ఎదురుగా కారు వస్తుండడం చూసి వెనక్కు తగ్గాడు రాజ్. ఆ కారు దాటిపోగానే తిగిగి ముందుకు పోబోయిన రాజ్ అంబాసిడర్ రోడ్లో నాట్యం చేస్తున్నట్లు అటూ ఇటూ తిరగడం చూసి , "మోసం చేశావు గదరా" అనుకొన్నాడు. చేసేది లేక దాన్ని అనుసరిస్తూ ఆలోచించ సాగాడు. తమాషా చూస్తున్నారు కారులోని వారు.
మరో లారీ ఎదురుగా రావడంతో హుషారుగా సిద్దంగా కూర్చున్నాడు రాజ్.
ఆనంద్ హుషారుగా వెనక్కు చూసి చేయి ఊపి ముందుకు చూసి లారీకి సైడ్ యిచ్చాడు. లారీ దగ్గరికి వస్తుండగా వేగాన్ని హెచ్చించి అంబాసిడర్ దగ్గరికి పోనిచ్చి లారీ అంబాసిడర్ ను దాటిపోగానే కుడి వైపు కు స్టీరింగ్ త్రిప్పి అప్పుడే రోడ్డు మధ్యకు వస్తున్న అంబాసిడర్ ప్రక్కనే పోనిచ్చాడు. తన కారు ప్రక్కనే వస్తున్న స్లిమత్ ను చూసి కంగారుతో ఎక్సి లెటర్ నొక్కాడు ఆనంద్. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తనకన్నా కొంచెం ముందుగా ఉంది స్లిమత్ . దాన్ని దాటాలని ప్రయత్నించి విఫలుడై పోయాడు. స్లిమత్ ముందుకు పోయింది. తనకు సైడ్ ఇవ్వకుండా మెల్లిగా స్లిమత్ ను చూసి "అన్యాయం" అని అరిచాడు ఆనంద్.
"నువ్వు నేర్పిన విద్యే" అన్నాడు రాజ్ వెనక్కు చూసి అరుణ అన్నయ్య అవస్థ చూసి నవ్వింది. సుగుణ సంతోషంతో లేచి ఆనంద్ ను వెక్కిరించింది.
"హా. ఎవరు చేసిన ఖర్మ వారను భావించకా ఏనాటి కైనా తప్పదన్నా!" అని పాట పాడుతూ వేగం తగ్గించాడు ఆనంద్. నవ్వులతో తమాషాగా చేరుకున్నారు తిరుపతి.
తిరుపతి చేరేప్పటికి అయిదయింది. దారిలో వారి కోసం కాచుకొని ఉన్నాడు గోపీ. గోపీని ఎక్కించుకొని కొండ పైకి దారి తీశారు వారు.
దారిలోకి పోగానే ఆనంద్ కారును మెల్లిగా పోనిస్తూ అక్కడి నుండి కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగాడు. ఎలక్ట్రిక్ లైట్ల వెలుగులో తిరుపతి చూడ ముచ్చటగా ఉంది. అప్పుడప్పుడే తెలతెలవారు తుంది. వసంత ట్రాన్సి స్టర్ అన్ చేసింది. సుప్రభాతం ఇంపుగా వినబడుతుంది. మంచు దట్టంగా అలముకొని కొండలలో ఆదుకుంటుంది. కొండల మాటున దోబూచులాడుతుంది మంచు. మంచును చూసి మేఘమనే భ్రమ కలుగుతుంది. లోయలలోని పచ్చని చెల్టు, పిచ్చి పిచ్చి మొక్కలు పనికి రాణి పూల చెట్లు యేవో సందేశాలను అందిస్తున్నాయి.
ఎక్కడా చోటు దొరక లేదంటూ మనుజులకు దూరంగా ఉండే అంత ఎత్తైన కొండలో తన స్థావరాన్ని ఏర్పరచు కొన్నాడు. భగవాన్ వేంకటేశ్వరుడు. ఆ దేవుని మహిమ తెలియని ప్రజలే లేరు. దేశం నలుమూలల నుండి ఆ భగవంతుడి దర్శనార్ధం అశేష ప్రజానీకం వస్తుంది. అందరినీ ఆకర్షించి, అందరినీ తన దగ్గరకు రప్పించు కొంటున్నాడు ఆ దేవుడు. ఇంతవరకూ ఏ దేవుడూ జరిపించు కోలేని ఘనమైన సన్మానాన్ని ఈ అవతారం లో పొందుతున్నాడు లోకేశ్వరుడు. కలియుగం లో పాపాలను అంతమొందింప దలచిన అసత్పంపన్నుడు వేంకటేశ్వరుడు.
ముందుగానే గోపీ ఏర్పాటు చేసిన బసలలో దిగారు అంతా. రాజ్ బసలోని కిటికీ గుండా చూశాడు. అక్కడి నుండి చంద్రగిరి కోట కనిపిస్తుంది. రాజ్ బయటికి వచ్చాడు. బస ముందున్న గార్డెన్ దాటి ముందు కెళ్ళి పోయాడు. అక్కడ నిలబడి ఆ దృశ్యాన్ని చూశాడు. నయనానందకరంగా ఉన్న దృశ్యం. ఎత్తైన కొండల్లో ఎక్కడో ఒక చిన్న కోట. దాని చుట్టూ దూరంగా కట్టబడిన ఆధునిక మైన భవంతులు. వాటికి అండదండగా చెట్లు. కళ్ళార్పకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు రాజ్.
అది చూసిన ఆనంద్ "కవి మహాశయా! తమ పని అప్పుడే మొదలు పెట్టారా!' అన్నాడు.
రాజ్ కు అది వినబడలేదు.
"ఏమిటన్నయ్యా!" అంటూ రజియా వచ్చింది.
"వీడు అప్పుడే ప్రకృతి సౌందర్యాన్ని పరిశీలిస్తున్నాడు. మనకేమో ఆకలవుతుంటే వీడు ఆ ఆనందంతో కడుపు నింపుకుంటున్నాడు. ఆ గోపీగాడు టిఫిన్ పంపిస్తానని ఇంతవరకూ పత్తా లేదు."
ఇంతలో అక్కడికి వసంత, సుగుణ కూడా వచ్చారు. వసంత రాజ్ ను చూసింది. అతను వీరి నెవ్వరినీ గమనించలేదు. కళ్ళు ఎదురుగా ఉన్న దృశ్యాల్ని చూసి మెదడు కు ఏదో పని కల్పిస్తున్నాయి. మనసు ఏవో భావాల్ని , ఆ భావాలోక పాటనూ సమకూర్చాయి.
వసంత, రాజ్ కు కుడి ప్రక్కగా జరిగి అతన్ని సైడు ఫోజుతో ఫోటో తీసింది. ఎవరూ ఏమీ మాట్లాడలేక పోయారు.
"ఒరేయ్!" గట్టిగా పిలిచాడు ఆనంద్. ఉలిక్కిపడి వారినందరినీ చూసి తన పరధ్యానానికి సిగ్గు పడ్డాడు రాజ్.
"వచ్చి గంటయిందో లేదో అప్పుడే నీపని మొదలు పెట్టావా! ఇక్కడ నాలుగు రోజులుంటాంగా? అప్పుడు చూడచ్చు లే పద!" అని రాజ్ చెయ్యి పట్టుకొని లాక్కు పొయ్యాడు ఆనంద్.
* * * *
బసలోకి వచ్చి తల చేతులతో పట్టుకొని కూలబడ్డాడు గోపీ. అది చూచి అతని చుట్టూ మూగారంతా.
"ఏమైంది రా గోపీ?" అతని పరిస్థితి చూసి అర్ధం గాక అడిగాడు రాజ్.
'అయిపొయింది. అంతా నాశన మయిపోయింది" అన్నాడు గోపీ తల ఎత్తకుండానే.
"వివరంగా చెప్పరా." గట్టిగా అడిగాడు ఆనంద్ ఆత్రుతతో.
"పెద్ద అనర్ధం వచ్చి పడిందిరా! మా శారద కు పెడతామన్న నగలన్నీ ఇంట్లోనే ఉండి పోయాయి. అవి ముందక్కడ పెడితేనే కానీ ఈ పెళ్లి జరగదు అంటున్నాడు వియ్యంకుడు. ఎంత చెప్పినా వినడం లేదు."
"ఎవడ్రా ఆ బుద్ది లేనివాడు! పద. తగిన బుద్ది చెప్తాం." ఆవేశంగా అరిచాడు ఆనంద్.
"ప్రయోజనం లేదురా! అవి లేనిదే పెళ్లి జరగదని మొండి పట్టు పట్టాడు. పెద్ద మనుషులు అందరూ చెప్పారు. పెళ్లి జరుగ నివ్వండి , తెప్పిస్తాను అన్న మామయ్య మాట కూడా పేడ చెవిని పెట్టాడు. నలుగురి లో తలెత్తుకు తిరగలేను ఈ పెళ్లి అనుకొన్న ముహూర్తాన జరగకుంటే అని ఏడుస్తూ కూర్చున్నాడు మామయ్య." కన్నీరు పెట్టుకొన్నాడు గోపీ.
రాజ్ కు ఏం చేయడానికి పాలుపోలేదు.
"ఎందుకురా ఏడుస్తావు? వాళ్ళు జరగదంటే పెళ్లి నిలిచి పోతుందా! నాలుగు తన్ని ఆ పెళ్లి కొడుకు చేత తాళి కట్టిద్దాం. అంతేకానీ ఆడపిల్లలా ఏడిస్తే ప్రయోజన మేమిటి?" అని గోపీని లేపి నిలబెట్టాడు ఆనంద్.
"ఆనంద్! అటువంటి మూర్కులతో మాట్లాడుతూ టైం వృధా చేయడం కన్నా అక్కడికి వెళ్లి నగలు తీసుకు రావటమే మంచిది." అన్నాడు రాజ్.
"అదెలా సాధ్యం, రాజ్? ఇప్పుడు గంట పదయిపోయింది. మర్నాడు ముహూర్తం. అక్కడికి వెళ్లాడమెప్పుడు? తిరిగి రావడమేప్పుడు?' అంది రజియా.
"ఫరావాలేదు , రజీ, గోపీ నగలు ఎక్కడున్నాయి?"
"ఇనప్పెట్టె లో ఉన్నాయి. ఇంద తాళం చెవులు."
రాజ్ మొహం లోని ఆవేశం, అతడు కారు నడిపే విధం తెలిసిన అందరూ ఒక్కసారి ఆ పరిస్థితులు చూసి భయంతో వణికి పోయారు.
రాజ్ తాళం చెవులు తీసుకొని బయటికి పరుగెత్తాడు అతని వెంటే. అందరూ వచ్చారు.
"రాజ్ , ఈ కారు తీసుకొని ఫో. అల్లుడి కోసం యాభై వేలు పెట్టి కొన్నాడు. వారికీ ఆ అదృష్టముందో, లేదో" అని ఒక క్రొత్త కారును చూపించాడు, గోపీ.
రాజ్ ఆ కారులో కూర్చున్నాడు.
"రాజ్, పెళ్లి ఆగిపోయినా ఫరవాలేదు కానీ...." బాధగా మారి చెప్పలేక పోయాడు గోపీ.
అది విని ఒక నవ్వు నవ్వాడు రాజ్.
"నా ప్రాణంకేం ఫర్వాలేదు. నువ్వు ఇక్కడ అన్ని పనులూ జరిపించు." అని మరో వైపు కార్లో కూర్చుంటున్న ఆనంద్ ను చూసి "నువ్వెక్కడికిరా?' అన్నాడు.
"నీతో పాటే నేనూ" అన్నాడు ఆనంద్ నిశ్చింతగా. "సరే" అని కారు స్టార్ట్ చేసుకొని ముందుకు చూస్తూ కారు నడప సాగాడు , రాజ్.
కొండ పైనే అంత వేగంగా నడుపుతున్న రాజ్ ను చూసి "రాజా" అన్నాడు కంగారుగా ఆనంద్.
"ఆనంద్ , ధైర్యం ఉంటె నోరు మూసుకొని కూర్చో. లేకుంటే దిగి వెనక్కు వెళ్ళిపో. అంతేకానీ నువ్వు భయపడి నాకు భయం కలిగించవద్దు."
గంబీరమైన అతని పలుకులు విని మాట్లాడకుండా కూర్చున్నాడు ఆనంద్.
దారిలో అప్పుడప్పుడూ కార్లు, లారీ లు వస్తుండడం వల్ల వేగం తగ్గించవలసి వస్తుండేది. యాభై వేల రూపాయల కారు అన్న గోపీ మాటలు జ్ఞాపకానికి వచ్చి కీ బోర్డు కు చుట్టూ ప్రక్కల చూశాడు రాజ్. ఒక ఎర్రటి బటన్ చూసి విజయ గర్వంతో దాన్ని నొక్కాడు. అప్పుడే ఎదురుగా వస్తున్నా లారీ ఒకటి బ్రేక్ వేసి రోడ్డు కు ప్రక్కగా నిలబడి పోయింది. అదే వేగంతో దాన్ని దాటిపోయాడు రాజ్. కొలది గంటల ప్రయాణమే తమను గమ్యం చేర్చిందని టైం చూసి తెలుసుకొన్న ఆనంద్ కు నోట మాట రాలేదు.
నగలు తీసుకొనేటప్పుడు చూశాడు ఆనంద్. ఇనప్పెట్టె లో నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. అంత ధనం ఒక్కసారి కళ్ళ బడడంతో కళ్ళు తిరిగాయి ఆనంద్ కు. రాజ్ నిర్లిప్తంగా నగల పెట్టె తీసికొని తలుపు వేసేశాడు.
"ఒరేయ్ , రాజా! నాకొక సందేహం."
"ఏమిటి?" దృష్టి మరల్చకుండా అడుగదు రాజ్.
"ఇంత డబ్బు నిక్కడ పెట్టి తాళాలిచ్చాడు కదా ఆ గోపీ గాడు? వాడికి మన పై అనుమానం కలగదా?"
"నమ్మకం మనిషిని ప్రాణ త్యాగానికి కూడా వెనుదీయనీదన్న విషయాన్ని మరిచి పోతున్నావు. ఇక కలలోని సుఖం లాంటి ఈ డబ్బు ఏం చేస్తుంది దాని ముందు?'
"మిత్రుల పైనే మనిషికి ఇంత నమ్మక ముంది కదా మనిషికి, మరి వియ్యంకులు కాబోతున్నా ఆ మూర్ఖులు వీరి మాటలను నమ్మలేదేం?"
"నీ ప్రశ్నకు జవాబు నీ ప్రశ్న లోనే ఉంది."
నవ్వాడు రాజ్ మాటలు విని, ఆనంద్.
మలుపుల్లో కారు ఒక వైపు రెండు చక్రాలు పైకి లేస్తూ ముందుకు సాగిపోతుంది. అలా చక్రాలు పైకి లేస్తున్నప్పుడు కాలు ఎక్సి లెటర్ మీది నుండి తీసి బ్రేక్ పై ఉంచి తిరిగి ఎక్స్ లెటర్ వెంటనే నొక్కు తుండడం గమనించాడు ఆనంద్.
బోయ్ మని వినిపించిన క్రొత్త కారు హరన్ విని నమ్మలేక బయటికి పరుగెత్తుకొచ్చాడు గోపీ. అప్పటికే ఒక్క కుదుపుతో ఆగింది ఆ కారు. అంత త్వరగా వారు రావడంతో ఏ ఆటంకం వల్లనో తిరిగి వచ్చారను కొన్నాడు గోపీ, వారిని చూసి. రాజ్ ఒక వైపు, ఆనంద్ మరో వైపు దిగి నిలబడ్డారు. ఆనంద్ చేతిలో ఉన్న నగల పెట్టె ను చూశాడు. అంతవరకూ కునుకుకు లొంగి పోయిన అతని మనస్సు నమ్మలేకపోయింది. కలా అనుకోని చెయ్యి గిల్లి చూసుకొన్నాడు గోపీ.
"ఏమిట్రా అలా చూస్తున్నావు" అన్నాడు చిరునవ్వుతో రాజ్.
ఆనందంతో రాజును కౌగలించు కొన్నాడు. దేవుడంటే ఆ రూపం లోనే ఉన్నడేమో ననిపించింది.
"రాజా, నీ ఋణం-----"
"అదంతా తర్వాత చేపుడువు గానీ ముందు అక్కడి కెళ్ళు" అని అతని భుజం తట్టి గోపీని పంపించేశాడు.
అందరూ కళ్ళప్పగించి తననే చూస్తుండడం గమనించి "ఏమిటలా చూస్తున్నారు? ముందు టాయ్ లేట్ అయి రండి. అక్కడ ముహూర్తానికి టైం అవుతోంది." అన్నాడు రాజ్.
ఆనంద్ తప్ప అంతా సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజ్, ఆనంద్ ను వెంట బెట్టుకొని పెళ్లి మంటపం వైపు పోయాడు.
"అబ్బాయ్.... నిన్నెలా అభినందించాలో తెలియడం లేదు. నా పరువు ప్రతిష్టలు కాపాడావు." అన్నారు రాజ్ చేతులు పట్టుకొని ముకుందయ్యా గారు.
"ముందు మీరు వెళ్లి అతిధులను స్వాగత మివ్వండి." అని అక్కడి నుండి పెళ్లి కూతురికి అలంకరణ చేసే గది వైపు ఒక్కడే నడిచాడు రాజ్. ముకుందయ్య కళ్ళు పై పంచతో తుడుచుకుని ముందుకు పోయాడు.
రాజ్ ను చూసిన శారద కళ్ళు కృతజ్ఞత తో మెరిశాయి. ఏదో చెప్పాలను కొంది. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితులలో ఏం మాట్లాడ లేకపోయింది.
ముహూర్తానికి సమయం అయింది. పెళ్లి కుమార్తెను తీసుకు రండంటూ కబురు వచ్చింది. ముత్తయిదువులు ఆమెకు ఇరు ప్రక్కలా ఉండి నడిపించుకు పోసాగారు. చీరే కుచ్చేళ్ళు కాళ్ళకు అడ్డు పడగా సంబాళించు కోన బోయి చేతకాక ముందుకు పడిపోయింది శారద. ఆమెను కంగారుగా లేవనెత్తారు. ఆమె మోహన బొట్టు చెరిగింది. గాజులు కొద్దిగా పగిలి పోయాయి. కలుక్కుమంది రాజ్ హృదయం. గిరుక్కున వెను దిరిగి పోయాడు.
పెళ్లి పందిరి లో ఎక్కడా రాజ్ కానక పోవడంతో వసంత "రజియా , శేఖర్ గారేక్కడ" అంది. రజియా కూడా వెదికింది. కానీ వారి కెక్కడా కనిపించలేదు. గోపీకి చెప్పారు ఆ విషయం.
"మీరిక్కడే ఉండండి. నే చూసి వస్తాను" అన్నాడు గోపీ చుట్టూ చూస్తూ.
"రాజా!"
తలెత్తి చూశాడు కుర్చీలో కూర్చొని ఉన్న రాజ్.
"ఏమిట్రా ఇక్కడున్నావు? నీకోసం అక్కడంతా వెదుకుతున్నాం."
రాజ్ ఏమీ చెప్పలేక పోయాడు. అతడు ఏ విషయం గురించో బాధపడుతున్నాడని గ్రహించాడు గోపీ.
"నీ బాధేమిటో మాతో చెప్పకూడదా!"
"శారద అక్కడ పడి పోవడం చూసి నా మనస్సేదో కీడును శంకిస్తోంది . ఈ పెళ్లి ఆగిపోయి ఉంటే బాగుండు నెమో?"
"రాజా, ఏమిట్రా ఆ మాటలు? అటువంటి చిన్న విషయాలు మనసులో పెట్టుకొని అనవసరంగా బాధపడకు. పద. తర్వాత చూసుకొందాం."
అతన్ని అనుసరించాడు రాజ్.
ముహూర్తం సమయంలో రాజ్ అక్షింతలు చల్లడానికి చేయి పైకెత్తాడు. కానీ అది ఎవరి చేతినో తగిలి అక్షింతలు అక్కడే పడిపోయాయి. బాధాగా నిట్టూర్చింది అతని హృదయం. శారదను చూశాడు. ఆమె మొహం సంతోషంతో కళకళలాడుతుంది. సిగ్గుతో భర్త వైపు ఓరగా చూస్తుంది.
