురగ ప - దాతి దళములతో
మారణాయుధా | ల బల గర్వముతో |
సేనాపతులు - ఐదుగురుచేరి
హనుమంతునిపై - దాడి వెడిలిరి .... ||శ్రీ||
2. దుర్ధరుండైదు - శరములు వేసి
మారుని శిరమును - గాయము చేసె |
సింహనాదమును - మారుతి చేసె
కాయము బెంచి | గగనానికెగసె |
దుర్ధరుండు మరి - శతశరములచె
కపికుంజరుని | కడుపీడించె |
మెరపు వోలె మెరసి - మారుతి దుమికి
పిడుగువోలె పడి - అసురుని గూల్చె ..... ||శ్రీ||
3. దుర్ధరుండటుల - కూలుట గాంచి
విరూపాక్ష యూ | పాక్షులు అలిగి |
గదలబూని హ | రీశుని దాకగ
మారుతి వారిని - చావమోదగ |
రక్తము గ్రక్కుచు - అసుర వీరులు
నేలపై బడి - అసువులు వీడిరి |
మారుతి ఇంకను - పోరు పెంచగను
తోరణ స్తంభము | పైన నిల్చెను .... ||శ్రీ||
4. మిగిలిన ప్రఘస - భాస కర్ణులు
శూలపట్ట సా | ది ఆయుధ ధారులు |
హనుమంతునిపై - తెగబడి పోరిరి
అతి భీకరముగ - గాయపరచిరి |
నెత్తుట దడిసిన - అనిలాత్మజుడు
బాలార్కుని వలె | భాసిల్లినాడు |
గిరి శృంగమును | పెకల్చినాడు
అసురవీరుల | మర్ధించినాడు .... ||శ్రీ||
